న్యూఢిల్లీ : నీతి ఆయోగ్ నిర్వహించిన సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. రిజర్వేషన్లలో కోటాను పెంచుతూ ఇటీవలి కాలంలో రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానం వివరాలను ఈ సందర్భంగా ప్రధాని మోదీ దృష్టికి తెచ్చినట్టు తెలుస్తోంది. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని నీతి ఆయోగ్ సమావేశంలో కోరిన కేసీఆర్ ఆ విషయంపై ప్రధానికి ఒక విజ్ఞాపన పత్రం అందజేసినట్టు సమాచారం. ప్రధానితో భేటీ అనంతరం మంత్రి రవిశంకర్‌తో కూడా కేసీఆర్ సమావేశం అయ్యారు.
వెనుకబడిన ముస్లింలు, షెడ్యూల్డ్ తెగల (ఎస్టీల) కు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసనసభలో బిల్లు ఆమోదించిన విషయం తెలిసిందే. తాము ఇవ్వబోతున్న రిజర్వేషన్లు మతపరమైనవి కావని.. సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగానే పెంచుతున్నామని అసెంబ్లీలో బిల్లు సందర్భంగా కేసీఆర్ చెప్పారు. తమిళనాడులో రాజ్యాంగబద్ధంగానే 69 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని, అదే తరహాలో తెలంగాణలోనూ పెంచి తీరుతామన్నారు. తమిళనాడు తరహా చట్టాన్నే కేవలం రాష్ట్రం పేరు మాత్రమే మార్చి కేంద్రానికి పంపుతామన్నారు. దీనిని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని కోరుతామని, ఈ విషయంలో ప్రధానమంత్రిని కలిసి కోరుతానని అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించారు.
కాగా కేసీఆర్ రిజర్వేషన్ల అంశాన్ని ప్రధాని వద్ద ప్రస్తావించారని అధికారవర్గాల సమాచారం. అలాగే దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఎన్నికల అంశం ప్రస్తావనకు వచ్చినట్టు చెబుతున్నారు. అయితే అందుకు సంబంధించిన సమాచారమేదీ బయటకురాలేదు.