కింకర్తవ్యం.. | Revenue Division office for decades was finally granted once was unimpressive | Sakshi
Sakshi News home page

కింకర్తవ్యం..

Published Wed, Sep 3 2014 3:25 AM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM

Revenue Division office for decades was finally granted once was unimpressive

హుజూరాబాద్ : దశాబ్దాల కాలంగా హుజూరాబాద్‌ను ఊరించి ఎట్టకేలకు మంజూరైన రెవెన్యూ డివిజన్ కార్యాలయంపై మరోమారు సందిగ్ధత నెలకొంది. గతనెల  14న హుజూరాబాద్‌లో ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు ఇన్‌చార్జి ఆర్డీవోను సైతం నియమించారు. ప్రస్తుతం హుజూరాబాద్ కేంద్రంగా హుజూరాబాద్, జమ్మికుంట, శంకరపట్నం, ఎల్కతుర్తి, సైదాపూర్, భీమదేవరపల్లి, కమలాపూర్, వీణవంక మండలాలకు సంబంధించిన రెవెన్యూ సేవలు మొదలయ్యాయి. గతంలో హుస్నాబాద్‌కు రెవెన్యూ హోదా కల్పించి ఆ తర్వాత హుజూరాబాద్‌కు రెవెన్యూ హోదా ఎలా ఇస్తారనే విషయంపై ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు.
 
 దీంతో హుజూరాబాద్‌ను రెవెన్యూ డివిజన్ చేస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ గతంలో హుస్నాబాద్‌కు అనుకూలంగా గత ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులనే కొనసాగించాలని మంగళవారం హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో స్థానికంగా మరోమారు నిరుత్సాహం నెలకొంది.
 
 ఆర్డీవో ఆఫీసు మూణ్ణాళ్ల ముచ్చటేనా..?
 సకల సౌకర్యాలతోపాటు ఎనిమిది మండలాలకు అందుబాటులో ఉన్న హుజూరాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేయడానికి రెండు దశాబ్దాలుగా ప్రయత్నాలు జరిగాయి. గత ప్రభుత్వంలో హుజూరాబాద్‌ను పక్కనబెట్టి అనూహ్యంగా హుస్నాబాద్‌కు రెవెన్యూ హోదా కల్పించింది. వెంటనే ఎన్నికలు రావడంతో ఆ ఉత్తర్వులు అమలుకాలేదు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే, మంత్రి ఈటెల రాాజేందర్ జోక్యంతో హుజూరాబాద్‌కు రెవెన్యూ హోదా కల్పించారు. అనుకున్నదే తడవుగా గత నెల 14న ఆర్డీవో కార్యాలయాన్ని తాత్కాలికంగా తహశీల్దార్ కార్యాలయంలో ప్రారంభించారు.
 
 శాశ్వత కార్యాలయాన్ని  ఐబీ గెస్ట్‌హౌస్‌లో ప్రారంభించడానికి అన్ని హంగులతో సిద్ధం చేస్తున్నారు. దాదాపు పనులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. హుజూరాబాద్‌లో రెవెన్యూ సేవలు సైతం ప్రారంభమయ్యాయి. కరీంనగర్ ఆర్డీవో చంద్రశేఖర్ వారానికి మూడు రోజులు ఇక్కడకు వచ్చివెళ్తున్నారు.

 మంత్రి మదిలో ఏముందో..?
 తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించడంతోపాటు అసెంబ్లీలో గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినందుకే తన నియోజకవర్గాన్ని కాదని రెవెన్యూ డివిజన్ హోదాను హుస్నాబాద్‌కు కేటాయించారని అప్పట్లో ఈటెల రాజేంద ర్ ఆరోపించారు. హుస్నాబాద్ రెవెన్యూ డివిజ న్ ఉత్తర్వులను రద్దు చేయించి.. హుజూరాబాద్‌కు రెవెన్యూ హోదా కల్పించేవరకు తన ముఖం చూపించనని ఆయన బహిరంగంగా ప్రకటించారు.
 
 అంతలోనే ఎన్నికలు రావడం, మరోసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గత ప్రతిపాదనల ఆధారంగా హుజూరాబాద్‌కు రెవెన్యూ హోదాను కల్పించి నియోజకవర్గ ప్రజలతో శభాష్ అనిపించుకున్నారు. మరో ఆటంకం రాకుండా ఆర్డీవో కార్యాలయాన్ని హుజూరాబాద్‌లో ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకున్నారు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో హైకోర్టు తీర్పుతో నిరుత్సాహం నెలకొంది. దీనిపై మంత్రి ఇప్పటివరకు స్పందించలేదు. దీనిపై ప్రభుత్వం ఏం చేయనుంది? హైకోర్టు ఉత్తర్వుల మేరకు పాత జీవోనే కొనసాగిస్తుందా? కొత్త జీవో అమలుకు సిద్ధపడుతుందా? అన్న చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement