tribals development
-
అడవే ఆధారం.. అభివృద్ధికి దూరం
చెట్లు చేమలే వారి నేస్తాలు.. బొడ్డు గుడిసెలే నివాసాలు.. ఆకులు, అలములు,కందమూలాలే ఆహారం.. అడవిలో పుట్టి.. అడవిలో పెరిగి.. అడవే సర్వస్వంగా జీవిస్తున్నా ఎదుగూబొదుగూ లేని బతుకులు.. అభ్యున్నతికి నోచక.. అనాగరిక జీవనం సాగిస్తున్న చెంచుల బతుకులపై విశ్లేషణాత్మక కథనమిది. అచ్చంపేట: చెంచుల అభ్యున్నతి, సంక్షేమానికి ప్రభుత్వం ఏటా బడ్జెట్లో రూ.కోట్లు కేటాయిస్తున్నా.. అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉన్నారు. నేటికీ వందలాది మంది చెంచులకు వ్యవసాయ భూమి లేదు. అటవీ ఉత్ప త్తుల సేకరణతో కాలం వెళ్లదీస్తున్నారు. వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ భూ పంపిణీకి నోచుకోవడం లేదు. నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచుల అభివృద్ధి గణాంకాలకే పరిమితమైంది. వారికి ఉపాధి కల్పించేందుకు జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం, వ్యవసాయ, గిరిజన సహకార సంస్థతో పాటు ఐకేపీ, టీపీఎంయూ ఐటీడీఏలో అంతర్భాగంగా ఉన్నాయి. విద్య, వైద్యం, గృహ నిర్మాణం, వ్యవసాయం, తాగునీటి వసతి వంటివి అమలు కావడం లేదని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కా ఇళ్లు లేక రాత్రివేళ బొడ్డు గుడిసెల్లో కట్టెల మండల (నెగడి)తో కాలం వెళ్లదీస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను వైద్య, ఆరోగ్యశాఖ, ఐటీడీఏ పట్టించుకోక పోవడంతో చెంచుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దీర్ఘకాలిక రోగాలతో పాటు మలేరియా, క్షయ, పక్షపాతం, కడుపులో గడ్డలు, విషజ్వరాలు, రక్తహీనత, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. అటవీ లోతట్టు ప్రాంతంలో జీవిస్తున్న చెంచుల జీవితాలు మరింత దుర్భరంగా ఉన్నాయి. వైద్యం, పౌష్టికాహారం, తాగునీరు అందక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. దుర్భరంగా బతుకులు..మహబూబ్‌నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని చెంచుల సంక్షేమం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సున్నిపెంట (శ్రీశైలం)లో ఏర్పాటైన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రభావితంగానే కొనసాగింది. 2014 రాష్ట్ర విభజన అనంతరం 2015 మార్చి నుంచి అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో సమీకృత గిరి జనాభివృద్ధి సంస్థను (ఐటీడీఏ ) ఏర్పాటు చేశారు. దీని పరిధి లో నాగర్‌కర్నూల్, మహబూబ్ నగర్, నల్లగొండ, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలున్నాయి. ఆయా జిల్లాల్లోని 25 మండలాల్లో 172 గిరిజన గ్రామాలు, పెంటలు.. 4,041 చెంచు కుటుంబాలున్నాయి. 14,194 మంది గిరిజన జనాభా ఉంది. నల్లమల అటవీ ప్రాంతంలో 88 చెంచు పెంటల్లో 2,595 కుటుంబాలుండగా.. 8,784 మంది చెంచులు నివసిస్తున్నారు. వీరిలో 4,341 మంది పురుషులు, 4,449 మంది మహిళలున్నారు. అభయారణ్యం పరిధిలో లింగాల, అమ్రాబాద్, పదర మండలాలుండగా.. 18 చెంచు పెంటలున్నాయి. 12 పెంటల్లో పూర్తిగా చెంచులే నివసిస్తుండగా.. మిగతా పెంటల్లో చెంచులతో పాటు ఎస్పీ, ఎస్టీలున్నారు. అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని లోతట్టు అటవీ ప్రాంతంలోని పర్హాబాద్, మల్లాపూర్, పుల్లాయిపల్లి, రాంపూర్, అప్పాపూర్, భౌరాపూర్, ఈర్లపెంట, మేడిమెల్కల, సంగడిగుండాలు, ధారవాగు, తాటిగుండాలు, పెద్దూటి, బట్టిచింతల, ఎంకలపెంట, ఎర్రపెంట, పాత ధారారం, కుండిచింతబైలు తదితర చెంచు పెంటల్లో నివసించే వారి పరిస్థితి దుర్భరంగా ఉంది. గిరిజనుల అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఐటీడీఏతో ఎలాంటి సంక్షేమ ఫలాలు అందకుండా పోతున్నాయి. వీరి జీవన స్థితిగతుల మార్పు, సమస్యల పరిష్కారానికి చెంచు సేవా సంఘం ఆ«ధ్వర్యంలో ఎన్నోసార్లు పాదయాత్రలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టారు. విద్య, వైద్యం, తాగునీరు, రవాణా, విద్యుత్ సౌకర్యాలతో పాటు ఇళ్లు లేక చెంచులు అంధకారంలో బతుకులు వెళ్లదీస్తున్నారు.ఫలాల సేకరణకు హద్దులు..చెంచులు ప్రధానంగా అటవీ ఉత్పత్తుల సేకరణ, వేటపై ఆధారపడి జీవనం కొనసాగిస్తారు. అటవీ ప్రాంతంలో లభించే ఫలాల సేకరణకు హద్దులు ఏర్పాటు చేసుకుంటారు. వారు ఏర్పాటు చేసుకున్న సరిహద్దు ప్రాంతంలోనే ఉత్పత్తులు సేకరిస్తుంటారు. ఇది వంశపారంపర్యంగా వస్తున్న హక్కుగా చెబుతున్నారు. చెంచుల ఆచారాలు, ఇంటి పేర్లు.. చెట్లు, వన్యప్రాణుల పేర్లతో కూడి ఉంటాయి.చెట్ల పెంపకం అంతంతే..అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగించే చెంచుల బతుకులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. క్రమంగా అటవీ ఉత్పత్తులు అంతరించడం.. చెంచుల జీవన ప్రమాణాలు పెంచాల్సిన అధికారులు నిద్రావస్థలో ఉండటంతో వారికి ఆహార కొరత ఏర్పడింది. నాగరికత ఎరుగని చెంచులు నేటికీ.. ఆహార సేకరణ దశలోనే ఉన్నారు. వీరి అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఐటీడీఏ.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నది వాస్తవం. ఫలాలు ఇచ్చే చెట్ల పెంపకంపై అధికారులు దృష్టి సారించడం లేదు. వేసవిలో కనీసం ఉపాధి పనులు కూడా చేపట్టకపోవడంతో చెంచులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు.అటవీ ఉత్పత్తులు ఇవే..నల్లమల అటవీ ప్రాంతంలో తేనె, మారెడు గడ్డలు, జిగురు, చింతపండు, కుంకుడుకాయలు, ముష్టి గింజలు, ఎండు ఉసిరి, చిల్లగింజలు, నరమామిడి చెక్క, కరక్కాయలు, ఇప్పపువ్వు, ఇప్పగింజలు, కానుగ గింజలు, తునికాకు, బుడ్డపార్ల వేర్లు, వెదురుతో పాటు మరో పది రకాల ఉత్పత్తులు అడవిలో లభిస్తాయి. వాతావరణ పరిస్థితులు, రేడియేషన్ ప్రభావం వల్ల సహజసిద్ధంగా లభించే అటవీ ఫలాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. వీటికోసం చెంచులు పెద్ద పులులు ఇతర క్రూరమృగాలతో పొంచి ఉన్న ముప్పును సైతం లెక్కచేయడం లేదు. అటవీ ఉత్పత్తులు సేకరించి, గిరిజన కార్పొరేషన్ సంస్థ జీసీసీ కేంద్రాల్లో విక్రయిస్తూ.. తమకు కావలసిన సరుకులు తీసుకెళ్తారు. ఇప్పటికే తీగలు, గడ్డలు అంతరించిపోవడంతో చెంచులకు ఉపాధి లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం మొక్కల పెంపకంపై దృష్టి సారించినా.. చెంచులకు ఫలాలు ఇచ్చే మొక్కల పెంపకంపై మాత్రం ఆసక్తి చూపడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికే అడవిలో లభించే తునికాకు సేకరణను అటవీశాఖ అధికారులు పదేళ్లుగా నిలిపివేశారు. రేడియేషన్ కారణంగా తేనెటీగలు అంతరించిపోవడంతో తేనె తుట్టెలు కనిపించడం లేదు. తేనెటీగల పెంపకంపై ప్రభుత్వం చెంచులకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. చెంచులు ఏడాది పొడవునా జిగురు, చింతపండు, తేనెపైనే ఆధారపడి జీవిస్తున్నారు.ఉప్పుకైనా అప్పాపూరే..చెంచులకు జీసీసీ డిపోల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారు. నల్లమలలోని చెంచులందరూ కాలినడకన అప్పాపూర్ చెంచుపెంటకు వచ్చి వాటిని కొనుగోలు చేస్తారు. అటవీ వస్తువులను విక్రయించి, వాటి ద్వారా వచ్చిన డబ్బుతో బియ్యం, నూనె, పప్పు వంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కొన్ని సరుకులకు బయటి మార్కెట్ కంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. చెంచులకు నాసిరకం సరుకులు అంటగడుతున్నారు.బీమా కల్పించాలిప్రభుత్వం తేనెకు మద్దతు ధర కల్పించడంతో పాటు.. తేనె సేకరణకు వెళ్లే ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. కొన్నేళ్లుగా స్వచ్ఛంద సంస్థలు మాత్రమే తేనె సేకరణలో మాకు ఉపయోగపడుతున్నాయి. వారు ఇచ్చిన కిట్లు కూడా పాడయ్యాయి. కొత్త వాటిని ఇవ్వలేదు. గతంలో పెంటలకు అందుబాటులో తేనె లభించేది. ఇప్పుడు అడవిలో చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది. – బయన్న, మల్లాపూర్ చెంచుపెంటపక్కా ఇళ్లు లేవులోతట్టు చెంచులు నేటికి ఆనాగరిక జీవితం కొనసాగిస్తున్నారు. అటవీ ఉత్పత్తులు తగ్గాయి. జీవనం కొనసాగడం కష్టంగా ఉంది. పక్కా ఇళ్లు లేక బొడ్డు గుడిసెల్లోనే కాపురం వెళ్లదీస్తున్నారు. ప్రత్యేక ఉపాధి తీసివేసిన తర్వాత పనులు లేకుండా పోయాయి. వైద్యం అందక రోగాల బారిన పడుతున్నారు. – నిమ్మల శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షుడు, ఆదివాసీ చెంచు ఐక్యవేదిక ఉపాధి కల్పనకు చర్యలుచెంచుల అభ్యున్నతి, సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. చెంచుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్«మన్ యోజన) పథకం కింద 88 చెంచుపెంటల్లో 11 రకాల కార్యక్రమాలను విడతల వారీగా చేపడుతున్నాం. చెంచుపెంటల్లో 1,030 ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదించి, పనులు ప్రారంభించాం. కొంతమంది చెంచులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డులు, ఆధార్‌కార్డులు అందజేశాం. ప్రత్యేక వైద్య వాహనం ఏర్పాటు చేశాం. మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.– రోహిత్‌రెడ్డి, ఇన్చార్జి ఐటీడీఏ పీవో -
ఆదివాసీ అస్తిత్వాలకు గొడ్డలిపెట్టు
జనాభాలో 12 కోట్ల పైచిలుకు ఉన్న అమాయక ఆదివాసీ ప్రజలకు హిందూ అస్తిత్వాన్ని అంటగట్టే ప్రయత్నం జరుగుతోంది. జనగణనలో ఆదివాసీలను హిందువులుగా నమోదుచేస్తూ... వారి చారిత్రక అస్తిత్వాన్ని మాయం చేస్తున్న వైనం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కుల వ్యవస్థ పునాదిగా ‘ఏకీకృత హిందూ అస్తిత్వం’ నినాదంతో సాగుతున్న సాంఘిక పునర్నిర్మాణ జగన్నాథ రథ చక్రాల కింద ‘బహుళ అస్తిత్వాల’ భారతీయ సమాజం నలిగిపోతోంది. ఈ దేశ బహుళత్వాన్ని అంతర్థానం చేయడం ద్వారా, అతి పెద్ద ఓటు బ్యాంకును సంఘటితం చేస్తున్నారు. అనేక జాతులు, కులాలు, మతాలుగా ఉన్న భారతీయులు తమ తమ సాముదాయక అస్తిత్వాలను కాపాడుకోవడానికి పోరాటాలకు దిగాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో కోట్లమంది మూలవాసులు కేవలం తమ అస్తిత్వం కోసమే పోరాడాల్సిన పరిస్థితి దాపురించింది. కులం, మతం, ప్రాంతం, జాతి, భాష, జెండర్ తదితర బహుళ అస్తిత్వాలు అంశీభూతాలుగా ఉన్న భార తీయ సమాజం... నేడు అస్తిత్వ వైషమ్యాల సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. పాలక, ఆధిపత్య అస్తిత్వాలూ; అణగారిన అస్తిత్వాల మధ్య ఒక విధమైన యుద్ధ వాతావరణం నెలకొంది. దళిత, బహుజన సామాజిక సమూహాలూ; ముస్లిం తదితర మైనారిటీ సమూహాలూ నేడు మెజారిటీ మత, కుల అస్తిత్వ దాష్టీకానికీ, విద్వేషకాండకూ గురవుతున్నాయి. కుల వ్యవస్థ పునాదిగా ఉన్న ‘ఏకీకృత హిందూ అస్తిత్వం’ అనే నినాదంతో సాగుతున్న సాంఘిక పునర్నిర్మాణ జగన్నాథ రథ చక్రాల కింద బహుళ అస్తిత్వాల భారతీయ సమాజం బీటలు వారుతోంది. 2024 నాటికి దేశ జనగణన డిజిటైజేషన్ పూర్తి చేయాలనే లక్ష్యంతో సాగుతున్న సర్వే వివాదాస్పదంగా మారింది. కుల గణన జరగాలని ఓబీసీలు ఉద్యమిస్తున్నారు. లింగాయత్ తదితర అస్తిత్వ సమూహాలు తమను హిందూ మతంలో భాగంగా కాక, ప్రత్యేక మైనారిటీ మతస్థులుగా గుర్తించాలని 20వ శతాబ్దం ప్రారంభం నుంచీ డిమాండ్ చేస్తూ అనేక ఉద్యమాలు నిర్వహించాయి. ఇప్పుడు అత్యంత నిశ్శబ్దంగా దేశ జనాభాలో 8.6 శాతంగా ఉన్న ఆదివాసీ సమూహాల అస్తిత్వ ఆకాంక్షలను ధ్వంసం చేస్తూ జనగణన సాగిస్తు న్నారు. ఆదివాసీ ప్రజానీకాన్ని హిందువులుగా చిత్రించడానికి వారి దేవతలను సైతం హైందవీకరిస్తున్నారు. అందుకు ఇటీవలి ఉదాహ రణ కోయల కులదేవత సమ్మక్కను హిందూ దేవతను చేస్తున్న వైనం! జనగణన సమయంలో ఆదివాసులు తమను హిందువులుగా నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ‘ఏకీకృత హిందూ అస్తిత్వం’లో ఈ దేశ బహుళత్వాన్ని అంతర్థానం చేయడం ద్వారా, అతిపెద్ద ఓటు బ్యాంకును సంఘటితం చేస్తున్నారు. తద్వారా కేంద్రీకృత అధికారాన్ని సుస్థిరం చేయాలని మెజారిటీ మతతత్వ శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగమే... దేశ జనాభాలో 12 కోట్ల పైచిలుకు ఉన్న అమాయక ఆదివాసీ ప్రజలకు హిందూ అస్తిత్వాన్ని అంటగట్టే ప్రయత్నం! షెడ్యూల్డ్ తెగలుగా రాజ్యాంగంలో వర్గీకరణకు గురైన ఆదివాసీ ప్రజల్లో చాలామంది హిందూ, క్రైస్తవం, ఇస్లాం మత శాఖల్లో అంతర్భాగం అయినప్పటికీ... ఇప్పటికీ గణనీయమైన సంఖ్యలో సాంప్రదాయిక ఆదివాసీ మతస్థులుగానే కొనసాగుతున్నారు. 2011 జనగణన ప్రకారం ఆనాటి 121 కోట్ల మంది జనాభాలో 79 లక్షల మంది హిందూ, ఇస్లాం, క్రైస్తవం, సిక్కు, బౌద్ధం, జైన మతాలకు చెందినవారు కాదు. నాస్తికులు, జొరాస్ట్రియన్లు, యూదులు, నిర్దిష్ట, అనిర్దిష్ట ఆదివాసీ మతాలకు చెందిన వారినందరినీ కలిపి ‘ఇతర మతాలు, విశ్వాసాలు’ అనే వర్గీకరణ కింద చేర్చారు. జార్ఖండ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, అస్సాం రాష్ట్రాల పరిధిలోని ఛోటానాగ్పూర్ పీఠభూమి ప్రాంతానికి చెందిన ముండా, భూమిజ్, ఖారియా, బైగా, హో, కురుఖ్, సంతాల్ తెగలకు చెందిన ప్రజలు సంప్రదాయిక చారి త్రక సంలీన మతమైన ‘సార్నాయిజం’కు చెందినవారు. సార్నా మతస్థులు 49 లక్షల మంది, సారి ధమ్మ 5 లక్షలు మంది ఉన్నారనీ; వీరితో పాటు వీరికి తోడు సంతాల్, కోయపూనెమ్, దోన్యీ– పోలోయిజం, సానామహిజం, ఖాసీ, నియామ్త్రే అనే మత విశ్వాసా లున్నట్టు 2011 జనగణనలో నమోదయ్యింది. ఆదివాసీ మతం, ప్రకృతి మతం, ‘సర్వాత్మ వాదం’ విశ్వాసులు కూడా ఉన్నట్టు అందులో నమోదు చేశారు. ఇంతటి వైవిధ్యం గల ఆదివాసీ ప్రజలను రాజకీయ దురు ద్దేశాల నేపథ్యంలో చారిత్రక అస్తిత్వ రహితులుగా మార్చివేసేందుకు పాలకులు ప్రయత్నిస్తుండటం అన్యాయం. వివిధ విశ్వాసాలు, ఆలోచనా ధోరణులు సామాజిక పరిణామ క్రమంలో సమకాలీన పాలక వర్గాల, ప్రజల అవసరాలకు అను గుణంగా ‘చారిత్రక సంలీనం’కు గురయ్యాయి. ఆయా జాతుల, తెగల, రాజ్యాల, సామ్రాజ్యాల పాలకవర్గాల అవసరాలకు అను గుణంగా చారిత్రక సంలీనం మెజారిటీ మతానికి చెందిన పాలకుల ఆధిపత్యాన్ని సుస్థిరం చేసేందుకు ఉపకరించేది. అలాంటి సంలీనం చారిత్రకంగా ప్రతీఘాతుక పాత్ర నిర్వహిస్తుంది. గ్రీకో– ఈజిప్షియన్, హెలినిస్టిక్ కాలంలో, గ్రీకో– రోమన్ మత చారిత్రక సంలీనాలు; షింటో–బౌద్ధం; అక్బర్ స్థాపించిన దీన్ –ఇ– ఇలాహి మతం; జర్మానిక్– సెల్టిక్– క్రిస్టియన్ మత విశ్వాసాల సంలీనాలు; నాజీ జర్మనీలో హిట్లర్ ప్రోత్సహించిన ‘జర్మన్ ఎవలాంజికల్ చర్చ్’; రష్యాలో ప్రతీఘాతుక విప్లవం కోసం ఏర్పాటైన ‘లివింగ్ చర్చ్’ అనే ఉద్యమం... అన్నీ కూడా మత చారిత్రక సంలీనాలే. ఇవన్నీ రాజ్య సుస్థిరత కోసం పాలకుల ప్రోత్సాహంతో ఏర్పాటైన మత చారిత్రక సంలీనాలు. ఈ నేపథ్యంలోనే నేడు ఇండియా వ్యాప్తంగా ‘ఏకీకృత హిందూ అస్తిత్వ’ కార్యక్రమం కూడా ఒక మత చారిత్రక సంలీనమే! భారతీయ న్యాయవ్యవస్థ ప్రకారం స్థానిక లేదా మూలవాసీ మతాలన్నీ హిందూ మతం పరిధిలోకి వస్తాయి. వైదిక మతాలు మాత్రమే హిందూ మతం కిందికి వస్తాయని రాజ్యాంగం గుర్తించక పోవడం వల్ల... ఆదివాసీ లాంటి మైనారిటీ మతాలకు ప్రత్యేక గుర్తింపు రాకుండా పోయింది. ద్వీపకల్పంలోని స్థానిక మతాలన్నిటినీ కలిపి హిందూ మతంగా గుర్తించడం పర్షియన్ల కాలం నుంచి ప్రారంభమైంది. వివిధ విశ్వాసాలకు, ప్రకృతి మతాలకు నిలయంగా ఉన్న ఇండియాను సులభంగా గుర్తించేందుకు వీలుగా పర్షియన్లు ‘హిందూ’ అని పిలవడంతో ఇక్కడి మతాలన్నిటినీ హిందూ మతంగా గుర్తించడం పరిపాటిగా మారింది. 1955 హిందూ వివాహ చట్టంలో కూడా క్రైస్తవులు, ముస్లింలు, యూదులు కాని వారంతా హిందువులే నని నిర్వచించడం ఒక పెద్ద చారిత్రక తప్పిదమయింది. రాజ్యాంగం లోని ఈ లొసుగును ఆసరాగా తీసుకొని పాలకులు ఆదివాసీలకు జనగణన ద్వారా హిందూ అస్తిత్వాన్ని పులుముతూ, మెజారిటీ ఓటు బ్యాంకును రూపొందించాలనే కుయుక్తులు పన్నుతున్నారు. హిందూ అస్తిత్వం అనేది ఏకరీతి వ్యవస్థ కాదు. కుల అస్తిత్వమనే అసమానత్వం, అస్పృశ్యతల దుర్మార్గమైన దొంతర్ల వ్యవస్థ అది. 12 కోట్లౖకు పెగా ఉన్న ఆదివాసీ ప్రజానీకం అసమానతల దొంతర్ల వ్యవస్థలో భాగమయ్యే ప్రమాదం ఉంది. వీర శైవం, లింగాయత్, శ్రీవైష్ణవం, ఆదివాసీల ప్రకృతి మతాలు కాల క్రమంలో హిందూ చారి త్రక సంలీనానికి గురయ్యాయి. ఇటువంటి ప్రయత్నాలు ఎన్ని జరి గినా ఇప్పటికీ అవైదిక వ్యక్తీకరణలు ఆయా ప్రకృతి మతాల్లో కొన సాగుతూనే ఉన్నాయి. అలాంటి చిన్నపాటి ప్రత్యేకతలను కూడా తొల గించి ‘సామాజిక ఫాసిజానికి’ గురి చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఆదివాసీ ప్రజలను 2011 నాటి జనగణనలోని వర్గీకరణతో గానీ, మొత్తం ‘ప్రకృతి మతం’ అనే వర్గీకరణతోగానీ నమోదు చేయాలి. అదే సమయంలో మైదాన ప్రాంతాల్లోని హిందూ మతం గొడుగుకింద తమ విశిష్టతలను కోల్పోయిన లింగాయత్, శ్రీవైష్ణవం తదితర మత శాఖలను హిందూ మతంలో భాగంగా కాకుండా విడి విడిగా మైనారిటీ మతాలుగా గుర్తించాల్సి ఉంది. వైదికేతర విశిష్ట మతాలను, ఆదివాసీల మతాలను మైనారిటీ మతాలుగా పరిగణిస్తూ రాజ్యాంగ లోపాన్ని సవరణ చేయాలి. మైనారిటీ మత గుర్తింపు కోసం ఆయా మతçస్థులు ఉద్యమిస్తే, ‘ఏకీకృత హిందూ అస్తిత్వం’ అనే ఓటు బ్యాంకు రాజకీయ కుట్రలను ఎదుర్కొనడం సాధ్యమవుతుంది! శ్రమ సంబంధాల ప్రాతిపదికన దళిత, మైనారిటీ తదితర అణచివేత సమూ హాలలోని నిజ అస్తిత్వ ప్రజానీకంతో సంఘటితమైన ‘ఏకీకృత నిజ అస్తిత్వ’ ఉద్యమ నిర్మాణమే తక్షణ కర్తవ్యం. ఆత్మగౌరవ, కుల వివక్ష వ్యతిరేక, కుల నిర్మూలనా ఉద్యమాలు ‘ఏకీకృత నిజ అస్తిత్వ’ ఉద్య మాలుగా అవతరిస్తేనే హిందూ చారిత్రక సంలీనాన్ని అడ్డుకోగలం! వ్యాసకర్త: వెన్నెలకంటి రామారావు సీనియర్ జర్నలిస్ట్ మొబైల్: 95503 67536 -
గిరిజనుల సమగ్ర అభివృద్ధికి పైలట్ ప్రాజెక్ట్
సాక్షి, హైదరాబాద్: ఆదిమజాతి గిరిజనుల ఆరోగ్య పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసి, అవసరమైన వైద్య సహాయాన్ని అందించడానికి హెల్త్ వర్సిటీ, ఈఎస్ఐ మెడికల్ కళాశాల బాధ్యత తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. గిరిజనుల్లో ఆరోగ్యం, పోషణ స్థాయిలను పెంచి, ఇతర నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించాలని, దీంతో వారు ఆర్థికంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా అభివృద్ధిని సాధిస్తారని గవర్నర్ పేర్కొన్నారు. ఆదిమజాతి గిరిజనుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం ఆమె రాజ్‌భవన్‌లో వర్సిటీల వైస్ చాన్స్లర్లు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, కాళోజీ వైద్య వర్శిటీ, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఆదిలాబాద్‌లోని కొల్లంతెగ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొండరెడ్లు, నాగర్‌కర్నూల్ జిల్లాలోని చెంచు తెగలకు చెందిన గిరిజనుల సమగ్ర అభివృద్ధికి రాజ్‌భవన్ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టనున్న కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి వివిధ వర్శిటీలు ఆసక్తి చూపాయి. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు ఆర్.లింబాద్రి, ప్రొఫెసర్ వి.వెంకటరమణ పాల్గొని తమ సూచనలు చేశారు. గవర్నర్‌ను కలిసిన ఇరాన్ దౌత్యవేత్తలు హైదరాబాద్‌లో ఇరాన్ కాన్సుల్ జనరల్ మహది షాహ్రోఖి, వైస్ కాన్సుల్ మీనా హదియన్ మంగ ళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. వర్సిటీలకు చాన్స్‌లర్స్‌పురస్కారాలు విశ్వవిద్యాలయాల్లో అత్యున్నత విద్యా ప్రమాణాలు, పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు చాన్స్‌లర్స్ పురస్కారాలు అందజేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయించారు. ఉత్తమ ఉపాధ్యాయులు, ఉత్తమ పరిశోధనతో పాటు ఉత్తమ విశ్వవిద్యాలయం విభాగాల్లో ఈ పురస్కారాలు అందజేయనున్నారు. ఉన్నత విద్యా మండలి ఈ పురస్కారాలకు అవసరమైన ఆర్థిక సహాయం అందజేస్తుందని సంస్థ చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. -
'వారిని పట్టించుకోకుండా ఏం అభివృద్ధి?'
హైదరాబాద్: తెలంగాణలో 10 శాతం ఉన్న గిరిజనులను పట్టించుకోకుండా రాష్ట్రాభివృద్ధి ఎలా సాధ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈమేరకు ఆయన ఆదివారం లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండున్నరేళ్లు దాటుతున్నా గిరిజనుల జీవితాల్లో మార్పేమీ రాలేదన్నారు. 2014లో ఎన్నికల సందర్భంగా గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలుకాలేదన్నారు. జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, పోడు భూములకు పట్టాలు, 500 జనాభా ఉన్న గిరిజన గ్రామాలను పంచాయతీలుగా మార్పు, ఉట్నూర్‌లో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి, ఆదివాసీ గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం, గిట్టుబాటు ధరలు వంటి హామీలు అమలుకు నోచుకోలేదని తమ్మినేని లేఖలో పేర్కొన్నారు. -
‘యాక్షన్‌ప్లాన్’లో నిర్లక్ష్యం
భద్రాచలం, న్యూస్‌లైన్:గిరిజనుల అభివృద్ధికి అమలు చేసే ట్రైకార్ యాక్షన్‌ప్లాన్ లక్ష్య సాధనలో ఐటీడీఏ అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు. లబ్ధిదారులను ఎంపికచేసినా వారికి ఆర్థికసహాయమందించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ‘మాటలే తప్ప..చేతలు లేని’ అధికారుల కారణంగా గిరిజనులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదనే ఆరోపణలున్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరం ట్రైకార్ యాక్షన్ ప్లాన్ అమలు తీరును పరిశీలిస్తే ఇది తేటతెల్లమవుతుంది. ఆర్థికాభివృద్ధి పథకాల (ట్రైకార్) అమల్లో భాగంగా ఆయా గ్రామాల్లో స్వయం ఉపాధి, అందుబాటులో ఉన్న ఇతర ఉత్పత్తులతో పనులు కల్పించి గిరిజనులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనేది ఈ పథకం లక్ష్యం. జిల్లాలోని ఏజెన్సీలో ఉన్న 29 మండలాల్లో 2012-13 సంవత్సరానికి సుమారు రూ.2.70 కోట్ల మేర సబ్సిడీ అందజేయాలని ఐటీడీఏ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతిపాదిత యూనిట్కయ్యే మొత్తంలో కొంతమేర ఐటీడీఏ ద్వారా సబ్సిడీ అందజేసి, దాని గ్రౌండింగ్ కోసం మిగతా డబ్బులను గ్రామైక్య సంఘాలు, బ్యాంకు రుణం ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా లక్ష్య సాధన పేరిట ఐటీడీఏ అధికారులు కుస్తీలు పడుతున్నారు. మొత్తం 643 యూనిట్లను మంజూరుకు ఐటీడీఏ అధికారులు మొదట్లో అనుమతులు ఇచ్చారు. వీరిలో 609 మంది చేత బ్యాంకుల్లో అకౌంట్లు కూడా తెరిపించారు. ఆ తరువాత 542 మందినే అర్హులుగా తేల్చి వారి పేరుతో బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లలో సబ్సిడీ కూడా జమ చేశారు. కానీ ఇప్పటి వరకు 395 యూనిట్లను మాత్రమే గ్రౌండింగ్ చేయగలిగారు. మిగిలిన యూనిట్లను గ్రౌండింగ్ చేయడంలో ఐటీడీఏ అధికారులు విఫలమయ్యారు. ఇచ్చిన సబ్సిడీ వెనక్కి ఏజెన్సీలో 542 యూనిట్ల ఏర్పాటుకు సుమారు రూ.2.70 కోట్లు సబ్సిడీ రూపేణా మంజూరు చేసినా వాటిని గ్రౌండింగ్ చేసే పరిస్థితి కనిపించకపోవడంతో లబ్ధిదారుల ఖాతాల్లో ఉన్న సబ్సిడీని వెనక్కి తీసుకుంటున్నారు. గత ఏడాది మార్చి, ఏప్రిల్, జూన్ నెలల్లో వేసిన సబ్సిడీ సొమ్మును ఆయా మండలాల అధికారులు తిరిగి ఐటీడీఏకు జమ చేసేందుకు లబ్ధిదారుల చుట్టూ తిరుగుతున్నారు. టెంటు హౌస్, పాడి గేదెలు, గిరిషాపు(కి రాణా దుకాణం)ల ఏర్పాటుకు కూడా బ్యాంకర్లు సహకరించలేదనే కారణంతో వాటిని రద్దు చేశారు. చివరకు కొండరెడ్డి గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పాలని నిశ్చయించుకున్న బేంబో( వెదురు ఉత్పత్తుల తయారీ) యూనిట్ల స్థాపనకు కూడా అధికారులు శ్రద్ధ చూపలేదు. 120 యూనిట్లను ప్రతిపాదిస్తే 76 మాత్రమే గ్రౌండింగ్ చేశారు. కొండరెడ్ల పైనా నిర్లక్ష్యమే ఏజెన్సీలోని గుట్టలపై నివసించే కొండరెడ్లపైనా ఐటీడీఏ అధికారులు నిర్లక్ష్యాన్నే ప్రదర్శిస్తున్నారు. వీరిని దృష్టిలో పెట్టుకునే వెదురు యూనిట్లకు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఆచరణలో నిర్లక్ష్యాన్ని చాటుకున్నారనే విమర్శలు మూటగట్టుకున్నారు. ఫలితంగా వెదురుఉత్పత్తుల తయారీనే జీవనాధారంగా చేసుకున్న కొండరెడ్లకు ప్రోత్సాహం లేకుండా పోయింది. వీరి ఆర్థిక ఇబ్బందులను ఆసరగా చేసుకున్న కొంతమంది వ్యాపారస్తులు ముందస్తు పెట్టుబడులు అందజేసి వారు తయారు చేసిన ఉత్పత్తులను తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. వేలేరుపాడు మండలం పేరంటాలపల్లి గ్రామాన్ని ‘న్యూస్‌లైన్’ సందర్శించగా ఈ విషయం తేటతెల్లమైంది. ఈ గ్రామంలోని కొండరెడ్లకు బేంబో యూనిట్లు మంజూరైనా పనికిరాని పనిముట్లు ఇచ్చారనే కారణంతో వాటిని తీసుకునేందుకు నిరాకరించారు. మళ్లీ సిద్ధం... ట్రైకార్ యాక్షన్ ప్లాన్ అమలు కోసం 2013-14 సంవత్సరానికి గాను రూ.17.01 కోట్ల మేర సబ్సిడీ అందించేందుకు ఐటీడీఏ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీని అమలుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు స్వీకరించిన దివ్య ట్రైకార్ యాక్షన్ ప్లాన్ అమలుపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందిగా గిరిజన సంఘాలు కోరుతున్నాయి.