సాక్షి, న్యూఢిల్లీ/చిత్తూరు కార్పొరేషన్ : కేంద్ర ప్రభుత్వ నిబంధనల వల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రకు వెళ్లేవారిపై పడే అధిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఉప ముఖ్యమంత్రి, మైనారిటీశాఖ మంత్రి అంజాద్ బాషా చెప్పారు. ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిశారు. అనంతరం అంజాద్ బాషా ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. హజ్ యాత్రికుల సమస్యపై పౌరవిమానయాన శాఖ మంత్రితో చర్చించామని, బుధవారం కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి స్మృతి ఇరానీతో సమావేశం అవుతామని తెలిపారు.
హైదరాబాద్, బెంగళూరులలోని ఎంబార్కేషన్ పాయింట్ల కన్నా విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి ధరలు అధికంగా ఉన్నాయని, ఇదే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. ఒక్కొక్కరికీ హైదరాబాద్ నుంచి రూ.3.05 లక్షలు, బెంగళూరు నుంచి రూ.3.04 లక్షలు ఉండగా.. విజయవాడ నంచి రూ.3,88,350 ఉందని తెలిపారు. ఒకవేళ ధర తగ్గించడం సాధ్యం కాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే అదనపు భారం భరిస్తుందని చెప్పారు.
ఈ నేపథ్యంలో ఎంబార్కేషన్ పాయింటును హైదరాబాద్ లేదా బెంగళూరుకు మార్చాలని మంత్రిని కోరామన్నారు. మైనారిటీల ఓట్ల కోసం హజ్ యాత్రికుల సమస్యను టీడీపీ రాజకీయం చేయడం తగదని ఆయన హితవు పలికారు. కేంద్ర మంత్రిని కలిసినవారిలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఏపీ హజ్ కమిటీ చైర్మన్ గౌస్‌లాజమ్, సభ్యులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment