నిజాం రుబాత్‌లో వసతులకు డ్రా
- ప్రభుత్వ చొరవతో మక్కాలోని రుబాత్‌లో ఏర్పాట్లు
- హజ్ యాత్రికుల సౌకర్యాల కోసం రూ.3 కోట్లు
- ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ చొరవతో హజ్ యాత్రికులకు మక్కాలోని నిజాం రుబాత్‌లో మళ్లీ వసతులు లభించాయని ఉప ముఖ్యమంత్రి మహ మూద్ అలీ వివరించారు. శనివారం చౌమహల్లా ప్యాలెస్‌లో ఈ వసతుల కోసం డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ సంస్థానం నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం ఐదో నిజాం మక్కాలో ఐదు భననాలను కొనుగోలు చేశారన్నారు. గతంలో ఆ భవనాల్లో హజ్ యాత్రికులకు ఉచితంగా వసతులు కల్పించేవారన్నారు. తరువాత నిజాం రుబాత్, నిజాం ట్రస్టు మధ్య వివాదాలతో వసతులు కల్పించడం మానేశారని చెప్పారు.
సీఎం కేసీఆర్ చొరవతో వసతుల కల్పనకు అంగీకారం కుదిరింద న్నారు. రుబాత్‌లో 1,283 మందికి వసతులు ఉండగా, ఇందులో నిజాం రాయల్ ఫ్యామిలీకి 10 శాతం కేటాయించారన్నారు. మిగతా 1,152 మంది యాత్రికుల్లో డ్రా నిర్వహిం చామన్నారు. రుబాత్‌కు ఎంపికైన వారికి రూ. 44 వేలు ఆదా అవుతుందని వివరించారు. యాత్రికుల సౌకర్యార్థం ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయించిం దన్నారు. రుబాత్‌లో వసతులతో పాటు భోజనం అందజేయనున్నట్లు రుబాత్ నిర్వాహకుడు హుస్సేన్ షరీఫ్ చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి షుకూర్, రాష్ట్ర మైనార్టీ సలహాదారు ఏకే ఖాన్, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం, నిజాం టస్టు చైర్మన్ నవాబ్ ఖైరుద్దీన్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.