సాక్షి, హైదరాబాద్: ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఆ దేశం నుంచి తిరిగి వచ్చిన భారతీయ వైద్య విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఈ అసాధారణ పరిస్థితుల దృష్ట్యా దేశంలోని వైద్య కళాశాలల్లో చదువులు పూర్తి చేయడానికి వారికి అవకాశం కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు మంగళవారం సీఎం లేఖ రాశారు. నిబంధనలను సడలించి దేశంలోని వైద్య కళాశాలల్లో సమాన సెమిస్టర్లలో ఉక్రెయిన్ విద్యార్థులకు ప్రవేశం కల్పించాలని కోరారు. ఒకసారి అవకాశం (వన్ టైమ్ బేసిస్) కింద దామాషా ప్రకారం వైద్య కళాశాలల్లో సీట్లను పెంచాలని సూచించారు. ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభం కావడంతో ఆ దేశంలోని వివిధ వైద్య కళాశాలల్లో చదువుతున్న 20 వేల భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి రావాల్సి వచ్చిందని, అందులో 700 మందికి పైగా తెలంగాణ విద్యార్థులున్నారని ముఖ్యమంత్రి వివరించారు.
రాష్ట్రానికి చెందిన విద్యార్థుల కష్టాలను దృష్టిలో పెట్టుకుని వారి ఫీజులను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఉక్రెయిన్ విద్యార్థుల్లో అధిక శాతం విద్యార్థులు మధ్య తరగతి కుటుంబాల వారేనని సీఎం పేర్కొన్నారు. వారి తల్లిదండ్రులు తమ జీవిత కాల శ్రమతో దాచిపెట్టుకున్న డబ్బులను ఖర్చు చేసి తమ పిల్లలకు వైద్య విద్య కోసం ఉక్రెయిన్‌కు పంపించారని, అయితే యుద్ధం వల్ల విద్యార్థుల చదువులు అర్ధంతరంగా ఆగిపోయాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి: (Hyderabad: రోడ్లపై వాహనాలను వదిలేస్తే ఇక ఉండవు అంతే..)
Comments
Please login to add a commentAdd a comment