State Haj Committee
-
వచ్చే ఏడాది విజయవాడ నుంచే హజ్ యాత్ర
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది నుంచి విజయవాడ కేంద్రంగా హజ్ యాత్రకు చర్యలు చేపడతామని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హజ్ కమిటీకి లేఖలు రాస్తామని ఏపీ హజ్ కమిటీ చైర్మన్ బీఎస్ గౌసల్ అజమ్ తెలిపారు. విజయవాడలోని హజ్ కమిటీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర హజ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తీసుకున్న పలు నిర్ణయాలను ఎమ్మెల్సీ, హజ్ కమిటీ సభ్యుడు ఇస్సాక్ బాషా, మిగిలిన సభ్యులతో కలిసి చైర్మన్ గౌసల్ అజమ్ మీడియాకు వెల్లడించారు. గత నెల 6న ఈ ఏడాది హజ్ యాత్ర ముగిసిందని, యాత్రకు 1,164 మంది సురక్షితంగా వెళ్లి వచ్చారని తెలిపారు. హజ్ యాత్రికులకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనంత ఎక్కువగా ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్న ఘనత ఏపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. సీఎం వైఎస్ జగన్‌ను కలిసి పలు అంశాలపై చర్చించి, ఆయన అనుమతితో రానున్న ఏడాదికి అవసరమైన చర్యలు చేపడతామన్నారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం కావడంతో 2020లో విజయవాడ నుంచి హజ్ యాత్రకు కేంద్ర హజ్ కమిటీ ఎంబార్కేషన్ సెంటర్‌కు అనుమతిచ్చిందని, కోవిడ్ కారణంగా అది వినియోగంలోకి రాలేదన్నారు. వచ్చే ఏడాది(2023) ఎంబార్కేషన్ సెంటర్‌ను పునరుద్ధరించేలా చేసి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచే హజ్ యాత్రకు చర్యలు చేపడతామని తెలిపారు. వైఎస్సార్ కడపలో హజ్ కమిటీ భవన నిర్మాణం దాదాపు 80 శాతం పూర్తయిందని, అలాగే విజయవాడ–గుంటూరు మధ్య హజ్ హౌస్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ను కోరతామని చెప్పారు. ఇందుకోసం గన్నవరం ఎయిర్‌పోర్టు – గుంటూరు మధ్య ఐదెకరాల భూమి కేటాయించి, నిధులు ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని గౌసల్ అజమ్ వివరించారు. -
మైనార్టీ సంక్షేమ శాఖలో ప్రక్షాళన
సాక్షి, హైదరాబాద్: మైనార్టీ సంక్షేమ శాఖ ప్రక్షాళనకు సర్కారు ఉపక్రమించింది. ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న అధికారుల బదిలీతోపాటు అవినీతి ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదులపై విచారణా చేపడుతోంది. వివిధ శాఖల్లో ప్రతి మూడేళ్లు.. అంతకన్నా ముందే ఉన్నతాధికారులు బదిలీ అవుతుండగా, మైనార్టీ సంక్షేమ శాఖలోని కొన్నిపోస్టుల్లో మాత్రం సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్నారు. దీంతో పలు అంశాల్లో అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు సీఎం కార్యాలయానికి వెళ్లాయి. ఈ క్రమంలో స్పందించిన ఉన్నతాధికారులు మెల్లమెల్లగా ఆ శాఖలో జరుగుతున్న తంతుపై పరిశీలన మొదలుపెట్టారు. ఇందులో భాగంగా సుదీర్ఘ కాలంగా వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఎస్ఏ షుకూర్‌ను పలు పోస్టుల నుంచి తప్పించిన ప్రభుత్వం, ఆయా స్థానాల్లో ఇతర అధికారులకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు ప్రభుత్వ పోర్టల్‌లో కాకుండా అంతర్గతంగా పంపించడం గమనార్హం. కీలక పోస్టుల్లో ఆయనే... సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ (సీఈడీఎం) డైరెక్టర్‌గా ఉన్న షుకూర్‌ను ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం రాష్ట్ర హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ అధికారిగా 2011 డిసెంబర్లో నియమించింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఆయన తెలంగాణ స్టేట్ హజ్ కమిటీ ఈవోగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో నియమితులయ్యారు. దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ డైరెక్టర్‌గానూ ప్రభుత్వం ఆయనకు అదనపు బాధ్యతలు కట్టబెట్టింది. అదేవిధంగా ఉర్దూ అకాడమీ ప్రత్యేకాధికారి హోదాలోనూ పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఒకే అధికారికి ఇన్ని బాధ్యతలు ఉండడాన్ని పరిశీలించిన ప్రభుత్వం పలు పోస్టుల నుంచి ఆయన్ను రిలీవ్ చేసి కొత్త వారికి కట్టబెట్టింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా మైనార్టీ సంక్షేమ శాఖ సంచాలకులు షానవాజ్ ఖాసీంను ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా మైనార్టీ స్టడీ సర్కిల్ డైరెక్టర్‌గా మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి బి.షఫీఉల్లాను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి మహేశ్‌దత్ ఎక్కా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అక్రమాలపై ఫిర్యాదుల వెల్లువ... మైనార్టీ స్టడీ సర్కిల్, ఉర్దూ అకాడమీలో అక్రమాలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మైనార్టీ స్టడీ సర్కిల్‌కు కేటాయించిన నిధులను సీఈడీఎంకు ఖర్చు చేసినట్లు ఆరోపణలున్నాయి. అదేవిధంగా నిధుల వినియోగంలోనూ అవకతవకలు జరిగినట్లు విమర్శలున్నాయి. ఉర్దూ అకాడమీ పోస్టుల భర్తీలోనూ భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. నిబంధనలను తుంగలో తొక్కుతూ రిజర్వేషన్లు పాటించకుండా నియామకాలు చేయడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. వీటితోపాటు పలు అంశాల్లోనూ ఇదే తరహాలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వ కార్యదర్శులకు లిఖిత పూర్వక ఫిర్యాదులు రావడం ఆ శాఖలో కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో మైనార్టీ శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోంది. అక్రమాలపై విచారణ చేపట్టేందుకు చర్యలు మొదలుపెట్టినట్టు సమాచారం. -
హజ్ యాత్రకు రాష్ట్రం నుంచి 3,685 మంది
సాక్షి, హైదరాబాద్: కంప్యూటర్ డ్రా పద్ధతిలో 2019 హజ్ యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా 3,685 మంది ఎంపికయ్యారని రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఎ.షుకూర్ తెలిపారు. అలాగే 70 ఏళ్ల వయసు పైబడిన వారిలో రిజర్వ్ కేటగిరీలో తెలంగాణ నుంచి 484 మంది హజ్ యాత్రకు నేరుగా ఎంపికయ్యారని పేర్కొన్నారు. శనివారం హజ్ యాత్రకు ఎంపిక ప్రక్రియను నాంపల్లి హజ్‌హౌస్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హజ్ కమిటీ ముంబై నుంచి ఆన్లైన్ ద్వారా ఏర్పాటు చేసిన కంప్యూటర్ డ్రాను ప్రత్యేక అధికారి బటన్ నొక్కి ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సౌదీఅరేబియా ప్రభుత్వం హజ్ యాత్రకు వెళ్లేందుకు దేశవ్యాప్తంగా 1.75 లక్షల మందికి అనుమతులు ఇచ్చిందన్నారు. ఇందులో కేంద్ర హజ్ కమిటీ 50 వేల మందిని తీసుకెళ్లే అవకాశం ప్రైవేట్ టూర్ ఆపరేటర్లకు.. మిగ తా 1.12 లక్షల మందిని తీసుకెళ్లే అవకాశం వివిధ రాష్ట్రాల హజ్ కమిటీలకు ఇచ్చిందన్నారు. తెలంగాణకు 4,169 మందికి యాత్రకు వెళ్లే కోటాను కేటాయించిందని తెలిపారు. 2019 హజ్ యాత్రకు హైదరాబాద్ నుంచి అత్యధికంగా 8,441 దరఖాస్తులు రాగా అత్యల్పంగా మహబూబాబాద్ జిల్లా నుంచి 4 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. వచ్చే నెల మొదటి వారంలో హజ్ యాత్ర తొలి నగదు కిస్తు రూ. 81 వేలు జమచేయాల్సి ఉంటుందన్నారు. జూలై 1 నుంచి ఆగస్టు 3 వరకు హజ్ యాత్ర కొనసాగుతుందన్నారు. హజ్ యాత్రకు రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా తీసుకెళ్తామని చేప్పే మధ్యవర్తులను సంప్రదించవద్దని హెచ్చరిం చారు. మరిన్ని వివరాల కోసం హజ్ కమిటీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని సూచించారు. -
హజ్‌యాత్రకు 4,169 మంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 2019 హజ్ యాత్రకు వెళ్లాల్సిన యాత్రికుల సంఖ్య (కోటా)ను కేంద్ర హజ్ కమిటీ ప్రకటించిందని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ మసీవుల్లా ఖాన్, ప్రత్యేక అధికారి ఎస్ఎ షుకూర్ తెలిపారు. రాష్ట్రం నుంచి 4,169 మందికి హజ్‌యాత్రకు వెళ్లే అవకాశం దక్కిందని వెల్లడించారు. సోమవారం హజ్ కమిటీ కార్యాలయంలో 2019 హజ్ యాత్ర, యాత్రికుల ఎంపికకు సంబంధించిన వివరాలపై వారు విలేకరులతో మాట్లాడారు. హజ్ యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా 13,388 మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. కేంద్ర హజ్ కమిటీ కోటా ప్రకారం ఇందులో 4,169 మంది హజ్ యాత్రకు వెళ్లనున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే 70 ఏళ్లు పైబడిన కేటగిరీలో 484 మంది నేరుగా హజ్ యాత్రకు ఎంపికయ్యారని తెలిపారు. ఇక, మిగిలిన 12,884 మంది దరఖాస్తుదారుల్లో 3,685 మందికి డ్రా తీసి అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ముస్లిం జనాభా శాతం ప్రకారం ఈ మేర కోటా దక్కిందని వివరించారు. 12న నాంపల్లి హజ్ హౌస్‌లో ఎంపిక ఈ నెల 10న రాష్ట్ర హజ్ కమిటీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఈ ఏడాది హజ్ యాత్రకు సంబంధిచిన ప్రణాళికలు రూపొందిస్తామని మసీవుల్లా ఖాన్, షుకూర్ తెలిపారు. ఈ నెల 12న హజ్ యాత్రికుల ఎంపిక నాంపల్లి హజ్ హౌస్‌లో ఉదయం 11 గంటల నుంచి ప్రారంభిస్తామని వెల్లడించారు. ఎలాంటి మోసాలు లేకుండా పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని వివరించారు. ఎవరైనా హజ్ యాత్రకు హజ్ కమిటీ ద్వారా తీసుకెళ్లతామని, డ్రాలో మీ పేరు వచ్చే విధంగా చేస్తామని చెబితే వారి మాటలు నమ్మొద్దని సూచించారు. ఎవరైనా ఇలా సంప్రదిస్తే తమకు సమాచారం అందించాలని వారు వెల్లడించారు. -
ఆగస్టు 21 నుంచి హజ్ యాత్ర: ఎస్ఏ షుకూర్
సాక్షి, హైదరాబాద్: హజ్ యాత్ర-2016 ఆగస్టు 21 నుంచి ప్రారంభమవుతుందని రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఏ షుకూర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రతిరోజూ 2 ఎయిర్ఇండియా విమానాల్లో సుమారు 340 మంది యాత్రికుల చొప్పున జెద్దాకు బయలుదేరుతారన్నారు. చివరి రోజైన ఆగస్టు 28న ఒకే విమానం బయలుదేరి వెళ్తుందన్నారు. హజ్ ప్రార్థనల అనంతరం యాత్రికులు హైదరాబాద్‌కు అక్టోబర్ 4 నుంచి 11 వరకు తిరుగు ప్రయాణమవుతారని తెలిపారు. హజ్ యాత్రికుల కోసం హజ్ హౌస్‌లో ప్రత్యేక క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. హజ్ యాత్రికులు 2 విడతల చార్జీలను జూలై 2 వరకు చెల్లించాలని ఆయన సూచించారు. -
రాష్ట్రాభివృద్ధి కోసం ప్రార్థించండి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘హజ్ యాత్రికులు పవిత్ర హృదయంతో చేసే ప్రార్థనలకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం.. రాష్ట్ర ప్రజల కోసం.. రాష్ట్రాభివృద్ధి కోసం.. ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచిన గంగా జమున సంస్కృతి కొనసాగే విధంగా ప్రార్థించండి’ అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్ హౌస్‌లో హజ్‌యాత్ర-2015ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పా టైన కార్యక్రమంలో మాట్లాడుతూ మక్కా మదీనాలో హజ్ ప్రార్థనలు చేయాలని కోట్లాది మంది కోరుకుంటారని, అందులో కొందరు అదృష్టవంతులకే అవకాశం దక్కుతుందన్నారు. పవిత్ర హృదయాలతో హజ్ యాత్రలకు వెళ్తున్నారని, ప్రార్థనలు విజయవంతంగా ముగించుకొని సుఖ సంతోషాలతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. మక్కా మదీనా లోని కాబా వద్ద ప్రపంచంలో ఎవరికీ దక్కని అతిథి మర్యాదలు హైదరాబాదీలకు దక్కుతున్నాయన్నారు. నిజాం ప్రభువు కాబాకు సమీపంలో రుబాత్ అతిథి గృహాన్ని నిర్మించడంతో అప్పటి నిజాం స్టేట్‌లోని తెలంగాణ రాష్ట్ర యాత్రికులను అతిథులుగా గుర్తిస్తారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంతి మహమూద్ అలీ మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా బడ్జెట్ కేటాయింపులో మైనార్టీలకు పెద్ద పీట వే సిన ఘనత తెలంగాణ రాష్ట్రానికే దక్కుతుందన్నారు. సౌదీలోని మక్కా మదీనాలో వివాదాస్పదంగా మారిన రుబాత్ సమస్యను సీఎం కేసీఆర్ చొరవతో పరిష్కరించగలిగామని, రుబాత్‌లో ఈసారి 597 మంది యాత్రికులకు ఉచిత బస కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు జాఫర్ హుస్సేన్ మేరాజ్, షకీల్, ఎమ్మెల్సీ సలీమ్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి జీడీ అరుణ, డెరైక్టర్ మహ్మద్ జలాలుద్దీన్ అక్బర్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ షఫీయుల్లా, రాష్ట్ర హజ్ కమిటీ స్పెషల్ ఆఫీసర్ ఎస్ఎం. షుకూర్, మౌలానా ముఫ్తీ ఖలీల్, ఆల్ మేవా చైర్మన్ మహ్మద్ ఖమ్రురుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
హజ్‌యాత్ర-2015కు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్‌యాత్ర-2015 ఏర్పాట్లు పూర్తయ్యాయి. హజ్‌యాత్రపై చివరి అవగాహన సదస్సు ఆదివారంతో ముగిసింది. సెప్టెంబర్ 2వ తేది నుంచి ప్రత్యేక విమానాల్లో హజ్ యాత్రికులు బయలుదేరనున్నాను. తొలిరోజు హజ్‌హౌస్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని యాత్రికులకు వీడ్కోలు పలకనున్నారు. హైదరాబాద్ శివారులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండియన్ ఎయిర్‌లైన్స్ ప్రత్యేక తొలి ఫ్లైట్ ఉదయం 6.10 గంటలకు సౌదీ అరేబియాలోని జెద్దాకు బయలుదేరుతోంది. ఒక్కొక్క ఫైట్స్‌లో 340 మంది యాత్రికుల చొప్పున మొత్తం 5,440 మంది బయలుదేరనున్నారు. ప్రతిరోజు సగటున మూడు ఫ్లైట్స్ చొప్పున 8వ తేదీన 16వ ఫ్లైట్‌తో యాత్రికులు బయలు దేరడం ముగియనుంది. మక్కా మదీనాలో హజ్ ప్రార్థనలు పూర్తి చేసుకొని 43 రోజుల అనంతరం మదీనా నుంచి తిరిగి బయలు దేరనున్నారు. హజ్‌హౌస్‌లో ప్రత్యేక క్యాంప్.. రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్‌హౌస్‌లో క్యాంప్-2015 సోమవారం ప్రారంభం కానుంది. హజ్ క్యాంప్ నుంచే యాత్రికులు బయలుదేరున్నారు. ఫ్లైట్ షెడ్యూలు కంటే 48 గంటల మందు హజ్‌క్యాంప్‌లో యాత్రికులు రిపోర్టు చేయాలి. క్యాంప్‌లో ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మైనార్టీసంక్షేమ శాఖ కార్యదర్శి జీడీ అరుణ ఆధ్వర్యంలో ఏర్పాట్లను చేశారు. క్యాంప్‌లో యాత్రికులు, వారితో వచ్చే బంధుమిత్రులకు మూడు పూటలా ఉచిత భోజన వసతి కల్పించనున్నారు. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇమిగ్రేషన్, కరెన్సీ, బోర్డింగ్ పాస్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. క్యాంప్ నుంచే ప్రత్యేక బస్సుల్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు నాలుగు గంటల ముందే బయలుదేరుతారు. -
సెప్టెంబర్ 2 నుంచి హజ్‌యాత్ర
* యాత్రికులకు ఖుర్బానీ వెసులుబాటు * రాష్ట్ర హజ్ కమిటీ స్పెషల్ ఆఫీసర్ ఎస్ఎం షుకూర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్ యాత్ర-2015 సెప్టెంబర్ రెండు నుంచి ప్రారంభమవుతుందని రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఎం.షుకూర్ వెల్లడించారు. ముంబైలో జరిగిన కేంద్ర హజ్ కమిటీ సమావేశానికి హాజరై వచ్చిన సందర్భంగా గురువారం హజ్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల యాత్రికులు హైదరాబాద్ నుంచే హజ్‌యాత్రకు బయలుదేరుతారని ఆయన వివరించారు. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి హజ్‌యాత్రకు ఇండియన్ ఎయిర్ లైన్స్ సేవలను వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఇండియన్ ఎయిర్ లైన్స్ సేవలపై అభ్యంతరాలు వ్యక్తమైనా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హమీ ఇచ్చిందన్నారు. మక్కాలో హజ్ ప్రార్థనల సందర్భంగా యాత్రికులు నేరుగా ఖుర్బానీ ఇచ్చేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు. సౌదీ ప్రభుత్వం తరఫున ఖుర్బానీకి అంగీకరిస్తే మాత్రం యాత్రికుల ఖర్చుకు ఇచ్చే 469 సౌదీ రియాల్స్ మినహాయించడం జరుగుతుందని చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో కేంద్ర హజ్ కమిటీ రెండో విడత డబ్బులు చెల్లించే తేదీ ప్రకటించే అవకాశం ఉందని వివరించారు. హజ్ యాత్రకు మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.