మీడియాతో షుకూర్, మసీవుల్లా ఖాన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 2019 హజ్ యాత్రకు వెళ్లాల్సిన యాత్రికుల సంఖ్య (కోటా)ను కేంద్ర హజ్ కమిటీ ప్రకటించిందని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ మసీవుల్లా ఖాన్, ప్రత్యేక అధికారి ఎస్‌ఎ షుకూర్ తెలిపారు. రాష్ట్రం నుంచి 4,169 మందికి హజ్‌యాత్రకు వెళ్లే అవకాశం దక్కిందని వెల్లడించారు. సోమవారం హజ్ కమిటీ కార్యాలయంలో 2019 హజ్ యాత్ర, యాత్రికుల ఎంపికకు సంబంధించిన వివరాలపై వారు విలేకరులతో మాట్లాడారు. హజ్ యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా 13,388 మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. కేంద్ర హజ్ కమిటీ కోటా ప్రకారం ఇందులో 4,169 మంది హజ్ యాత్రకు వెళ్లనున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే 70 ఏళ్లు పైబడిన కేటగిరీలో 484 మంది నేరుగా హజ్ యాత్రకు ఎంపికయ్యారని తెలిపారు. ఇక, మిగిలిన 12,884 మంది దరఖాస్తుదారుల్లో 3,685 మందికి డ్రా తీసి అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ముస్లిం జనాభా శాతం ప్రకారం ఈ మేర కోటా దక్కిందని వివరించారు.
12న నాంపల్లి హజ్ హౌస్‌లో ఎంపిక
ఈ నెల 10న రాష్ట్ర హజ్ కమిటీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఈ ఏడాది హజ్ యాత్రకు సంబంధిచిన ప్రణాళికలు రూపొందిస్తామని మసీవుల్లా ఖాన్, షుకూర్ తెలిపారు. ఈ నెల 12న హజ్ యాత్రికుల ఎంపిక నాంపల్లి హజ్ హౌస్‌లో ఉదయం 11 గంటల నుంచి ప్రారంభిస్తామని వెల్లడించారు. ఎలాంటి మోసాలు లేకుండా పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని వివరించారు. ఎవరైనా హజ్ యాత్రకు హజ్ కమిటీ ద్వారా తీసుకెళ్లతామని, డ్రాలో మీ పేరు వచ్చే విధంగా చేస్తామని చెబితే వారి మాటలు నమ్మొద్దని సూచించారు. ఎవరైనా ఇలా సంప్రదిస్తే తమకు సమాచారం అందించాలని వారు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment