చింతూరు: కొత్తగా ఏర్పాటు చేసిన చింతూరు రెవెన్యూ డివిజన్‌కు సంబంధించిన కార్యాలయంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. గతంలో రంపచోడవరం డివిజన్ కేంద్రానికి తరలించిన సామగ్రిని తిరిగి చింతూరు కార్యాలయానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గతంలో రాష్ట్ర విభజన అనంతరం ఎటపాక డివిజన్‌గా వుండగా జిల్లాల పునర్వవ్యవస్థీకరణలో భాగంగా దీనిని రద్దుచేసి నాలుగు మండలాలను రంపచోడవరం డివిజన్‌లో కలిపారు.
దీంతో చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల ప్రజలకు రెవెన్యూ, పోలవరం సమస్యల పరిష్కారం కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత జూలైలో వరదముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా చింతూరు మండలం కుయిగూరు వచ్చారు. ఈ సందర్భంగా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్షి్మతో పాటు స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు డివిజన్ కేంద్రం ఆవశ్యకతను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం డివిజన్ కేంద్రం ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారు.
చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి ఆమోదముద్ర పడిన వెంటనే డివిజన్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. డివిజన్ ఏర్పాటును సెప్టెంబరు ఏడో తేదీన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. దీనిపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం అంతే వేగంగా అక్టోబరు 20న చింతూరు రెవెన్యూ డివిజన్‌కు రాజముద్ర పడింది. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో దానికి అధికారి ఆవశ్యకత ఉండటంతో చింతూరు ఐటీడీఏ పీవోగా పనిచేస్తున్న రామశేషును బదిలీచేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవోగా ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌ను నియమించింది.
చింతూరుకు ఉద్యోగులు..
ఎటపాక డివిజన్ రద్దు కావడంతో చింతూరులోని డివిజన్ కార్యాలయ సామగ్రితో పాటు ఉద్యోగులు రంపచోడవరం డివిజన్ కేంద్రానికి తరలివెళ్లారు. చింతూరు డివిజన్ కేంద్రం ఏర్పాటైన నేపథ్యంలో రంపచోడవరం తరలించిన కార్యాలయ సామగ్రితో పాటు ఉద్యోగులు కూడా చింతూరు కార్యాలయానికి తిరిగి రావడంతో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. గతంలో మాదిరిగానే ఐటీడీఏ కార్యాయలంలోని పీవో చాంబర్ పక్కనే ఉన్న భవనంలో చింతూరు రెవెన్యూ డివిజన్ పరిపాలన కొనసాగనుంది. చింతూరులో నిరి్మస్తున్న రెవెన్యూ డివిజన్ కార్యాలయ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభం కావడంతో చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాలకు చెందిన ప్రజలకు సంబంధించి రెవెన్యూ, పోలవరం, భూ సమస్యలకు దగ్గరలోనే పరిష్కారం లభించనుంది. రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పరిపాలన ప్రారంభమైంది. ప్రస్తుతానికి ప్రాముఖ్యతను బట్టి ఇతర మండలాలకు చెందిన ఉద్యోగులను సర్దుబాటు చేశారు. త్వరలోనే పూర్తిస్థాయిలో ఉద్యోగుల నియామకానికి చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment