సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది నుంచి విజయవాడ కేంద్రంగా హజ్ యాత్రకు చర్యలు చేపడతామని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హజ్ కమిటీకి లేఖలు రాస్తామని ఏపీ హజ్ కమిటీ చైర్మన్ బీఎస్ గౌసల్ అజమ్ తెలిపారు. విజయవాడలోని హజ్ కమిటీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర హజ్ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా తీసుకున్న పలు నిర్ణయాలను ఎమ్మెల్సీ, హజ్ కమిటీ సభ్యుడు ఇస్సాక్ బాషా, మిగిలిన సభ్యులతో కలిసి చైర్మన్ గౌసల్ అజమ్ మీడియాకు వెల్లడించారు. గత నెల 6న ఈ ఏడాది హజ్ యాత్ర ముగిసిందని, యాత్రకు 1,164 మంది సురక్షితంగా వెళ్లి వచ్చారని తెలిపారు. హజ్ యాత్రికులకు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనంత ఎక్కువగా ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్న ఘనత ఏపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
సీఎం వైఎస్ జగన్‌ను కలిసి పలు అంశాలపై చర్చించి, ఆయన అనుమతితో రానున్న ఏడాదికి అవసరమైన చర్యలు చేపడతామన్నారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం కావడంతో 2020లో విజయవాడ నుంచి హజ్ యాత్రకు కేంద్ర హజ్ కమిటీ ఎంబార్కేషన్ సెంటర్‌కు అనుమతిచ్చిందని, కోవిడ్ కారణంగా అది వినియోగంలోకి రాలేదన్నారు.
వచ్చే ఏడాది(2023) ఎంబార్కేషన్ సెంటర్‌ను పునరుద్ధరించేలా చేసి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచే హజ్ యాత్రకు చర్యలు చేపడతామని తెలిపారు. వైఎస్సార్ కడపలో హజ్ కమిటీ భవన నిర్మాణం దాదాపు 80 శాతం పూర్తయిందని, అలాగే విజయవాడ–గుంటూరు మధ్య హజ్ హౌస్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ను కోరతామని చెప్పారు. ఇందుకోసం గన్నవరం ఎయిర్‌పోర్టు – గుంటూరు మధ్య ఐదెకరాల భూమి కేటాయించి, నిధులు ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని గౌసల్ అజమ్ వివరించారు.
వచ్చే ఏడాది విజయవాడ నుంచే హజ్ యాత్ర
Published Wed, Sep 7 2022 4:50 AM | Last Updated on Thu, Mar 9 2023 3:54 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment