సీతంపేట, న్యూస్‌లైన్:
నారాయణగూడ..ప్రకృతి అందాలకు నిలయమైన సీతంపేట ఏజెన్సీలోని శివారు ఊరు. కల్లాకపటం ఎరుగని గిరిజనులు నివసించే చిన్న కుగ్రామం. ప్రస్తుతం కడగండి పంచాయతీ పరిధిలో ఉన్న ఈ ఊరు 12 ఏళ్ల క్రితం ఏర్పాటైంది. చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాలకు చెందిన కొన్ని కుటుంబాలు వలస వచ్చి దీన్ని నిర్మించుకున్నారు.
70 కుటుంబాలుంటున్న ఈ గ్రామ జనాభా సుమారు రెండు వందలు. పోడు వ్యవసాయం చేస్తూ జీవన పోరాటం చేస్తున్న ఈ గ్రామస్తులకు కనీస సౌకర్యాలంటే ఏమిటో కూడా తెలియవు. తాగునీటి కోసం ఇక్కడివారు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. ఐటీడీఏ అధికారులు ఓ బోరును ఏర్పాటు చేసినా దాని నీరు తాగడానికి పనికిరాదు. దీంతో సమీపంలో ఉన్న ఊట బావి నీటినే తెచ్చుకొని దాహార్తి తీర్చుకుంటున్నారు. దీనికితోడు విద్యుత్ సౌకర్యం కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో సాయంత్రమైతే అంధకారంలో నారాయణగూడ వాసులు ప్రాణాలన అరచేతిలో పెట్టుకొని కాలాన్ని వెల్లబుచ్చుతున్నారు. ఏజెన్సీ కావడంతో విషజంతువులు గ్రామంలోకి వస్తున్నాయని గిరిజనులు చెబుతున్నారు. విద్యుత్ వెలుగులు కల్పించాలని ఐటీడీఏ అధికారులతోపాటు జిల్లా స్థాయి అధికారులకు అనేకసార్లు మొరపెట్టుకున్నా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద ధర్నా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. విద్యుత్ మీటర్లకు డబ్బులు కట్టాలని అధికారులు చెప్పడంతో రూ.170 చొప్పున మూడేళ్ల క్రితం చెల్లించారు. అయితే కేవలం సర్వే చేసి వదిలేశారని గిరిజనులు ఆరోపిస్తున్నారు.
గ్రామంలో డిగ్రీ, ఇంజనీరింగ్, ఇంటర్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. కరెంటు సౌకర్యం లేకపోవడంతో రాత్రిపూట చదువుకోలేకపోతున్నామని తెలిపారు. దీపపు బుడ్డీల మీద చదువుదామన్నా కిరోసిన్ సమస్య ఉందంటున్నారు. రాత్రి ఏడు గంటలైతే నిద్రపోవాల్సి వస్తుందంటున్నారు. కరెంటు లేకపోవడంతో చదువులు సాగడం లేదని డిగ్రీ చదువుతున్న సవర మోహనరావు, రమేష్, రాము, జగదీష్ తదితరులు తెలిపారు. దీనికి తోడు రహదారి సౌకర్యం లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. తుప్పల మధ్యలో నుంచి ఉన్న చిన్న దారినే ఉపయోగించుకుంటున్నారు. అలాగే ఇక్కడ పాఠశాలను కూడా ఏర్పాటు చేయలేదు. అంగన్‌వాడీ కేంద్రం కూడా లేదు. దీంతో సుమారు 15 పిల్లలను చదువుల కోసం వేరే గ్రామంలో ఉంటున్న బంధువుల ఇళ్లలో ఉంచి తల్లిదండ్రులు చదివించుకుంటున్నారు. రేషన్ దుకాణం కూడా లేకపోవడంతో ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న లోకొత్తవలస గ్రామానికి వెళ్లాల్సి వస్తుందని గిరిజనులు వాపోతున్నారు. పక్కా గృహాలు కూడా మంజూరు కాలేదని వాపోతున్నారు. దీంతో చిన్న పూరి గుడిసెల్లోనే నివసిస్తున్నారు.
కొండపోడు పట్టాలు లే వు
కొండపోడు పట్టాలు లేవని గిరిజనులు తెలిపారు. బ్యాంకుల నుంచి రుణ సౌకర్యాన్ని పొందలేకపోతున్నామని వాపోతున్నారు. ఐటీడీఏ పరంగా కూడా తమకు ఎటువంటి రుణాలు లేవంటున్నారు. ముఖ్యంగా గ్రామానికి రహదారి సౌకర్యం లేదు. అటవీశాఖ అభ్యంతరం తెలపడంతో గ్రామానికి రహదారి లేదని జగ్గారావు,జమ్మయ్య, దుర్గారావు తదితరులు తెలిపారు. అత్యవసర సమయాల్లో ఇబ్బందులు తప్పడం లేదని, వైద్యం కోసం నానా అవస్థలు పడుతున్నామన్నారు.
రంగు మారుతున్న బోరు నీరు
సీతంపేట సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ బోరు ఏర్పాటు చేసినప్పటికీ ఆ నీరు బాగోవడం లేదు. నీరు ఐదు నిమిషాల్లో ఎర్రగా మారిపోతుంది. దీంతో కనీసం వాడుకకు కూడా పనికిరాకపోవడంతో గ్రామానికి దూరంలో ఉన్న ఊటబావి, గెడ్డలోని చెలమ నీటిని తెచ్చుకుంటున్నారు. వేసవి వస్తే అది కూడా ఎండిపోతుంది. ఆ సమయంలో కిలోమీటరున్నర దూరంలో ఉన్న లోకొత్తవలస గ్రామానికి వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నామని గిరిజన మహిళలు చెబుతున్నారు.
నారాయణ గోడును పట్టించుకోరు!
Published Sat, Dec 21 2013 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM
Advertisement
Advertisement