AP CM YS Jagan releases 14.51 crore for Haj Pilgrims - Sakshi
Sakshi News home page

హజ్‌ యాత్రికులకు అండగా నిలిచిన సీఎం వైఎస్‌ జగన్‌ 

Published Wed, May 17 2023 8:29 AM | Last Updated on Wed, May 17 2023 9:58 AM

Cm Ys Jagan Stood By Haj Pilgrims - Sakshi

ముస్లిం మత పెద్దలకు స్వీట్స్‌ తినిపిస్తున్న హజ్‌ కమిటీ చైర్మన్‌ గౌస్‌ లాజమ్‌

సాక్షి, అమరావతి/అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడసెంట్రల్‌): హజ్‌ యాత్రికులపై అదనపు భారం పడకుండా ఆదుకుని అండగా నిలిచిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఏపీ హజ్‌ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. ఏపీ హజ్‌ కమిటీ చైర్మన్‌ షేక్‌ గౌస్‌లాజమ్‌ అధ్యక్షతన విజయవాడలోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మంగళవారం కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చైర్మన్‌ గౌస్‌లాజమ్‌ మాట్లాడుతూ హైదరాబాద్, బెంగళూరుతో పోలిస్తే విజయవాడ నుంచి హజ్‌ యాత్రకు వెళ్లే 1,813 మందిపై దాదాపు రూ.83 వేల వంతున అదనపు భారం పడుతుందని సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించారని చెప్పారు.

రాష్ట్రానికి చెందిన హజ్‌ యాత్రికులపై పడుతున్న అదనపు భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ రూ.14.51 కోట్లు విడుదల చేయడం ముస్లిం సమాజం పట్ల ఆయనకున్న ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు. దీంతో సమావేశం సీఎం వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలిపింది. హజ్‌ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను ఈ సమావేశంలో చర్చించారు. హజ్‌ యాత్రికులకు బస, భోజనం, నీరు, రవాణా తదితర ఏర్పాట్లుకు హజ్‌ కమిటీ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేశారు.

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో హజ్‌ కమిటీ చైర్మన్, డైరెక్టర్లు, ముస్లిం మతపెద్దలు, సంఘాల నాయకులు మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. హజ్‌ యాత్రికులకు రూ.14.51 కోట్లు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో హజ్‌ యాత్రికులను చిన్నచూపు చూశారని, అప్పటి టీడీపీ నాయకుడు సుజనాచౌదరి కేంద్రమంత్రిగా ఉన్నప్పటికీ కనీసం విజయవాడకు ఎంబార్కేషన్‌ పాయింట్‌ కూడా సాధించలేకపోయారని గుర్తుచేశారు.

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం విజయవాడకు ఎంబార్కేషన్‌ పాయింట్‌ తీసుకురావడంతోపాటు హజ్‌ యాత్రికులపై అదనపు భారం పడకుండా ప్రభుత్వ నిధులు విడుదల చేయడం గొప్ప విషయమని వారు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఏపీ ముస్లిం మై నార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ షేక్‌ ఆసిఫ్, ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ షేక్‌ మునీర్‌ అహ్మద్, ఎంఎస్‌ బేగ్, మతపెద్దలు మహ్మద్‌ అక్బర్‌బాషా, డీఎస్‌ హబీ బుల్లా, నసీర్‌ అహ్మద్‌ ఉమ్రీ, ముక్తి అబ్దుల్‌ బాషిత్, ముక్తి అబ్దుల్‌ హాబీబ్‌ తదితరులు మాట్లాడారు. 
చదవండి: ఉదయం నుంచే భగభగ 

వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తోనే రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీ ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా చెప్పారు. హజ్‌ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులకు రాయితీ సొమ్మును ప్రభుత్వం విడుదల చేయడాన్ని హర్షిస్తూ ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ముస్లిం మైనార్టీలకు అన్ని రంగాలలో సముచిత స్థానం లభి స్తోందని చెప్పారు. ప్రతి ముస్లిం సోదరుడు సీఎం జగనన్నకు ఎళ్లవేళలా అండగా నిలుస్తారని పేర్కొన్నారు. అనంతరం ముస్లిం మైనార్టీ పెద్దలు ప్రత్యేక దువా నిర్వహించారు. కార్యక్రమంలో ముస్లిం మై నార్టీ నాయకులు ఎండీ హఫీజుల్లా, షేక్‌ అమిత, మున్షీ, జిలాని, రెహ్మాన్, ఖలీముల్లా తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement