సాక్షి, చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో నాలుగు మండలాల ప్రజల చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. చింతూరు, కూనవరం, ఎటపాక, వీఆర్‌పురం మండలాలను కలిపి కొత్తగా చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది జూలై 27న వరదప్రాంతాల పరిశీలనకు చింతూరు మండలం వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుయిగూరులో మాట్లాడారు. కొత్తగా చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీఇచ్చారు. మాట ఇచ్చిందే తడవుగా ఆయన కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ప్రక్రియకు చకచకా చర్యలు చేపట్టారు.
► రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వరద ప్రాంతాల పర్యటనకు సందర్భంగా ఇచ్చిన హామీని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వెనువెంటనే అమల్లోకి తెచ్చారు.
► సెప్టెంబరు ఏడున జరిగిన మంత్రివర్గ సమావేశంలో చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోద ముద్ర పడింది. అనంతరం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సంబంధించి అభ్యంతరాలపై నోటిఫికేషన్ జారీఅయింది. ఆ గడువు ముగియడంతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
► ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం పట్ల చింతూరు, కూనవరం, ఎటపాక, వీఆర్‌పురం మండలాల ప్రజలనుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
► అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పటివరకు పాడేరు, రంపచోడవరం రెండు రెవెన్యూ డివిజన్లు వుండగా, కొత్తగా చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో ఆ సంఖ్య మూడుకు పెరిగింది.
► కొత్తగా ఏర్పాటైన చింతూరు డివిజన్‌లో మొత్తం 1,35,082 మంది జనాభా వుండగా 90,929 మంది ఓటర్లున్నారు. వీరిలో 82,992 మంది ఎస్టీ జనాభా ఉన్నారని అధికారవర్గాలు తెలిపాయి.
సర్వత్రా హర్షం
మాట ఇస్తే నిలబెట్టుకోవడం తన నైజమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి నిరూపించుకున్నారని నాలుగు మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు పేర్కొన్నారు. ఇటీవల వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చింతూరు మండలం కుయిగూరు, చట్టిలో పర్యటించారు. రెవెన్యూ డివిజన్ ఎత్తివేయడంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని, పోలవరం భూ సమస్యలతో పాటు ఇతర సమస్యలపై రంపచోడవరం వెళ్లాలంటే దూరాభారంగా మారిందని ఇక్కడి ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చింతూరు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీనిచ్చారు. ఈ మేరకు హామీని నెరవేరుస్తూ చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
రెవెన్యూ డివిజన్ ఏర్పాటు హర్షణీయం
ప్రభుత్వం చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం హర్షణీయం. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాంత ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కలగనుంది.
– నాగులాపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్యే రంపచోడవరం
ఇదీ చదవండి: అక్కా.. సాయం అందిందా?
Comments
Please login to add a commentAdd a comment