itda officers
-
‘యాక్షన్‌ప్లాన్’లో నిర్లక్ష్యం
భద్రాచలం, న్యూస్‌లైన్:గిరిజనుల అభివృద్ధికి అమలు చేసే ట్రైకార్ యాక్షన్‌ప్లాన్ లక్ష్య సాధనలో ఐటీడీఏ అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు. లబ్ధిదారులను ఎంపికచేసినా వారికి ఆర్థికసహాయమందించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ‘మాటలే తప్ప..చేతలు లేని’ అధికారుల కారణంగా గిరిజనులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదనే ఆరోపణలున్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరం ట్రైకార్ యాక్షన్ ప్లాన్ అమలు తీరును పరిశీలిస్తే ఇది తేటతెల్లమవుతుంది. ఆర్థికాభివృద్ధి పథకాల (ట్రైకార్) అమల్లో భాగంగా ఆయా గ్రామాల్లో స్వయం ఉపాధి, అందుబాటులో ఉన్న ఇతర ఉత్పత్తులతో పనులు కల్పించి గిరిజనులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనేది ఈ పథకం లక్ష్యం. జిల్లాలోని ఏజెన్సీలో ఉన్న 29 మండలాల్లో 2012-13 సంవత్సరానికి సుమారు రూ.2.70 కోట్ల మేర సబ్సిడీ అందజేయాలని ఐటీడీఏ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతిపాదిత యూనిట్కయ్యే మొత్తంలో కొంతమేర ఐటీడీఏ ద్వారా సబ్సిడీ అందజేసి, దాని గ్రౌండింగ్ కోసం మిగతా డబ్బులను గ్రామైక్య సంఘాలు, బ్యాంకు రుణం ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా లక్ష్య సాధన పేరిట ఐటీడీఏ అధికారులు కుస్తీలు పడుతున్నారు. మొత్తం 643 యూనిట్లను మంజూరుకు ఐటీడీఏ అధికారులు మొదట్లో అనుమతులు ఇచ్చారు. వీరిలో 609 మంది చేత బ్యాంకుల్లో అకౌంట్లు కూడా తెరిపించారు. ఆ తరువాత 542 మందినే అర్హులుగా తేల్చి వారి పేరుతో బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లలో సబ్సిడీ కూడా జమ చేశారు. కానీ ఇప్పటి వరకు 395 యూనిట్లను మాత్రమే గ్రౌండింగ్ చేయగలిగారు. మిగిలిన యూనిట్లను గ్రౌండింగ్ చేయడంలో ఐటీడీఏ అధికారులు విఫలమయ్యారు. ఇచ్చిన సబ్సిడీ వెనక్కి ఏజెన్సీలో 542 యూనిట్ల ఏర్పాటుకు సుమారు రూ.2.70 కోట్లు సబ్సిడీ రూపేణా మంజూరు చేసినా వాటిని గ్రౌండింగ్ చేసే పరిస్థితి కనిపించకపోవడంతో లబ్ధిదారుల ఖాతాల్లో ఉన్న సబ్సిడీని వెనక్కి తీసుకుంటున్నారు. గత ఏడాది మార్చి, ఏప్రిల్, జూన్ నెలల్లో వేసిన సబ్సిడీ సొమ్మును ఆయా మండలాల అధికారులు తిరిగి ఐటీడీఏకు జమ చేసేందుకు లబ్ధిదారుల చుట్టూ తిరుగుతున్నారు. టెంటు హౌస్, పాడి గేదెలు, గిరిషాపు(కి రాణా దుకాణం)ల ఏర్పాటుకు కూడా బ్యాంకర్లు సహకరించలేదనే కారణంతో వాటిని రద్దు చేశారు. చివరకు కొండరెడ్డి గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పాలని నిశ్చయించుకున్న బేంబో( వెదురు ఉత్పత్తుల తయారీ) యూనిట్ల స్థాపనకు కూడా అధికారులు శ్రద్ధ చూపలేదు. 120 యూనిట్లను ప్రతిపాదిస్తే 76 మాత్రమే గ్రౌండింగ్ చేశారు. కొండరెడ్ల పైనా నిర్లక్ష్యమే ఏజెన్సీలోని గుట్టలపై నివసించే కొండరెడ్లపైనా ఐటీడీఏ అధికారులు నిర్లక్ష్యాన్నే ప్రదర్శిస్తున్నారు. వీరిని దృష్టిలో పెట్టుకునే వెదురు యూనిట్లకు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఆచరణలో నిర్లక్ష్యాన్ని చాటుకున్నారనే విమర్శలు మూటగట్టుకున్నారు. ఫలితంగా వెదురుఉత్పత్తుల తయారీనే జీవనాధారంగా చేసుకున్న కొండరెడ్లకు ప్రోత్సాహం లేకుండా పోయింది. వీరి ఆర్థిక ఇబ్బందులను ఆసరగా చేసుకున్న కొంతమంది వ్యాపారస్తులు ముందస్తు పెట్టుబడులు అందజేసి వారు తయారు చేసిన ఉత్పత్తులను తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. వేలేరుపాడు మండలం పేరంటాలపల్లి గ్రామాన్ని ‘న్యూస్‌లైన్’ సందర్శించగా ఈ విషయం తేటతెల్లమైంది. ఈ గ్రామంలోని కొండరెడ్లకు బేంబో యూనిట్లు మంజూరైనా పనికిరాని పనిముట్లు ఇచ్చారనే కారణంతో వాటిని తీసుకునేందుకు నిరాకరించారు. మళ్లీ సిద్ధం... ట్రైకార్ యాక్షన్ ప్లాన్ అమలు కోసం 2013-14 సంవత్సరానికి గాను రూ.17.01 కోట్ల మేర సబ్సిడీ అందించేందుకు ఐటీడీఏ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీని అమలుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు స్వీకరించిన దివ్య ట్రైకార్ యాక్షన్ ప్లాన్ అమలుపై ప్రత్యేక దృష్టి సారించాల్సిందిగా గిరిజన సంఘాలు కోరుతున్నాయి. -
నారాయణ గోడును పట్టించుకోరు!
సీతంపేట, న్యూస్‌లైన్: నారాయణగూడ..ప్రకృతి అందాలకు నిలయమైన సీతంపేట ఏజెన్సీలోని శివారు ఊరు. కల్లాకపటం ఎరుగని గిరిజనులు నివసించే చిన్న కుగ్రామం. ప్రస్తుతం కడగండి పంచాయతీ పరిధిలో ఉన్న ఈ ఊరు 12 ఏళ్ల క్రితం ఏర్పాటైంది. చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాలకు చెందిన కొన్ని కుటుంబాలు వలస వచ్చి దీన్ని నిర్మించుకున్నారు. 70 కుటుంబాలుంటున్న ఈ గ్రామ జనాభా సుమారు రెండు వందలు. పోడు వ్యవసాయం చేస్తూ జీవన పోరాటం చేస్తున్న ఈ గ్రామస్తులకు కనీస సౌకర్యాలంటే ఏమిటో కూడా తెలియవు. తాగునీటి కోసం ఇక్కడివారు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. ఐటీడీఏ అధికారులు ఓ బోరును ఏర్పాటు చేసినా దాని నీరు తాగడానికి పనికిరాదు. దీంతో సమీపంలో ఉన్న ఊట బావి నీటినే తెచ్చుకొని దాహార్తి తీర్చుకుంటున్నారు. దీనికితోడు విద్యుత్ సౌకర్యం కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో సాయంత్రమైతే అంధకారంలో నారాయణగూడ వాసులు ప్రాణాలన అరచేతిలో పెట్టుకొని కాలాన్ని వెల్లబుచ్చుతున్నారు. ఏజెన్సీ కావడంతో విషజంతువులు గ్రామంలోకి వస్తున్నాయని గిరిజనులు చెబుతున్నారు. విద్యుత్ వెలుగులు కల్పించాలని ఐటీడీఏ అధికారులతోపాటు జిల్లా స్థాయి అధికారులకు అనేకసార్లు మొరపెట్టుకున్నా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద ధర్నా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. విద్యుత్ మీటర్లకు డబ్బులు కట్టాలని అధికారులు చెప్పడంతో రూ.170 చొప్పున మూడేళ్ల క్రితం చెల్లించారు. అయితే కేవలం సర్వే చేసి వదిలేశారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో డిగ్రీ, ఇంజనీరింగ్, ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. కరెంటు సౌకర్యం లేకపోవడంతో రాత్రిపూట చదువుకోలేకపోతున్నామని తెలిపారు. దీపపు బుడ్డీల మీద చదువుదామన్నా కిరోసిన్ సమస్య ఉందంటున్నారు. రాత్రి ఏడు గంటలైతే నిద్రపోవాల్సి వస్తుందంటున్నారు. కరెంటు లేకపోవడంతో చదువులు సాగడం లేదని డిగ్రీ చదువుతున్న సవర మోహనరావు, రమేష్, రాము, జగదీష్ తదితరులు తెలిపారు. దీనికి తోడు రహదారి సౌకర్యం లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. తుప్పల మధ్యలో నుంచి ఉన్న చిన్న దారినే ఉపయోగించుకుంటున్నారు. అలాగే ఇక్కడ పాఠశాలను కూడా ఏర్పాటు చేయలేదు. అంగన్వాడీ కేంద్రం కూడా లేదు. దీంతో సుమారు 15 పిల్లలను చదువుల కోసం వేరే గ్రామంలో ఉంటున్న బంధువుల ఇళ్లలో ఉంచి తల్లిదండ్రులు చదివించుకుంటున్నారు. రేషన్ దుకాణం కూడా లేకపోవడంతో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న లోకొత్తవలస గ్రామానికి వెళ్లాల్సి వస్తుందని గిరిజనులు వాపోతున్నారు. పక్కా గృహాలు కూడా మంజూరు కాలేదని వాపోతున్నారు. దీంతో చిన్న పూరి గుడిసెల్లోనే నివసిస్తున్నారు. కొండపోడు పట్టాలు లే వు కొండపోడు పట్టాలు లేవని గిరిజనులు తెలిపారు. బ్యాంకుల నుంచి రుణ సౌకర్యాన్ని పొందలేకపోతున్నామని వాపోతున్నారు. ఐటీడీఏ పరంగా కూడా తమకు ఎటువంటి రుణాలు లేవంటున్నారు. ముఖ్యంగా గ్రామానికి రహదారి సౌకర్యం లేదు. అటవీశాఖ అభ్యంతరం తెలపడంతో గ్రామానికి రహదారి లేదని జగ్గారావు,జమ్మయ్య, దుర్గారావు తదితరులు తెలిపారు. అత్యవసర సమయాల్లో ఇబ్బందులు తప్పడం లేదని, వైద్యం కోసం నానా అవస్థలు పడుతున్నామన్నారు. రంగు మారుతున్న బోరు నీరు సీతంపేట సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ బోరు ఏర్పాటు చేసినప్పటికీ ఆ నీరు బాగోవడం లేదు. నీరు ఐదు నిమిషాల్లో ఎర్రగా మారిపోతుంది. దీంతో కనీసం వాడుకకు కూడా పనికిరాకపోవడంతో గ్రామానికి దూరంలో ఉన్న ఊటబావి, గెడ్డలోని చెలమ నీటిని తెచ్చుకుంటున్నారు. వేసవి వస్తే అది కూడా ఎండిపోతుంది. ఆ సమయంలో కిలోమీటరున్నర దూరంలో ఉన్న లోకొత్తవలస గ్రామానికి వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నామని గిరిజన మహిళలు చెబుతున్నారు.