హజ్‌యాత్ర-2015కు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్‌యాత్ర-2015 ఏర్పాట్లు పూర్తయ్యాయి. హజ్‌యాత్రపై చివరి అవగాహన సదస్సు ఆదివారంతో ముగిసింది. సెప్టెంబర్ 2వ తేది నుంచి ప్రత్యేక విమానాల్లో హజ్ యాత్రికులు బయలుదేరనున్నాను. తొలిరోజు హజ్‌హౌస్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని యాత్రికులకు వీడ్కోలు పలకనున్నారు. హైదరాబాద్ శివారులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండియన్ ఎయిర్‌లైన్స్ ప్రత్యేక తొలి ఫ్లైట్ ఉదయం 6.10 గంటలకు సౌదీ అరేబియాలోని జెద్దాకు బయలుదేరుతోంది.
ఒక్కొక్క ఫైట్స్‌లో 340 మంది యాత్రికుల చొప్పున మొత్తం 5,440 మంది బయలుదేరనున్నారు. ప్రతిరోజు సగటున మూడు ఫ్లైట్స్ చొప్పున 8వ తేదీన 16వ ఫ్లైట్‌తో యాత్రికులు బయలు దేరడం ముగియనుంది. మక్కా మదీనాలో హజ్ ప్రార్థనలు పూర్తి చేసుకొని 43 రోజుల అనంతరం మదీనా నుంచి తిరిగి బయలు దేరనున్నారు.
హజ్‌హౌస్‌లో ప్రత్యేక క్యాంప్..
రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్‌హౌస్‌లో క్యాంప్-2015 సోమవారం ప్రారంభం కానుంది. హజ్ క్యాంప్ నుంచే యాత్రికులు బయలుదేరున్నారు. ఫ్లైట్ షెడ్యూలు కంటే 48 గంటల మందు హజ్‌క్యాంప్‌లో యాత్రికులు రిపోర్టు చేయాలి. క్యాంప్‌లో ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మైనార్టీసంక్షేమ శాఖ కార్యదర్శి జీడీ అరుణ ఆధ్వర్యంలో ఏర్పాట్లను చేశారు.
క్యాంప్‌లో యాత్రికులు, వారితో వచ్చే బంధుమిత్రులకు మూడు పూటలా ఉచిత భోజన వసతి కల్పించనున్నారు. ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇమిగ్రేషన్, కరెన్సీ, బోర్డింగ్ పాస్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. క్యాంప్ నుంచే ప్రత్యేక బస్సుల్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు నాలుగు గంటల ముందే బయలుదేరుతారు.