chinturu
-
Vippa Puvvu: విప్ప పువ్వు.. కల్పతరువు
గిరిజనులకు అడవి ప్రసాదించిన ఫలాల్లో విప్ప పువ్వు ఒకటి. మన్యంలో విరివిగా లభించే ఇవి గిరిజనులకు మంచి ఆదాయ వనరు. ఇప్పటివరకు సీజన్లో మాత్రమే సేకరించి ఆదాయం పొందేవారు. ఇక నుంచి వీటితో ఏడాది పొడవునా అనుబంధ ఆహార ఉత్పత్తులను తయారు చేసి ఆదాయం పొందే దిశగా గిరి మహిళలు అడుగులు వేస్తున్నారు. చింతూరు: లాటిన్ పరిభాషలో సపోటేసీ జాతికి చెందిన అడవి చెట్టు విప్ప. ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పూస్తుంది. చెట్లు కలిగిన గిరిజనులు పూలు రాలడానికి ముందే వాటి చుట్టూ నేలను శుభ్రం చేస్తారు. తెల్లవారుతున్న వేళ విప్పపూలు (Vippa puvvu) రాలుతున్న సమయంలో సువాసన వెదజల్లుతుంది. ఇంటిల్లిపాదీ కలసి చెట్టు వద్దకు చేరుకుని బుట్టలు, చేటలతో పూలను సేకరిస్తారు. వీటిని నాలుగైదు రోజులు బాగా ఎండబెడతారు. ఎండిన పూలను సంతలకు తీసుకువెళ్లి విక్రయిస్తారు. ఏడాది పొడవునా అమ్మకాలు అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో విరివిగా విప్పచెట్లు ఉన్నాయి. కొన్ని గిరిజన కుటుంబాలు వీటిపై వచ్చే ఆదాయంతో ఏడాది పొడవునా జీవనం సాగిస్తున్నాయి. సేకరించిన పూలను ఎండబెట్టి చింతూరు, ఏడుగురాళ్లపల్లి, కుంట మార్కెట్లకు తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. భద్రాచలం, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు భారీగా కొనుగోలు చేస్తున్నారు. ఒక చెట్టుకు సుమారు 150 కిలోల విప్ప పువ్వు లభ్యమవుతుంది. దీనిని ఎండబెట్టిన తరువాత వచ్చే పువ్వు కిలో రూ.50 నుంచి రూ.60 ధరకు విక్రయిస్తున్నారు. విప్పకాయలు కిలో రూ.30కు అమ్ముతున్నారు. ఈ చెట్లు విస్తారంగా ఉన్నందున గిరిజనులకు చేతినిండా ఆదాయం వస్తోంది. పోషకాలెన్నో.. : విప్పపూలలో ఎన్నో పోషక గుణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. రోగాలను హరించే ఔషధ గుణాలు కూడా విప్పపూలలో ఉన్నాయని వారు సూచిస్తున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం వంటి రోగాలను నయంచేసే గుణంతోపాటు ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు, ఎనర్జీ, కాల్షియం, ఫాస్పరస్, విటమిన్–సి వంటి ఎన్నో పోషక విలువలు ఉన్నాయని వారు చెబుతున్నారు. విప్పకాయలతో చేసిన నూనెతో మసాజ్ చేస్తే కీళ్లనొప్పులు దూరమవుతాయని వారు పేర్కొంటున్నారు. స్వీట్ల తయారీ దిశగా అడుగులువిప్ప పూలను సారా తయారీ, ప్రసాదాల్లో మాత్రమే వినియోగించేవారు. ప్రస్తుతం కొన్ని స్చచ్ఛంద సంస్థల సహకారంతో స్వీట్ల తయారీపై మహిళలు దృష్టి పెట్టారు. చింతూరుకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ విప్ప పూల సేకరణ, స్వీట్ల తయారీపై మహిళలకు అవగాహన కల్పిస్తోంది. లడ్డూ, హల్వా, జామ్, కేక్ వంటి తినుబండారాల తయారీపై శిక్షణ ఇచ్చి ఉపా ధిని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి విప్పపువ్వుల్లో ఎన్నో పోషక విలువలు ఉన్నందున వీటితో స్వీట్లు తయారీపై శిక్షణ ఇవ్వడంతోపాటు మార్కెటింగ్‌పై అవగాహన కల్పిస్తున్నాం. చింతూరు డివిజన్లోని గిరిజన గ్రామాల్లో ఈ ప్రక్రియ చేపట్టాం. తాము అందిస్తున్న సహకారం గిరిజన మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. – సుభాని,కార్యదర్శి, ఆశా స్వచ్ఛంద సంస్థ, చింతూరువిప్పపువ్వుతో ఆర్థికాదాయం ప్రతి వేసవిలో ఇంటిల్లిపాదీ కలసి విప్పపూలు సేకరిస్తాం. వాటిని ఆరబెట్టి చింతూరు, మోతుగూడెం సంతల్లో విక్రయించడం ద్వారా ఆదాయం లభిస్తుంది. దీంతోపాటు మా సంస్కృతిలో భాగంగా విప్పపువ్వుతో సారా కూడా తయారుచేసి సేవిస్తాం. – పూసం మహేష్,లక్కవరం, చింతూరు మండలంశిక్షణ ఎంతో ఉపయోగం విప్పపువ్వుల సేకరణతో పాటు ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వీట్ల తయారీలో శిక్షణ పొందుతున్నాం. తయారు చేసే విధానంతోపాటు ఆన్లైన్ మార్కెటింగ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. నాణ్యమైన విప్పపూల సేకరణకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాం. – వెట్టి కన్నమ్మ,తెరపాడు, చింతూరు మండలం -
క్రికెటర్ అవ్వాలని కలలు కన్నాడు.. పేదరికం అడ్డొచ్చింది.. అయితేనేం..
ఎంతో ఇష్టమైన క్రికెట్లో రాణించాలని కలలు కన్నాడు. మైదానంలో ఫోర్లు, సిక్సర్లతో మోత మోగించాలని, దేశానికి పేరు తేవాలని పదేపదే పరితపించాడు. అయితే టాలెంట్ ఉన్నా పేదరికం అడ్డొచ్చింది. ఆటపై ఉన్న మక్కువ పేదరికాన్ని జయించేలా చేసింది. తాను ఆడలేని క్రికెట్‌ను పదిమందితో ఆడించాలని భావించాడు. అభినవ ద్రోణాచార్యలా మారాడు. ఎందరికో అంతర్జాతీయస్థాయిలో తర్ఫీదునిస్తూ తన కలలను సాకారం చేసుకుంటున్నాడు చింతూరుకు చెందిన పాసర్లపూడి సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు. సాక్షి, అల్లూరి సీతారామరాజు(చింతూరు): క్రికెట్లో ఎంతోమందికి తర్ఫీదునిస్తూ వారి ఉన్నతికి బాటలు వేస్తున్నాడు చింతూరుకు చెందిన పాసర్లపూడి సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు. పేదరికం కారణంగా మధ్యలోనే ఆటకు స్వస్తి పలికిన సుబ్బు తన కలల సాకారానికి అడ్డొచ్చిన పేదరికాన్ని అసహ్యించుకోలేదు. తాను సాధించలేనిది తన శిక్షణతో పలువురిని ఆటలో తీర్చిదిద్దేందుకు నడుం బిగించాడు. ఖర్చుతో కూడుకున్నదైనా క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసి పలువురు చిన్నారులకు శిక్షణ ఇస్తున్నాడు. వారు మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకునేలా చేస్తున్నాడు. స్థానికంగానే చదువు.. సుబ్బు తండ్రి సత్యనారాయణ వడ్రంగి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుండగా సబ్బు చింతూరులో ఇంటర్ వరకు చదివాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న అతను స్థానికంగా జరిగే టోర్నమెంట్లలో ఆడుతూ మంచి నైపుణ్యం సాధించాడు. అదే సమయంలో అకాడమీలో చేరి క్రికెట్లో ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆశించాడు. అతనికి పేదరికం అడ్డురావడంతో ఆశయానికి బ్రేక్‌పడింది. అనంతరం భద్రాచలంలో డిగ్రీలో చేరిన సుబ్బు 2010 నుంచి 2014 వరకు ఐదేళ్లపాటు చిన్నారులకు క్రికెట్లో కోచింగ్ ఇచ్చాడు. 2015 నుంచి 2016 వరకు హైదరాబాద్‌లోని సెయింట్‌జోన్స్ క్రికెట్ అకాడమీలో కోచ్‌గా పనిచేశాడు. 2016లో హైదరాబాద్‌లో ఎరీనా ఎలైట్ కోచింగ్ సెంటర్ ప్రారంభించి 2020 వరకు ఎందరో చిన్నారులకు క్రికెట్ ఓనమాలు నేర్పాడు. అనంతరం 2020లో తిరిగివచ్చిన ఆయన శ్రీ భద్రాద్రి క్రికెట్ అకాడమి పేరుతో సంస్థను నెలకొల్పాడు. ప్రస్తుతం అదే పేరుతో 30 మంది చిన్నారులకు కోచింగ్ ఇస్తున్నాడు. రాణించిన త్రిష భద్రాచలంకు చెందిన గొంగడి త్రిష 2010 నుంచి 2014 వరకు భద్రాచలంలో సుబ్బు కోచింగ్‌లో క్రికెట్లో ఓనమాలు నేర్చుకుంది. దీంతో త్రిష హైదరాబాద్ జట్టుతో పాటు ఇండియా అండర్–16, అండర్–19 జట్లకు ఎంపికైంది. అనంతరం నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కు ఎంపికై మరిన్ని మెళకువలు నేర్చుకుంది. ఇటీవల అండర్–19 మహిళా జట్టు తరఫున శ్రీలంక, వెస్టిండీస్, న్యూజిలాండ్ సిరీస్‌లో రాణించడం ద్వారా అండర్–19 వరల్డ్‌కప్‌లో పాల్గొనే భారత్ మహిళా జట్టుకు ఎంపికైంది. ఇదే బాటలో మరెందరో చిన్నారులు సుబ్బు కోచింగ్‌లో రాటుదేలుతున్నారు. ఉన్నత అవకాశాల కోసం వారంతా ఎదురు చూస్తున్నారు. భారత్ జట్టులో ఆడాలనుకున్నా చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. ఎప్పటికైనా ఇండియా జట్టు తరఫున ఆడాలనుకున్నా. అనివార్య కారణాలతో ఆటను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఎంతో ఇష్టమైన ఆటను వదల్లేక కోచ్‌గా బాధ్యతలు చేపట్టి చిన్నారులకు శిక్షణ ఇస్తున్నాను. నా కోచింగ్‌లో రాటుదేలిన త్రిష ఇండియా జట్టుకు ఎంపిక కావడం ఎంతో ఆనందంగా ఉంది. నా కళ ఇలా సాకారం చేసుకుంటున్నా. –పాసర్లపూడి సుబ్రహ్మణ్యం, క్రికెట్ కోచ్, చింతూరు -
ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం
చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చింతూరు మండలం బొడ్డుగూడెం వద్ద లారీ- బొలెరో వాహనాలు ఎదురెదురుగా డీకొన్నాయి. ఈ ఘటనలో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. మృతులను ఛత్తీస్‌గఢ్ వాసులుగా గుర్తించారు. ప్రమాదం జరిగే సమయంలో లారీ అతివేగంతో బొలెరోపైకి దూసుకొచ్చినట్లు తెలుస్తోంది. -
చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు.. ప్రభుత్వం ఉత్తర్వులు
సాక్షి, చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో నాలుగు మండలాల ప్రజల చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. చింతూరు, కూనవరం, ఎటపాక, వీఆర్‌పురం మండలాలను కలిపి కొత్తగా చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది జూలై 27న వరదప్రాంతాల పరిశీలనకు చింతూరు మండలం వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుయిగూరులో మాట్లాడారు. కొత్తగా చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీఇచ్చారు. మాట ఇచ్చిందే తడవుగా ఆయన కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ప్రక్రియకు చకచకా చర్యలు చేపట్టారు. ► రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వరద ప్రాంతాల పర్యటనకు సందర్భంగా ఇచ్చిన హామీని సీఎం జగన్మోహన్రెడ్డి వెనువెంటనే అమల్లోకి తెచ్చారు. ► సెప్టెంబరు ఏడున జరిగిన మంత్రివర్గ సమావేశంలో చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోద ముద్ర పడింది. అనంతరం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సంబంధించి అభ్యంతరాలపై నోటిఫికేషన్ జారీఅయింది. ఆ గడువు ముగియడంతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ► ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం పట్ల చింతూరు, కూనవరం, ఎటపాక, వీఆర్‌పురం మండలాల ప్రజలనుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ► అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పటివరకు పాడేరు, రంపచోడవరం రెండు రెవెన్యూ డివిజన్లు వుండగా, కొత్తగా చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో ఆ సంఖ్య మూడుకు పెరిగింది. ► కొత్తగా ఏర్పాటైన చింతూరు డివిజన్లో మొత్తం 1,35,082 మంది జనాభా వుండగా 90,929 మంది ఓటర్లున్నారు. వీరిలో 82,992 మంది ఎస్టీ జనాభా ఉన్నారని అధికారవర్గాలు తెలిపాయి. సర్వత్రా హర్షం మాట ఇస్తే నిలబెట్టుకోవడం తన నైజమని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మరోసారి నిరూపించుకున్నారని నాలుగు మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు పేర్కొన్నారు. ఇటీవల వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చింతూరు మండలం కుయిగూరు, చట్టిలో పర్యటించారు. రెవెన్యూ డివిజన్ ఎత్తివేయడంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని, పోలవరం భూ సమస్యలతో పాటు ఇతర సమస్యలపై రంపచోడవరం వెళ్లాలంటే దూరాభారంగా మారిందని ఇక్కడి ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చింతూరు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీనిచ్చారు. ఈ మేరకు హామీని నెరవేరుస్తూ చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు హర్షణీయం ప్రభుత్వం చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం హర్షణీయం. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాంత ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కలగనుంది. – నాగులాపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్యే రంపచోడవరం ఇదీ చదవండి: అక్కా.. సాయం అందిందా? -
మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలు.. ఏవోబీలో రెడ్ అలర్ట్
సాక్షి, పాడేరు/ముంచంగిపుట్టు/కొయ్యూరు: ఏజెన్సీలో మావోయిస్టులు జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు 50వ అమరవీరుల వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏవోబీ వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కొద్ది రోజుల కిందట ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్ పేరిట విడుదలైన లేఖలో వారోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్ జిల్లాలతో పాటు అల్లూరి జిల్లాలోని పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, చింతూరు పోలీసు సబ్ డివిజన్ల పరిధిలోని పోలీసు బలగాలు వారం రోజుల నుంచి కూంబింగ్ చేపడుతున్నాయి. చింతూరుకు సరిహద్దులో ఉన్న చత్తీస్‌గఢ్ ప్రాంతంలో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ మావోయిస్టుల వారోత్సవాలను భగ్నం చేసేలా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సీఆర్పీఎఫ్తో పాటు ఇతర పోలీసు బలగాలు అటవీ ప్రాంతాల్లో మకాం వేశాయి. మండల కేంద్రాలు, ప్రధాన జంక్షన్లలో ఆయా పోలీసులు వాహన తనిఖీలు చేపడుతున్నారు. బాంబ్, డాగ్ స్క్వాడ్‌తో కూడా తనిఖీలు జరిపారు. ముంచంగిపుట్టులో ఎస్ఐ కె.రవీంద్ర ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. సీఆర్పీఎఫ్ పోలీసులు ముంచంగిపుట్టు నుంచి రాముల గ్రామం వరకు కల్వర్టులు, వంతెనలను బాంబు స్క్వాడ్‌తో పరిశీలించారు. జోలాపుట్టు, మాచ్‌ఖండ్, ఒనకఢిల్లీల్లో బీఎస్ఎఫ్ బలగాలు నిఘా పెంచాయి. నాయకులంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, ఎక్కడికి వెళ్లినా తమకు సమాచారం అందించాలని పోలీసులు నోటీసులను జారీ చేశారు. కొయ్యూరు మండలంలోనూ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఏడాది కాలంలో ఏవోబీ పరిధిలో 12 మంది మావోయిస్టులు మరణించారు. అలా మరణించిన వారికి వారోత్సవాల్లో మావోయిస్టులు నివాళులర్పిస్తారు. ఈ సందర్భంగా యాక్షన్టీంలను రంగంలోకి దించే అవకాశం ఉండడంతో పోలీసులు నిఘా పెంచారు. పాడేరు, చింతలవీధి, గబ్బంగి, కరకపుట్టు తదితర ప్రాంతాల్లో ఎస్ఐలు లక్ష్మణ్‌రావు, రంజిత్‌లు తమ సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సులలో రాకపోకలు సాగిస్తున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. (క్లిక్: ఆంధ్రాలోనే ఉంటాం.. భద్రాచలాన్ని ఆంధ్రాలో కలపాలి) -
అక్కా.. సాయం అందిందా?
వేలేరుపాడు, చింతూరు: ‘చరిత్రలో ఇప్పటి వరకు కన్నాయిగుట్ట గిరిజన గ్రామానికి ఏ ముఖ్యమంత్రీ రాలేదు. మొదటిసారిగా మా అభిమాన నేత కష్టాల్లో ఉన్న మమ్మల్ని పలకరించి మనోధైర్యాన్ని నింపేందుకు కొండలు, కోనలు దాటుకుని వచ్చారు. ఆయన రాకే మాకు కొండంత భరోసా ఇచ్చింది. ఆయన మాట్లాడాక మాలో భయం పోయింది’ అంటూ ఆ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం హెలీప్యాడ్‌కు చేరుకున్నప్పటి నుంచి గ్రామంలో పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లే వరకు కాన్వాయి వెంట బారులు తీరి సీఎంతో కరచాలనం చేయడానికి పెద్ద ఎత్తున జనం పోటీపడ్డారు. పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలతో, గ్రామస్తులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. అక్కా.. అన్నా.. సాయం అందిందా.. అంటూ ఆరా తీశారు. ప్రభుత్వ సాయం బాగా అందిందని, అందరూ ముక్తకంఠంతో సమాధానం చెప్పారు. దాదాపు అర కిలోమీటరుకు పైగా సీఎం నడుచుకుంటూ వెళ్లి బాధితులతో మాట్లాడి వారిలో మనోధైర్యాన్ని నింపారు. నీట మునిగిన ఇళ్లకు రూ.4 వేలు ఉన్న పరిహారాన్ని రూ.10 వేలు చేస్తాం అని చెప్పారు. అనంతరం ఫొటో ఎగ్గిబిషన్‌ను పరిశీలించారు. అక్కడికక్కడే సమస్యల పరిష్కారం చింతూరు మండలం కుయిగూరులో పడిపోయిన ఇంటిని సీఎం తొలుత పరిశీలించారు. అక్కడి ప్రజలతో మాట్లాడారు. ముందు వరుసలో కూర్చొన్న ఓ బాలికను ఆప్యాయంగా పిలిచి దీవించడంతో పాటు ప్రసంగం ముగిసే వరకు తన వద్దే నిలబెట్టుకున్నారు. సూరన్నగొందికి చెందిన జానీ అనే యువకుడు తమ గ్రామంలో పాఠశాల నిర్మాణం అసంపూర్తిగా వుందని, దానిని పూర్తి చేయాలని కోరాడు. నాడు–నేడులో పాఠశాలను పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి చట్టి గ్రామానికి బస్సులో బయలుదేరిన సీఎం.. మార్గంమధ్యలోని నిమ్మలగూడెం వద్ద బస్సు నుంచి దిగి వారితో మాట్లాడారు. సరోజిని అనే వృద్ధురాలు గత ఆరు నెలలుగా తనకు గొంతు సరిగా పనిచేయక మాట రావడంలేదని చెప్పారు. ఆమెకు వైద్యం చేయించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎనిమిదేళ్ల దివ్యాంగ బాలిక మడకం దుర్గాభవానీకి పింఛను రావట్లేదని తెలపడంతో.. పింఛను వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గ్రామగ్రామానికీ ఇంటర్నెట్
సాక్షి, అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లా చింటూరు మండలం పేగ గ్రామం అడవి మధ్యలో ఉంటుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సరిహద్దు దండకారణ్యానికి ఆనుకొని ఈ గ్రామం ఉంది. ఆ ఊరిలో మొబైల్ ఫోను సిగ్నల్స్ కూడా ఉండవు. ఊరంతా తిరిగితే ఎక్కడో ఓ చోట అప్పుడప్పుడూ ఫోను సిగ్నల్స్ వచ్చిపోతుంటాయి. అలాంటి కుగ్రామంలో సైతం అంతరాయం లేకుండా నిరంతరం ఇంటర్నెట్ సౌకర్యం ఉండేలా ప్రభుత్వం ఇటీవల కేబుల్‌ను ఏర్పాటు చేసింది. మొబైల్ ఫోనుకు సైతం ఇంటర్నెట్ అందని ఇటువంటి గ్రామాలన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం కేబుల్ ఇంటర్నెట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. 5,929 గ్రామాలకు దాదాపు రూ. 76 కోట్లు ఖర్చుతో కొత్తగా ఇంటర్నెట్ కేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 2020 జనవరి 26 నుంచి మారుమూల గ్రామాల్లో సైతం ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చారు. గత ఏడాది నవంబర్ వరకు రాష్ట్రవ్యాప్తంగా 5,929 గ్రామాల్లోని సచివాలయాల్లో మొబైల్ ఇంటర్నెట్ ద్వారానే అక్కడి సిబ్బంది ఆన్లైన్ సేవలు అందించారు. మొబైల్ సిగ్నల్స్ లేనప్పుడు లేదంటే సిగ్నల్స్ తక్కువగా ఉన్నప్పుడు ఆన్లైన్ సేవలకు అంతరాయం కలుగుతుండేది.దీనికి పరిష్కారంగా ఏపీలోని అన్ని గ్రామాలకు కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ వసతి కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఒకట్రెండు నెలల్లోనే అన్ని గ్రామాల్లో సచివాలయాలకు కేబుల్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
హోటల్లోకి దూసుకెళ్లిన లారీ, మహిళలు మృతి
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామం వద్ద శనివారం విషాదం నెలకొంది. లారీ అదుపు తప్పి హోటల్లోకి దూసుకెళ్లిన సంఘటనలో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన మహిళలను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఛత్తీస్గడ్ రాష్ట్రం నుంచి ఆంధ్ర వైపు వస్తున్న తౌడు లారీ చట్టి జంక్షన్ వద్ద అదుపుతప్పి హోటల్లోకి దూసుకెళ్ళడంతో హోటల్లో కూర్చున్న ముగ్గురు మహిళలు అక్కడికి అక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. వారినీ చింతూరు ఏరియా ఆసుపత్రి కి తరలించారు, డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టుగా సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. -
రూ.27 లక్షల గంజాయి పట్టివేత
సాక్షి, చింతూరు (రంపచోడవరం) : ఆంధ్రా నుంచి కర్నాటకకు అక్రమంగా తరలిస్తున్న 900 కిలోల గంజాయిని గురువారం చింతూరు పోలీసులు పట్టుకున్నారు.చింతూరు మండలం చట్టిలో ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్ పోస్టు వద్ద తనిఖీల్లో భాగంగా ఈ గంజాయి పట్టుబడింది. దీనిపై చింతూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్ మీడియాకు వివరాలు వెల్ల డించారు. లారీలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారం మేరకు చింతూరు సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ శ్రీనివాస్‌కుమార్ చట్టిలో చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో చింతూరు వైపు నుంచి భద్రాచలం వైపునకు వెళుతున్న మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కలిగిన ఓ లారీని తనిఖీ చేయగా 25 కేజీల చొప్పున ప్యాక్ చేసి ఉన్న 36 ప్లాస్టిక్ సంచుల్లోని 900 కిలోల గంజాయి లభ్యమైందని డీఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా కర్నాటక రాష్ట్రం బీదర్ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ మహ్మద్ రియాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా రాజు అనే వ్యక్తి వద్ద తాను డ్రైవర్‌గా పనిచేస్తున్నానని తెలిపాడు. తాను, రాజు కలసి విశాఖ జిల్లా దారకొండలో గంజాయిని కొనుగోలు చేసి జిప్సమ్ అడుగున లారీలో లోడ్ చేశామని తెలిపాడు. గంజాయి లోడు లారీని కర్నాటకకు తీసుకురావాలని చెప్పి తన ఓనర్ రాజు బస్సులో వస్తానని చెప్పాడని డ్రైవర్లో విచారణలో వెల్లడించాడని డీఎస్పీ తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో రూ.27 లక్షలు ఉంటుందని, దానికి పంచనామా నిర్వహించి లారీని సీజ్ చేసి డ్రైవర్ రియాజ్‌ను అరెస్టు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ పోలినాయుడు, మోతుగూడెం రేంజర్ ఉషారాణి, చెక్‌పోస్టు ఇన్చార్జి భాస్కర్ పాల్గొన్నారు. -
ఐదు గంటలు నరకప్రాయం
చింతూరు (రంపచోడవరం) : ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఓ లారీడ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుని ఐదు గంటలపాటు నరకం అనుభవించాడు. మండలంలోని కాటుకపల్లి వద్ద ఆదివారం ఛత్తీస్‌గఢ్ నుండి విజయవాడ వెళ్తున్న లారీ విజయవాడ నుంచి ఛత్తీస్‌గఢ్ వెళుతున్న లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ లారీ డ్రైవర్‌కు స్వల్పగాయాలయ్యాయి. దీంతో అతడికి ఏడుగురాళ్లపల్లి ఆసుపత్రిలో చికిత్స నిర్వహించిన అనంతరం భద్రాచలం తరలించారు. కాగా మరో లారీలోని డ్రైవర్ తెలంగాణ రాష్ట్రం నల్గొండకు చెందిన లతీఫ్ క్యాబిన్లో ఇరుక్కుని పోయాడు. స్టీరింగ్ వీల్ వద్ద కాలు ఇరుక్కుని ఎంతకూ రాకపోవడంతో వైద్యులు అతడికి లారీలోనే సిలైన్లు పెట్టి చికిత్స అందించారు. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రమాదం జరుగగా పోలీసులు తీవ్రంగా శ్రమించి ఐదు గంటల అనంతరం గ్యాస్‌కట్టర్ సాయంతో రాత్రి ఎనిమిది గంటలకు అతనిని బయటకు తీశారు. అనంతరం 108 ద్వారా అతడిని భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. -
లడఖ్‌కు పర్వతారోహక బృందం
చింతూరు: ఇరవై రోజులపాటు చింతూరులో శిక్షణ పొందిన రాష్ట్రానికి చెందిన పర్వతారోహక బృందం శుక్రవారం శిక్షణ ముగించుకుని జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్‌కు బయలుదేరి వెళ్లింది. ఎవరెస్టు అధిరోహణలో భాగంగా రాష్ట్రానికి చెందిన 16 మంది పర్వతారోహక శిక్షకుడు దూబి భద్రయ్య ఆధ్వర్యంలో ఇరవై రోజులపాటు చింతూరు గురుకుల పాఠశాల ఆవరణలో శిక్షణ పొందారు. శిక్షణ పూర్తికావడంతో జమ్మూకాశ్మీర్‌కు వెళుతున్నామని అక్కడ వాతావరణ అనుకూలతను బట్టి ఫిబ్రవరిలో లడఖ్ పర్వతారోహణ ఉంటుందని భద్రయ్య తెలిపారు. అనంతరం ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో ఎవరెస్టును అధిరోహించే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ఈ బృందానికి తహశీల్దార్ జగన్మోçßæనరావు, గురుకుల పాఠశాల, కళాశాల ఉపాధ్యాయులు, ఆర్ఐ, విద్యార్థులు జాతీయ జెండాను అదించి వీడ్కోలు పలికారు. అన్ని అవరోధాలు అధిగమించి అత్యున్నత శిఖరాన్ని అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. -
చింతూరు ఐటీడీఏ తొలి పీఓగా చినబాబు
చింతూరు: స్థానిక ఐటీడీఏ తొలి ప్రాజెక్టు అధికారి (పీఓ)గా గుగ్గిలి చినబాబును నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన అనంతరం విలీన మండలాల ప్రజల సౌకర్యార్థం ఈ ఏడాది ఏప్రిల్‌లో చింతూరులో ఐటీడీఏ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుండి రంపచోడవరం పీఓ కేవీఎ¯ŒS చక్రధరబాబు ఇ¯ŒSఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం చినబాబు విజయవాడలోని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అంతకుముందు ఆయన రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో ఏపీఓ జనరల్‌గా, చింతూరు మండల ప్రత్యేకాధికారిగా పనిచేశారు. చినబాబు మాట్లాడుతూ విలీన మండలాల ప్రజల సమస్యలు తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. -
ఎదురు కాల్పుల్లో మావోయిస్టు మృతి
చింతూరు : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా, కుంటలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలం తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండల సరిహద్దులకు సమీపంలో ఉంది. కుంటలో తమ టార్గెట్‌లో ఉన్న వ్యక్తులను హతమార్చేందుకు మావోయిస్టులు పథకం రచించినట్టు పోలీసులకు సమాచారం తెలిసింది. దీంతో కుంటలోని నయాపారా రహదారిలోని బెర్జి బేస్ క్యాంపు వద్ద వారు మాటువేసి అటుగా వచ్చిన మావోయిస్టులతో ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా సంఘటనా స్థలంలో నాటు తుపాకీ, 12 బోరు తుపాకీ లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. -
చింతూరుకు పాకిన కాళ్లవాపు వ్యాధి
చింతూరు : ఏజన్సీలో గిరిజనులను హడలెత్తిస్తున్న కాళ్లవాపు వ్యాధి చింతూరు మండలానికీ పాకింది. గురువారం ఈ వ్యాధితో బాధపడుతూ మండలంలోని కల్లేరు గ్రామానికి చెందిన సోడె రాములయ్య అనే ఆటోడ్రైవర్ చింతూరులోని ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. అతడిని పరిశీలించిన వైద్యులు రక్తపూతలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. అనంతరం మందులను ఇవ్వగా కాళ్లవాపు కొద్దిగా తగ్గినట్టు వైద్యాధికారి శివరామకృష్ణ తెలిపారు. వారం రోజులుగా కాళ్లు వాచి ఇబ్బంది పడుతున్నానని, దీంతో గురువారం ఆసుపత్రికి వచ్చానని బాధితుడు రాములయ్య తెలిపాడు. తమ గ్రామానికి చెందిన మరో ఇద్దరికి కూడా ఈ వ్యాధిసోకి తగ్గినట్టు అతను తెలిపాడు. ఇప్పటికే కాళ్లవాపు వ్యాధితో వీఆర్‌పురం మండలంలో ముగ్గురు మృత్యువాత పడగా, 32 మంది కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యాధితో పక్క మండలంలో గిరిజనులు మృత్యువాత పడ్డారనే విషయం తెలుసుకుని కల్లేరుతో పాటు పక్క గ్రామాల గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. -
నిర్లక్ష్యానికి బాలింత బలి
చింతూరు ప్రభుత్వాస్పత్రిలో సంఘటన టేకులూరు (వీఆర్‌పురం) : ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు శ్రేయస్కరమంటూ ఓ వైపు సర్కారు ప్రచారం చేస్తుంటే, అదే ఆస్పత్రిలో పురుడు పోయించుకున్న మహిళ.. వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి బలైపోయింది. చింతూరు ప్రభుత్వాస్పత్రిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మృతురాలి భర్త చాందల బుచ్చిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వీఆర్‌పురం మండలం కుందులూరు పంచాయతీ టేకులూరు గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డికి, అదే గ్రామానికి చెందిన నాగమణి(28)కు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. పెళ్లయిన ఇన్నాళ్లకు ఆమె గర్భం దాల్చడంతో, ఆమె భర్తతో పాటు కుటుంబ సభ్యులు ఆనందపడ్డారు. నిండు గర్భిణి అయిన ఆమెకు ఆదివారం ఉదయం 5.30కు పురిటినొప్పులు వస్తుండడంతో, ఆమె భర్త 108కు సమాచారం అందించాడు. గ్రామానికి మధ్యలో రహదారి నిర్మిస్తుండడంతో, అంబులె¯Œæ్స గ్రామానికి 4 కి.మీ. దూరంలో ఉన్న కుందులూరు వద్ద నిలిచిపోయింది. అతికష్టంపై బంధువులు ఆమెను ఆటోలో అంబులె¯Œæ్స వరకూ తీసుకువెళ్లారు. అక్కడి నుంచి చింతూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఉదయం 7.30 సమయంలో ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. అరగంట తర్వాత ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో, ఆందోళన చెందిన ఆమె భర్త ఈ విషయాన్ని ఆస్పత్రి సిబ్బందితో చెప్పాడు. ఏమీ కాదని, తర్వాత తగ్గిపోతుందని చెప్పి.. సాయంత్రం 4 వరకూ ఆమెను అక్కడే ఉంచేశారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉందంటూ, ఆమెను మెరుగైన చికిత్సకు 108లో భద్రాచలం ఆస్పత్రికి పంపేశారు. అక్కడి ఆస్పత్రికి వెళ్లిన కొద్ది సమయానికే ఆమె మరణించింది. ఆమె మృతదేహాన్ని సోమవారం స్వగ్రామమైన టేకులూరుకు తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు. కాగా తల్లి పాల కోసం ఆ పసిపాప గుక్కపెట్టి ఏడవడం చూపరులను కంటతడి పెట్టించింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే.. నా భార్య ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చనిపోయింది. ప్రసవం అనంతరం తీవ్ర రక్తస్రావం అవుతోందని, చూడమని నర్సును అడిగితే, పదేపదే నావెంట తిరుగుతావేంటి? రక్తస్రావం దానికదే తగ్గిపోతుందని చెప్పి పంపేసింది. మందులు ఆస్పత్రిలో లేకపోతే, బయటకు వెళ్లి కొనుక్కొస్తానని చెప్పినా ఆమె నా మాటలను పట్టించుకోలేదు. – చాందల బుచ్చిరెడ్డి, మృతురాలి భర్త విచారణ చేపడతాం రక్తస్రావంతో బాలింత మరణించిన విషయమై విచారణ చేపడతాం. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిఉంటే మాత్రం బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – పవన్‌కుమార్, అడిషనల్ డీఎంహెచ్ఓ -
రెండు మందుపాతరల గుర్తింపు
చింతూరు (తూర్పుగోదావరి జిల్లా) : చింతూరు మండలం పరిధిలో పోలీసులు రెండు మందుపాతరలను గుర్తించారు. ఏడుగురాళ్లపల్లి గ్రామంలో వారాంతపు సంతను పురస్కరించుకుని భద్రత దృష్ట్యా చింతూరు పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రేగులగుంపు వద్ద భూమిలో పాతిపెట్టిన రెండు మందుపాతరలను గుర్తించారు. బాంబు నిర్వీర్యక బృందాన్ని పిలిపించి వాటిని శనివారం ఉదయం వెలికితీయనున్నారు. -
చింతూరు కేంద్రంగా ఐటీడీఏ ఏర్పాటు
రాజమండ్రి: చింతూరు కేంద్రంగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ను ఏర్పాటుచేస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో ఉన్న చింతూరు సహా వీఆర్‌పురం, కూనవరంతోపాటు తూర్పుగోదావరి జిల్లాలోని ఎటపాక మండలాలను కలిపి నూతన ఐటీడీఏ కిందకు వస్తాయి. ఈ మేరకు సర్కారు జీవో-96ను విడుదల చేసింది. అధికార యంత్రాంగం సమీపంలోకి రావటంతో ఆయా మండలాల్లోని గిరిజనుల ఇబ్బందులు తీరనున్నాయి. -
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు
ఖమ్మం (చింతూరు) : విలీన మండలాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చింతూరులో విద్యార్థులు రిలే నిరాహార దీక్షకు పూనుకున్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని, చింతూరులో బస్ డిపో ఏర్పాటు చేసి తక్షణమే బస్ పాస్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూనవరం మండలంలోని బాలికల గురుకుల పాఠశాలను కళాశాలగా అప్‌గ్రేడ్ చేయాలని, విలీన మండలాల్లో ప్రభుత్వ డిగ్రీ, బీఈడీ, డైట్ కళాశాలు ఏర్పాటు చేయాలని కోరారు. -
అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్‌కు పిలుపు
చింతూరు(ఖమ్మం) : ఖమ్మం జిల్లా చింతూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలనే డిమాండ్‌తో అఖిలపక్షం బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాలలో శనివారం బంద్ పాటించాలని కోరుతూ శుక్రవారం చింతూరులో అఖిలపక్షం నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో ఎటపాకను రెవెన్యూ డివిజన్ చేయడంవలన భవిష్యత్తులో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి చింతూరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని, లేదంటే మున్ముందు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మూడు మండలాలకు చెందిన ప్రజలు, వ్యాపారులు బంద్‌కు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చింతూరు ఎంపీపీ చిచ్చడి మురళి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రామలింగారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ హబీబ్, అహ్మద్అలీ, సీపీఐ మండల కన్వీనర్ ఎస్ కే రంజాన్, సీపీఎం నాయకులు సీతారామయ్య, కోట్ల కృష్ణలు పాల్గొన్నారు. కాగా ఎటపాకను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటిస్తూ గత నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్(రాజపత్రం)ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
ఒడిశా టు ఆంధ్రా
చింతూరు: ఒడిశా నుంచి ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలకు భారీ ఎత్తున పశువుల రవాణా కొనసాగుతోంది. ఒడిశా నుంచి పశువులను తీసుకొచ్చి చింతూరు మండలం కొత్తపల్లి వద్ద సీలేరు నదిని దాటిస్తున్నారు. అనంతరం అటవీ ప్రాంతం గుండా 10 కి.మీ దూరంలోని తులసిపాక గ్రామానికి తీసుకెళ్లి అక్కడి నుంచి లారీల ద్వారా రవాణా చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం, ఖమ్మం జిల్లా పాల్వంచ సంతల్లో ఈ పశువులను విక్రయిస్తామని వ్యాపారులు చెపుతున్నారు. అయితే గో సంరక్షణ చట్టానికి వ్యతిరేకంగా పశువుల రవాణా కొనసాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ చట్టం ప్రకారం ఒక్కో వాహనంలో ఏడు పశువులను మాత్రమే రవాణా చేయాలని, కానీ వ్యాపారులు 20 నుంచి 30 పశువులను తీసుకెళ్తున్నారని అంటున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ‘మేం అందరికీ మామూళ్లు ఇస్తున్నాం, మా ఇష్టమొచ్చినట్లు రవాణా చేసుకుంటాం, మీకెందుకు’ అని సమాధానం చెపుతున్నారని, గో సంరక్షణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న పశువుల రవాణాకు అడ్డుకట్ట వేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. -
సరిహద్దుల్లో టెన్షన్, టెన్షన్
చింతూరు, న్యూస్‌లైన్: ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టు తెలంగాణ కమిటీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో పోలీసు బలగాలు ముమ్మరంగా కూంబింగ్ సాగిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అగ్ర నేత ఒకరు ఇటీవల ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో సమావేశం నిర్వహించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారమందింది. ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టుల పిలుపు, పోలీసుల ముమ్మర కూంబింగ్‌తో ఎప్పుడేం జరుగుతుందోనని సరిహద్దుల్లోని పల్లెలు బిక్కుబిక్కుమంటున్నాయి. గత నెల 10న సరిహద్దునగల చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ లోక్‌సభ ఎన్నికల సమయంలో మావోయిస్టులు భారీ దాడులకు పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లాలో జరిగిన మావోయిస్టుల దాడిలో ఏడుగురు ఎన్నికల సిబ్బంది మృతిచెందారు. బస్తర్ జిల్లాలో జరిగిన దాడిలో ఎనిమిదిమంది పోలీసులు బలయ్యారు. ఇటువంటి దాడులే తెలంగాణ ఎన్నికల్లో కూడా జరగవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మావోయిస్టులు చింతూరు మండలంలో హల్చల్ సృష్టించారు. శబరి ఏరియా కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని తుమ్మల గ్రామానికి చెందిన సీపీఎం నాయకుడు పట్రా ముత్యంను హత్య చేశారు. బుర్కనకోట వద్ద రహదారి పనుల కోసం ఉంచిన తారు డ్రమ్ములను ధ్వంసం చేశారు. చింతూరు మండలంలోని నారకొండ, అల్లిగూడెం, పేగ, ఏడుగురాళ్లపల్లి, తుమ్మల, సరివెల, చిడుమూరు, సుద్దగూడెం పోలింగ్ కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఉన్నాయి. దీనిలో, నారకొండ పోలింగ్ కేంద్రాన్ని అధికారులు ఇప్పటికే అల్లిగూడెం గ్రామానికి మార్చారు. నారకొండ, అల్లిగూడెం, పేగ పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సిన సిబ్బందిని మంగళవారం రాత్రి ఏడుగురాళ్లపల్లిలోనే నిలిపేసినట్టు తెలిసింది. వీరిని బుధవారం ఉదయం పోలింగ్ సమయానికి ఆయా కేంద్రాలకు చేర్చే అవకాశముంది. పోలింగు కేంద్రాలపై డేగ కన్ను దుమ్ముగూడెం: నేటి ఎన్నికలకు మావోయిస్టుల నుంచి ఎటువంటి ఆటంకాలు ఎదురవకుండా చూసేందుకు ఆంధ్రా-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో సీఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్, ప్రత్యేక పోలీసు బలగాలు మోహరించాయి. ‘బూటకపు ఎన్నికలను బహిష్కరించా’లని మావోయిస్టులు పదే పదే హెచ్చరించడంతో సరిహద్దుల్లోని పోలింగ్ కేంద్రాలపై పోలీసులు డేగ కన్ను వేశారు, గిరిజన గ్రామాల్లో పోలింగ్ శాతం పెంచడం ద్వారా మావోయిస్టుల హెచ్చరికలను తిప్పికొట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. నాలుగు రోజుల కిందట.. దుమ్ముగూడెం మండలానికి ఆనుకుని ఉన్న చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా కుంట బ్లాక్ పరిధిలోగల గొల్లపల్లి పోలీస్ స్టేషన్ అటవీ ప్రాంతంలో ఎడ్లపాడు వద్ద పదిమందితో కూడిన సంతోష్ దళం ఉందన్న సమాచారంతో పోలీసులు దాడికి యత్నించారు. ఆ దళం తప్పించుకుని పరారైంది. సంతోష్‌కు చెందిన 9 ఎంఎం పిస్టల్, మందులు, ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. ఎన్నికల బహిష్కరణ పిలుపుతో విధ్వంసానికి దిగేందుకే సంతోష్ దళం ఈ ప్రాంతానికి వచ్చినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టులు ఈ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుండవచ్చని భావించిన పోలీసులు కూంబింగ్ సాగిస్తున్నారు. మావోయిస్టుల కొరియర్లు, సానుభూతిపరులుగా భావిస్తున్న వారిపై పోలీసులు ఓ కన్నేశారు. మంగళ, బుధవారాలలో చత్తీస్‌గఢ్ వారపు సంతలను నిలిపేశారు. కొందరు సంత వ్యాపారులను, మావోయిస్టుల కొరియర్లగా అనుమానిస్తున్న వారిని సరిహద్దుల్లోగల పోలింగ్ కేంద్రాల వద్ద ‘పహారా’ కాసేందుకు నియమించారు. వారి కదలికలపై పోలీసులు డేగ కన్ను వేశారు. -
అంతా తికమక...
చింతూరు,న్యూస్‌లైన్: పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రాలో కలిపే విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇవ్వకపోవడంతో ఏజెన్సీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏ ప్రాంతం ఏ వైపునకు వెళుతుందో తెలియని అయోమయ పరిస్థితి ఉండడంతో ప్రజలతో పాటు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ముంపు గ్రామాలను ఎక్కడికి తరలిస్తారనే విషయంపై కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడం మరింత అయోమయానికి దారితీస్తోంది. పోలవరం ముంపు గ్రామాలు మా త్రమే ఆంధ్రాలో చేర్చుతామని కేంద్రం చెబుతోంది. ముంపు గ్రామాలనే పరిశీలిస్తే... మధ్య ప్రాంతం ఆంధ్రాలోకి వెళితే దానికి కుడి, ఎడమ ప్రాంతాలు యథావిధిగా తెలంగాణలోనే ఉండే పరిస్థితులు ఉన్నాయి. చింతూరు మండలంలోని గ్రామాలే ఇందుకు నిదర్శనం. ఇక్కడ శబరినదిపరివాహక గ్రామాలైన కుయిగూరు, కల్లేరు, చింతూరు, చూటూరు, ముకునూరు, నర్శింగపేట, తిమ్మిరిగూడెం, ఏజీకొడేరు, వులుమూరు, మల్లెతోట, చిడుమూరు, వీరాపురం, చట్టి, కుమ్మూరు గ్రామాలు ముంపు ప్రాంతం లో ఉండడంతో ఇవన్నీ ఆంధ్రాలో కలుస్తాయి. ఈ గ్రామాలకు ఎడమ వైపున ముంపులో లేని తుమ్మల, సరివెల, ఏడుగురాళ్లపల్లి వంటి గ్రామాలు తెలంగాణలో ఉంటాయి...వీటికి ఎలాంటి ఇబ్బంది రాదు. అయితే చిక్కల్లా కుడివైపు గ్రామాలకే. ముంపులో లేని ఎర్రంపేట, తులసిపాక, మోతుగూడెం వంటి గ్రామాలు యథావిధిగా తెలంగాణలో ఉంటాయి. ఈగ్రామాలకు కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ప్రభుత్వ కార్యాలయాల సంగతేంటి? మండల కేంద్రమైన చింతూరు గ్రామాన్ని పరిశీలిస్తే... ముంపులో వుంది కాబట్టి చింతూరును ఆంధ్రాలో కలుపుతారు. దీనికి కుడి వైపున కేవలం అరకిలోమీటరు దూరంలో వున్న ఎర్రంపేట ముంపు ప్రాంతంలో లేదు కాబట్టి దీనిని తెలంగాణలో ఉంచుతారు. మండలకేంద్రం ఆంధ్రాలోకి వెళితే ఇక్కడి ప్రభుత్వ కార్యాలయాలు కూడా మండల కేంద్రానికే చెందుతాయి. అయితే చింతూరుకు సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఎర్రంపేట గ్రామంలోనే వున్నాయి. రెవెన్యూ, మండల పరిషత్, ఐకేపీ, ఎంఈవో, ఏపీఆర్ఎస్, ప్రభుత్వ కళాశాల, జీసీసీ వంటి కార్యాలయాలన్నీ ఎర్రంపేటలోనే వున్నాయి. దీనివలన పరిపాలనా పరంగా మున్ముందు చాలా ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు వాపోతున్నారు. రవాణాకు కూడా ఇబ్బందే: మరోవైపు రవాణా పరంగా చూసుకుంటే ఆంధ్రాలోని రాజమండ్రి నుంచి చింతూరుకు రావాలంటే.... చింతూరుకు ముందు భాగంలో వున్న తెలంగాణకు చెందిన తులసిపాక, ఎర్రంపేటలను దాటుకుని ఆంధ్రాకు చెందిన చింతూరుకు రావాల్సి వుంటుంది. ఈ గ్రామాలకు చెందిన ప్రజలు భద్రాచలం వంటి పట్టణాలకు వెళ్లాలంటే ఆంధ్రాలో కలిసిన చింతూరు, చట్టిని దాటుకుని ప్రయాణించాల్సి వుంటుంది. మరోవైపు ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులను ఆనుకుని వున్న చింతూరు మండలం పోలవరం ముంపునకు గురైతే ఆయా రాష్ట్రాలకు వెళ్లేందుకు కూడా రవాణాపరంగా ఇబ్బందులు తప్పవు. మధ్య ప్రాంతంలో వున్న గ్రామాలు ముంపునకు గురైతే ముంపునకు గురికాని గ్రామాల నుంచి రవాణా సౌకర్యం కోసం రహదారులు ఎలా నిర్మిస్తారనేది ప్రభుత్వం ఇంతవరకు స్పష్టం చేయలేదు. గ్రామాలను ఎక్కడికి తరలిస్తారు: పోలవరం ముంపునకు గురవుతున్న చింతూరు మండలంలోని గ్రామాలను ఎక్కడికి తరలిస్తారనే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు స్పష్టం చేయకపోవడంతో ముంపు గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా ఇక్కడి ప్రకృతితో మమేకమై జీవిస్తున్న తమను వేరే ప్రాంతాలకు తరలిస్తే అక్కడి వాతావరణానికి అలవాటు పడాలంటే చాలా కష్టమని, పూర్తిస్థాయిలో అన్ని రకాల మౌళిక సౌకర్యాలు కల్పిస్తారో లేదోనని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఎలా ఇస్తారనే విషయమై చింతూరు మండలంలోని ముంపు గ్రామాలకు చెందిన సుమారు 13 వేల మందిలో ఆందోళన రేకెత్తిస్తోంది.