భద్రాచలం, న్యూస్‌లైన్:గిరిజనుల అభివృద్ధికి అమలు చేసే ట్రైకార్ యాక్షన్‌ప్లాన్ లక్ష్య సాధనలో ఐటీడీఏ అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు. లబ్ధిదారులను ఎంపికచేసినా వారికి ఆర్థికసహాయమందించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ‘మాటలే తప్ప..చేతలు లేని’ అధికారుల కారణంగా గిరిజనులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదనే ఆరోపణలున్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరం ట్రైకార్ యాక్షన్ ప్లాన్ అమలు తీరును పరిశీలిస్తే ఇది తేటతెల్లమవుతుంది.
ఆర్థికాభివృద్ధి పథకాల (ట్రైకార్) అమల్లో భాగంగా ఆయా గ్రామాల్లో స్వయం ఉపాధి, అందుబాటులో ఉన్న ఇతర ఉత్పత్తులతో పనులు కల్పించి గిరిజనులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనేది ఈ పథకం లక్ష్యం. జిల్లాలోని ఏజెన్సీలో ఉన్న 29 మండలాల్లో 2012-13 సంవత్సరానికి సుమారు రూ.2.70 కోట్ల మేర సబ్సిడీ అందజేయాలని ఐటీడీఏ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతిపాదిత యూనిట్‌కయ్యే మొత్తంలో కొంతమేర ఐటీడీఏ ద్వారా సబ్సిడీ అందజేసి, దాని గ్రౌండింగ్ కోసం మిగతా డబ్బులను గ్రామైక్య సంఘాలు, బ్యాంకు రుణం ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు.
మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా లక్ష్య సాధన పేరిట ఐటీడీఏ అధికారులు కుస్తీలు పడుతున్నారు. మొత్తం 643 యూనిట్లను మంజూరుకు ఐటీడీఏ అధికారులు మొదట్లో అనుమతులు ఇచ్చారు. వీరిలో 609 మంది చేత బ్యాంకుల్లో అకౌంట్‌లు కూడా తెరిపించారు. ఆ తరువాత 542 మందినే అర్హులుగా తేల్చి వారి పేరుతో బ్యాంకుల్లో ఉన్న అకౌంట్‌లలో సబ్సిడీ కూడా జమ చేశారు. కానీ ఇప్పటి వరకు 395 యూనిట్లను మాత్రమే గ్రౌండింగ్ చేయగలిగారు. మిగిలిన యూనిట్లను గ్రౌండింగ్ చేయడంలో ఐటీడీఏ అధికారులు విఫలమయ్యారు.
ఇచ్చిన సబ్సిడీ వెనక్కి
ఏజెన్సీలో 542 యూనిట్ల ఏర్పాటుకు సుమారు రూ.2.70 కోట్లు సబ్సిడీ రూపేణా మంజూరు చేసినా వాటిని గ్రౌండింగ్ చేసే పరిస్థితి కనిపించకపోవడంతో లబ్ధిదారుల ఖాతాల్లో ఉన్న సబ్సిడీని వెనక్కి తీసుకుంటున్నారు. గత ఏడాది మార్చి, ఏప్రిల్, జూన్ నెలల్లో వేసిన సబ్సిడీ సొమ్మును ఆయా మండలాల అధికారులు తిరిగి ఐటీడీఏకు జమ చేసేందుకు లబ్ధిదారుల చుట్టూ తిరుగుతున్నారు. టెంటు హౌస్, పాడి గేదెలు, గిరిషాపు(కి రాణా దుకాణం)ల ఏర్పాటుకు కూడా బ్యాంకర్లు సహకరించలేదనే కారణంతో వాటిని రద్దు చేశారు. చివరకు కొండరెడ్డి గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పాలని నిశ్చయించుకున్న బేంబో( వెదురు ఉత్పత్తుల తయారీ) యూనిట్ల స్థాపనకు కూడా అధికారులు శ్రద్ధ చూపలేదు. 120 యూనిట్లను ప్రతిపాదిస్తే 76 మాత్రమే గ్రౌండింగ్ చేశారు.
కొండరెడ్ల పైనా నిర్లక్ష్యమే
ఏజెన్సీలోని గుట్టలపై నివసించే కొండరెడ్లపైనా ఐటీడీఏ అధికారులు నిర్లక్ష్యాన్నే ప్రదర్శిస్తున్నారు. వీరిని దృష్టిలో పెట్టుకునే వెదురు యూనిట్లకు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఆచరణలో నిర్లక్ష్యాన్ని చాటుకున్నారనే విమర్శలు మూటగట్టుకున్నారు. ఫలితంగా వెదురుఉత్పత్తుల తయారీనే జీవనాధారంగా చేసుకున్న కొండరెడ్లకు ప్రోత్సాహం లేకుండా పోయింది.
వీరి ఆర్థిక ఇబ్బందులను ఆసరగా చేసుకున్న కొంతమంది వ్యాపారస్తులు ముందస్తు పెట్టుబడులు అందజేసి వారు తయారు చేసిన ఉత్పత్తులను తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. వేలేరుపాడు మండలం పేరంటాలపల్లి గ్రామాన్ని ‘న్యూస్‌లైన్’ సందర్శించగా ఈ విషయం తేటతెల్లమైంది. ఈ గ్రామంలోని కొండరెడ్లకు బేంబో యూనిట్లు మంజూరైనా పనికిరాని పనిముట్లు ఇచ్చారనే కారణంతో వాటిని తీసుకునేందుకు నిరాకరించారు.
మళ్లీ సిద్ధం...
ట్రైకార్ యాక్షన్ ప్లాన్ అమలు కోసం 2013-14 సంవత్సరానికి గాను రూ.17.01 కోట్ల మేర సబ్సిడీ అందించేందుకు ఐటీడీఏ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీని అమలుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు స్వీకరించిన దివ్య ట్రైకార్ యాక్షన్ ప్లాన్ అమలుపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందిగా గిరిజన సంఘాలు కోరుతున్నాయి.
‘యాక్షన్‌ప్లాన్’లో నిర్లక్ష్యం
Published Sun, Feb 16 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 3:44 AM
Advertisement
Advertisement