Haj Committee
-
హజ్ యాత్రకు నమోదు చేసుకోండి : ఏపీ హజ్ కమిటీ చైర్మన్
సాక్షి, విజయవాడ : కేంద్ర మైనార్టీ వ్యహహారాల శాఖ వచ్చే ఏడాది(2024) హజ్ వెళ్లే యాత్రికుల కోసం గైడ్‌లైన్స్ విడుదల చేసినట్లు ఏపీ హజ్ కమిటీ చైర్మన్ గౌసల్ ఆజాం తెలిపారు. యాత్రికులు డిసెంబర్ 4 నుంచి 20 వరకు ఆన్ లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. జిల్లాల్లో ఉన్న హజ్ సొసైటీల్లో వాలంటీర్లు రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పారు. ‘అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 70 సంవత్సరాల వయసు వారు హజ్ యాత్రకు అర్హులు. రెండేళ్ల లోపల వయసున్న చిన్నారులకు విమాన ఛార్జీల్లో 10శాతం రాయితీ ఉంటుంది. 40 ఏళ్లు దాటిన ఒంటరి మహిళలు కూడా హజ్‌కి వెళ్ళవచ్చు. విజయవాడలో గతేడాది నుంచి ఎంబారికేషన్ పాయింట్ ఏర్పాటు చేయిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. విజయవాడ నుంచి వెళ్తున్న హజ్ యాత్రికులకు విమాన చార్జీల భారాన్ని తగ్గించేందుకు సీఎం జగన్ గతేడాది రూ. 14 కోట్లు విడుదల చేశారు’అని గౌసల్ ఆజాం తెలిపారు. ‘దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ యాత్రికుల కోసం ఏర్పాట్లు జరిగినట్టు మక్కాలో మాట్లాడుకున్నారు. మే 9 నుంచి జూన్ 20 వరకు హజ్ యాత్ర విడతల వారిగా జరుగుతుంది. యాత్రికులు ఏప్రిల్ 24కల్లా పాస్ పోర్టులు సబ్మిట్ చేయాలి. గతేడాది కంటే మరింత బాగా హజ్ యాత్ర జరగాలని సీఎం జగన్ సూచించారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆదేశించారు’ అని గౌసల్ వెల్లడించారు. ఇదీచదవండి..మిచౌంగ్ తుపాను హెచ్చరిక.. అప్డేట్స్ -
హజ్ యాత్రికులకు ఏపీ ప్రభుత్వ సహకారం
సాక్షి, న్యూఢిల్లీ/చిత్తూరు కార్పొరేషన్ : కేంద్ర ప్రభుత్వ నిబంధనల వల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రకు వెళ్లేవారిపై పడే అధిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఉప ముఖ్యమంత్రి, మైనారిటీశాఖ మంత్రి అంజాద్ బాషా చెప్పారు. ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను కలిశారు. అనంతరం అంజాద్ బాషా ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. హజ్ యాత్రికుల సమస్యపై పౌరవిమానయాన శాఖ మంత్రితో చర్చించామని, బుధవారం కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి స్మృతి ఇరానీతో సమావేశం అవుతామని తెలిపారు. హైదరాబాద్, బెంగళూరులలోని ఎంబార్కేషన్ పాయింట్ల కన్నా విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి ధరలు అధికంగా ఉన్నాయని, ఇదే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. ఒక్కొక్కరికీ హైదరాబాద్ నుంచి రూ.3.05 లక్షలు, బెంగళూరు నుంచి రూ.3.04 లక్షలు ఉండగా.. విజయవాడ నంచి రూ.3,88,350 ఉందని తెలిపారు. ఒకవేళ ధర తగ్గించడం సాధ్యం కాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే అదనపు భారం భరిస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎంబార్కేషన్ పాయింటును హైదరాబాద్ లేదా బెంగళూరుకు మార్చాలని మంత్రిని కోరామన్నారు. మైనారిటీల ఓట్ల కోసం హజ్ యాత్రికుల సమస్యను టీడీపీ రాజకీయం చేయడం తగదని ఆయన హితవు పలికారు. కేంద్ర మంత్రిని కలిసినవారిలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఏపీ హజ్ కమిటీ చైర్మన్ గౌస్‌లాజమ్, సభ్యులు ఉన్నారు. -
చోటా సన్మాన్.. బడా దావత్! ప్లేట్ బిర్యానీకి రూ.700? మరో విశేషం ఏంటంటే!
సాక్షి, సిటీబ్యూరో: ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. ధార్మిక సేవల కోసం వినియోగించాల్సిన సర్కారీ సొమ్ము పక్కదారి పడుతోంది. యాత్రికులకు ఉత్తమ సేవలు అందించినవారికి అవార్డుల పేరుతో హజ్ కమిటీ భారీగా నిధులను దుబారా చేసింది. ఆతిథులకు మెగా విందును ఏర్పాటు చేసి ఖజానాకు గండికొట్టింది. ప్లేట్ బిర్యానీకి ఏకంగా రూ.700 చెల్లించి భారీగా వెనకేసుకుంది. కేవలం 200 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించినట్లు చెప్పుకున్న కమిటీ.. బిల్లుల చెల్లింపుల వరకు వచ్చేసరికి ఈ సంఖ్యను 350 చేసేసింది. ఇలా ఏకంగా రూ.3.5 లక్షలను ఈ దావత్‌కు వెచ్చించింది. మరో విచిత్రమేమింటే.. ఈ ఆతిథ్యమిచ్చిన హోటల్ హజ్ కమిటీ చైర్మన్‌ది కావడం మరో విశేషం. హజ్ యాత్రికుల కోసం శిబిరం ఏర్పాటు చేసేందుకు ఏటా బడ్జెట్లో రూ.2 కోట్లను ప్రభుత్వం కేటాయిస్తోంది. ఈ నిధులకు అదనంగా చైర్మన్ పలుకుబడిని ఉపయోగించి మరో రూ.2 కోట్లను ప్రభు త్వం నుంచి రాబట్టారు. ఆర్థిక సంవత్సరం దగ్గర పడుతుండటంతో మంచినీళ్లలా నిధులను ఖర్చు చేస్తున్న హజ్ యంత్రాంగం.. లెక్కా పద్దు కూడా చూసుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. (చదవండి: NGRI Hyderabad: ఆ గనుల్లో బంగారం కంటే విలువైన లోహం) -
సీఎం వైఎస్ జగన్‌కు హజ్ పవిత్ర జలం అందజేత
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని హజ్ కమిటీ చైర్మన్, సభ్యులు, ఎమ్మెల్సీలు సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హజ్ పవిత్ర జలం (జమ్ జమ్ వాటర్)ను సీఎంకు అందజేశారు. హజ్ 2022 యాత్ర ముగిసిన సందర్భంగా పవిత్ర జలాన్ని ముఖ్యమంత్రికి అందజేసి, మైనారిటీలకు సంబంధించి పలు అంశాలను ప్రస్తావించారు. సీఎంను కలిసిన వారిలో హజ్ కమిటీ చైర్మన్ బీఎస్ గౌస్ లాజమ్, ఎమ్మెల్సీలు రుహుల్లా, ఇషాక్ బాషా, హజ్ కమిటీ సభ్యులు మునీర్ బాషా, ఇమ్రాన్, ఇబాదుల్లా, ఖాదర్, ముఫ్తిబాసిత్ తదితరులు ఉన్నారు. అన్ని సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించారు సీఎంను కలిసిన అనంతరం బీఎస్ గౌస్ లాజమ్ మాట్లాడుతూ కేంద్ర పౌరవిమానయాన శాఖతో సంప్రదించి ఏపీలో హజ్ టెర్మినల్ ఏర్పాటుకు కృషి చేయాలని, విజయవాడలో హజ్ హౌస్ నిర్మాణానికి ఆరు ఎకరాల భూమి కేటాయించాలని, వైఎస్సార్ జిల్లా కడపలో అసంపూర్తిగా నిలిచిపోయిన హజ్ హౌస్‌ను పూర్తి చేయాలని కోరామని తెలిపారు. హజ్ హౌస్ కార్యకలాపాల కోసం బడ్జెట్లో రూ.4.5 కోట్లు కేటాయించాలని, తద్వారా 2023 సంవత్సరంలో హజ్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని సీఎం దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. వీటన్నింటిని త్వరలోనే నెరవేరుస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. -
హజ్ యాత్ర–2022 షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: హజ్ యాత్ర–2022కు కేంద్ర హజ్ కమిటీ షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ ఏడాది 1,822 మందికి హజ్ యాత్రకు వెళ్లే అవకాశం దక్కిందని, టీకా రెండు డోసులు తీసుకున్న వారినే ఎంపిక చేసినట్లు రాష్ట్ర హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ అధికారి బి. షఫీవుల్లా తెలిపారు. కరోనా వల్ల ఈ ఏడాది యాత్రకు 65 ఏళ్లలోపు వారికే కేంద్ర హజ్ కమిటీ షరతులతో కూడిన అనుమతినిచ్చిందని పేర్కొన్నారు. జూన్ 17నుంచి జూలై 3వరకు యాత్ర ఉంటుందన్నారు. ఇప్పటికే ఎంపికైన యాత్రికుల నుంచి మొదటి వాయిదాగా రూ.2.1లక్షలు వసూలు చేశామని, కేంద్ర హజ్ కమిటీ ఆదేశాలతో రెండో వాయిదా వసూలు చేస్తామని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 3,500 మంది యాత్రికులుంటారని, ఈ ఏడాది రెండు రాష్ట్రాలవారూ హైదరాబాద్ ఎంబారికేషన్ పాయింట్ నుంచే వెళ్లనున్నారని చెప్పారు. హజ్ యాత్రికులను తీసుకెళ్లే అవకాశం ఈసారి సౌదీ ఎయిర్‌లైన్స్‌కు లభించిందని, ఎంపికైన యాత్రికులకు హజ్ శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నాయని వివరించారు. -
రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్‌గా మహ్మద్ సలీం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్‌గా మహ్మద్ సలీం ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్ హజ్‌హౌస్‌లో జరిగిన పాలక మండలి సభ్యుల సమావేశానంతరం.. సలీం చైర్మన్‌గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి షహనవాజ్ ఖాసిం ప్రకటించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ.. సలీంకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జాఫర్‌హుస్సేన్, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, వక్ఫ్‌బోర్డు చైర్మన్ మహ్మద్ మసీ ఉల్లాఖాన్ పాల్గొన్నారు. -
సూపర్‌స్టార్‌ను కలిసిన అబూబకర్
సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను ఇండియన్ హజ్ హౌజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబుబాకర్ కలిశారు. చెన్నైలో వీరి సమావేశం జరిగింది. భేటీ సందర్భంగా రజనీకాంత్‌ను శాలువాతో అబు బాకర్ సత్కరించారు. రజనీని మర్యాదపూర్వకంగానే కలిసినట్లుగా సమావేశం అనంతరం ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో, దేశంలో చోటుచేసుకుంటున్న ప్రస్తుత పరిణామాలపై చర్చించినట్లుగా తెలిపారు. చదవండి: శభాష్ మిత్రమా రజనీకాంత్: కమల్‌హాసన్ -
హజ్‌యాత్రకు నేటి నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: హజ్‌యాత్ర–2019కు వెళ్లాలనుకునేవారు ఈ నెల 18 నుంచి హజ్ కమిటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర హజ్‌కమిటీ ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ ఎస్ఏ షుకూర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది నుంచి దరఖాస్తుల స్వీకరణతోపాటు అన్ని ప్రక్రియలను ఆన్లైన్ ద్వారా చేపట్టినట్లు పేర్కొన్నారు. నవంబర్ 17వరకు దరఖాస్తు స్వీకరణ ఉంటుందన్నారు. పాస్‌పోర్టు గడువు 2018, నవంబర్ 17కు ముందు నుంచి 2020, జనవరి 31 వరకు ఉండాలన్నారు. దరఖాస్తు చేసుకున్నవారిని డ్రా పద్ధతిలో హజ్‌యాత్రకు ఎంపిక చేస్తారని, డిసెంబర్ చివరివారంలో డ్రా ఉంటుందన్నారు. ఆన్లైన్ దరఖాస్తులకు ఆధార్‌కార్డు తప్పనిసరన్నారు. దరఖాస్తుతోపాటు ఎస్బీఐ ద్వారా రూ.300 చెల్లించాలన్నారు. ఏమైనా సందేహాలుంటే 040 2329 8793 నంబర్ లేదా కేంద్ర హజ్ కమిటీ వెబ్సైట్ www.hajcommittee.gov.inద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. -
తీవ్ర వివాదాస్పదంగా మారిన యోగి నిర్ణయం
లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ కార్యాలయాలన్నింటికి కాషాయం రంగు పూయాలని గతంలో ఆయన అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే అది ఇప్పుడు మతపరమైన విమర్శలకు దారితీసింది. ప్రధాన కార్యాలయంతోసహా హజ్ కమిటీ ఆఫీసులకు కూడా అధికారులు కాషాయం రంగు పూయటంతో ఇస్లాం మత పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రే ఆయా కార్యాలయాల గోడల రంగును మార్చేయటంతో అది తీవ్ర స్థాయికి చేరుకుంది. ‘‘ఇది ముమ్మాటికీ ఖండించదగ్గ అంశం. సాధారణంగా ఈ రంగు రాజకీయాల కోసం వాడేది. ఇలాగే చూస్తూ ఊరుకుంటే రేపు హజ్ యాత్రికులను కూడా కాషాయపు దుస్తులు ధరించమంటారేమో?’’ అని లక్నో హజ్ కమిటీ అధికారి షాహర్ ఖాజీ మౌలానా అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హజ్ కమిటీ సభ్యులు హెచ్చరిస్తున్నారు. ఇక షియా పర్సనల్ లా బోర్డు సభ్యుడు మౌలానా యాసుబ్ అబ్బాస్ కూడా యోగి ప్రభుత్వ చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా రంగులు మారుస్తారా? అది కూడా మనోభావాలు దెబ్బతీసేలా.. ఇది మంచి పద్ధతి కాదు అంటూ అబ్బాస్ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం విమర్శలను చాలా తేలికగా తీసుకుంటోంది. మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి మోసిన్ రాజా.. సీఎం యోగి నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. కాషాయం రంగు శక్తి, వెలుగులకు చిహ్నమని... ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన పేర్కొంటున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో కార్యాలయాలకు అంతకు ముందు తెలుపు రంగు ఉండేది. కానీ, గతేడాది అక్టోబర్‌లో వాటన్నింటికి కాషాయం రంగు పూయాలంటూ యోగి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యాలయం లాల్ బహదూర్ శాస్త్రి భవన్‌తో మొదలుపెట్టి ఇప్పటిదాకా 100 స్కూళ్లకు, 50 ఆర్టీసీ బస్సులకు, పలు పోలీస్ స్టేషన్లకు కాషాయం రంగు అధికారులు అద్దేశారు. -
హక్కుల సాధనకు పోరాడుదాం
దూదేకుల యువగర్జన విజయవంతం కల్లూరు: దూదేకుల హక్కుల సాధనకు సంఘటితంగా పోరాడుదామని అనంతపురం జెడ్పీ చైర్మన్ చెమన్ అన్నారు. ఆదివారం దూదేకుల ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు డీపీ మస్తాన్ అధ్యక్షతన నగరంలోని రావూరి గార్డెన్లో రాష్ట్ర దూదేకుల యువగర్జన నిర్వహించారు. ఈ సందర్భంగా చెమన్ మాట్లాడుతూ దూదేకుల్లో ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధిక సంఖ్యలో తమ సామాజిక వర్గంలో చదువుకున్న మేధావులు, పారిశ్రామికవేత్తలు ఉన్నారన్నారు. అలాంటి వారిని గుర్తించి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని పార్టీలను డిమాండ్ చేశారు. దూదేకులను బీసీ బి గ్రూపు నుంచి తొలగించి బీసీ ఈ గ్రూపులో చేర్చి విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. దూదేకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగుల్‌మీరా మాట్లాడుతూ తమను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణచివేస్తున్నారన్నారు. హజ్‌కమిటీ, వక్ఫ్‌బోర్డు, మైనార్టీ కార్పొరేషన్లలో దూదేకులకు చైర్మన్ పదవులు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో దూదేకుల సంఘం యూత్ అధ్యక్షుడు పి. మస్తాన్, జిల్లా అధ్యక్షుడు నాయిబాబు, నూర్‌బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి దూదేకుల సలేం, సత్తార్ పాల్గొన్నారు. -
పాపం ఆ నాలుగు శాఖలదే..
సాక్షి, సిటీబ్యూరో: ఆ నాలుగు ప్రభుత్వ విభాగాల అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించి ఉంటే హజ్ హౌస్ వద్ద జరిగిన విద్యుదాఘాతంలో నలుగురు యువకులు బలయ్యేవారు కాదు. మైనార్టీ శాఖకు చెందిన హజ్ కమిటీ, జీహెచ్ఎంసీ, ట్రాన్స్‌కో, ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘోరానికి కారణంగా నిలిచాయి. హజ్ హౌస్ ప్రధాన ద్వారం పక్కన ఫుట్‌పాత్‌పై కనీసం 20 చిన్నా చితక దుకాణాలు వెలిశాయి. వీటికి అక్రమ విద్యుత్ కనె క్షన్లను తీసుకున్నారు. సమీపంలోని ఆర్టీసీ బస్టాప్‌లో ఏకంగా చోటు అనే వ్యక్తి హోటల్ పెట్టేశాడు. ఫుట్‌పాత్‌పై కనీసం ఒక్క అడుగు స్థలం కూడా లేకుండాపోయింది. ఈ షాప్‌ల వారు తమ దుకాణాలపై నుంచి వెళ్తున్న విద్యుత్ వైర్లు (సింగిల్‌ఫేజ్) నుంచి వైర్లు తగిలించి అక్రమంగా విద్యుత్‌ను వాడుతున్నారు. ఇది ట్రాన్స్‌కో అధికారులు పట్టించుకోలేదు. అప్పుడే విద్యుత్ చౌర్యాన్ని నివారించి ఉంటే దుర్ఘటన జరిగి ఉండేది కాదు. మరోపక్క ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకుని షాప్‌లు ఏర్పాటుచేస్తుంటే జీహెచ్ఎంసీ అధికారులు గుడ్లప్పగించి చూశారు. ఇక మైనార్టీ శాఖ.. ఇష్టానుసారం దుకాణాలు ఏర్పాటైనా అడ్డుకోలేదు. బస్టాప్‌లో హోటల్ ఏర్పాటైనా ఆర్టీసీ అధికారులు గమనించలేకపోయారు. ఇవన్నీ కలిసి నాలుగు ప్రాణాల్ని బలిగొన్నాయి. ప్రమాదానికి కారణమిదే.. బస్టాప్‌లో ఉన్న హోటల్‌కు అక్రమంగా విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారు. వీరు తగిలించిన రెండు వైర్లలో ఒకటి గాలిదుమారానికి కింద పడింది. అదే ఘటనకు కారణమైంది. ఈ తీగ ఫుట్‌పాత్‌కు ఆనుకుని వేసిన బారికేడ్లకు తగలడంతో విద్యుత్ సరఫరా జరిగింది. ఇదే హోటల్లో పనిచేస్తున్న ముంబయికి చెందిన రాజు, ఖయ్యూం త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఇద్దరు ఎటువంటి ఇనుప సామానులను పట్టుకోకుండా ధైర్యాన్ని కూడదీసుకుని పది నిముషాల పాటు అక్కడే ఉండి జాగ్రత్తగా బయటపడ్డారు. -
హజ్ యాత్ర ఆరంభం
సాక్షి, చెన్నై: ముస్లింల పవిత్ర క్షేత్రం మక్కా. ఇస్లాంలోని ఐదు సూత్రాల్లో చిట్ట చివరిదిగా హజ్ తీర్థ యాత్రను పరిగణిస్తారు. ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో కనీసం ఒక్క సారైనా ఈ యాత్ర చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు ప్రతి ఏటా బక్రీదు నెలలో హజ్‌యాత్ర ఆరంభం అవుతుంది. ప్రపంచ దేశాల్లోని ముస్లింలు ఈ యాత్రతో మక్కానగరం చేరుకుంటారు. బక్రీద్ పండుగ పర్వదినాన మక్కాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. జీవిత కాలంలో తాము చేసిన పాప కర్మల నుంచి విముక్తి కల్పించాలని అల్లాను వేడుకుంటారు. హజ్ యాత్ర : రాష్ట్రంలోని ముస్లింలను ప్రతి ఏటా హజ్ కమిటీ ద్వారా మక్కాకు పంపిస్తున్నారు. ప్రతి ఏటా ఈ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వం ప్రత్యేక రాయితీ, సౌకర్యాలను కల్పిస్తున్నది. హజ్ కమిటీ ద్వారా అర్హులైన వాళ్లను ఎంపిక చేస్తారు. ఈ ఏడాది వేలాది మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరందరిలో అదృష్ట వంతుల్ని లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. అదే సమయంలో గత ఏడాది కంటే, ఈ ఏడాది హజ్ యాత్ర సీట్లను కేంద్రం తగ్గించడం ముస్లింలను నిరాశ పరిచింది. రాష్ట్ర వాటాలో కోత వేయడాన్ని సీఎం జయలలిత సైతం ఖండించారు. గత ఏడాది కల్పించిన సీట్లతో పాటుగా, ఈ ఏడాది అదనపు సీట్లను రాబట్టుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈ ఏడాదికి గాను ఇప్పటి వరకు 3,300 మందిని హజ్ యాత్ర నిమిత్తం లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. రెండు రోజులుగా చెన్నైలోని హజ్ హౌస్‌లో హజ్ యాత్రకు వెళ్లే తొలి బృందానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సౌదీ పద్ధతులు, అక్కడ వ్యవహరించాల్సిన విధానాలను, కల్పిండిన సదుపాయాలు, సహకరించే అధికారుల గురించి విశదీకరించారు. సర్వం సిద్ధం : 450 మందితో కూడిన తొలి బృందాన్ని సౌదీకి పంపించేందుకు హజ్ హౌస్ వర్గాలు సర్వం సిద్ధం చేశాయి. పాస్ పోర్టులు, వీసా, తదితర వాటిని హాజీలకు అందజేశాయి. మధ్యాహ్న ప్రార్థన అనంతరం హజ్ హౌస్ నుంచి హాజీలను ప్రత్యేక బస్సుల్లో విమానాశ్రయానికి తరలించారు. కొందరు అయితే తమ సొంత వాహనాల్లో విమానాశ్రయానికి చేరుకున్నారు. హజ్ యాత్రకు వెళ్లే తమ వాళ్లకు వీడ్కోలు పలికేందుకు బంధువులు, ఆప్తులు పెద్ద ఎత్తున మీనంబాక్కంకు తరలి రావడంతో ఆ పరిసరాలు కిటకిటలాడాయి. దీంతో విమానాశ్రయం విదేశీ టెర్మినల్ పరిసరాల్లో గట్టి భద్రత కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో ప్రత్యేకంగా నాలుగో నెంబర్ మార్గాన్ని కేటాయించడంతో హాజీలందరూ తమ వాళ్ల నుంచి వీడ్కోలు తీసుకుని హజ్ యాత్రకు బయలు దేరి వెళ్లారు. రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి అబ్దుల్ రహీం, వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు తమిళ్ మగన్ హుస్సేన్, హజ్ కమిటీ కార్యవర్గం ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ విభాగం అధికారులు హాజీలకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ప్రయాణానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు ముగియడంతో సాయంత్రం విమానాశ్రయంలో జరిగిన ప్రార్థనాననంతరం హాజీలందరూ సౌదీ అరేబియాకు విమానంలో పయనమయ్యారు. తొలి బృందం పయనంతో మంగళవారం నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో చెన్నై నుంచి జట్లు జట్లుగా హజ్ యాత్రకు ఎంపిక చేసిన హాజీలు పయనం కానున్నారు. నెల రోజులకు పైగా హ జ్ యాత్రను ముగించుకునే ఈ తొలి బృందం అక్టోబరు 20వ తేదీ అర్ధరాత్రి చెన్నైకు చేరుకుంటుంది. కేంద్రం మరిన్ని సీట్లను కేటాయిస్తుందన్న ఆశాభావంతో మరికొంత మంది ముస్లింలు వేచి ఉన్నారు. కేంద్రం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న హజ్ కమిటీ వర్గాలు ఇప్పటికే కొందరిని వెయిటింగ్ లిస్టులో ఉంచాయి. సీట్ల సంఖ్య పెరిగిన పక్షంలో వెయిటింగ్ లిస్టులో ఉన్న వాళ్లకు హజ్ యాత్ర అవకాశం దక్కుతుంది.