కొత్తగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మునిసిపల్ చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లు అందరికీ అభినందనలు. స్థానిక సంస్థల ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఎవరూ ప్రశ్నించలేని విధంగా, ఏకపక్షంగా తిరుగు లేని నమ్మకాన్ని ప్రజలు మనపై ఉంచారు. ఈ విజయంతో మన బాధ్యత మరింత పెరుగుతుందని అందరం గుర్తుంచుకోవాలి.
ప్రజలు మనల్ని ఎందుకు ఆశీర్వదిస్తున్నారో, మన నుంచి ఏం ఆశిస్తున్నారోమీలో ప్రతి ఒక్కరూ కూడా పూర్తి అవగాహనతోనే ఉంటారు. మనం పాలకులం కాదు.. మనం సేవకులం అని గుర్తెరగాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎదిగే కొద్దీ ఒదగాలి. మన దగ్గరకు ఎవరైనా అర్జీ తీసుకువచ్చినప్పుడు వారితో మనం మాట్లాడే తీరు, వారి పట్ల మనం చూపించే అభిమానం వారి మనసులో ఎప్పటికీ నిలబడిపోతుంది. – సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘మనం పాలకులం కాదు.. సేవకులం అని సదా గుర్తుంచుకోండి. అవినీతి, వివక్షకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వొద్దు. ప్రజలకు అవినీతి లేని పాలన అందించాలి. వివక్ష అన్నది ఎక్కడా ఉండకూడదు. మనకు ఓటు వేయని వారు అయినా సరే అర్హులైతే ప్రభుత్వ పథకాలు అందించాలి. ఈ రెండే మనకు రేపటి రోజున శ్రీరామరక్ష అవుతాయి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నూతన ప్రజా ప్రతినిధులకు ఉద్బోధించారు. పట్టణాలు, నగరాల్లో ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందిస్తామన్న భరోసా కల్పించడమే లక్ష్యం కావాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మునిసిపల్ చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్ల రెండు రోజుల సదస్సు విజయవాడలో గురువారం ముగిసింది. ఈ సందర్భంగా ముగింపు సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగిస్తూ ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడంపై వారికి దిశా నిర్దేశం చేశారు. పరిశుభ్రత, రక్షిత తాగు నీటి సరఫరాకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ప్రభుత్వం త్వరలో మధ్యతరగతి ప్రజలకు లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకు ప్లాట్లు అందిస్తుందని తెలిపారు. 22 నెలలుగా నవరత్నాల పాలన అందిస్తూ నేరుగా ఆర్థిక లబ్ధి చేకూర్చే పథకాల ద్వారా దాదాపు రూ.లక్ష కోట్లు ప్రజలకు వినమ్రంగా అందించామని వివరించారు. ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..
సామాజిక న్యాయం.. అక్కచెల్లెమ్మలకు పెద్దపీట
► ‘‘మొత్తం 87 చోట్ల ఎన్నికలు జరిగితే ఏలూరు కార్పొరేషన్‌లో కోర్టు స్టే ఇవ్వడంతో ఎన్నికల కౌంటింగ్ నిర్వహించలేదు. మిగిలిన 86 చోట్ల పదవుల్లో మునుపెన్నడూ లేని రీతిలో సామాజిక న్యాయాన్ని పాటించి చూపించ గలిగామని సగర్వంగా తెలియజేస్తున్నాను.
► ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చట్ట ప్రకారం 45 పదవులు ఇవ్వాల్సి ఉంటే ఏకంగా 67 పదవులు ఇచ్చాం. అంటే 78 శాతం పదవులు ఈ అణగారిన వర్గాలకే ఇవ్వడం గర్వకారణం. ఇక అక్కచెల్లెమ్మలకు చట్ట ప్రకారం 42 పదవులు ఇవ్వాల్సి ఉంటే ఏకంగా 52 పదవులు ఇచ్చామని సగర్వంగా చెబుతున్నాను. అంటే ఏకంగా 61 శాతం పదవులు అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం.
► మామూలుగా ఎన్నికలప్పుడు సామాజిక న్యాయం చేస్తామని, అక్కచెల్లెమ్మలకు న్యాయం చేస్తామని రకరకాల మాటలు చెబుతుంటారు. పార్టీ మేనిఫెస్టోలో కూడా తీసుకువస్తారు. కానీ ఎన్నికలు అయ్యాక అవన్నీ కూడా పక్కన పెట్టడం, అక్కచెల్లెమ్మలను పట్టించుకోకపోవడం, మేనిఫెస్టోలను చెత్తబుట్టలో వేయడం చూశాం. కానీ అందుకు భిన్నంగా ఇవాళ కార్పొరేషన్, మునిసిపల్ పదవుల్లో నిజాయితీగా సామాజిక న్యాయాన్ని చేశామని, అక్కచెల్లెమ్మలకు పెద్దపీట వేశామని సగర్వంగా చెబుతున్నాను.
భరోసా కల్పించాలి...
►ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, అధికారులను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఈ రెండు రోజులు మీకు ఎంతో ఉపయోగపడ్డాయని భావిస్తున్నాను. మీ సందేహాలు నివృత్తి చేసి ఉంటారని అనుకుంటున్నా.
►రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో 1.43 కోట్ల జనాభా.. అంటే రాష్ట్రంలో 30 శాతం జనాభా ఉంది. అంత జనాభాకు మీరు ప్రతినిధులుగా ఉన్నారనే విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. పట్టణాలు, నగరాల్లో అత్యుత్తమ జీవన ప్రమాణాలు అందుతాయన్న భరోసా మనం ప్రజలకు కల్పించాలి.
పరిశుభ్రత – తాగునీరు
► ఈ రోజు పరిశుభ్రతకు మనం చాలా ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇందుకోసం జూలై 8న కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. గతంలో ఎన్నడూ జరగని విధంగా ప్రతి వార్డుకు రెండు వాహనాల చొప్పున రాష్ట్రంలో ఏకంగా 8 వేల వాహనాలను కేటాయిస్తున్నాం.
► ప్రతి ఇంటికి రకరకాల చెత్తబుట్టలు ఇచ్చి ఆ చెత్తను ఎలా డిస్పోజ్ చేయాలో చెబుతాం. పరిశుభ్రత తరువాత అంతే ప్రాధాన్యత అంశం రక్షిత తాగు నీరు. రక్షిత తాగు నీరు ప్రతి ఇంటికి చేర్చాలి. ప్రతి మునిసిపాలిటీలోనూనీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేసే పనులు చేపడుతున్నాం.
► ఇప్పటికే 50 మునిసిపాలిటీలలో ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) ద్వారా పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన చోట్ల కూడా ఈ పనులను త్వరలోనే ప్రారంభిస్తాము.
సచివాలయాలపై సూచనలు ఇవ్వండి
► గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా 540 రకాల సేవలు అందిస్తున్నారు. ఆ వ్యవస్థను ఇంకా మెరుగు పరిచేందుకు నిరంతరాయంగా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నా.
► ఇంకా ఎక్కడైనా మెరుగ్గా చేయొచ్చని మీకు అనిపిస్తే సూచించండి. మీరు మీ సలహాలు, సూచనలు నేరుగా సీఎం ఆఫీసుకు తెలియజేసేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం.
రూ.లక్ష కోట్లు ప్రజలకు అందించాం
► మనందరి ప్రభుత్వం 22 నెలలుగా నవరత్నాల పాలన అందిస్తోంది. ఎక్కడా వివక్ష, లంచానికి తావు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రతిదీ అందించే కార్యక్రమం చేస్తున్నాం. ఈ 22 నెలల్లో ప్రజలకు నేరుగా ఆర్థిక లబ్ధిని చేకూర్చే పథకాల ద్వారా దాదాపు లక్ష కోట్ల రూపాయలు వినమ్రంగా ప్రజల చేతుల్లో ఉంచామని సగర్వంగా తెలియజేస్తున్నా.
►ఎక్కడా అవినీతి లేదు. వివక్ష లేదు. అర్హత ఉన్న వారందరికీ అందించాం. ప్రతి చోటా సోషల్ ఆడిటింగ్ చేసి జాబితాలు ప్రదర్శించాం. ఈ 22 నెలల్లో జరిగిన అభివృద్ధి మన కళ్ల ఎదుటే కనిపిస్తోంది.
నాడు–నేడు, ఆర్బీకేలు..
► శిథిలావస్థకు చేరిన స్కూళ్ల రూపురేఖలు మారుతున్నాయి. ‘నాడు–నేడు’తో ఆ మార్పులు మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మారబోతున్నాయి. ఇంకా శిథిలావస్థలో ఉన్న ఆస్పత్రుల రూపురేఖలు కూడా ‘నాడు–నేడు’తో పూర్తిగా మారబోతున్నాయి. అవన్నీ ఇప్పటికే మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి.
► వార్డు స్థాయిలో అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణం కూడా మీ కళ్లెదుటే కనిపి స్తోంది. గ్రామాల్లో రైతులకు ప్రతి అడుగులో అండగా నిల్చేలా, వారికి ఎంతో చేయూతనిచ్చేలా, రైతులు ఏ అవసరాలకూ ఊరు దాటి వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఊళ్లోనే అన్ని సదుపాయాలు అంటే విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు సేవలందించేందుకు రైతు భరోసా కేంద్రాలను స్థాపించాం. ఇవన్నీ మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి.
► ఈ వ్యవస్థలోకి మీరు రావడంతో ఇంకా మంచి జరుగుతుందని ఆశిస్తున్నా. దేవుని దయ మీ పట్ల, మన ప్రభుత్వం పట్ల సదా ఉండాలని, ప్రజలకు ఇంకా మంచి చేసే అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని కోరుతున్నా’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
► సదస్సులో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పాలక మండళ్ల సభ్యులు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, పురపాలక శాఖ కమిషనర్–డైరెక్టర్ నాయక్ పాల్గొన్నారు.
లే అవుట్లలో వసతులు
► చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పట్టణాల్లో పేదలకు రికార్డు స్థాయిలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశాం. మొత్తం 17 వేల లే అవుట్లలో యూఎల్‌బీ, యూడీఏ పరిధిలోనే 16 వేల లే అవుట్లు ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా వదిలేస్తే పెద్ద మురికి వాడలుగా మారిపోతాయి. అది ఒక ఆప్షన్.
► లేదూ... వాటిని పట్టించుకుంటాము అంటే.. దేశం మొత్తం మన వైపు చూసేలా కాలనీలను అభివృద్ధి చేయొచ్చు. అందమైన కాలనీలుగా మారతాయి. అక్కడ ఉన్న వారిని సంతోష పెట్టే విధంగా చేయొచ్చు. అది రెండో ఆప్షన్. ఈ రెండో ఆప్షన్ కోసం అందరూ కృషి చేయాలని కోరుతున్నా.
► ఆ కాలనీల్లో సీసీ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, భూగర్భ డ్రైనేజీ, పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు, భూగర్భ విద్యుత్ కేబుళ్లు, పచ్చదనం, స్మార్ట్ బస్ స్టాప్‌లు ఉంటాయి. సామాజిక మౌలిక సదుపాయాలు పూర్తిగా ఉంటాయి. తొలిసారిగా భూగర్భ కేబుళ్లు వేయబోతున్నాం. ఆ స్థాయిలో మనమంతా కలసికట్టుగా వాటిని అభివృద్ధి చేయబోతున్నాం.
మధ్యతరగతి వారికి ఇళ్ల స్థలాలు
► పట్టణ ప్రాంతాల్లో ఎంఐజీ అంటే మధ్య తరగతి వర్గాలకు ప్రభుత్వం లాభాపేక్ష లేకుండా ఎలాంటి లిటిగేషన్లు లేని స్థలాలను తక్కువ ధరకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఆ మేరకు జిల్లా కేంద్రాలు, పెద్ద మునిసిపాలిటీలలో ఒక్కో చోట 50 ఎకరాల నుంచి 150 ఎకరాల వరకు భూమిని సేకరించి, లాభాపేక్ష లేకుండా ప్లాటింగ్ చేసి, లీగల్ సమస్యలు లేకుండా పట్టాలు ఇస్తాం.
► ఇక్కడ కూడా మోడల్ లే అవుట్లు తయారవుతాయి. ఫుట్‌పాత్‌లు, సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, పార్కులు, వాకింగ్ ట్రాక్‌లు, భూగర్భ విద్యుత్ కేబుళ్లు, పచ్చదనం, స్మార్ట్ బస్టాండ్‌లు ఉంటాయి. సామాజిక మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. కుటుంబానికి ఒకటి చొప్పున ప్లాట్ ఇవ్వబోతున్నాం.
సే నో టు కరప్షన్
► ప్రతి గడప వద్దకూ ప్రభుత్వ సేవలందించే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ దేశంలోనే తొలిసారిగా మనందరి ప్రభుత్వం ప్రారంభించింది. ఇవి ఎలా పని చేస్తున్నాయో మీ అందరికీ తెలిసిందే. వలంటీర్లు ఎలా పని చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా వ్యవస్థలో మంచి జరగాలంటే అవినీతి అన్నది ఎక్కడా ఉండకూడదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అందుకే మీరు అందరూ ‘సే నో టు కరప్షన్’. అవినీతికి తావు లేకుండా చేయాలి. అలాగే వివక్ష ఉండకూడదు.
► మనకు ఓటు వేయని వారు అయినా సరే అర్హత ఉంటే వారికి ప్రభుత్వ పథకాలు అందించాలి. అవినీతి, వివక్ష ఉండకూడదు. ఈ రెండూ కచ్చితంగా పాటించాలి. మీరు బాధ్యతాయుతమైన స్థానాల్లోకి వెళ్తున్నారు కాబట్టి ఈ రెండూ గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రెండే మనకు రేపటి రోజున శ్రీరామరక్ష అవుతాయి.
చదవండి:
వాలంటీర్లకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..
‘ప్రభుత్వ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి’
Comments
Please login to add a commentAdd a comment