Minority Welfare Department
-
CM Jagan: ఒదిగితేనే ఎదుగుదల
దేవుడు మన నుంచి కోరుకునేది ఒక్కటే.. అధికారంలో ఉన్న వారు అధికార దర్పంతో వ్యవహరించకూడదని, వారు ప్రజలకు సేవకులుగా ఉండాలని కోరుకుంటాడు. నేను అదే నమ్ముతాను. దేవుడి ఆశీస్సులతో మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా గొప్ప సేవకుడిగా ఉండాలని కోరుకుంటున్నాను. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్న వారు ప్రజలకు సేవకులుగా ఒదిగి ఉండటం నేర్చుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. విజయవాడలోని ఎ–ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం సెమీక్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించి తేనీటి విందు ఏర్పాటుచేసింది. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ కేక్ కట్‌చేసి క్రైస్తవ ప్రముఖులకు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉండి ఇంకా ఒదిగి ఉండేలా నేర్చుకోవాలన్నారు. ప్రజలకు ఇంకా మంచిచేసే అవకాశం.. గొప్ప సేవకుడిగా ఉండేలా దేవుడు అవకాశం ఇవ్వాలని సీఎం ఈ సందర్భంగా ప్రార్థించారు. ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే.. ఈ రోజు నాతో పాటు వేదికపై ఉన్న పెద్దలు మోస్ట్ రెవరెండ్ జోసెఫ్, డాక్టర్ జార్జ్, పాస్టర్ జాన్‌వెస్లీ, బాలస్వామి, ఇక్కడ ఉన్న ఫాదర్లు, పాస్టర్లే కాకుండా ఇక్కడికి వచ్చినా, రాలేకపోయినా నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములందరికీ కూడా ఈ క్రిస్మస్ మాసంలో ఈ వేడుక జరుపుకుంటున్న శుభసందర్భంలో అందరికీ మెర్రీ క్రిస్మస్ తెలియజేస్తున్నాను. కాసేపటి క్రితం ఇక్కడికి వచ్చాక ఏం మాట్లాడాలని అడిగాను. దేవుడి గురించి చెప్పాలంటే నా కంటే ఇక్కడ ఉన్న వారు చాలా చక్కగా చెబుతారు. మనం నేర్చుకోదగ్గ పాఠం ఒకటి ఉంది. మన నుంచి దేవుడు కోరుకునేది ఒక్కటే. అధికారం అన్నది అధికారం కాదు. అధికారంలో ఉన్నవాళ్లు ప్రజలకు ఇంకా ఒదిగి ఉండాలి. ఇంకా సేవలకులమని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను మీ బిడ్డగా ఉన్నానంటే అందుకు దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలే కారణం. దేవుడి దయతో ఇంకా మంచిచేసే అవకాశం.. ఇంకా ఒదిగి ఉండే అవకాశం దేవుడు ఇవ్వాలని, ఇంకా గొప్ప సేవకుడిగా మీ అందరికీ సేవచేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఇంట్లో ఉన్న వారికి మరొక్కసారి మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ సీఎం జగన్ తన సందేశాన్ని అందించారు. క్రీస్తు జననం లోకానికి పండుగ ఇక ఏపీ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బొల్లవరపు జాన్‌వెస్లీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ.. క్రీస్తు జననం లోకానికి పండుగ అన్నారు. సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలోని అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమానికి సువర్ణాధ్యాయం మొదలైందన్నారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ముస్లిం మైనార్టీల కోసం కేవలం రూ.2,655 కోట్లు ఖర్చుచేస్తే వైఎస్సార్సీపీ మూడున్నరేళ్లలో రూ.20,330.63 కోట్లు ఖర్చుచేయడం గొప్ప విషయమన్నారు. ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకర్, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, బిషప్ రాజారావు, హోసన్న మినిస్ట్రీస్ జాన్‌వెస్లీ, బందెల రాజు మాట్లాడారు. ఉత్తమ సేవలకు అవార్డులు అందించిన సీఎం ఇక పలు రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన ఏడుగురికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవార్డులు అందజేశారు. సామాజిక సేవలో ఉన్నం మేరీ సుజాత, వల్లూర్ అశవ్కుమార్.. వైద్య రంగంలో డాక్టర్ కోలా విజయ కిసింజెర్.. విద్యా రంగంలో కంచి డొమినిక్‌రెడ్డి, డాక్టర్ ఎం. సండ్ర కార్మెల్ సోఫియా.. సాహిత్యంలో తేర జాన్జర్షన్ శ్రీనివాస్, పెద్దేటి యోహాన్లకు అవార్డులను అందించి సత్కరించారు. తేనిటి విందులో సీఎం వైఎస్ జగన్ అనంతరం ఇచ్చిన తేనీటి విందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మంత్రులు అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, విడదల రజిని, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, శాసన మండలి వైస్ చైర్మన్ జకియాఖానం, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, కృష్ణాజిల్లా జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారికా రాము, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏపీ పైబర్‌నెట్ చైర్మన్ పి.గౌతంరెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి దేవినేని అవినాష్, పలువురు క్రైస్తవ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
కదం తొక్కిన ముస్లింలు
కడప కల్చరల్: మహా ప్రవక్త మహమ్మద్ (సొ.అ.వ)పై బీజేపీ నేతలు నుపుర్‌శర్మ, నవీన్‌కుమార్ జిందాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్బీ అంజాద్‌బాషా అన్నారు. వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలో పలు ముస్లిం సంస్థల ఆధ్వర్యంలో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నేక్‌నామ్‌ఖాన్ కళాక్షేత్రంలో బహిరంగసభ నిర్వహించారు. డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మాట్లాడుతూ ఏ మతాన్ని ఇతర మతాల వారు కించపరచడం ధర్మం కాదని, అన్ని ధార్మిక గ్రంథాలు ఇతర మతాలను గౌరవించాలని సూచిస్తున్నాయన్నారు. నుపుర్‌శర్మ, నవీన్ జిందాల్ వ్యాఖ్యలు దేశంలోని కోట్లాది మంది ముస్లింలను ఆవేదనకు గురి చేశాయన్నారు. ప్రధాని మోదీ జోక్యం చేసుకుని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి అహ్మదుల్లా, రాజకీయ ప్రముఖులు ఎస్బీ అహ్మద్‌బాషా, సుభాన్‌బాషా, అమీర్‌బాబు, నజీర్ అహ్మద్, ఆధ్యాత్మికవేత్తలు హజరత్ వలీవుల్లా హుసేనీ సాహెబ్, హుసేనీ బాషా షహమీరి సాహెబ్, హజరత్ ముఫ్తీ మహమ్మద్ అలీ బొగ్దాది సాహెబ్, ముస్లిం మతగురువులు పాల్గొన్నారు. కడపలోని అల్మాస్‌పేట నుంచి ప్రారంభమైన ర్యాలీ నేక్‌నామ్‌ఖాన్ కళాక్షేత్రం వరకు సాగింది. -
వక్ఫ్ భూముల మ్యాపింగ్‌లో ఏపీ ఆదర్శం
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): ఏపీలో వక్ఫ్‌బోర్డు భూముల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కృషి అద్భుతమని సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సభ్యులు జనాబ్ నౌషాద్, జనాబ్ హనీఫ్‌అలీ, ఎస్. మున్వారీబేగం, దరక్షన్ ఆంద్రాబీ ప్రశంసించారు. గడిచిన ఏడాదిలో రాష్ట్రంలో అన్యాక్రాంతమైన 559.16 ఎకరాల వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని పరిరక్షించడంపై వారు ప్రభుత్వాన్ని అభినందించారు. విజయవాడలోని ఏపీ స్టేట్ వక్ఫ్‌బోర్డు కార్యాలయంలో రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ గంధం చంద్రుడు ఇతర ఉన్నతాధికారులతో వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను గురువారం సాయంత్రం కౌన్సిల్ సభ్యులు సమీక్షించారు. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ పర్వతారోహకుడు తుకారాం వారు మాట్లాడుతూ వక్ఫ్‌బోర్డు ఆస్తులను 50 శాతానికి పైగా మ్యాపింగ్ చేసి దక్షిణ భారతదేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి అమలు చేస్తున్న పలు పథకాల కింద రాష్ట్రంలో వక్ఫ్‌బోర్డు ద్వారా నిధులు మంజూరుకు కృషి చేస్తామన్నారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో వక్ఫ్‌బోర్డు నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలు ఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందని కౌన్సిల్ సభ్యులు చెప్పారు. అలాగే రాష్ట్రంలో ఏపీ వక్ఫ్‌బోర్డు కమిటీని, వక్ఫ్ ట్రిబ్యునల్ త్వరగా ఏర్పాటు చేయాలని సభ్యులు కోరారు. ఏపీ వక్ఫ్‌బోర్డు సీఈవో ఎస్.అలీమ్‌బాషా, ఏపీ వక్ఫ్‌బోర్డు డిప్యూటీ సెక్రటరీ షేక్ అహ్మద్, డిప్యూటీ ఇంజినీర్ అబ్దుల్‌ఖాదిర్ పాల్గొన్నారు. చదవండి: తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల -
ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనం విడుదల
కడప కార్పొరేషన్: ఆంధ్రప్రదేశ్‌లోని ఇమామ్‌లు, మౌజన్లకు మే, జూన్, జూలై మాసాలకు సంబంధించిన గౌరవ వేతనం విడుదల చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఇమామ్‌లకు నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు, మౌజన్లకు నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంచిన గౌరవ వేతనం ప్రకారం మే, జూన్ మాసాలకు గాను రూ.14.74 కోట్లు మసీదుల కమిటీల జాయింట్ అకౌంట్లలో జమ చేశామన్నారు. అలాగే, జూలై నెలకు సంబంధించిన గౌరవ వేతనం రూ.7.98 కోట్లు కూడా జమ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఇకపై ఇమామ్‌లు, మౌజన్లకు ప్రతి నెలా గౌరవ వేతనం జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అంజాద్ బాషా తెలిపారు. విడుదలయ్యే మొత్తాలను మసీదు కమిటీలు ఇమామ్‌లు, మౌజన్లకు ప్రతినెలా కచ్చితంగా చెల్లించాలని ఆదేశించారు. -
వక్ఫ్ భూములకు భద్రత
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వక్ఫ్ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వక్ఫ్ భూములపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడంతో పాటు స్థలాల చుట్టూ ప్రహరీ గోడల నిర్మాణాన్ని చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ పనులను ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలించాలన్నారు. మైనారిటీలకూ సబ్ ప్లాన్ అమలుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో హజ్‌హౌస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. మైనార్టీల సంక్షేమంపై సీఎం జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. వక్ఫ్ ఆస్తుల రక్షణకు హోంగార్డులు వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో భాగంగా భూముల చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టి అనంతరం హోంగార్డులను వాటి రక్షణ కోసం నియమించేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైఎస్సార్ జగనన్న సమగ్ర భూ సర్వేతో పాటు వక్ఫ్ ఆస్తులు కూడా సర్వే చేయాలని ఆదేశించారు. కొత్త శ్మశానవాటికలు మైనార్టీల కోసం కొత్త శ్మశానవాటికల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ప్రాధాన్యతాంశంగా తీసుకుని వీటి నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. అవసరాలకు తగినట్టుగా కొత్త శ్మశానాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో డిప్యూటీ సీఎం అంజాద్ తదితరులు సకాలంలో గౌరవ వేతనాలు ఇమామ్‌లు, మౌజంలు, ఫాస్టర్లకు సకాలంలో గౌరవ వేతనాల చెల్లింపులు జరగాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గౌరవ వేతనాల కోసం అందిన కొత్త దరఖాస్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మైనార్టీలకూ సబ్ ప్లాన్ మైనార్టీలకూ సబ్‌ప్లాన్ కోసం అధికారులు అందచేసిన ప్రతిపాదనలపై సీఎం స్పందిస్తూ దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. మైనార్టీలకు సబ్‌ప్లాన్ అమలైతే నిధులు కూడా మరింత పెరుగుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రాధాన్యత క్రమంలో పనులు మైనారిటీ విద్యార్ధుల వసతి గృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. నిర్మాణంలో ఉన్న భవనాల ప్రగతిని సీఎంకు వివరించారు. ఐదు గురుకుల పాఠశాలలు, 2 వసతి గృహాలకు సంబంధించి రూ.75 కోట్లతో చేపడుతున్న పనుల పురోగతిని తెలియచేశారు. పెండింగ్ బిల్లుల బకాయిలు చెల్లించడంతోపాటు ఇప్పటికే ప్రారంభమైన అన్ని ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని సీఎం సూచించారు. మైనార్టీ శాఖలో పెండింగ్ సమస్యలపై పూర్తి స్ధాయి నివేదిక అందచేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై దృష్టి మైనార్టీ విద్యార్ధుల్లో నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల సేవలను వినియోగించుకోవడం ద్వారా మైనార్టీ వర్గాల విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేలా చర్యలు చేపట్టాలన్నారు. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పనుల వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రాధాన్యత కింద యూనివర్సిటీ పనులను నాడు – నేడు తరహాలో చేపట్టాలని అధికారులకు నిర్దేశించారు. ఉర్దూ అకాడమీని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాల్సిందిగా సూచనలు చేశారు. అకాడమీ అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధం చేయాలని, షాదీఖానాల నిర్వహణను మైనారిటీశాఖకు బదిలీ చేయాలని సీఎం ఆదేశించారు. క్రిస్టియన్ భవన్ పనులు పూర్తవ్వాలి.. మైనారిటీశాఖలో ఖాళీ పోస్టుల వివరాలను సమీక్ష సందర్భంగా అధికారులు వెల్లడించారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఆర్ధికశాఖ అధికారులతో సమావేశమై నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో హజ్‌హౌస్ నిర్మాణ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలిపారు. హజ్, వక్ఫ్ కమిటీల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని సూచించారు. గుంటూరు జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై అర్ధాంతరంగా నిలిచిపోయిన క్రిస్టియన్ భవన్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. – సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (మైనార్టీ సంక్షేమశాఖ) అంజద్ బాషా, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి గంధం చంద్రుడు, మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్ కె.శారదాదేవి, ఏపీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ సీఈవో పి.రవి సుభాష్, ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వీసీ అండ్ ఎండీ అలీం బాషా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆక్రమణలకు గురైన సుమారు 500 ఎకరాలకుపైగా వక్ఫ్ బోర్డు భూములను ఈ రెండేళ్ల వ్యవధిలో తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు సమీక్షలో అధికారులు తెలిపారు. ఆ వివరాలు ఇవీ.. -
మైనార్టీ సంక్షేమానికి తగ్గిన నిధులు
సాక్షి, హైదరాబాద్: మైనార్టీ సంక్షేమ శాఖకు తాజా బడ్జెట్లో కేటాయింపులు తగ్గాయి. 2020– 21 వార్షిక సంవత్సరంలో ఈ శాఖకు రూ. 1,138.45 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అయితే 2019–20 సంవత్సరంలో రూ. 1,346.95 కోట్లు కేటాయించగా... తాజా బడ్జెట్లో రూ. 208 కోట్ల మేర కేటాయింపులు తగ్గాయి. గత కేటాయింపులు భారీగా జరపడంతో పెండింగ్ పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. దీంతో 2020–21 వార్షిక సంవత్సరంలో ప్రాధాన్యతలకు తగినట్లు నిధులు కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. కార్మిక సంక్షేమానికి రూ.107.78 కోట్లు కార్మిక సంక్షేమం, ఉపాధి కల్పన శాఖలకు ప్రభుత్వం బడ్జెట్లో రూ.107.78 కోట్లు కేటాయించిం ది. గత బడ్జెట్లో ఈ శాఖకు రూ. 60. 35 కోట్లు కేటాయించగా... తాజా బడ్జెట్లో అదనంగా రూ.47 కోట్లు కేటాయించడం గమనార్హం. మహిళా, శిశు సంక్షేమానికి కాస్త మెరుగ్గా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమానికి నిధుల కేటాయింపులు కాస్త మెరుగుపడ్డాయి. గత బడ్జెట్లో ప్రగతి పద్దు కింద మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు రూ.663.80 కోట్లు కేటాయించగా, 2020–21 వార్షిక బడ్జెట్లో రూ.676.11 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే దాదాపు 13 కోట్లు అధికంగా కేటాయించారు. సంక్షేమ గురుకులాలకు రూ.2,073.91 కోట్లు సంక్షేమ శాఖల ద్వారా నిర్వహిస్తున్న గురుకుల విద్యా సంస్థల సొసైటీలకు ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ.2,073.91 కోట్లు కేటాయించింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) రూ.878.15 కోట్లు, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్) రూ.739.61 కోట్లు, తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీకి రూ.212.98 కోట్లు, మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) రూ.243.17 కోట్లు కేటాయించింది. -
హజ్, జెరూసలేం యాత్రికులకు ఆర్థిక సాయం పెంపు
సాక్షి, అమరావతి: హజ్, జెరూసలేం యాత్రికులకు రాష్ట్రప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని పెంచుతూ మంగళవారం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ అయ్యాయి. హజ్ యాత్రకు వెళ్లేవారిలో మూడు లక్షల రూపాయల లోపు వార్షికాదాయం ఉన్నవారికి రూ. 60 వేలు, మూడు లక్షలు పైబడి వార్షికాదాయం ఉన్న వారికి రూ. 30 వేలు చొప్పున ప్రభుత్వం సహాయంగా అందజేయనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి మొహద్ ఇలియాస్ రిజ్వి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హజ్ యాత్రకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేవారు ముందుగా ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలను పూర్తిగా చదవాలని, నిర్ధారిత ఫార్మాట్లో ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. జెరూసలేం, ఇతర బైబిల్ సంబంధిత యాత్రాస్థలాల సందర్శనార్థం వెళ్లే వారికి.. మూడు లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి ప్రస్తుతం అందిస్తున్న రూ. 40 వేల సహాయాన్ని రూ. 60 వేలకు, మూడు లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి ప్రస్తుతం ఇస్తున్న రూ. 20 వేలను రూ. 30 వేలకు పెంచుతున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ వేరొక ఉత్తర్వులో పేర్కొంది. -
ఆ శాఖకు ఒకే ఒక్కడు..!
సాక్షి, కరీంనగర్ : జిల్లా మైనార్టీ సంక్షేమశాఖకు ఏడాదిన్నరగా రెగ్యులర్ అధికారి కరువయ్యారు. కీలకమైన జిల్లా అధికారి పోస్టును రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో ఏడాదిన్నరగా ఇన్చార్జి అధికారుల పాలన సాగుతోంది. ప్రస్తుతం మైనారిటీ సంక్షేమశాఖ ఇన్చార్జి అధికారిగా కొనసాగుతున్న పవన్‌కుమార్‌కు అదనంగా మెప్మా పీడీగా, బీసీ సంక్షేమశాఖ అధికారిగా కొనసాగుతున్నారు. నిన్నటి వరకు సైనిక సంక్షేమశాఖ అధికారిగా సైతం విధులు నిర్వహించారు. ప్రస్తుతం మూడుశాఖలు ప్రధానమైనవే కావడంతో పనిభారం పెరిగి పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇలా ఒక్క మైనార్టీ సంక్షేమ శాఖ కాదు అన్ని శాఖలకు పూర్తిస్తాయి సిబ్బంది, అధికారులు లేకపోవడంతో ఒత్తిడికి గురై అదనపు భారాన్ని మోయలేక బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. ఇటు శాఖ పర కార్యక్రమాలు, పథకాల అమలుపై కొంత ప్రభావం కనిపిస్తోంది. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖకు రెగ్యులర్ అధికారిగా మహ్మద్ షఫీయొద్దీన్ 2018 ఏప్రిల్ వరకు పనిచేసి హైదరాబాద్ మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ప్రభుత్వం మరో అధికారిని జిల్లాకు పంపకపోవడంతో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మెప్మా పీడీగా కొనసాగుతున్న పవన్‌కుమార్‌ను ఇన్చార్జిగా నియమించారు. 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్వయం ఉపాధి రుణాల కోసం 340 మందికిపైగా దరఖాస్తులు చేసుకోగా కేవలం 42 మందికి రూ. 50 వేల చొప్పున చెక్కులు ఇచ్చిన చేతులు దులుపుకున్నారు. ఇలా మూడేళ్లుగా మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి దరఖాస్తులు తీసుకోవడం మినహా రుణాలు అందజేసిన దాఖాలాలు లేవని మైనార్టీ వర్గాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ అధికారి ఉంటేనే పాలనపై పట్టు.... ఏ శాఖకైనా రెగ్యులర్ జిల్లా అధికారి ఉంటేనే పరిపాలన సవ్యంగా జరుగుతుంది. ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు సులువుగా ఉంటుంది. కానీ మైనార్టీ సంక్షేమ శాఖకు 2018 మే నుంచి రెగ్యులర్ అధికారి లేకపోవడం మైనార్టీ ప్రజలకు లోటుగానే మారిందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ శాఖ ద్వారా జిల్లాలో మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు కొనసాగుతున్నాయి. వాటి పర్యవేక్షణకు రెగ్యులర్ అధికారి అవసరం. కాగా సంక్షేమ పథకాలైన సబ్సిడీ రుణాలు, వాటి గ్రౌండింగ్ , విద్యార్థులకు ఉపకార వేతనాల మంజూరు, తదితర కార్యక్రమాల పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ప్రజావాణిలో కూడా మైనార్టీ సంఘాల చాలాసార్లు రెగ్యులర్ అధికారిని నియమించాలని కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశాయి. వాటిని ప్రభుత్వానికి పంపుతున్నా మైనార్టీ శాఖకు రెగ్యులర్ అధికారిని నియమించడం లేదు. -
'ఏపీలోనూ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్'
సాక్షి, విజయవాడ: తెలంగాణ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లో సైతం మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వెల్లడించారు. గురువారం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మైనార్టీల జీవన శైలిలో మార్పుకు కారణం దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని, మైనార్టీలకు పెద్ద పీట వేసేలా ఆయన పథకాలు ప్రవేశ పెట్టారని అన్నారు. పేద ప్రజలకు సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మైనార్టీలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగానే పాస్టర్లకు 5 వేలు గౌరవ వేతనం, మౌజన్, పేషమామ్‌లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 8 వేల నుంచి 15 వేలకు పెంచామని అన్నారు. అంతేకాక జెరుసలేం, హజ్ యాత్రకు వెళ్లే వారికి సైతం 3లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారిని పరిగణనలోకి తీసుకుని 60వేలు, ఆపైన వారికి 30వేలు ఆర్ధిక సహాయం అందజేస్తున్నామని తెలిపారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఇప్పటికే 80 శాతం నెరవేర్చామని ఆయన తెలిపారు. మైనార్టీ శాఖలో ఉన్న అన్ని శాఖలను ఒకే దగ్గరికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వమిచ్చే వైఎస్సార్ షాది-కా-తోఫాను 50 వేల నుంచి లక్షకు పెంచామని పేర్కొన్నారు. మైనార్టీ, క్రిస్టియన్లకు వైఎస్సార్ బీమా కింద 5 లక్షలు అందజేస్తున్నామని గుర్తుచేశారు. మైనార్టీ శాఖలో ప్రతి మూడు నెలలకు ఒకసారి రివ్యూ మీటింగ్ నిర్వహించి, సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటి క్యాబినేట్‌లోనే ఏపీ సీఎం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం పదవులు కేటాయించారని అన్నారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్మోహన్రెడ్డి పాలన సాగిస్తున్నారని అన్నారు. అధికారం చేపట్టిన నాలుగు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని.. గ్రామ, వార్డు సచివాలయాలలో లక్షా 26 వేల శాశ్వత ఉద్యోగాలు కల్పించామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్స్, ఈడీలు, వివిధ విభాగాల హెచ్ఓడీలతో సమీక్షా సమావేశాలు నిర్వహించామన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలంటే విద్య చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకుగాను తెలంగాణ తరహాలోనే ఏపీలో సైతం రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి, విద్యార్థులకు హాస్టల్స్‌తో పాటు అన్ని వసతులు కల్పిస్తామని అన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎండీ ఇలియస్ రిజ్వీ, స్పెషల్ కమిషనర్ శారదాదేవి, మైనార్టీ కార్పొరేషన్ ఎండీ ఏసురత్నం, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
జగన్‌తోనే మైనారిటీల అభివృద్ధి
ఏపీ చరిత్రలో మొదటిసారిగా మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి అంజాద్ బాషా అన్నారు. విశాఖలో మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ముస్లింల సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనారిటీల సంక్షేమానికి అధిక నిధులు కేటయించా మని చెప్పారు. జిల్లాలో వక్ఫ్‌బోర్డు ఆస్తులు, మసీద్, దర్గాల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ముస్లింలను ఇబ్బందులకు గురిచేశారని, ప్రశ్నించిన వారిపై అక్రమకేసులు పెట్టి వేధించారని గుర్తుచేశారు. రాబోయే విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతునిచ్చి గెలిపించాలని కోరారు. ముస్లింలకు ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. – సాక్షి, విశాఖపట్నం సాక్షి, విశాఖపట్నం : మైనారిటీల సంక్షేమం, అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా చెప్పారు. వుడాచిల్డ్రన్ థియేటర్లో ఆదివారం వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐహెచ్ పరూఖీ ఆధ్వర్యంలో ఆత్మీయ సభ నిర్వహించారు. అంతక ముందు మైనారిటీల సమస్యలపై ఆయన వినతులు స్వీకరించారు. అనంతరం మంత్రి అంజాద్‌బాషా మాట్లాడుతూ జిల్లాలో వక్ఫ్‌బోర్డుల ఆస్తులపై ఉన్న వివాదాలతో పాటు మసీదులు, దర్గాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల సీఎం వైఎస్ జగన్‌తో జరిగిన సమావేశంలో మైనారిటీ సబ్ ప్లాన్‌పై చర్చించినట్టు చెప్పారు. అలాగే హజ్ యాత్రకు సీఎం ప్రత్యేకంగా నిధులు కేటా యించారని వివరించారు. నాడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపారని .. ఇప్పుడు ఆయన తనయుడు, సీఎం వైఎస్ జగన్ రెట్టి పథకాలు అమలు చేస్తూ మైనారిటీలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. హామీల అమలు దిశగా కార్యాచరణ ప్రజాసంకల్పయాత్రలో ముస్లింలకు ఇచ్చిన హామీ అమలు చేసేవిధంగా సీఎం జగనన్న చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ముస్లింల కు ఏ సమస్యలొచ్చినా పరిష్కారానికి తాను ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు. అదే సందర్భంలో త్వరలో జరగనున్న జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి మైనారిటీలంతా శక్తి వంచన లేకుండా పని చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే గుడివాడ అమర్నా«థ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థికంగా వెనకబడిన మైనారి టీలు ఉత్తరాంధ్రలోనే ఉన్నారని, వారి అభివృద్ధికి తోడ్పడాలని ఉపముఖ్యమంత్రిని కోరారు. ఎక్కువ శాతం నిధులు ఉత్తరాంధ్రలో వెచ్చించా లని కోరారు. వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ విశాఖ సిటీ స్టేక్‌హోల్డర్స్ ముస్లింలని.. వారి అభివృద్ధికి సీఎం జగన్ ముందుంటారని చెప్పారు. విశాఖను ముంబై తరహాలో అభివృద్ధి చేయాలని ఆలోచనలో సీఎం ఉన్నారని పేర్కొన్నారు. మంత్రి అంజాద్ బాషాను సన్మానిస్తున్న పార్టీ నాయకులు, ముస్లిం నేతలు ముస్లింలను వంచించిన టీడీపీని నమ్మవద్దని నగర అధ్యక్షుడు వంశీకృష్ణశ్రీనివాస్ మాట్లాడు తూ వెనకబడిన ఉత్తరాంధ్రలో ముస్లింలకు అత్యధికంగా నిధులు వెచ్చించాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా గురువులు మా ట్లాడుతూ ముస్లింలకు ఐదు సీట్లు ఇస్తే నాలుగు గెలిచారని, ఓడిపోయిన ఆ ఒక్కరికీ ఎంఎల్సీ ఇచ్చారంటే ఆ వర్గంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. సమన్వయకర్త కేకేరాజు, అధికార ప్రతినిధి ప్రసాదరెడ్డి, ఎంఏ ఖాన్, పార్టీ మైనా రిటీ విభాగం విశాఖ పార్లమెంట్, నగర అధ్యక్షుడులు బర్కత్ అలీ, షరీఫ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సనపల చంద్రమౌళి, పార్లమెం ట్ జిల్లా మహిళా అధ్యక్షరాలు పీలా వెంకటలక్ష్మి, ముఖ్యనేతలు బాబా, అజంఅలీ, షేక్బాబ్జి పాల్గొన్నారు. -
రంజాన్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: రంజాన్ పండుగ నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. సోమవారం సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. రంజాన్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 832 మసీదులకు గిఫ్ట్ ప్యాక్‌లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఇఫ్తార్ విందు నిర్వహణ కోసం ప్రతి మసీదుకు రూ.లక్ష మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. రంజాన్ పండుగ ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని మసీదు ప్రాంతాల్లో శానిటేషన్, రోడ్లకు మరమ్మతులు, లైటింగ్ తదితర ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. మసీదుల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఇక జీహెచ్ఎంసీ పరిధిలోని మసీదుల వద్ద తాగునీటి వసతికి మెట్రో వాటర్ బోర్డు సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు. విద్యుత్‌కు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. రంజాన్ పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో రాత్రి బజారు నిర్వహించే ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపులను ఏర్పాటుచేసి ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చార్మినార్ వద్ద గల జీహెచ్ఎంసీ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మక్కా మసీదు, రాయల్ మాస్కులో మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ షానవాజ్ ఖాసీమ్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మైనార్టీ సంక్షేమ శాఖలో ప్రక్షాళన
సాక్షి, హైదరాబాద్: మైనార్టీ సంక్షేమ శాఖ ప్రక్షాళనకు సర్కారు ఉపక్రమించింది. ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న అధికారుల బదిలీతోపాటు అవినీతి ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదులపై విచారణా చేపడుతోంది. వివిధ శాఖల్లో ప్రతి మూడేళ్లు.. అంతకన్నా ముందే ఉన్నతాధికారులు బదిలీ అవుతుండగా, మైనార్టీ సంక్షేమ శాఖలోని కొన్నిపోస్టుల్లో మాత్రం సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్నారు. దీంతో పలు అంశాల్లో అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు సీఎం కార్యాలయానికి వెళ్లాయి. ఈ క్రమంలో స్పందించిన ఉన్నతాధికారులు మెల్లమెల్లగా ఆ శాఖలో జరుగుతున్న తంతుపై పరిశీలన మొదలుపెట్టారు. ఇందులో భాగంగా సుదీర్ఘ కాలంగా వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఎస్ఏ షుకూర్‌ను పలు పోస్టుల నుంచి తప్పించిన ప్రభుత్వం, ఆయా స్థానాల్లో ఇతర అధికారులకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు ప్రభుత్వ పోర్టల్‌లో కాకుండా అంతర్గతంగా పంపించడం గమనార్హం. కీలక పోస్టుల్లో ఆయనే... సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ (సీఈడీఎం) డైరెక్టర్‌గా ఉన్న షుకూర్‌ను ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం రాష్ట్ర హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ అధికారిగా 2011 డిసెంబర్లో నియమించింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఆయన తెలంగాణ స్టేట్ హజ్ కమిటీ ఈవోగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో నియమితులయ్యారు. దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ డైరెక్టర్‌గానూ ప్రభుత్వం ఆయనకు అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. అదేవిధంగా ఉర్దూ అకాడమీ ప్రత్యేకాధికారి హోదాలోనూ పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఒకే అధికారికి ఇన్ని బాధ్యతలు ఉండడాన్ని పరిశీలించిన ప్రభుత్వం పలు పోస్టుల నుంచి ఆయన్ను రిలీవ్ చేసి కొత్త వారికి కట్టబెట్టింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా మైనార్టీ సంక్షేమ శాఖ సంచాలకులు షానవాజ్ ఖాసీంను ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా మైనార్టీ స్టడీ సర్కిల్ డైరెక్టర్‌గా మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి బి.షఫీఉల్లాను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి మహేశ్‌దత్ ఎక్కా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అక్రమాలపై ఫిర్యాదుల వెల్లువ... మైనార్టీ స్టడీ సర్కిల్, ఉర్దూ అకాడమీలో అక్రమాలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మైనార్టీ స్టడీ సర్కిల్‌కు కేటాయించిన నిధులను సీఈడీఎంకు ఖర్చు చేసినట్లు ఆరోపణలున్నాయి. అదేవిధంగా నిధుల వినియోగంలోనూ అవకతవకలు జరిగినట్లు విమర్శలున్నాయి. ఉర్దూ అకాడమీ పోస్టుల భర్తీలోనూ భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. నిబంధనలను తుంగలో తొక్కుతూ రిజర్వేషన్లు పాటించకుండా నియామకాలు చేయడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. వీటితోపాటు పలు అంశాల్లోనూ ఇదే తరహాలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వ కార్యదర్శులకు లిఖిత పూర్వక ఫిర్యాదులు రావడం ఆ శాఖలో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో మైనార్టీ శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోంది. అక్రమాలపై విచారణ చేపట్టేందుకు చర్యలు మొదలుపెట్టినట్టు సమాచారం. -
స్వీయ పరీక్షా కేంద్రాలకు స్వస్తి
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో స్వీయ పరీక్షా కేంద్రాలకు ప్రభుత్వం స్వస్తి పలకనుంది. ఇకపై ఒక గురుకుల సొసైటీ పరిధిలోని విద్యార్థులు అదే సొసైటీకి చెందిన ఎగ్జామ్ సెంటర్లో పరీక్షలు రాసే వీలుండదు. పరీక్షల నిర్వహణలో మరింత పారదర్శకత కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పరీక్షా కేంద్రాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సొసైటీలను ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా 603 గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో ఎస్సీ 232, ఎస్టీ 88, జనరల్ 35, బీసీ 142, మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో 120 గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో సగానికి పైగా గురుకుల పాఠశాలలు గత రెండు, మూడేళ్ల క్రితమే ప్రారంభం కావడంతో అవి పదో తరగతికి మరో ఏడాదిలో అప్‌గ్రేడ్ కానున్నాయి. మరో 207 గురుకుల పాఠశాలల్లో పదో తరగతి వరకు నడుస్తుండగా వీటిలో 98 గురుకుల పాఠశాలలు జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ కావడంతో ఇంటర్మీడియట్ కోర్సులను పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ 207 గురుకుల పాఠశాలలు పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. ఈ కేంద్రాల్లో చాలావరకు అదే సొసైటీకి చెందిన విద్యార్థులు పరీక్షలు రాయాల్సి వస్తోంది. జంబ్లింగ్ విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ పరీక్ష కేంద్రాల దూరం తదితర అంశాలను పరిగణిస్తూ వారికి ఆయా కేంద్రాలను నిర్ధారిస్తున్నారు. ఈ క్రమంలో అవకతవకలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వీయ పరీక్షా కేంద్రాలు (సెల్ఫ్ సెంటర్లు) రద్దు చేయాలని పరీక్షల విభాగం సూచన చేసింది. దీంతో సెల్ఫ్ సెంటర్లు లేకుండా పరీక్షల నిర్వహణకు సొసైటీలు చర్యలు చేపట్టాయి. ఏటా ఎంత మంది విద్యార్థులు స్వీయ సొసైటీ పరిధిలో పరీక్షలు రాస్తున్నారనే గణాంకాలు తిరగేస్తున్నారు. సంఖ్య అధికంగా ఉంటే భారీ మార్పులు తప్పవని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఫలితాలపై ప్రభావముంటుందా? పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో గురుకుల పాఠశాలలు మెరుగ్గా ఉన్నాయి. ప్రతి సొసైటీ ఫలితాలు రాష్ట్ర ఫలితాల సగటు కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. గురుకుల విద్యార్థులు ఎక్కువగా అదే సొసైటీకి చెందిన సెంటర్లలో పరీక్షలు రాయడంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో సెల్ఫ్ సెంటర్ల రద్దు చేపడితే ఫలితాలపై ప్రభావం పడే అవకాశముందనే భావన గురుకుల ఉపాధ్యాయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. -
ఉర్దూ అధికారి పోస్టులకు 10న నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని కీలక శాఖల్లో ఖాళీగా ఉన్న ఉర్దూ అధికారి ఉద్యో గాల భర్తీకి ఈ నెల 10న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారు డు అబ్దుల్ ఖయ్యూం ఖాన్ తెలిపారు. బుధవారం నాంపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉర్దూ అధికారి గ్రేడ్–1 విభా గంలో 6 పోస్టులు, గ్రేడ్–2 విభాగంలో 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఉర్దూ అధికారులు ఉర్దూ నుంచి ఆంగ్లం, తెలుగులోకి అనువాదం చేస్తారన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉర్దూ రెండో అధికార భాషగా అమలు చేయడానికి చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. ఉర్దూ అకాడమీ ద్వారా రాష్ట్రంలోని ఉర్దూ స్కూళ్లలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను విద్యా వలంటీర్లతో భర్తీ చేస్తామన్నారు. ఉర్దూ లైబ్రరీలను అప్‌గ్రేడ్ చేస్తామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మైనార్టీలకూ అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్ఏ షుకూర్ పాల్గొన్నారు. -
ఉద్రిక్తత మధ్య వక్ఫ్ బోర్డు పాలకవర్గ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వక్ఫ్ బోర్డు పాలకవర్గ సమావేశం సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. శనివారం ఉదయం 11 గంటలకు హజ్ హౌస్‌లోని మొదటి అంతస్తులో సమావేశం ప్రారంభం కాగానే.. పలు స్వచ్ఛంద సంస్థలు, మసీదు కమిటీల సభ్యులు సమావేశ మందిరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వక్ఫ్ చట్టం ప్రకారం కాకుండా బోర్డు ఇష్టానుసారం వక్ఫ్ కమిటీలను ఏర్పాటు చేస్తోందని ఆరోపిస్తూ ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. కమిటీలు, వక్ఫ్ నిర్వాహకుల నియామకాలతోనే సమావేశాలు ముగుస్తున్నాయని, వక్ఫ్ ఆస్తులు, భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. కాన్ఫరెన్స్ హాల్ ఎదుట బైఠాయించడానికి ప్రయత్నం చేశారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు.. సమావేశం జరుగుతున్న ప్రదేశానికి ఎవరినీ అనుమతించలేదు. హజ్ హౌస్‌లో రాష్ట్ర వక్ఫ్ బోర్డు కార్యాలయంతో పాటు మైనార్టీ సంక్షేమ శాఖకు సంబంధించినఇతర కార్యాలయాలు ఉన్నాయి. దీంతో వాటికి వచ్చే వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరికి ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండానే సమావేశం వాయిదా పడింది. మొక్కుబడిగా సమావేశం.. సమావేశం అనంతరం బోర్డు చైర్మన్ సలీం మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని మసీదు, పలు సంస్థల పాలకవర్గ కమిటీలకు అనుమతులు ఇచ్చామన్నారు. ముస్లింల మ్యారేజ్ సర్టిఫికెట్ల ఆన్లైన్ ప్రక్రియ వాయిదా పడిందన్నారు. వక్ఫ్ కార్యకలాపాలు వేగవంతం చేయడానికి 50 మంది యువకులను ఔట్సోర్సింగ్ విధానంలో నియామకంపై వచ్చే పాలకవర్గ సమావేశంలో చర్చిస్తామ న్నారు. 2018కి బడ్జెట్ నివేదిక ఇంకా సిద్ధం కాలేదని, దీన్ని వచ్చే సమావేశంలో ప్రవేశపెడతామని చెప్పారు. వచ్చే నెల 10న మళ్లీ పాలకవర్గ సమావేశం నిర్వహిస్తామన్నారు. -
రూ. 4,100 కోట్లు కేటాయించండి: అక్బర్
సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్లో మైనార్టీ సంక్షేమానికి రూ.4,100 కోట్లు కేటాయిం చాలని మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. గత బడ్జెట్లో కేటాయించిన నిధులను ఈ ఆర్థిక ఏడాది ముగిసే లోపు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలతో సమంగా మైనార్టీలకు సంక్షేమ పథకాలను వర్తింపజేయడం అభినందనీయమన్నారు. మైనార్టీలకు కేటాయించిన నిధుల విడుదల, వ్యయంలో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2014–15 నుంచి 2017–18 వరకు రూ. 4,613.85 కోట్లు కేటాయించగా రూ.2,330 కోట్లను మాత్రమే ఖర్చు చేసినట్లు చెప్పారు. షాదీ ముబారక్ పథకం కింద ఇస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.75,116 నుంచి రూ.1,00,116 కు పెంచాలని ప్రతిపాదించారు. -
పత్తాలేని టీ–ప్రైమ్..!
సాక్షి, హైదరాబాద్: ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు ఇతర మైనారిటీ సామాజిక వర్గాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కరువైంది. ఉత్పాదక రంగంలో అట్టడుగున కార్మికులుగా గణనీయ సంఖ్యలో ఉన్న ఈ సామాజిక వర్గాల ప్రజలు ఈ స్థాయిని అధిగమించి పారిశ్రామికవేత్తలుగా ఎదగలేకపోతున్నారు. మైనారిటీ వర్గాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీ, ప్రోత్సాహకాలు అందించేందుకు ఎలాంటి పథకం లేకపోవడంతో ఈ వర్గాల నుంచి పారిశ్రామికవేత్తలు తయారు కావట్లేదు. దళిత, గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీ, ప్రోత్సాహకాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2014 నవంబర్ 2న ‘తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ రాపిడ్ ఇంక్యూబేషన్ ఆఫ్ దళిత్ ఎంట్రప్రెన్యూర్స్(టీ–ప్రైడ్)’అనే కార్యక్రమాన్ని ప్రకటించింది. మైనారిటీ సామాజిక వర్గాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇదే తరహా ప్రోత్సాహం అందించేందుకు త్వరలో‘తెలంగాణ స్టేట్ ప్రోగ్రాం ఫర్ రాపిడ్ ఇంక్యూబేషన్ ఆఫ్ మైనారిటీస్ ఎంట్రప్రెన్యూర్స్ (టీ–ప్రైమ్) అనే కొత్త పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్ దాదాపు 9 నెలల కింద అసెంబ్లీలో ప్రకటించారు. ఈ పథకం ద్వారా మైనారిటీ వర్గాల పారిశ్రామికవేత్తలకు దళిత, గిరిజనులతో సమానంగా రాయితీ, ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. టీ–ప్రైమ్ విధాన రూపకల్పన బాధ్యతలను మైనారిటీల సంక్షేమశాఖకు అప్పగించింది. ఇప్పటికీ ముసాయిదా విధానాన్ని ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపలేదు. పరిస్థితి ఇలా ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కాదు వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా టీ–ప్రైమ్ అమల్లోకి వచ్చే సూచనలు కన్పించట్లేదని పరిశ్రమల శాఖ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రోత్సాహం లేక నిరుత్సాహం.. ప్రస్తుతం అమల్లో ఉన్న సాధారణ రాయితీ విధానం కింద మైనారిటీ వర్గాల పారిశ్రామికవేత్తలకు రూ.20 లక్షలకు మిం చకుండా గరిష్టంగా 15 శాతం వరకు మాత్రమే పెట్టుబడి రాయితీ లభిస్తోంది. టీ–ప్రైమ్ అమల్లోకి వస్తే మైనారిటీ వర్గాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు రూ.75 లక్షల వరకు గరిష్టంగా 35 శాతం పెట్టుబడి రాయితీని ప్రభుత్వం అందించనుంది. ఐదేళ్ల వరకు విద్యుత్ బిల్లులు, స్టేట్ జీఎస్టీ వాటాతో పాటు పలు రకాల పన్నులను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఈ పరిశ్రమల యజమానులకు చెల్లిస్తుంది. టీ–ప్రైమ్‌ను అమల్లోకి తెస్తే ఇలాంటి ఎన్నో ప్రత్యేక ప్రోత్సాహకాలు మైనారిటీ వర్గాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందనున్నాయి. అయితే, టీ–ప్రైమ్ విధాన రూపకల్పనలో జరుగుతున్న జాప్యంతో మైనారిటీ వర్గాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని కోల్పోతున్నారు. పరిశ్రమల శాఖ అభిప్రాయాన్ని కోరాం టీ–ప్రైమ్ ముసాయిదా రూపొందించి పరిశ్రమల శాఖ అభిప్రాయాన్ని కోరాం. అక్కడి నుంచి సలహాలు, సూచనలు అందాక ముసాయిదాకు తుది రూపునిచ్చి ప్రభుత్వ ఆమోదానికి పంపిస్తాం. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే అమల్లోకి తీసుకొస్తాం. –ఉమర్ జలీల్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి -
బోగస్
మైనారిటీ సంక్షేమశాఖలో నాన్‌టీచింగ్ ఉద్యోగాల నియామకాల్లో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. దొడ్డిదారిన అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు దక్కించుకున్న ఏజెన్సీకి చెందిన ఓ నిర్వాహకురాలు ఉద్యోగాలిప్పిస్తామంటూ బోగస్ ఇంటర్వూ్యలు నిర్వహించినట్లు తేలింది. జక్రాన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఈనెల 13న చీటింగ్ కేసు నమోదైంది. మునిపల్లిలోని గురుకులలో నాన్‌టీచింగ్ ఉద్యోగాలకు బోగస్ ఇంటర్వూ్యలు నిర్వహించినట్లు గుర్తించారు. పోలీసులు ఈ కేసు విచారిస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : మైనారిటీ వర్గాలకు చెందిన చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కొత్తగా మైనారిటీ గురుకులాను మంజూరు చేసిన విషయం విదితమే. అందులో భాగంగా జిల్లాలో 12 మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేశారు. వీటిలో నాన్‌టీచింగ్ ఉద్యోగాల నిర్వహణకు సంబంధించి అవుట్సోర్సింగ్ ఏజెన్సీ నియామకం విషయంలో నిబంధనలను గాలికొదిలేశారు. నిబంధనల ప్రకారం ఈ ఏజెన్సీ నియామకం కోసం ప్రత్యేకంగా టెండరు నోటిఫికేషన్ జారీ చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏజెన్సీల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి, అర్హులైన ఏజెన్సీకి ఈ బాధ్యతలు అప్పగించాలి. కానీ జిల్లా అధికార యంత్రాంగం ఈ నిబంధనలను తుంగలో తొక్కింది. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదు. టెండర్లు పిలవలేదు. ఆయా ఏజెన్సీల పనితీరును పరిశీలించి.. ఏజెన్సీని ఎంపిక చేసినట్లు మైనారిటీ సంక్షేమశాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇందుకోసం ఇద్దరు జిల్లా ఉన్నతాధికారులు కలిసి ఈ ఏజెన్సీలను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం.. అడ్డగోలుగా జరిగిన ఈ నియామకాలతో అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులకు పూర్తిగా అన్యాయం జరిగింది. ఈ ఒక్కశాఖలోనే 96 ఉద్యోగాల భర్తీ అడ్డదారిలో జరగడంతో వీటి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు నిరాశే ఎదురైంది. నాన్‌టీచింగ్ ఉద్యోగాలైన డాటాఎంట్రీ ఆపరేటర్లు, సెక్యురిటీగార్డులు, అటెండర్లు, హౌజ్‌కీపింగ్ ఉద్యోగాలను భర్తీ చేశారు. రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం ఉండటంతో ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. అధికారులు మాత్రం ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకే వారిని ఈ ఉద్యోగాల్లో పెట్టుకున్నామంటూ చేతులెత్తేస్తున్నారు. సందెట్లో సడేమియా అన్నట్లు.. ఈ క్రమంలో అధికారులు అందిన కాడికి దండుకున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇన్చార్జి కలెక్టర్ సీరియస్.. డాటాఎంట్రీ ఆపరేటర్ల పోస్టులకు కొందరు అభ్యర్థులు బోగస్ స్టడీ సర్టిఫికెట్లు జతపరిచారు. అడ్రస్ లేని సంస్థల్లో కంప్యూటర్ కోర్సు చేసినట్లు.. పీజీ డీసీఏ సర్టిఫికెట్లు సృష్టించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సమగ్ర విచారణకు జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం వెనుకంజ వేస్తోంది. ఈ భర్తీ ప్రక్రియలో అక్రమాలు వెలుగుచూడటంతో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఈ విషయంలో మైనారిటీ సంక్షేమశాఖ అధికారులను తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం. -
‘ఇఫ్తార్’ ఖర్చు వివరాలు చెప్పండి
మైనారిటీ సంక్షేమ శాఖకు హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 18న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఖర్చుల వివరాలు తమ ముందుంచాలని బుధవారం మైనారిటీ సంక్షేమ శాఖను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఇఫ్తార్ విందు పేరుతో వక్ఫ్‌బోర్డ్ నిధులను దుర్వినియోగం చేస్తోందంటూ, ఇఫ్తార్ విందుకు 2015, 2016, 2017ల్లో జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త లుబ్నాసార్వత్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. బుధవారం విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది రజా సమీర్ అహ్మద్ వాదనలు వినిపిస్తూ ఇఫ్తార్ విందు ఖర్చుల వివరాలను ప్రభుత్వం ఎక్కడా బయటపెట్టడం లేదని పేర్కొన్నారు. జీవోల్లో ఆ వివరాలను ప్రస్తావించట్లేదని తెలిపా రు. మైనారిటీలకు ఈ విందు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోందని, అయితే ఇందులో మైనా రిటీయేతరులూ పాల్గొంటున్నారని వివరించారు. సీఎం కూడా ఈ విందులో పాల్గొంటున్నారని తెలిపారు. ధర్మాసనం జీవోను పరిశీలించి, ఇందులో 420 మసీదుల్లో 500 మందికి చొప్పున విందు ఇవ్వాలని ఉందని, మరి మైనారిటీయేతరులు విందులో పాల్గొన్నారని ఎలా గుర్తించాలని ప్రశ్నించింది. ప్రభుత్వాలు అనేక పథకాలకు రాయితీలు ఇస్తుంటాయని, ప్రతీ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం పేర్కొంది. మైనారిటీ నిధులను అవసరమైన మైనా రిటీల కోసం వినియోగించడాన్ని తాము వ్యతిరేకించట్లేదని సమీర్ తెలిపారు. ఇఫ్తార్ పేరుతో నిధుల దుర్వినియోగం జరుగుతోంది కాబట్టే జోక్యం కోరుతున్నట్లు పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఇఫ్తార్ విందు జీవో అమలుపై స్టే ఇవ్వాలని కోరారు. ఇఫ్తార్ విందుకు అయ్యే వ్యయాలకు సంబంధించిన వివరాలు తమ ముందుంచాలని మైనారిటీ సంక్షేమ శాఖ తరఫు న్యాయవాదికి స్పష్టం చేస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది -
‘ఉపకార’ బకాయిలకు మోక్షం
విడతలవారీగా విడుదలకు సర్కార్ చర్యలు సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతన బకాయిలకు మోక్షం లభించింది. దాదాపు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ బకాయిల విడుదలకు తాజాగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఈ ఏడాది తొలి త్రైమాసికం బడ్జెట్లో కొన్ని బకాయిలను విడుదల చేసింది. 2015–16, 2016–17 విద్యాసంవత్సరాల బకాయిలను ప్రాధాన్యతాక్రమంలో విడుదల చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బడ్జెట్ పరిమితిని బట్టి ఉపకారవేతన బకాయిల బిల్లులను సంక్షేమశాఖల అధికారులు ఆమోదిస్తూ వాటిని ఖజానా విభాగానికి పంపుతున్నారు. ఖజానాశాఖలో ఆమోదం పొందిన వెంటనే విద్యార్థుల వ్యక్తిగత ఖాతాల్లో జమకానున్నాయి. బకాయిలు రూ.778.83 కోట్లు : రాష్ట్రంలో వివిధ సంక్షేమ శాఖలకు సంబంధించి పోస్టుమెట్రిక్ ఉపకారవేతన బకాయిలు రూ.778.83 కోట్లు ఉన్నాయి. ఇందులో 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.564.44 కోట్లు కాగా, మిగతా 214.39 కోట్లు 2015–16 విద్యా సంవత్సరానికి సంబంధించినవి. ప్రభుత్వం తాజాగా 2017–18 తొలి త్రైమాసిక నిధులను విడుదల చేసింది. ఇందులో గత బకాయిలను పూర్తిస్థాయిలో ఇచ్చే అవకాశం లేదు. తొలుత 2015–16 విద్యా సంవత్సరానికి చెందిన నిధులు విడుదల చేస్తూ ఆ తర్వాత మిగులును 2016–17 సంవత్సరం బకాయిలకు సర్దుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ శాఖల నిధులు అవసరమైనంత అందుబాటులో ఉండడంతో ఆయా శాఖల బకాయిలన్నీ దాదాపు పూర్తి కానున్నాయి. బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల బకాయిలు మరికొంతకాలం పెండింగ్‌లోనే ఉండే అవకాశం ఉంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. 2016–17 విద్యాసంవత్సరానికి గాను ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,606.86 కోట్లు ఉండగా అంతకు ముందుకు ఏడాదివి దాదాపు రూ.1,200 కోట్లు ఉన్నాయి. రెండు రకాల బిల్లులను ఖజానాశాఖకు పంపుతున్నా నిధుల అందుబాటును బట్టి ఆన్లైన్లో వాటికి ఆమోదం తెలుపుతామని సంక్షేమాధికారులు చెబుతున్నారు. -
నిజాం రుబాత్‌లో వసతులకు డ్రా
- ప్రభుత్వ చొరవతో మక్కాలోని రుబాత్‌లో ఏర్పాట్లు - హజ్ యాత్రికుల సౌకర్యాల కోసం రూ.3 కోట్లు - ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ చొరవతో హజ్ యాత్రికులకు మక్కాలోని నిజాం రుబాత్‌లో మళ్లీ వసతులు లభించాయని ఉప ముఖ్యమంత్రి మహ మూద్ అలీ వివరించారు. శనివారం చౌమహల్లా ప్యాలెస్‌లో ఈ వసతుల కోసం డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ సంస్థానం నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం ఐదో నిజాం మక్కాలో ఐదు భననాలను కొనుగోలు చేశారన్నారు. గతంలో ఆ భవనాల్లో హజ్ యాత్రికులకు ఉచితంగా వసతులు కల్పించేవారన్నారు. తరువాత నిజాం రుబాత్, నిజాం ట్రస్టు మధ్య వివాదాలతో వసతులు కల్పించడం మానేశారని చెప్పారు. సీఎం కేసీఆర్ చొరవతో వసతుల కల్పనకు అంగీకారం కుదిరింద న్నారు. రుబాత్‌లో 1,283 మందికి వసతులు ఉండగా, ఇందులో నిజాం రాయల్ ఫ్యామిలీకి 10 శాతం కేటాయించారన్నారు. మిగతా 1,152 మంది యాత్రికుల్లో డ్రా నిర్వహిం చామన్నారు. రుబాత్‌కు ఎంపికైన వారికి రూ. 44 వేలు ఆదా అవుతుందని వివరించారు. యాత్రికుల సౌకర్యార్థం ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయించిం దన్నారు. రుబాత్‌లో వసతులతో పాటు భోజనం అందజేయనున్నట్లు రుబాత్ నిర్వాహకుడు హుస్సేన్ షరీఫ్ చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి షుకూర్, రాష్ట్ర మైనార్టీ సలహాదారు ఏకే ఖాన్, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం, నిజాం టస్టు చైర్మన్ నవాబ్ ఖైరుద్దీన్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
హజ్ యాత్రికుల ఎంపిక పూర్తి
మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారులు ఏకే ఖాన్ హైదరాబాద్: ఈ ఏడాది మన దేశం నుంచి హజ్ వెళ్లేందుకు లక్షా 72 వేలమందికి సౌదీ అరేబియా ప్రభుత్వం అనుమతినిచ్చిందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య సలహాదారు అబ్దుల్ ఖయ్యూం ఖాన్ తెలిపారు. శనివారం నాంపల్లి హజ్‌హౌస్‌లో హజ్‌కు వెళ్లే యాత్రికులను డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...2017 హజ్ యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా 20,601 దరఖాస్తులు అందాయన్నారు. ఇందులో సాధారణ క్యాటగిరీలో 17,564, ఏ క్యాటగిరీలో 743, బీ క్యాటగిరీలో 2294 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. కేంద్ర హజ్ కమిటీ నిబంధనల ప్రకారం ఏ,బీ క్యాటగిరీలో దరఖాస్తు చేసుకున్న 3,037 మంది నేరుగా హజ్ యాత్రకు ఎంపికైయ్యారన్నారు. అనంతరం మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ మాట్లాడుతూ..ఈ ఏడాది హజ్ యాత్రికుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. 2017 హజ్ యాత్రకు ఎంపికైన వారు ఏప్రిల్ 5 లోపు మొదటి విడత రూ. 81 వేలు హజ్ రుసుమును కేంద్ర హజ్ కమిటీ పేరున డీడీ తీసి జమచేయాలని హజ్ కమిటీ ప్రత్యేక అధికారి తెలిపారు. ఏప్రిల్ 13వ తేదీ లోపు ఎంపికైన యాత్రికులు తమ పాస్‌పోర్టును రాష్ట్ర హజ్ కమిటీ కార్యాలయంలో అందించాలని కోరారు. -
ఏడాదిలోగా క్రైస్తవ భవన్
-
ఏడాదిలోగా క్రైస్తవ భవన్
- నాగోల్ చౌరస్తాలో రెండెకరాలు కేటాయిస్తున్నాం: సీఎం కేసీఆర్ - ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు - పేద క్రైస్తవులకు దుస్తుల పంపిణీ సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారత దేశానికే గర్వకారణంగా నిలిచేలా హైదరాబాద్‌లో క్రైస్తవ భవనాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. గతేడాది క్రిస్టియన్ భవన నిర్మాణానికి ప్రయత్నించగా న్యాయపరమైన చిక్కులు వచ్చాయన్నారు. నాగోల్ చౌరస్తాలో క్రైస్తవ భవన నిర్మాణం కోసం తక్షణమే రెండెకరాలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. తాను స్వయంగా పర్యవేక్షణ చేసి ఏడాదిలోగా క్రైస్తవ భవన్ నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంగళవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రైస్తవ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని మతాలకు చెందిన వారు సుఖంగా జీవించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. గతంలో చర్చిల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ల వద్ద అనుమతి తీసుకోవాల్సి వచ్చేదని, బిషప్‌ల విన్నపం మేరకు స్థానిక సంస్థల ద్వారానే చర్చిల నిర్మాణానికి అనుమతి మంజూరయ్యేలా ఆదేశాలిస్తానన్నారు. చర్చిల నిర్మాణం కోసం నామమాత్రపు ధరకు ప్రభుత్వ స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. పాత చర్చిలకు మరమ్మతులు చేసేందుకు కూడా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేస్తామన్నారు. శ్మశాన వాటికలు సహా ఇతర ఇబ్బందులను పరిష్కరించేందుకు త్వరలోనే బిషప్‌లతో సమావేశమై వారి సూచనల మేరకు తగిన చర్యలు చేపడతానని హామీనిచ్చారు. బంగారు తెలంగాణ అంటే పది మంది మాత్రమే బాగుపడేది కాదని, అన్ని వర్గాల వారు ఆనందంగా ఉంటేనే అది సార్థకమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా క్రిస్టియన్లపై దాడులు జరిగితే సహించేది లేదని, ఎక్కడైనా జరిగినట్లు తెలిస్తే ఉక్కుపాదంతో అణచి వేస్తానని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పేద క్రైస్తవులకు సీఎం దుస్తులను పంపిణీ చేశారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభను, సామాజిక సేవాతత్పరతను కనబరిచిన ప్రముఖులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని, తలసాని, పద్మారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బిషప్‌లు తుమ్మబాల, సాల్మన్, డేనియల్, మాజీ సీసీఎల్ఏ రేమండ్ పీటర్, మైనార్టీ సంక్షేమ విభాగం చైర్మన్ ఏకే ఖాన్, మైనార్టీ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేయండి
మైనార్టీ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ నెల్లూరు(పొగతోట) : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ ఉషారాణి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని జేసీ చాంబర్లో వివిధ సంక్షేమ శాఖల అ«ధికారులతో నిర్వహించిన సమావేశంలో సెక్రటరీ మాట్లాడారు. సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. మైనార్టీలకు రేషన్‌కార్డులు, పింఛన్లు, నివాసస్థలాలు, భూములు కేటాయించాలన్నారు. నిర్ధేశించిన లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జేసీ ఇంతియాజ్, జేసీ–2 రాజ్‌కుమార్, డీఆర్ఓ మార్కండేయులు, నెల్లూరు ఆర్డీఓ వెంకటేశ్వర్లు, మైనార్టీ సంక్షేమ శాఖ ఈడీ షంషుద్దీన్ తదితర అధికారులు పాల్గొన్నారు. సకాలంలో రుణాలు మంజూరు చేయండి జిల్లాలో కౌలు రైతులకు సకాలంలో వ్యవసాయ రుణాలు మంజూరు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జేసీ ఇంతియాజ్ సంబంధిత అ«ధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. అర్హులైన కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు మంజూరు చేయాలన్నారు. ఎల్ఈసీ కార్డుదారులకు రుణాలు మంజూరు చేయడంలో బాలాయపల్లి, వెంకటగిరి, కోట, సూళ్లూరుపేట, చిట్టమూరు, చిల్లకూరు, తడ మండలాలు వెనుకబడి ఉన్నాయన్నారు. రెవెన్యూ, వ్యవసాయ, బ్యాంకు అధికారులు సమన్వయంతో సమావేశాలు నిర్వహించి నిర్ధేశించిన రుణాల లక్ష్యాలను సాధించాలని సూచించారు. రుణాల రీషెడ్యుల్లో సమస్యలు ఉంటే సంబంధిత బ్యాంకుల అధికారులతో చర్చించి రుణాలు మంజూరు చేయించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ హేమమహేశ్వరరావు, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట ఆర్డీఓలు వెంకటేశ్వరరావు, వెంకటసుబ్బయ్య, శీనానాయక్, వ్యవసాయశాఖ డీడీలు తదితర అధికారులు పాల్గొన్నారు.