
సాక్షి, హైదరాబాద్: ఇకనుంచి రెండోసారి హజ్ లేదా ఉమ్రాను సందర్శించాలనుకునే వారికి ఆ యాత్రలు పెనుభారం కానున్నాయి. హజ్, ఉమ్రాలపై సౌదీ అరేబియా రూపొందించిన కొత్త నిబంధనలతో యాత్రికులపై రూ.35 వేలు అదనపు భారం పడుతోంది. సౌదీ రూపొందించిన కొత్త విధానం ప్రకారం రెండోసారి హజ్‌ను సందర్శించే వారు 2వేల రియాళ్లు చెల్లించాలి. గతేడాది రాష్ట్ర హజ్ కమిటీ నుంచి ఎంపికైన యాత్రికులు హజ్‌కు వెళ్లేందుకు రూ.2 లక్షలు చెల్లించారు.
ఈ ఏడాది ఎంపికైన యాత్రికులకు అయ్యే ఖర్చులు రూ.2.14 లక్షలు కాగా అదనంగా రూ.35 వేలు కలిపి మొత్తం రూ.2.5 లక్షలు చెల్లించాల్సి ఉంది. హజ్ యాత్రకు సౌదీ అరేబియాకు వెళ్లడానికి విమానాల కంపెనీల గ్లోబల్ టెండర్ ప్రక్రియను ఈసారి కేంద్ర హజ్ కమిటీ నిర్వహించలేదు. దీంతో విమాన టికెట్‌కు ఒకొక్కరూ రూ.65వేలు చెల్లించాల్సి వస్తోంది. రూ.65 వేలల్లో యూజర్ డెవలప్‌మెంట్ ఫేర్ (యూడీఎఫ్) రూపంలో రూ.15 వేలు వసూలు చేస్తున్నారు. గతంలో యూడీఎఫ్ రూ.2 వేల నుంచి రూ.5 వేల లోపు ఉండేదని రాష్ట్ర హజ్ కమిటీ అధికారులు చెబుతున్నారు.
ఇలా అటు సౌదీ సర్కార్, దేశంలోని ఎయిర్‌పోర్టులు కలిపి యూడీఎఫ్, ఇతర చార్జీల రూపంలో ప్రతి యాత్రికుడిపై రూ.50 వేల అదనపు భారాన్ని వేస్తున్నాయని.. దీంతో హజ్ యాత్ర భారంగా మారిపోయిందని వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment