![Single judge orders are one-sided - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/23/highcourt.jpg.webp?itok=bZZazzNu)
సాక్షి, హైదరాబాద్: క్రిస్టియన్ భవన్‌కు కేటాయించిన భూమిని తక్షణమే సదరు భూయజమానికి అప్పగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ చేసింది. తమ వాదనలను వినకుండానే సింగిల్ జడ్జి ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొంది. ఈ అప్పీల్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరింది. అల్వాల్ మండలం యాప్రాల్‌లోని సర్వే నంబర్ 124/బి లోని మూడెకరాల భూమిని ప్రభుత్వం క్రిస్టియన్ భవన్ నిర్మాణం నిమిత్తం కేటాయించింది. ఈ మేరకు అక్కడ నిర్మాణ పనులను ప్రారంభించింది. క్రిస్టియన్ భవన్‌కు కేటాయించిన భూమి తమదని, తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే భూమిని స్వాధీనం చేసుకుందని, తమ భూమికి తమకు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని ఎం.గంగావతి అనే మహిళ, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, పట్టాను రద్దు చేయకుండానే భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని తప్పుపట్టారు. తక్షణమే మూడెకరాల భూమిని పిటిషనర్లకు స్వాధీనం చేయాలని అధికారులను ఆదేశిస్తూ ఈ నెల 19న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, మల్కాజ్‌గిరి–మేడ్చల్ జిల్లా కలెక్టర్, ఆర్‌డీవోలు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. 2016లో పంచనామా నిర్వహించి, నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. పిటిషనర్లు ఈ నోటీసులకు స్పందించకపోవడంతో నిబంధనలకు లోబడే ఆ భూమిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే, సింగిల్ జడ్జి ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండానే స్వాధీన ఉత్తర్వులు జారీ చేశారని, వాటిని రద్దు చేయాలని కోరారు. అయితే, ప్రత్యేక ధర్మాసనాలు ఉండటంతో శుక్రవారం ఈ అప్పీల్ విచారణకు నోచుకోలేదు. బుధవారం విచారణ జరిపే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment