Revenue division office
-
చింతూరు రెవెన్యూ డివిజన్.. ఇక సేవలు మరింత చేరువగా..
చింతూరు: కొత్తగా ఏర్పాటు చేసిన చింతూరు రెవెన్యూ డివిజన్‌కు సంబంధించిన కార్యాలయంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. గతంలో రంపచోడవరం డివిజన్ కేంద్రానికి తరలించిన సామగ్రిని తిరిగి చింతూరు కార్యాలయానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గతంలో రాష్ట్ర విభజన అనంతరం ఎటపాక డివిజన్‌గా వుండగా జిల్లాల పునర్వవ్యవస్థీకరణలో భాగంగా దీనిని రద్దుచేసి నాలుగు మండలాలను రంపచోడవరం డివిజన్లో కలిపారు. దీంతో చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల ప్రజలకు రెవెన్యూ, పోలవరం సమస్యల పరిష్కారం కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత జూలైలో వరదముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా చింతూరు మండలం కుయిగూరు వచ్చారు. ఈ సందర్భంగా రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్షి్మతో పాటు స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు డివిజన్ కేంద్రం ఆవశ్యకతను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం డివిజన్ కేంద్రం ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారు. చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి ఆమోదముద్ర పడిన వెంటనే డివిజన్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. డివిజన్ ఏర్పాటును సెప్టెంబరు ఏడో తేదీన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. దీనిపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం అంతే వేగంగా అక్టోబరు 20న చింతూరు రెవెన్యూ డివిజన్‌కు రాజముద్ర పడింది. రెవెన్యూ డివిజన్ ఏర్పాటుతో దానికి అధికారి ఆవశ్యకత ఉండటంతో చింతూరు ఐటీడీఏ పీవోగా పనిచేస్తున్న రామశేషును బదిలీచేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవోగా ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌ను నియమించింది. చింతూరుకు ఉద్యోగులు.. ఎటపాక డివిజన్ రద్దు కావడంతో చింతూరులోని డివిజన్ కార్యాలయ సామగ్రితో పాటు ఉద్యోగులు రంపచోడవరం డివిజన్ కేంద్రానికి తరలివెళ్లారు. చింతూరు డివిజన్ కేంద్రం ఏర్పాటైన నేపథ్యంలో రంపచోడవరం తరలించిన కార్యాలయ సామగ్రితో పాటు ఉద్యోగులు కూడా చింతూరు కార్యాలయానికి తిరిగి రావడంతో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. గతంలో మాదిరిగానే ఐటీడీఏ కార్యాయలంలోని పీవో చాంబర్ పక్కనే ఉన్న భవనంలో చింతూరు రెవెన్యూ డివిజన్ పరిపాలన కొనసాగనుంది. చింతూరులో నిరి్మస్తున్న రెవెన్యూ డివిజన్ కార్యాలయ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభం కావడంతో చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాలకు చెందిన ప్రజలకు సంబంధించి రెవెన్యూ, పోలవరం, భూ సమస్యలకు దగ్గరలోనే పరిష్కారం లభించనుంది. రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో పరిపాలన ప్రారంభమైంది. ప్రస్తుతానికి ప్రాముఖ్యతను బట్టి ఇతర మండలాలకు చెందిన ఉద్యోగులను సర్దుబాటు చేశారు. త్వరలోనే పూర్తిస్థాయిలో ఉద్యోగుల నియామకానికి చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ తెలిపారు. -
నెరవేరనున్న 37 ఏళ్ల కల
పరకాల : 37 సంవత్సరాల క్రితం పరకాల నుంచి తరలించుకుపోయిన రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఈ నెల 27న ప్రారంభించుకోబోతున్నట్లు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలి పారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వపరిపాలనే లక్ష్యంగా 10 జిల్లాల తెలం గాణ రాష్ట్రాన్ని 31 జిల్లాలుగా, కొత్త రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, మండలాలను ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గతంలో పరకాల రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ములుగుకు తరలించడంలో టీడీపీ, బీజేపీ నేతల హస్తం ఉండగా ప్రస్తుత జయశంకర్ జిల్లాలోని భూపాలపల్లి, చిట్యాల, రేగొండ, మొగుళ్లపల్లి మండలాలతో ఉన్న పరకాల నియోజకవర్గాన్ని కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం ముక్కలు చేసి పరకాల ప్రజలకు అన్యాయం చేశారన్నారు. పరకాలలోని అన్నివర్గాల ప్రజల పోరాటాలతో 2017 అక్టోబర్ 27న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ టెక్స్టైల్ పార్క్ నిర్మాణం శంకుస్థాపన సభలో ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ డివిజన్ కేంద్రాన్ని ప్రకటించి 2018 ఏప్రిల్ మొదటి వారంలో గెజిట్ విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నెల 27న సోమవారం ఆర్డీఓ కార్యాలయ ప్రారంభంతో పరకాల రెవెన్యూ డివిజన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి కడి యం శ్రీహరి, మంత్రి హరీష్‌రావు, స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, వరంగల్ ఎంపీ దయాకర్, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, కార్పొరేషన్ చైర్మన్లు లింగంపల్లి కిషన్‌రావు, రాజయ్యయాదవ్, నాగుర్ల వెంకటేశ్వర్రావు, వాసుదేవరెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. నడికూడ తహసీల్దార్ కార్యాలయాన్ని ఉదయం 10 గంటలకు ప్రారంభించిన తర్వాత 10.30 గంటలకు పరకాల రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొంపెల్లి ధర్మారాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొచ్చు వినయ్, జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి, మార్కెట్ వైస్ చైర్మన్ పావుశెట్టి వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు దుబాసి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
కింకర్తవ్యం..
హుజూరాబాద్ : దశాబ్దాల కాలంగా హుజూరాబాద్‌ను ఊరించి ఎట్టకేలకు మంజూరైన రెవెన్యూ డివిజన్ కార్యాలయంపై మరోమారు సందిగ్ధత నెలకొంది. గతనెల 14న హుజూరాబాద్‌లో ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు ఇన్చార్జి ఆర్డీవోను సైతం నియమించారు. ప్రస్తుతం హుజూరాబాద్ కేంద్రంగా హుజూరాబాద్, జమ్మికుంట, శంకరపట్నం, ఎల్కతుర్తి, సైదాపూర్, భీమదేవరపల్లి, కమలాపూర్, వీణవంక మండలాలకు సంబంధించిన రెవెన్యూ సేవలు మొదలయ్యాయి. గతంలో హుస్నాబాద్‌కు రెవెన్యూ హోదా కల్పించి ఆ తర్వాత హుజూరాబాద్‌కు రెవెన్యూ హోదా ఎలా ఇస్తారనే విషయంపై ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో హుజూరాబాద్‌ను రెవెన్యూ డివిజన్ చేస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ గతంలో హుస్నాబాద్‌కు అనుకూలంగా గత ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులనే కొనసాగించాలని మంగళవారం హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో స్థానికంగా మరోమారు నిరుత్సాహం నెలకొంది. ఆర్డీవో ఆఫీసు మూణ్ణాళ్ల ముచ్చటేనా..? సకల సౌకర్యాలతోపాటు ఎనిమిది మండలాలకు అందుబాటులో ఉన్న హుజూరాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేయడానికి రెండు దశాబ్దాలుగా ప్రయత్నాలు జరిగాయి. గత ప్రభుత్వంలో హుజూరాబాద్‌ను పక్కనబెట్టి అనూహ్యంగా హుస్నాబాద్‌కు రెవెన్యూ హోదా కల్పించింది. వెంటనే ఎన్నికలు రావడంతో ఆ ఉత్తర్వులు అమలుకాలేదు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే, మంత్రి ఈటెల రాాజేందర్ జోక్యంతో హుజూరాబాద్‌కు రెవెన్యూ హోదా కల్పించారు. అనుకున్నదే తడవుగా గత నెల 14న ఆర్డీవో కార్యాలయాన్ని తాత్కాలికంగా తహశీల్దార్ కార్యాలయంలో ప్రారంభించారు. శాశ్వత కార్యాలయాన్ని ఐబీ గెస్ట్‌హౌస్‌లో ప్రారంభించడానికి అన్ని హంగులతో సిద్ధం చేస్తున్నారు. దాదాపు పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. హుజూరాబాద్‌లో రెవెన్యూ సేవలు సైతం ప్రారంభమయ్యాయి. కరీంనగర్ ఆర్డీవో చంద్రశేఖర్ వారానికి మూడు రోజులు ఇక్కడకు వచ్చివెళ్తున్నారు. మంత్రి మదిలో ఏముందో..? తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించడంతోపాటు అసెంబ్లీలో గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినందుకే తన నియోజకవర్గాన్ని కాదని రెవెన్యూ డివిజన్ హోదాను హుస్నాబాద్‌కు కేటాయించారని అప్పట్లో ఈటెల రాజేంద ర్ ఆరోపించారు. హుస్నాబాద్ రెవెన్యూ డివిజ న్ ఉత్తర్వులను రద్దు చేయించి.. హుజూరాబాద్‌కు రెవెన్యూ హోదా కల్పించేవరకు తన ముఖం చూపించనని ఆయన బహిరంగంగా ప్రకటించారు. అంతలోనే ఎన్నికలు రావడం, మరోసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గత ప్రతిపాదనల ఆధారంగా హుజూరాబాద్‌కు రెవెన్యూ హోదాను కల్పించి నియోజకవర్గ ప్రజలతో శభాష్ అనిపించుకున్నారు. మరో ఆటంకం రాకుండా ఆర్డీవో కార్యాలయాన్ని హుజూరాబాద్‌లో ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నారు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో హైకోర్టు తీర్పుతో నిరుత్సాహం నెలకొంది. దీనిపై మంత్రి ఇప్పటివరకు స్పందించలేదు. దీనిపై ప్రభుత్వం ఏం చేయనుంది? హైకోర్టు ఉత్తర్వుల మేరకు పాత జీవోనే కొనసాగిస్తుందా? కొత్త జీవో అమలుకు సిద్ధపడుతుందా? అన్న చర్చ జరుగుతోంది.