chintooru
-
చింతూరు రెవెన్యూ డివిజన్.. ఇక సేవలు మరింత చేరువగా..
చింతూరు: కొత్తగా ఏర్పాటు చేసిన చింతూరు రెవెన్యూ డివిజన్‌కు సంబంధించిన కార్యాలయంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. గతంలో రంపచోడవరం డివిజన్ కేంద్రానికి తరలించిన సామగ్రిని తిరిగి చింతూరు కార్యాలయానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గతంలో రాష్ట్ర విభజన అనంతరం ఎటపాక డివిజన్‌గా వుండగా జిల్లాల పునర్వవ్యవస్థీకరణలో భాగంగా దీనిని రద్దుచేసి నాలుగు మండలాలను రంపచోడవరం డివిజన్లో కలిపారు. దీంతో చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల ప్రజలకు రెవెన్యూ, పోలవరం సమస్యల పరిష్కారం కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత జూలైలో వరదముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా చింతూరు మండలం కుయిగూరు వచ్చారు. ఈ సందర్భంగా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్షి్మతో పాటు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు డివిజన్ కేంద్రం ఆవశ్యకతను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం డివిజన్ కేంద్రం ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారు. చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి ఆమోదముద్ర పడిన వెంటనే డివిజన్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. డివిజన్ ఏర్పాటును సెప్టెంబరు ఏడో తేదీన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. దీనిపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం అంతే వేగంగా అక్టోబరు 20న చింతూరు రెవెన్యూ డివిజన్‌కు రాజముద్ర పడింది. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో దానికి అధికారి ఆవశ్యకత ఉండటంతో చింతూరు ఐటీడీఏ పీవోగా పనిచేస్తున్న రామశేషును బదిలీచేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవోగా ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌ను నియమించింది. చింతూరుకు ఉద్యోగులు.. ఎటపాక డివిజన్ రద్దు కావడంతో చింతూరులోని డివిజన్ కార్యాలయ సామగ్రితో పాటు ఉద్యోగులు రంపచోడవరం డివిజన్ కేంద్రానికి తరలివెళ్లారు. చింతూరు డివిజన్ కేంద్రం ఏర్పాటైన నేపథ్యంలో రంపచోడవరం తరలించిన కార్యాలయ సామగ్రితో పాటు ఉద్యోగులు కూడా చింతూరు కార్యాలయానికి తిరిగి రావడంతో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. గతంలో మాదిరిగానే ఐటీడీఏ కార్యాయలంలోని పీవో చాంబర్ పక్కనే ఉన్న భవనంలో చింతూరు రెవెన్యూ డివిజన్ పరిపాలన కొనసాగనుంది. చింతూరులో నిరి్మస్తున్న రెవెన్యూ డివిజన్ కార్యాలయ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభం కావడంతో చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాలకు చెందిన ప్రజలకు సంబంధించి రెవెన్యూ, పోలవరం, భూ సమస్యలకు దగ్గరలోనే పరిష్కారం లభించనుంది. రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పరిపాలన ప్రారంభమైంది. ప్రస్తుతానికి ప్రాముఖ్యతను బట్టి ఇతర మండలాలకు చెందిన ఉద్యోగులను సర్దుబాటు చేశారు. త్వరలోనే పూర్తిస్థాయిలో ఉద్యోగుల నియామకానికి చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ తెలిపారు. -
చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు.. ప్రభుత్వం ఉత్తర్వులు
సాక్షి, చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో నాలుగు మండలాల ప్రజల చిరకాల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. చింతూరు, కూనవరం, ఎటపాక, వీఆర్‌పురం మండలాలను కలిపి కొత్తగా చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఏడాది జూలై 27న వరదప్రాంతాల పరిశీలనకు చింతూరు మండలం వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కుయిగూరులో మాట్లాడారు. కొత్తగా చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీఇచ్చారు. మాట ఇచ్చిందే తడవుగా ఆయన కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ప్రక్రియకు చకచకా చర్యలు చేపట్టారు. ► రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వరద ప్రాంతాల పర్యటనకు సందర్భంగా ఇచ్చిన హామీని సీఎం జగన్మోహన్రెడ్డి వెనువెంటనే అమల్లోకి తెచ్చారు. ► సెప్టెంబరు ఏడున జరిగిన మంత్రివర్గ సమావేశంలో చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోద ముద్ర పడింది. అనంతరం రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు సంబంధించి అభ్యంతరాలపై నోటిఫికేషన్ జారీఅయింది. ఆ గడువు ముగియడంతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ► ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం పట్ల చింతూరు, కూనవరం, ఎటపాక, వీఆర్‌పురం మండలాల ప్రజలనుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ► అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పటివరకు పాడేరు, రంపచోడవరం రెండు రెవెన్యూ డివిజన్లు వుండగా, కొత్తగా చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో ఆ సంఖ్య మూడుకు పెరిగింది. ► కొత్తగా ఏర్పాటైన చింతూరు డివిజన్లో మొత్తం 1,35,082 మంది జనాభా వుండగా 90,929 మంది ఓటర్లున్నారు. వీరిలో 82,992 మంది ఎస్టీ జనాభా ఉన్నారని అధికారవర్గాలు తెలిపాయి. సర్వత్రా హర్షం మాట ఇస్తే నిలబెట్టుకోవడం తన నైజమని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మరోసారి నిరూపించుకున్నారని నాలుగు మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు పేర్కొన్నారు. ఇటీవల వరద ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చింతూరు మండలం కుయిగూరు, చట్టిలో పర్యటించారు. రెవెన్యూ డివిజన్ ఎత్తివేయడంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని, పోలవరం భూ సమస్యలతో పాటు ఇతర సమస్యలపై రంపచోడవరం వెళ్లాలంటే దూరాభారంగా మారిందని ఇక్కడి ప్రజలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చింతూరు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీనిచ్చారు. ఈ మేరకు హామీని నెరవేరుస్తూ చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు హర్షణీయం ప్రభుత్వం చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం హర్షణీయం. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాంత ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కలగనుంది. – నాగులాపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్యే రంపచోడవరం ఇదీ చదవండి: అక్కా.. సాయం అందిందా? -
ఉపాధ్యాయుడి బాగోతం బట్టబయలు.. జీతం లక్ష.. కానీ తనకు బదులుగా..
చింతూరు (తూర్పుగోదావరి): ఆ అయ్యవారి జీతం అక్షరాలా లక్ష రూపాయలు పైగా ఉంది. నెల తిరిగేసరికి ఆ డబ్బులు లక్షణంగా తీసుకుంటున్నాడు. జీవితం హ్యాపీగా గడుపుతున్నాడు. కానీ తన కనీస కర్తవ్యమైన బోధనను మాత్రం విస్మరించాడు. చిన్నారులకు పాఠాలు చెప్పడానికి విముఖత చూపుతున్నాడు. మారుమూల గిరిజన గ్రామం కదా! తనను ఎవరేం చేస్తారని అనుకున్నాడేమో! అస లు పాఠశాలకే వెళ్లడం లేదు. ఇందుకు ఎటువంటి అనుమతీ కూడా తీసుకోలేదు. పైగా తనకు బదులుగా పాఠాలు చెప్పడానికి ఓ యువకుడిని తానే దర్జాగా నియమించేశాడు. రోజూ కొంత డబ్బులు కూడా చెల్లిస్తున్నాడు. ఈ అయ్యవారి బాగోతం ఎట్టకేలకు బట్టబయలైంది. చదవండి: Kachidi Fish: తగ్గేదేలే.. కచ్చిడి కచ్చిడే!.. ధర ఎంతంటే? చింతూరు మండలంలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దున ఉన్న మారుమూల గిరిజన గ్రామం ఇరకంపేట. ఇక్కడి గిరిజన ప్రాథమిక పాఠశాల(జీపీఎస్)లో 52 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిలో ఒకరు లాంగ్‌లీవ్‌లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మరో రెగ్యులర్ ఉపాధ్యాయుడు ముచ్చిక రెడ్డి పాఠశాలకు తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సి ఉంది. ఏడుగురాళ్లపల్లిలో నివాసం ఉంటున్న అతడు పాఠశాలలో విధులకు హాజరు కావడం లేదు. ఈ విషయం బయటకు పొక్కడంతో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు చిచ్చడి మురళి, వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు కలసి శనివారం ఆ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ, ఉపాధ్యాయుడు ముచ్చిక రెడ్డి పాఠశాలకు గైర్హాజరవుతున్నాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రూ.లక్షకు పైగా జీతం తీసుకుంటున్న ఆ ఉపాధ్యాయుడు తన బదులు అదే గ్రామానికి చెందిన యువకుడు ముచ్చిక రవికుమార్‌ను అనధికారికంగా నియమించుకున్నాడని, అతడికి రోజుకు రూ.150 చొప్పున చెల్లిస్తూ, విద్యార్థులకు పాఠా లు చెప్పిస్తున్నాడని తెలిపారు. రవికుమార్ కూడా ఈ విషయాన్ని అంగీకరించాడని చెప్పారు. ఉపాధ్యాయుడు గైర్హాజరవుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి గ్రామస్తులు తీసుకువెళ్లినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని తెలిపారు. ఉపాధ్యాయుల వైఖరి ఇలాగే ఉంటే విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితులు నెలకొంటాయన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్‌తో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లానని మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సవలం అమల, వైస్ ఎంపీపీ యడమ అర్జున్, ఎంపీటీసీ సభ్యుడు సున్నం నాగరాజు, సర్పంచ్‌లు సవలం సత్తిబాబు, పాయం చంద్రయ్య, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ యగుమంటి రామలింగారెడ్డి పాల్గొన్నారు. -
ఇద్దరు భార్యలను హింసించి జైలుకు.. ఆపై
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ కళ్యాణం వెంకన్న మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. జైలు సూపరింటెండెంట్ రాజారావు తెలిపిన వివరాల మేరకు.. చింతూరు మండలం చట్టి గ్రామానికి చెందిన వెంకన్నకి ఇద్దరు భార్యలు. వీరిపై అనుమానం పెంచుకుని చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఇతనిపై అభియోగం. చిత్రహింసలకు గురిచేస్తూ సెల్ఫోన్లో చిత్రీకరించేవాడు. ఆ వీడియోలు రాష్ట్రవ్యాప్తంగా హల్చల్ చేశాయి. అతను పెట్టే బాధలు భరించలేక ఇద్దరు భార్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతూరు పోలీసులు ఏప్రిల్ 19వ తేదీన నిందితుడ్ని అరెస్టు చేశారు. సెంట్రల్ జైలుకి రిమాండ్‌కు తరలించారు. జైలులో అతను మంగళవారం ఉదయం స్నానాల గదిలో మెడకు టవల్ చుట్టుకుని మృతి చెంది ఉండడాన్ని సహచర ఖైదీలు గమనించి జైలు అధికారులకు తెలిపారు. చదవండి: ‘పెళ్లి అంటేనే నాకు ఇష్టం లేదు.. పుట్టింటికి వచ్చేస్తా’ -
తండ్రి వస్తేనే తనయుడి విడుదల!
చింతూరు: తమ చెరలో ఉన్న ఇస్సాక్‌ను విడుదల చేయాలంటే అతడి తండ్రి పాస్టర్ కన్నయ్య తమ వద్దకు రావాల్సిందేనని మావోయిస్టులు అల్టిమేటం ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు ఇస్సాక్ ఆచూకీ కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లి మావోయిస్టులకు దొరికిన పాస్టర్లను ఆదివారం రాత్రి విడిచి పెట్టారు. అయితే చెర వీడిన పాస్టర్లు అటవీ ప్రాంతంలో అసలేం జరిగిందనే దానిపై నోరు మెదపడం లేదు. ఇస్సాక్ఆచూకీ కోసం వెళ్లినపుడు మావోయిస్టులు ఎలా తారసపడ్డారు? ఇస్సాక్‌ను చూపించారా? ఎలాంటి హెచ్చరికలు చేశారు? లాంటి ప్రశ్నలపై వారు వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. అయితే ముందు నుంచీ బందీ చేసిన ఇస్సాక్‌ను, పాస్టర్లను మావోయిస్టులు విడివిడిగా ఉంచినట్టు తెలిసింది. కాగా, కన్నయ్య వచ్చిన తర్వాత అతనితో మాట్లాడి కొడుకును విడుదల చేస్తామని, మరోసారి ఇస్సాక్‌విడుదల కోసం ఎవరూ మధ్యవర్తులుగా రావద్దని మావోయిస్టులు హెచ్చరించినట్టు సమాచారం. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే ఆందోళన కుటుంబసభ్యుల్లో నెలకొంది. మరోవైపు మావోయిస్టులు కన్నయ్యకు అల్టిమేటం జారీచేస్తూ ఓ లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఇస్సాక్‌ను అపహరించిన నాటి నుంచి కన్నయ్య ఆచూకీ లేకపోవడంతో మావోయిస్టులు లేఖలో ఏం రాశారనేది స్పష్టంగా తెలియరాలేదు.