కేంద్ర ప్రభుత్వ కార్యక్రమానికి గతేడాది శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్
ఏడాదిలో తొలిదశ సికిల్ సెల్ స్క్రీనింగ్ పూర్తి చేసేలా కార్యాచరణ
19,90,277 మందికి స్క్రీనింగ్ లక్ష్యం
9,38,007 మందికి స్క్రీనింగ్.. 4,36,556 సికిల్ సెల్ కార్డులు
మరో 10,52,270 మందికి 2025 మార్చి నాటికి పూర్తి చేసేలా ప్రస్తుత ప్రభుత్వం ప్రణాళిక
సాక్షి, అమరావతి: ప్రాణాంతకమైన సికిల్‌సెల్ వ్యాధిని పూర్తిగా నివారించి, గిరిజనులను దాని బారినుంచి కాపాడటంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. దేశంలోని గిరిజన ప్రాంతాల్లో ‘మిషన్ టు ఎలిమినేషన్ సికిల్‌సెల్ ఎనీమియా 2023–24’ను నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా చేపట్టాలని గతేడాది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరిగే 2047 నాటికి గిరిజన ప్రాంతాల్లో సికిల్‌సెల్ అనేది లేకుండా చేసేందుకు తీసుకునే చర్యల్లో భాగంగా స్క్రీనింగ్(నిర్ధారణ పరీక్షలు) నిర్వహిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ హాయంలోనే కార్యాచరణ..
రాష్ట్రంలో 40 ఏళ్లలోపు గిరిజనులు 19,90,277 మంది ఉన్నట్లు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గుర్తించింది. వారందరికీ మూడేళ్లలో (మూడు దశల్లో) రోగ నిర్ధారణ పరీక్షలు పూర్తిచేసి రోగ లక్షణాలున్నవారిని గుర్తించాలని ప్రణాళిక రూపొందించింది. ఈ నేపథ్యంలోనే తొలిదశ రోగ నిర్ధారణ పరీక్షలు గతేడాది చేపట్టారు. ఇప్పటి వరకు 9,38,007 మందికి స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేíÜ 4,36,556 సికిల్ సెల్ కార్డులు పంపిణీ చేశారు. మరో 10,52,270 మందికి 2025 మార్చి నాటికి పరీక్షలు పూర్తి చేసేలా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
బాధితులకు భరోసా ఇచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
తొలిదశలో రాష్ట్రంలోని ఏజెన్సీ జిల్లాల్లో అత్యధికంగా సికిల్‌సెల్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అత్యధిక పరీక్షలు నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జిల్లాలో సికిల్‌సెల్ రోగులు, క్యారియర్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సికిల్‌సెల్, తలసేమియా వ్యాధిగ్రస్తులకు గొప్ప భరోసా ఇచ్చింది. గిరిజనుల్లో 1,913 మంది సికిల్‌సెల్, 1,707 మంది తలసేమియా వ్యాధిగ్రస్తులకు గత ప్రభుత్వం నెలకు రూ.10 వేల చొప్పున పెన్షన్ అందించడంతోపాటు ఉచిత వైద్యం అందించింది. దేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కావడం గమనార్హం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బాధితులకు సామాజిక భద్రతా పెన్షన్ పెంచి మరీ ఇచ్చారు.
గిరిజనుల్లోనే తీవ్రత ఎందుకంటే..
సికిల్‌సెల్, తలసేమియా రెండూ రక్తసంబంధ వ్యాధులే. ఇవి రెండూ గిరిజనుల్లోనే ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం రక్త సంబంధీకుల మధ్యే వివాహాలు ఎక్కువగా జరగడమని గుర్తించారు. మైదాన ప్రాంతాల్లో బయటి వాళ్లతో పెళ్లి సంబంధాలు కలుపుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదే గిరిజన ప్రాంతాల్లో గూడెం, ఊళ్లలో అతి తక్కువ జనాభా ఉండటం, వాటి పరిధి తక్కువగా ఉండటంతో వాళ్లలో వాళ్లే మేనరికపు వివాహాలు చేసుకుంటారు. రక్త సంబంధీకుల మధ్యే తరచూ వివాహాలు జరగడంతో జన్యుపరమైన సమస్యలతో అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పరిశోధకుల నిర్ధారించారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఈ రోగ లక్షణాలున్న ఇద్దరు వివాహం చేసుకోకుండా అవగాహన కల్పిస్తారు. దీనివల్ల భావితరాలకు సికిల్‌సెల్ సోకుండా అడ్డుకట్ట వేస్తారు. అప్పటికే రోగ లక్షణాలున్నవారికి పెన్షన్‌తోపాటు వైద్యసేవలు అందించి వారి జీవితకాలాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తారు.
రోగ లక్షణాలను బట్టి కార్డులు
⇒ సికిల్ సెల్ రోగ లక్షణాలు (బాధితులు), రోగవ్యాప్తికి కారకులుగా (క్యారియర్స్)ఉన్నవారిని గుర్తించి తగు వైద్య సహాయం అందించాల్సి ఉంటుంది.
⇒ చదువురాని వారికి సైతం అర్థమయ్యే రీతిలో మహిళలకు, పురుషులకు వేర్వేరుగా ఈ కార్డుల్ని డిజైన్ చేశారు.
⇒ క్యారియర్స్‌గా ఉన్నవారికి ప్రాణాపాయం లేకపోయినా వారి ద్వారా పిల్లలకు ఆ రోగం సంక్రమించే అవకాశం ఉంది.
⇒ సికిల్‌సెల్, తలసేమియా వ్యాధుల తీవ్రతను తెలిపేలా తెలుపు, పసుపు రంగుల్లో వాటిని రూపొందిస్తున్నారు.
⇒రోగ నిర్ధారణ పరీక్షల అనంతరం సంబంధిత వ్యక్తికి సికిల్‌సెల్, తలసేమియా వంటి రోగ లక్షణాలు ఉన్నాయో? లేదో? తెలిపే కార్డులు ఇస్తారు.
⇒ రోగ లక్షణాలు లేకపోతే పూర్తిగా తెలుపు, లక్షణాల తీవ్రతను బట్టి తెలుపు నుంచి ముదురు పసుపురంగు వరకు ఉండేలా కార్డులు ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment