
సాక్షి, హైదరాబాద్: క్రిస్టియన్ భవన్ నిర్మాణం కోసం ఎంచుకున్న భూమి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. 1962లో ఎస్సీ కులస్తుడికి అనైన్డ్ భూమిగా ఇచ్చిన దానిని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించింది. అల్వాల్ మండలం యాప్రాల్‌లోని సర్వే నంబర్ 124/బీలోని మూడు ఎకరాల భూమిలో క్రిస్టియన్ భవన్ లేదా ఇతర ఏతరహా నిర్మాణాలు చేయరాదని తేల్చి చెప్పింది. భూమిని తిరిగి పిటిషనర్‌కు ఇవ్వాలంటూ బుధవారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
తన భర్త ముత్తు స్వామికి 1962లోనే అప్పటి ప్రభుత్వం మూడు ఎకరాల భూమికి పట్టా ఇచ్చిందని, 124 సర్వే నంబర్‌లోని మొత్తం 7.26 ఎకరాల్లో 124/ఏలోని 4.26 ఎకరాలకు హెచ్‌ఎండీఏ ప్రహారీ నిర్మించిందని, మిగిలిన భూమిని తాము సాగు చేసుకుంటున్నామని పిటిషనర్ ఎం.గంగావతి హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిని చట్ట ప్రకారం సేకరించకుండా, తనకిచ్చిన పట్టాను రద్దు చేయకుండానే నేరుగా తాము సాగు చేసుకునే భూమిలో ఈ నెల 4న క్రిస్టియన్ భవన్ కోసం భూమి పూజ చేశారని ఆమె న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు.
అయితే పిటిషనర్ భూమిని రెండేళ్ల క్రితమే ప్రభుత్వం తిరిగి తీసేసుకుందని, 2015లోనే ఉత్తర్వులు కూడా వెలువడ్డాయని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. భూమిని అసైన్ చేశాక సాగు చేయలేదన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. 1962లో అసైన్డ్ భూమి ఇచ్చి, ఇంతకాలానికి తిరిగి ఎలా స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు. ఆ భూమిని తిరిగి పిటిషనర్‌కు ఇవ్వాలని, అందులో నిర్మాణాలు చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment