Christian Bhavan
-
సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఏకపక్షం
సాక్షి, హైదరాబాద్: క్రిస్టియన్ భవన్‌కు కేటాయించిన భూమిని తక్షణమే సదరు భూయజమానికి అప్పగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్ చేసింది. తమ వాదనలను వినకుండానే సింగిల్ జడ్జి ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొంది. ఈ అప్పీల్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరింది. అల్వాల్ మండలం యాప్రాల్‌లోని సర్వే నంబర్ 124/బి లోని మూడెకరాల భూమిని ప్రభుత్వం క్రిస్టియన్ భవన్ నిర్మాణం నిమిత్తం కేటాయించింది. ఈ మేరకు అక్కడ నిర్మాణ పనులను ప్రారంభించింది. క్రిస్టియన్ భవన్‌కు కేటాయించిన భూమి తమదని, తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే భూమిని స్వాధీనం చేసుకుందని, తమ భూమికి తమకు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని ఎం.గంగావతి అనే మహిళ, మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, పట్టాను రద్దు చేయకుండానే భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని తప్పుపట్టారు. తక్షణమే మూడెకరాల భూమిని పిటిషనర్లకు స్వాధీనం చేయాలని అధికారులను ఆదేశిస్తూ ఈ నెల 19న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, మల్కాజ్గిరి–మేడ్చల్ జిల్లా కలెక్టర్, ఆర్డీవోలు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. 2016లో పంచనామా నిర్వహించి, నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. పిటిషనర్లు ఈ నోటీసులకు స్పందించకపోవడంతో నిబంధనలకు లోబడే ఆ భూమిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే, సింగిల్ జడ్జి ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండానే స్వాధీన ఉత్తర్వులు జారీ చేశారని, వాటిని రద్దు చేయాలని కోరారు. అయితే, ప్రత్యేక ధర్మాసనాలు ఉండటంతో శుక్రవారం ఈ అప్పీల్ విచారణకు నోచుకోలేదు. బుధవారం విచారణ జరిపే అవకాశం ఉంది. -
క్రిస్టియన్ భవన్ భూమిపై వివాదం
సాక్షి, హైదరాబాద్: క్రిస్టియన్ భవన్ నిర్మాణం కోసం ఎంచుకున్న భూమి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. 1962లో ఎస్సీ కులస్తుడికి అనైన్డ్ భూమిగా ఇచ్చిన దానిని ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించింది. అల్వాల్ మండలం యాప్రాల్‌లోని సర్వే నంబర్ 124/బీలోని మూడు ఎకరాల భూమిలో క్రిస్టియన్ భవన్ లేదా ఇతర ఏతరహా నిర్మాణాలు చేయరాదని తేల్చి చెప్పింది. భూమిని తిరిగి పిటిషనర్‌కు ఇవ్వాలంటూ బుధవారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తన భర్త ముత్తు స్వామికి 1962లోనే అప్పటి ప్రభుత్వం మూడు ఎకరాల భూమికి పట్టా ఇచ్చిందని, 124 సర్వే నంబర్లోని మొత్తం 7.26 ఎకరాల్లో 124/ఏలోని 4.26 ఎకరాలకు హెచ్ఎండీఏ ప్రహారీ నిర్మించిందని, మిగిలిన భూమిని తాము సాగు చేసుకుంటున్నామని పిటిషనర్ ఎం.గంగావతి హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిని చట్ట ప్రకారం సేకరించకుండా, తనకిచ్చిన పట్టాను రద్దు చేయకుండానే నేరుగా తాము సాగు చేసుకునే భూమిలో ఈ నెల 4న క్రిస్టియన్ భవన్ కోసం భూమి పూజ చేశారని ఆమె న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. అయితే పిటిషనర్ భూమిని రెండేళ్ల క్రితమే ప్రభుత్వం తిరిగి తీసేసుకుందని, 2015లోనే ఉత్తర్వులు కూడా వెలువడ్డాయని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. భూమిని అసైన్ చేశాక సాగు చేయలేదన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. 1962లో అసైన్డ్ భూమి ఇచ్చి, ఇంతకాలానికి తిరిగి ఎలా స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు. ఆ భూమిని తిరిగి పిటిషనర్‌కు ఇవ్వాలని, అందులో నిర్మాణాలు చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. -
ఏడాదిలోగా క్రైస్తవ భవన్
-
ఏడాదిలోగా క్రైస్తవ భవన్
- నాగోల్ చౌరస్తాలో రెండెకరాలు కేటాయిస్తున్నాం: సీఎం కేసీఆర్ - ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు - పేద క్రైస్తవులకు దుస్తుల పంపిణీ సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారత దేశానికే గర్వకారణంగా నిలిచేలా హైదరాబాద్‌లో క్రైస్తవ భవనాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గతేడాది క్రిస్టియన్ భవన నిర్మాణానికి ప్రయత్నించగా న్యాయపరమైన చిక్కులు వచ్చాయన్నారు. నాగోల్ చౌరస్తాలో క్రైస్తవ భవన నిర్మాణం కోసం తక్షణమే రెండెకరాలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. తాను స్వయంగా పర్యవేక్షణ చేసి ఏడాదిలోగా క్రైస్తవ భవన్ నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంగళవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రైస్తవ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని మతాలకు చెందిన వారు సుఖంగా జీవించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గతంలో చర్చిల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ల వద్ద అనుమతి తీసుకోవాల్సి వచ్చేదని, బిషప్‌ల విన్నపం మేరకు స్థానిక సంస్థల ద్వారానే చర్చిల నిర్మాణానికి అనుమతి మంజూరయ్యేలా ఆదేశాలిస్తానన్నారు. చర్చిల నిర్మాణం కోసం నామమాత్రపు ధరకు ప్రభుత్వ స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. పాత చర్చిలకు మరమ్మతులు చేసేందుకు కూడా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేస్తామన్నారు. శ్మశాన వాటికలు సహా ఇతర ఇబ్బందులను పరిష్కరించేందుకు త్వరలోనే బిషప్‌లతో సమావేశమై వారి సూచనల మేరకు తగిన చర్యలు చేపడతానని హామీనిచ్చారు. బంగారు తెలంగాణ అంటే పది మంది మాత్రమే బాగుపడేది కాదని, అన్ని వర్గాల వారు ఆనందంగా ఉంటేనే అది సార్థకమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా క్రిస్టియన్లపై దాడులు జరిగితే సహించేది లేదని, ఎక్కడైనా జరిగినట్లు తెలిస్తే ఉక్కుపాదంతో అణచి వేస్తానని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పేద క్రైస్తవులకు సీఎం దుస్తులను పంపిణీ చేశారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభను, సామాజిక సేవాతత్పరతను కనబరిచిన ప్రముఖులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని, తలసాని, పద్మారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బిషప్‌లు తుమ్మబాల, సాల్మన్, డేనియల్, మాజీ సీసీఎల్ఏ రేమండ్ పీటర్, మైనార్టీ సంక్షేమ విభాగం చైర్మన్ ఏకే ఖాన్, మైనార్టీ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్ తదితరులు పాల్గొన్నారు.