పోరాడైనా సాధిస్తాం.. | CM Chandrasekhar rao says to fight for Muslim Reservation | Sakshi
Sakshi News home page

పోరాడైనా సాధిస్తాం..

Published Fri, Nov 10 2017 2:12 AM | Last Updated on Wed, Aug 15 2018 8:12 PM

CM Chandrasekhar rao says to fight for Muslim Reservation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ కోసం చేసిన ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రంలో మైనారిటీ రిజర్వేషన్లను సాధిస్తానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఉద్యమాలు చేసి విజయం సాధించటం తనకు కొత్తకాదన్నారు. ఎస్టీల రిజర్వేషన్లు కూడా 15–16 శాతానికి పెంచుతామని.. తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్‌లో చేర్చి రిజర్వేషన్లు అమలు చేయడమే దీనికి పరిష్కార మార్గమని పేర్కొన్నారు. ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని.. కేంద్రం సహకరించకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఈ అంశంపై అన్ని పార్టీలను వెంటపెట్టుకుని ఢిల్లీ వెళ్తామన్నారు. పార్లమెంటు శీతాకాల సమా వేశాల్లో తమ ఎంపీలు భీకర పోరాటం చేస్తారని పేర్కొన్నారు. గురువారం శాసనసభలో మైనార్టీ సంక్షేమంపై జరిగిన లఘుచర్చకు సీఎం సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. 

సమగ్ర డేటాతో ముందుకెళుతున్నాం.. 
మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లపై తాము ఆషామాషీగా వ్యవహరించడం లేదని, సమగ్ర డేటా తీసుకుని ముందుకెళుతున్నామని కేసీఆర్‌ చెప్పారు. దీనిపై ప్రధానితో మాట్లాడానని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఒకవేళ కేంద్రం ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టులో తేల్చుకుంటామన్నారు. ముస్లింలలో ఉన్నవాళ్లంతా పేదవాళ్లు కాదని.. వారిలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో మైనార్టీలకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, 4 శాతమే అమలు చేశారని... మిగతా ఒక్క శాతం ఏమయిందని, ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. 

కాంగ్రెస్‌ దశాబ్దాల పాలన వల్లే ముస్లిం రిజర్వేషన్ల అవసరం వచ్చిందని, వారు నిజమైన స్ఫూర్తితో పనిచేసి ఉంటే ఈ అవసరం ఉండేది కాదని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో మైనార్టీలకు ఖర్చుపెట్టింది రూ.932 కోట్లు మాత్రమేనని... తాము రాష్ట్రం ఏర్పాటైన మూడున్నరేళ్లలో రూ.2,146 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో న్యాయపరమైన చిక్కులున్నాయని, ఈ అంశం సుప్రీంతీర్పుకు లోబడి ఉందని తాను ఎప్పటినుంచో చెబుతున్నానని పేర్కొన్నారు. 

పదో షెడ్యూల్‌ పంచాయతీ తెగకనే.. 
రాష్ట్ర విభజన తర్వాత పదో షెడ్యూల్‌పై ఉన్న పంచాయతీ తెగకనే కొన్ని మైనార్టీ సంస్థలను తాము ఏర్పాటు చేయలేకపోయామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ‘‘ఆస్తుల పంపకానికి వచ్చినప్పుడు ఫసీ ఉర్దూలో ఉన్న లక్షల డాక్యుమెంట్లలో కూడా ఆంధ్ర వాటా కావాలంటోంది. వాళ్లకు ఉర్దూనే చదవడం రాదు. ఆ డాక్యుమెంట్లు ఎందుకని మేమంటున్నం. అలాంటి సమస్యలు పరిష్కారం కాగానే ఈ సంస్థలను ఏర్పాటు చేస్తాం..’’అని చెప్పారు. హజ్‌ కమిటీ లేకపోయినా తెలంగాణలో అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ బాగా పనిచేసి, హజ్‌ యాత్రికులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసిందని కేంద్ర మంత్రి ఒకరు పార్లమెంటులో ప్రశంసించారని గుర్తు చేశారు. రవీందర్‌సింగ్‌ అనే ఓ సిక్కు మతస్తుడిని ఒక కార్పొరేషన్‌ మేయర్‌గా నియమించిన ఘనత రాష్ట్ర చరిత్రలో తమకే దక్కిందన్నారు. 
 
వక్ఫ్‌ భూముల లెక్క తేలుస్తాం 
తన పరిధిలోని భూములు ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఉన్నాయో చెప్పే స్థితిలో వక్ఫ్‌ బోర్డు లేదని.. సమైక్య పాలకులు దాన్ని అంతగా నిర్వీర్యం చేశారని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. దీంతో మొత్తం రికార్డులు సీజ్‌ చేయాలని అధికారులను ఆదేశించామని.. వక్ఫ్‌ బోర్డును బాగు చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీ వేస్తున్నామని తెలిపారు. సమగ్ర భూసర్వేలో వక్ఫ్‌ భూముల బాగోతం కూడా బయటకొస్తుందన్నారు. దళిత క్రైస్తవుల అంశం కేంద్ర చట్టం పరిధిలో ఉంటుందని, దానిపై కూడా తాను ప్రధానితో మాట్లాడానని.. ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తామని తెలిపారు. 

కావాలనే ఐదో తరగతి నుంచి ‘రెసిడెన్షియల్‌’ 
ఐదో తరగతి నుంచే రెసిడెన్షియల్‌ పాఠశాలల విధానం కల్పించటంపై కాంగ్రెస్‌ అనవసర విమర్శలు చేస్తోందని.. నిపుణులతో చర్చించాకే ఆ నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఐదో తరగతికి వచ్చేసరికి పిల్లలు ఎనిమిదేళ్ల వయసు దాటి హోమ్‌సిక్‌ నుంచి బయటపడతారని.. రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చేర్చితే ఇబ్బంది లేకుండా చదువుకుంటారన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. 

ముస్లింలపై సీఎం వరాల వర్షం 
శాసనసభ వేదికగా సీఎం కేసీఆర్‌ ముస్లిం మైనారిటీలపై వరాల వర్షం కురిపించారు. వ్యక్తిగత రుణాలు మొదలుకుని అన్ని విభాగాల్లో ఉర్దూ ప్రతినిధులుగా ముస్లింల నియామకం వరకు వరుసపెట్టి హామీలు ఇచ్చారు. మజ్లిస్‌ సభ్యుడు అక్బరుద్దీన్‌ విన్నపాల మేరకు కొన్ని అంశాలను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. సీఎం ఇచ్చిన హామీలు.. 
– చట్టపరిధిలో ఉన్న రిజర్వేషన్‌ వంటి అంశాలు మినహా అన్ని సంక్షేమ పథకాల్లో ఎస్సీ, ఎస్టీలు పొందుతున్న స్థాయిలో ముస్లింలకు ప్రయోజనం 
– బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా స్వయం ఉపాధి యూనిట్లకు ప్రభుత్వమే నేరుగా రుణాలు ఇస్తుంది. రూ.లక్ష, రూ.లక్షన్నర, రూ.రెండు లక్షలు, రూ.రెండున్నర లక్షలు.. ఇలా యూనిట్లను గరిష్ట సంఖ్యలో అందిస్తాం. 
– పరాధీనమైన వక్ఫ్‌ బోర్డు స్థలాలను తిరిగి స్వాధీనం చేస్తాం. వక్ఫ్‌ బోర్డును పరిపుష్టం చేస్తాం. 
– 1.76 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హజ్‌ హౌజ్‌ భవనాన్ని సంపూర్ణంగా నిర్మిస్తాం. ముస్లింలతో ముడిపడి ఉన్న ప్రభుత్వ విభాగాలన్నింటిని అందులోకి తరలిస్తాం. 
– షాదీ ముబారక్‌ పథకంలో ధ్రువీకరణ కోసం ఓటర్‌ ఐడీ, ఆధార్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు వంటివాటిల్లో ఏదో ఒకటి దాఖలు చేసినా చాలు. 
– ఉర్దూ పాఠశాలల్లో త్వరలోనే 900 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తం. 
– ఉర్దూ అకాడమీని పటిష్టం చేసేందుకు 66 పోస్టులు కేటాయిస్తున్నాం. అందులోంచి ఇద్దరు ముఖ్యమంత్రి కార్యాలయంలో, ఒకరు చొప్పున స్పీకర్, మండలి చైర్మన్‌ కార్యాలయాల్లో, నలుగురు జీఏడీలో, ప్రతి మంత్రి కార్యాలయంలో ఒకరు చొప్పున, ప్రతి కలెక్టర్‌ కార్యాలయంలో ఒకరు చొప్పున, అసెంబ్లీ, కౌన్సిల్‌లలో ఇద్దరేసి చొప్పున, ఐ అండ్‌ పీఆర్‌ కార్యాలయంలో ఒకరు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయాల్లో ఒక్కొక్కరు చొప్పున ‘ఉర్దూ’ప్రతినిధులుగా నియమిస్తం. 
– ఉర్దూ మాధ్యమం డిగ్రీ, జూనియర్‌ కళాశాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ కోర్సులు ప్రారంభిస్తం. 
– ‘నీట్‌’పరీక్షను ఉర్దూలోనూ రాసే అవకాశం కల్పించాలని ప్రధానిని కోరాం. టీఎస్‌పీఎస్సీ, విద్యుత్, సింగరేణి, ఆర్టీసీ సహా అన్ని నియామక, పోటీ పరీక్షలను ఉర్దూలో రాసే అవకాశం కల్పిస్తున్నం. 
– ఫలక్‌నుమా, చంచల్‌గూడల్లోని ఉర్దూ కళాశాలలకు సొంతంగా కొత్త భవనాలు నిర్మిస్తాం. 
– తెలంగాణ రాష్ట్రం యూనిట్‌గా అన్ని ప్రాంతాల్లో ఇక నుంచి ఉర్దూ రెండో అధికార భాషగా అమలవుతుంది. 
– మహారాష్ట్రలో ముస్లింల అభ్యున్నతికి అనుసరిస్తున్న ప్రత్యేక విధానాలను తెలంగాణలోనూ అమలు చేసే అంశంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో బృందం అధ్యయనం చేస్తుంది. 
– పహడీషరీఫ్‌ దర్గా అభివృద్ధికి రూ.9.5 కోట్లు విడుదల చేస్తున్నం, జహంగీర్‌పీర్‌ దర్గా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను స్వయంగా పరిశీలించి ప్రకటిస్తా. ఇక మౌలాలి దర్గాకు దారి నిర్మిస్తాం. 
– అజ్మీర్‌ దర్గా వద్ద తెలంగాణ తరఫున రుబాత్‌ నిర్మిస్తాం. అక్కడి ప్రభుత్వం ఇప్పటికే రెండెకరాల భూమి ఇచ్చింది. 
– ఎస్సీ మహిళా రెసిడెన్షియల్‌ కాలేజీల తరహాలో ముస్లిం యువతులకు రెసిడెన్షియల్‌ కళాశాలలు నిర్మిస్తం. 
– దేవాలయాల్లో అర్చకులకు వేతన క్రమబద్ధీకరణ జరుగుతున్న తరహాలో మసీదుల్లోని ఇమాంల వేతనాలను సవరిస్తాం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement