Central Haj Committee
-
హజ్ యాత్రకు రాష్ట్రం నుంచి 3,685 మంది
సాక్షి, హైదరాబాద్: కంప్యూటర్ డ్రా పద్ధతిలో 2019 హజ్ యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా 3,685 మంది ఎంపికయ్యారని రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఎ.షుకూర్ తెలిపారు. అలాగే 70 ఏళ్ల వయసు పైబడిన వారిలో రిజర్వ్ కేటగిరీలో తెలంగాణ నుంచి 484 మంది హజ్ యాత్రకు నేరుగా ఎంపికయ్యారని పేర్కొన్నారు. శనివారం హజ్ యాత్రకు ఎంపిక ప్రక్రియను నాంపల్లి హజ్‌హౌస్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హజ్ కమిటీ ముంబై నుంచి ఆన్లైన్ ద్వారా ఏర్పాటు చేసిన కంప్యూటర్ డ్రాను ప్రత్యేక అధికారి బటన్ నొక్కి ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సౌదీఅరేబియా ప్రభుత్వం హజ్ యాత్రకు వెళ్లేందుకు దేశవ్యాప్తంగా 1.75 లక్షల మందికి అనుమతులు ఇచ్చిందన్నారు. ఇందులో కేంద్ర హజ్ కమిటీ 50 వేల మందిని తీసుకెళ్లే అవకాశం ప్రైవేట్ టూర్ ఆపరేటర్లకు.. మిగ తా 1.12 లక్షల మందిని తీసుకెళ్లే అవకాశం వివిధ రాష్ట్రాల హజ్ కమిటీలకు ఇచ్చిందన్నారు. తెలంగాణకు 4,169 మందికి యాత్రకు వెళ్లే కోటాను కేటాయించిందని తెలిపారు. 2019 హజ్ యాత్రకు హైదరాబాద్ నుంచి అత్యధికంగా 8,441 దరఖాస్తులు రాగా అత్యల్పంగా మహబూబాబాద్ జిల్లా నుంచి 4 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. వచ్చే నెల మొదటి వారంలో హజ్ యాత్ర తొలి నగదు కిస్తు రూ. 81 వేలు జమచేయాల్సి ఉంటుందన్నారు. జూలై 1 నుంచి ఆగస్టు 3 వరకు హజ్ యాత్ర కొనసాగుతుందన్నారు. హజ్ యాత్రకు రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా తీసుకెళ్తామని చేప్పే మధ్యవర్తులను సంప్రదించవద్దని హెచ్చరిం చారు. మరిన్ని వివరాల కోసం హజ్ కమిటీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని సూచించారు. -
హజ్‌యాత్రకు 4,169 మంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 2019 హజ్ యాత్రకు వెళ్లాల్సిన యాత్రికుల సంఖ్య (కోటా)ను కేంద్ర హజ్ కమిటీ ప్రకటించిందని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ మసీవుల్లా ఖాన్, ప్రత్యేక అధికారి ఎస్ఎ షుకూర్ తెలిపారు. రాష్ట్రం నుంచి 4,169 మందికి హజ్‌యాత్రకు వెళ్లే అవకాశం దక్కిందని వెల్లడించారు. సోమవారం హజ్ కమిటీ కార్యాలయంలో 2019 హజ్ యాత్ర, యాత్రికుల ఎంపికకు సంబంధించిన వివరాలపై వారు విలేకరులతో మాట్లాడారు. హజ్ యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా 13,388 మంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. కేంద్ర హజ్ కమిటీ కోటా ప్రకారం ఇందులో 4,169 మంది హజ్ యాత్రకు వెళ్లనున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే 70 ఏళ్లు పైబడిన కేటగిరీలో 484 మంది నేరుగా హజ్ యాత్రకు ఎంపికయ్యారని తెలిపారు. ఇక, మిగిలిన 12,884 మంది దరఖాస్తుదారుల్లో 3,685 మందికి డ్రా తీసి అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ముస్లిం జనాభా శాతం ప్రకారం ఈ మేర కోటా దక్కిందని వివరించారు. 12న నాంపల్లి హజ్ హౌస్‌లో ఎంపిక ఈ నెల 10న రాష్ట్ర హజ్ కమిటీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఈ ఏడాది హజ్ యాత్రకు సంబంధిచిన ప్రణాళికలు రూపొందిస్తామని మసీవుల్లా ఖాన్, షుకూర్ తెలిపారు. ఈ నెల 12న హజ్ యాత్రికుల ఎంపిక నాంపల్లి హజ్ హౌస్‌లో ఉదయం 11 గంటల నుంచి ప్రారంభిస్తామని వెల్లడించారు. ఎలాంటి మోసాలు లేకుండా పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని వివరించారు. ఎవరైనా హజ్ యాత్రకు హజ్ కమిటీ ద్వారా తీసుకెళ్లతామని, డ్రాలో మీ పేరు వచ్చే విధంగా చేస్తామని చెబితే వారి మాటలు నమ్మొద్దని సూచించారు. ఎవరైనా ఇలా సంప్రదిస్తే తమకు సమాచారం అందించాలని వారు వెల్లడించారు. -
హజ్ యాత్రకు 13 వేల దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: 2019 హజ్ యాత్రకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారంతో ముగిసింది. హజ్‌యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా 13 వేల దరఖాస్తులు అందాయని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మసీవుల్లాఖాన్ తెలిపారు. బుధవారం నాంపల్లి హజ్‌హౌస్‌లోని కమిటీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. హజ్ యాత్రకు గతేడాది కంటే ఈసారి 4 వేల దర ఖాస్తులు తక్కువగా అందాయన్నారు. 70 ఏళ్ల పైబడిన వారి కేటగిరీలో 416 దరఖాస్తులు అందాయని, వీరు కేంద్ర హజ్ కమిటీ నిబంధనల ప్రకారం నేరుగా హజ్ యాత్రకు ఎంపికైనట్లు తెలిపారు. మిగతా దరఖాస్తుదారులకు డ్రా పద్ధతిలో జనవరిలో కేంద్ర హజ్ కమిటీ ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తుందన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు ఇంకా హార్డ్ కాపీలు హజ్ కమిటీ కార్యాలయంలో జమచేయకపోతే అందించాలని సూచించారు. జనవరి నెలలో డ్రా పద్ధతిలో ఎంపికైన యాత్రికులు మొదటి కిస్తుగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. -
రెండోసారి హజ్ యాత్ర.. పెనుభారమే
సాక్షి, హైదరాబాద్: ఇకనుంచి రెండోసారి హజ్ లేదా ఉమ్రాను సందర్శించాలనుకునే వారికి ఆ యాత్రలు పెనుభారం కానున్నాయి. హజ్, ఉమ్రాలపై సౌదీ అరేబియా రూపొందించిన కొత్త నిబంధనలతో యాత్రికులపై రూ.35 వేలు అదనపు భారం పడుతోంది. సౌదీ రూపొందించిన కొత్త విధానం ప్రకారం రెండోసారి హజ్‌ను సందర్శించే వారు 2వేల రియాళ్లు చెల్లించాలి. గతేడాది రాష్ట్ర హజ్ కమిటీ నుంచి ఎంపికైన యాత్రికులు హజ్‌కు వెళ్లేందుకు రూ.2 లక్షలు చెల్లించారు. ఈ ఏడాది ఎంపికైన యాత్రికులకు అయ్యే ఖర్చులు రూ.2.14 లక్షలు కాగా అదనంగా రూ.35 వేలు కలిపి మొత్తం రూ.2.5 లక్షలు చెల్లించాల్సి ఉంది. హజ్ యాత్రకు సౌదీ అరేబియాకు వెళ్లడానికి విమానాల కంపెనీల గ్లోబల్ టెండర్ ప్రక్రియను ఈసారి కేంద్ర హజ్ కమిటీ నిర్వహించలేదు. దీంతో విమాన టికెట్‌కు ఒకొక్కరూ రూ.65వేలు చెల్లించాల్సి వస్తోంది. రూ.65 వేలల్లో యూజర్ డెవలప్మెంట్ ఫేర్ (యూడీఎఫ్) రూపంలో రూ.15 వేలు వసూలు చేస్తున్నారు. గతంలో యూడీఎఫ్ రూ.2 వేల నుంచి రూ.5 వేల లోపు ఉండేదని రాష్ట్ర హజ్ కమిటీ అధికారులు చెబుతున్నారు. ఇలా అటు సౌదీ సర్కార్, దేశంలోని ఎయిర్‌పోర్టులు కలిపి యూడీఎఫ్, ఇతర చార్జీల రూపంలో ప్రతి యాత్రికుడిపై రూ.50 వేల అదనపు భారాన్ని వేస్తున్నాయని.. దీంతో హజ్ యాత్ర భారంగా మారిపోయిందని వాపోతున్నారు. -
15 నుంచి హజ్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: హజ్ 2018 షెడ్యూల్‌ను కేంద్ర హజ్ కమిటీ విడుదల చేసిందని, ఈ నెల 15 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర కోసం దరఖాస్తుల పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఏ షుకూర్ తెలిపారు. హైదరాబాద్‌లోని నాంపల్లి హజ్‌హౌస్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాదికి కేంద్ర హజ్ కమిటీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. రాష్ట్ర కమిటీ కార్యాచరణ రూపొందించిందన్నారు. అన్ని జిల్లాల్లో ఒకే రోజు హజ్ దరఖాస్తుల పంపిణీకి ఏర్పాట్లు చేశామన్నారు. 15న డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చేతుల మీదుగా దరఖాస్తుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈసారి కేంద్ర హజ్ కమిటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించామన్నారు. దరఖాస్తు ఫారం పూర్తి చేసి.. రూ.300ల స్టేట్ బ్యాంక్ లేదా యూనియన్ బ్యాంక్ ద్వారా చలాన్ తీయాలన్నారు. దరఖాస్తుతో పాటు పాస్‌పోర్టు జిరాక్స్, బ్యాంక్ పాస్‌బుక్, ఆదార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్ జమచేయాలన్నారు. గ్రీన్, అజీజియా.. రెండు కేటగిరీలు ఉన్నాయని, దరఖాస్తులో కేటగిరీని నమోదు చేయాలని సూచించారు. గత మూడేళ్లకు ముందు హజ్ లేదా ఉమ్రాకు వెళ్లి వచ్చిన వారు తిరిగి హజ్ యాత్రికుడితో సహాయకుడిగా వెళ్తే యాత్రకయ్యే ఖర్చులతో పాటు అదనంగా 2 వేల సౌదీ రియాల్ జమ చేయాల్సి ఉంటుందన్నారు. కేంద్ర హజ్ షెడ్యూల్ ప్రకారం హజ్ యాత్రికుల ఎంపిక ప్రక్రియకు జనవరిలో డ్రా ఉంటుందన్నారు. జూలై 11 నుంచి హజ్ యాత్ర ప్రారంభమౌతుందన్నారు. హజ్ ఆరాధన 2019 ఆగస్టు 8న ఉంటుందన్నారు. హజ్ కొత్త పాలసీ విధివిధానాలు తేలియజేయడానికి నేడు అన్ని జిల్లాల కమిటీలతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. కొత్త హజ్ పాలసీపై అసంతృప్తి ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేంద్ర హజ్ కమిటీ విడుదల చేసిన హజ్ పాలసీపై ముస్లింలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. హజ్ యాత్రలో కేంద్రం జోక్యాన్ని ముస్లిం ధార్మిక సంస్థలు తప్పుపడుతున్నారు. హజ్ యాత్ర కోసం గత మూడేళ్లుగా దరఖాస్తు చేసుకున్నవారు నాల్గవసారి దరఖాస్తు చేసుకుంటే నేరుగా యాత్రకు అవకాశం ఉండేది. ఈసారి ఈ కేటగిరీని రద్దు చేయడంపై యాత్రికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇస్లామియా ధర్మశాస్తం ప్రకారం.. ఏ మహిళ కూడా ఒంటరిగా ప్రయాణం చేయకూడదని, దాన్ని పరిగణనలో తీసుకోకుండా కేంద్రం 45 ఏళ్ల వయస్సు పైబడిన మహిళలు ఒంటరిగా ప్రయాణం చేయవచ్చనడం సరికాదన్నారు. -
ఐఏఎస్‌కు ఉచిత శిక్షణ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో ఐఏఎస్ పరీక్ష ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ స్పెషల్ ఆఫీసర్ ఎస్ఏ షుకూర్ తెలిపారు. ముస్లిం వర్గానికి చెందిన డిగ్రీ, పీజీ విద్యార్థులు ఆన్లైన్ ద్వారా మే 10 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని మరో ఆరు కేంద్రాల్లో మే 28న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు జూలై 16, 17 తేదీల్లో ముంబైలోని కేంద్ర హజ్ కమిటీ మౌఖిక పరీక్ష నిర్వహిస్తుందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్ 5 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు.