
సాక్షి, హైదరాబాద్: 2019 హజ్ యాత్రకు ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారంతో ముగిసింది. హజ్‌యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా 13 వేల దరఖాస్తులు అందాయని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మసీవుల్లాఖాన్ తెలిపారు. బుధవారం నాంపల్లి హజ్‌హౌస్‌లోని కమిటీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. హజ్ యాత్రకు గతేడాది కంటే ఈసారి 4 వేల దర ఖాస్తులు తక్కువగా అందాయన్నారు. 70 ఏళ్ల పైబడిన వారి కేటగిరీలో 416 దరఖాస్తులు అందాయని, వీరు కేంద్ర హజ్ కమిటీ నిబంధనల ప్రకారం నేరుగా హజ్ యాత్రకు ఎంపికైనట్లు తెలిపారు.
మిగతా దరఖాస్తుదారులకు డ్రా పద్ధతిలో జనవరిలో కేంద్ర హజ్ కమిటీ ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తుందన్నారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు ఇంకా హార్డ్ కాపీలు హజ్ కమిటీ కార్యాలయంలో జమచేయకపోతే అందించాలని సూచించారు. జనవరి నెలలో డ్రా పద్ధతిలో ఎంపికైన యాత్రికులు మొదటి కిస్తుగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.