సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి సీతక్క, సీఎస్ శాంతికుమారి
ఆదివాసీలకు విద్యా బోధనపై అధ్యయనం
ఐటీడీఏ ప్రాంతాల్లో ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇళ్లు
సీఎం రేవంత్‌రెడ్డి హామీ.. ఆదివాసీ నేతలతో సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీలకు గోండు భాషలో ప్రాథమిక విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనిపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఆదివాసీ ప్రజాప్రతినిధులు, సంఘాల ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీల సమస్యలను సంఘాల నేతలు సీఎం వద్ద ప్రస్తావిస్తూ వినతులు సమర్పించారు.
ఆదివాసీల సమగ్రాభివృద్ధికి చర్యలు
రాష్ట్రంలోని ఆదివాసీల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘నేను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మొట్టమొదటి సభ ఇంద్రవెల్లిలోనే పెట్టాం. ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని స్మృతివనంగా మార్చాలని, అమరుల కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయాలని అప్పట్లోనే నిర్ణయించాం. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పూర్తి చేశాం. రాజకీయంగానూ ఆదివాసీలకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఆదివాసీలు విద్య, ఉద్యోగ, ఆర్థిక అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. ఆదివాసీల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, మౌలిక సదుపాయాలను వెంటనే మంజూరు చేస్తున్నాం.
విదేశాల్లో చదువుకునే ఆదివాసీ విద్యార్థులకు సంబంధించి పెండింగ్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లను క్లియర్ చేస్తాం. ఆదివాసీ గూడేల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను. కేస్లాపూర్ జాతరకు నిధులు మంజూరు చేస్తాం. ఉద్యమాల్లో ఆదివాసీలపై పెట్టిన కేసులు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఐటీడీఏ ప్రాంతాలకు ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం. ఇందిర జలప్రభ ద్వారా ఉచితంగా బోర్లు వేస్తాం. ఆదివాసీ రైతుల వ్యవసాయ బోర్లకు సోలార్ పంపుసెట్లు ఉచితంగా అందిస్తాం’ అని సీఎం వారికి హామీనిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment