దక్షిణ భారత దేశానికే గర్వకారణంగా నిలిచేలా హైదరాబాద్‌లో క్రైస్తవ భవనాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గతేడాది క్రిస్టియన్ భవన నిర్మాణానికి ప్రయత్నించగా న్యాయపరమైన చిక్కులు వచ్చాయన్నారు. నాగోల్ చౌరస్తాలో క్రైస్తవ భవన నిర్మాణం కోసం తక్షణమే రెండెకరాలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. తాను స్వయంగా పర్యవేక్షణ చేసి ఏడాదిలోగా క్రైస్తవ భవన్ నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంగళవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రైస్తవ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.