రిజర్వేషన్ల బిల్లుకు ఓకే | Ok to Reservation bill in Parliament, Council | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్ల బిల్లుకు ఓకే

Apr 17 2017 12:15 AM | Updated on Oct 16 2018 6:01 PM

రాష్ట్రంలో ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్ల పెంపు బిల్లుకు శాసన మండలి, శాసనసభ ఆమోదం తెలిపాయి.

ఆమోదించిన శాసనసభ, మండలి

- విద్యా ఉద్యోగాల్లో ముస్లింలకు 12%, ఎస్టీలకు 10%
- బీజేపీ మినహా అన్ని పక్షాల మద్దతు
- అసెంబ్లీలో నిరసన తెలిపిన బీజేపీ సభ్యులు.. సస్పెండ్‌ చేసిన స్పీకర్‌
- వారసత్వ సంపద బిల్లు, రాష్ట్ర వస్తు సేవల (జీఎస్‌టీ) బిల్లులకూ ఆమోదం l
- శాసనసభ నిరవధిక వాయిదా


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్ల పెంపు బిల్లుకు శాసన మండలి, శాసనసభ ఆమోదం తెలిపాయి. ఈ బిల్లు కు బీజేపీ మినహా అన్ని పార్టీలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించాయి. ఆదివారం నిర్వహిం చిన అసెంబ్లీ, మండలి ప్రత్యేక సమావేశాల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ‘తెలంగాణ వెనుకబడిన తరగ తులు, షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల (రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో సీట్లు, సర్వీసుల్లో నియామకాలు లేదా పదవుల రిజర్వేషన్లు) బిల్లు–2017’పేరుతో దీనిని తీసుకువచ్చారు. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ప్రవేశాలకు, రాష్ట్ర సర్వీసుల కింద నియామకాలకు ప్రస్తుతమున్న 50 శాతం రిజర్వేషన్లను 62 శాతానికి పెంచు తున్నట్లు అందులో పేర్కొన్నారు.

ముస్లింల (బీసీ–ఈ) రిజర్వేషన్‌ను 4 నుంచి 12 శాతానికి, గిరిజనులకు 6 నుంచి 10 శాతానికి పెంచు తున్నట్లు పొందుపరిచారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారమే రిజర్వే షన్లను పెంచుతున్నట్లు బిల్లును ప్రవేశపెట్టే సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అన్ని పార్టీల సభ్యులు ఈ బిల్లుపై జరిగిన చర్చ లో పాల్గొని ప్రభుత్వానికి సలహాలు, సూచన లు అందించారు. బీజేపీ మినహా అన్ని పక్షాలు బిల్లుకు పూర్తి మద్దతు తెలిపాయి. బీజేపీ మాత్రం గిరిజన రిజర్వేషన్లకు మద్దతిస్తూనే ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకించింది. మత పరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని, ఓటు బ్యాంకు కోసమే ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను ప్రవేశపెడుతోందని బీజేపీ సభ్యులు ఆరోపించారు.

అసెంబ్లీలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. దీంతో సభకు అంతరాయం కలగ డటంతో బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ప్రభాకర్, రాజాసింగ్, చింతల రామచంద్రా రెడ్డిలను స్పీకర్‌ మధుసూదనాచారి సస్పెండ్‌ చేశారు. ఇతర పార్టీలన్నీ మద్దతు ప్రకటిం చటంతో రిజర్వేషన్ల బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఇక శాసనమండలిలోనూ బీజేపీ సభ్యుడు రామచంద్రారావు నల్ల చొక్కాతో నిరసన తెలిపారు. చర్చ అనంతరం మండలి కూడా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపింది.

ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ ప్రకారమే రిజర్వేషన్లు తీసుకువచ్చామని.. బిల్లుకు మద్ద తు ఇచ్చిన పార్టీలకు కృతజ్ఞతలు చెబు తున్నానని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇక రిజర్వేషన్ల పెంపు బిల్లుతో పాటు నూతన వారసత్వ సంపద బిల్లు, రాష్ట్ర వస్తు సేవల (జీఎస్‌టీ) బిల్లులను సైతం ఉభయ సభలు ఆమోదించాయి. బిల్లుల ఆమోదం అనంతరం స్పీకర్‌ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement