రాష్ట్రాభివృద్ధి కోసం ప్రార్థించండి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘హజ్ యాత్రికులు పవిత్ర హృదయంతో చేసే ప్రార్థనలకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం.. రాష్ట్ర ప్రజల కోసం.. రాష్ట్రాభివృద్ధి కోసం.. ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచిన గంగా జమున సంస్కృతి కొనసాగే విధంగా ప్రార్థించండి’ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్ హౌస్‌లో హజ్‌యాత్ర-2015ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పా టైన కార్యక్రమంలో మాట్లాడుతూ మక్కా మదీనాలో హజ్ ప్రార్థనలు చేయాలని కోట్లాది మంది కోరుకుంటారని, అందులో కొందరు అదృష్టవంతులకే అవకాశం దక్కుతుందన్నారు. పవిత్ర హృదయాలతో హజ్ యాత్రలకు వెళ్తున్నారని, ప్రార్థనలు విజయవంతంగా ముగించుకొని సుఖ సంతోషాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. మక్కా మదీనా లోని కాబా వద్ద ప్రపంచంలో ఎవరికీ దక్కని అతిథి మర్యాదలు హైదరాబాదీలకు దక్కుతున్నాయన్నారు.
నిజాం ప్రభువు కాబాకు సమీపంలో రుబాత్ అతిథి గృహాన్ని నిర్మించడంతో అప్పటి నిజాం స్టేట్‌లోని తెలంగాణ రాష్ట్ర యాత్రికులను అతిథులుగా గుర్తిస్తారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంతి మహమూద్ అలీ మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా బడ్జెట్ కేటాయింపులో మైనార్టీలకు పెద్ద పీట వే సిన ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కుతుందన్నారు. సౌదీలోని మక్కా మదీనాలో వివాదాస్పదంగా మారిన రుబాత్ సమస్యను సీఎం కేసీఆర్ చొరవతో పరిష్కరించగలిగామని, రుబాత్‌లో ఈసారి 597 మంది యాత్రికులకు ఉచిత బస కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్ మేరాజ్, షకీల్, ఎమ్మెల్సీ సలీమ్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి జీడీ అరుణ, డెరైక్టర్ మహ్మద్ జలాలుద్దీన్ అక్బర్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ షఫీయుల్లా, రాష్ట్ర హజ్ కమిటీ స్పెషల్ ఆఫీసర్ ఎస్‌ఎం. షుకూర్, మౌలానా ముఫ్తీ ఖలీల్, ఆల్ మేవా చైర్మన్ మహ్మద్ ఖమ్రురుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.