చెట్టుకు 150 కిలోల పువ్వు లభ్యం
కిలో రూ.50 నుంచి రూ.60కు విక్రయం
కాయలు కిలో రూ.30కు కొనుగోలు
ఆధారిత ఉత్పత్తుల తయారీ దిశగాగిరి మహిళల అడుగులు
గిరిజనులకు అడవి ప్రసాదించిన ఫలాల్లో విప్ప పువ్వు ఒకటి. మన్యంలో విరివిగా లభించే ఇవి గిరిజనులకు మంచి ఆదాయ వనరు. ఇప్పటివరకు సీజన్‌లో మాత్రమే సేకరించి ఆదాయం పొందేవారు. ఇక నుంచి వీటితో ఏడాది పొడవునా అనుబంధ ఆహార ఉత్పత్తులను తయారు చేసి ఆదాయం పొందే దిశగా గిరి మహిళలు అడుగులు వేస్తున్నారు.
చింతూరు: లాటిన్ పరిభాషలో సపోటేసీ జాతికి చెందిన అడవి చెట్టు విప్ప. ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పూస్తుంది. చెట్లు కలిగిన గిరిజనులు పూలు రాలడానికి ముందే వాటి చుట్టూ నేలను శుభ్రం చేస్తారు. తెల్లవారుతున్న వేళ విప్పపూలు (Vippa puvvu) రాలుతున్న సమయంలో సువాసన వెదజల్లుతుంది. ఇంటిల్లిపాదీ కలసి చెట్టు వద్దకు చేరుకుని బుట్టలు, చేటలతో పూలను సేకరిస్తారు. వీటిని నాలుగైదు రోజులు బాగా ఎండబెడతారు. ఎండిన పూలను సంతలకు తీసుకువెళ్లి విక్రయిస్తారు.
ఏడాది పొడవునా అమ్మకాలు
అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో విరివిగా విప్పచెట్లు ఉన్నాయి. కొన్ని గిరిజన కుటుంబాలు వీటిపై వచ్చే ఆదాయంతో ఏడాది పొడవునా జీవనం సాగిస్తున్నాయి. సేకరించిన పూలను ఎండబెట్టి చింతూరు, ఏడుగురాళ్లపల్లి, కుంట మార్కెట్లకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. భద్రాచలం, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు భారీగా కొనుగోలు చేస్తున్నారు.
ఒక చెట్టుకు సుమారు 150 కిలోల విప్ప పువ్వు లభ్యమవుతుంది. దీనిని ఎండబెట్టిన తరువాత వచ్చే పువ్వు కిలో రూ.50 నుంచి రూ.60 ధరకు విక్రయిస్తున్నారు. విప్పకాయలు కిలో రూ.30కు అమ్ముతున్నారు. ఈ చెట్లు విస్తారంగా ఉన్నందున గిరిజనులకు చేతినిండా ఆదాయం వస్తోంది.
పోషకాలెన్నో.. : విప్పపూలలో ఎన్నో పోషక గుణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. రోగాలను హరించే ఔషధ గుణాలు కూడా విప్పపూలలో ఉన్నాయని వారు సూచిస్తున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం వంటి రోగాలను నయంచేసే గుణంతోపాటు ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, ఎనర్జీ, కాల్షియం, ఫాస్పరస్, విటమిన్–సి వంటి ఎన్నో పోషక విలువలు ఉన్నాయని వారు చెబుతున్నారు. విప్పకాయలతో చేసిన నూనెతో మసాజ్ చేస్తే కీళ్లనొప్పులు దూరమవుతాయని వారు పేర్కొంటున్నారు.
స్వీట్ల తయారీ దిశగా అడుగులు
విప్ప పూలను సారా తయారీ, ప్రసాదాల్లో మాత్రమే వినియోగించేవారు. ప్రస్తుతం కొన్ని స్చచ్ఛంద సంస్థల సహకారంతో స్వీట్ల తయారీపై మహిళలు దృష్టి పెట్టారు. చింతూరుకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ విప్ప పూల సేకరణ, స్వీట్ల తయారీపై మహిళలకు అవగాహన కల్పిస్తోంది. లడ్డూ, హల్వా, జామ్, కేక్ వంటి తినుబండారాల తయారీపై శిక్షణ ఇచ్చి ఉపా ధిని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది.
మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి
విప్పపువ్వుల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నందున వీటితో స్వీట్లు తయారీపై శిక్షణ ఇవ్వడంతోపాటు మార్కెటింగ్‌పై అవగాహన కల్పిస్తున్నాం. చింతూరు డివిజన్‌లోని గిరిజన గ్రామాల్లో ఈ ప్రక్రియ చేపట్టాం. తాము అందిస్తున్న సహకారం గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది.
– సుభాని,కార్యదర్శి, ఆశా స్వచ్ఛంద సంస్థ, చింతూరు
విప్పపువ్వుతో ఆర్థికాదాయం
ప్రతి వేసవిలో ఇంటిల్లిపాదీ కలసి విప్పపూలు సేకరిస్తాం. వాటిని ఆరబెట్టి చింతూరు, మోతుగూడెం సంతల్లో విక్రయించడం ద్వారా ఆదాయం లభిస్తుంది. దీంతోపాటు మా సంస్కృతిలో భాగంగా విప్పపువ్వుతో సారా కూడా తయారుచేసి సేవిస్తాం.
– పూసం మహేష్,లక్కవరం, చింతూరు మండలం
శిక్షణ ఎంతో ఉపయోగం
విప్పపువ్వుల సేకరణతో పాటు ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వీట్ల తయారీలో శిక్షణ పొందుతున్నాం. తయారు చేసే విధానంతోపాటు ఆన్‌లైన్ మార్కెటింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. నాణ్యమైన విప్పపూల సేకరణకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాం.
– వెట్టి కన్నమ్మ,తెరపాడు, చింతూరు మండలం
Comments
Please login to add a commentAdd a comment