పాపం ఆ నాలుగు శాఖలదే..
సాక్షి, సిటీబ్యూరో: ఆ నాలుగు ప్రభుత్వ విభాగాల అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించి ఉంటే హజ్ హౌస్ వద్ద జరిగిన విద్యుదాఘాతంలో నలుగురు యువకులు బలయ్యేవారు కాదు. మైనార్టీ శాఖకు చెందిన హజ్ కమిటీ, జీహెచ్‌ఎంసీ, ట్రాన్స్‌కో, ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘోరానికి కారణంగా నిలిచాయి. హజ్ హౌస్ ప్రధాన ద్వారం పక్కన ఫుట్‌పాత్‌పై కనీసం 20 చిన్నా చితక దుకాణాలు వెలిశాయి. వీటికి అక్రమ విద్యుత్ కనె క్షన్‌లను తీసుకున్నారు.
సమీపంలోని ఆర్టీసీ బస్టాప్‌లో ఏకంగా చోటు అనే వ్యక్తి హోటల్ పెట్టేశాడు. ఫుట్‌పాత్‌పై కనీసం ఒక్క అడుగు స్థలం కూడా లేకుండాపోయింది. ఈ షాప్‌ల వారు తమ దుకాణాలపై నుంచి వెళ్తున్న విద్యుత్ వైర్లు (సింగిల్‌ఫేజ్) నుంచి వైర్లు తగిలించి అక్రమంగా విద్యుత్‌ను వాడుతున్నారు. ఇది ట్రాన్స్‌కో అధికారులు పట్టించుకోలేదు. అప్పుడే విద్యుత్ చౌర్యాన్ని నివారించి ఉంటే దుర్ఘటన జరిగి ఉండేది కాదు.
మరోపక్క ఫుట్‌పాత్‌లను ఆక్రమించుకుని షాప్‌లు ఏర్పాటుచేస్తుంటే జీహెచ్‌ఎంసీ అధికారులు గుడ్లప్పగించి చూశారు. ఇక మైనార్టీ శాఖ.. ఇష్టానుసారం దుకాణాలు ఏర్పాటైనా అడ్డుకోలేదు. బస్టాప్‌లో హోటల్ ఏర్పాటైనా ఆర్టీసీ అధికారులు గమనించలేకపోయారు. ఇవన్నీ కలిసి నాలుగు ప్రాణాల్ని బలిగొన్నాయి.
ప్రమాదానికి కారణమిదే..
బస్టాప్‌లో ఉన్న హోటల్‌కు అక్రమంగా విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారు. వీరు తగిలించిన రెండు వైర్లలో ఒకటి గాలిదుమారానికి కింద పడింది. అదే ఘటనకు కారణమైంది. ఈ తీగ ఫుట్‌పాత్‌కు ఆనుకుని వేసిన బారికేడ్లకు తగలడంతో విద్యుత్ సరఫరా జరిగింది. ఇదే హోటల్‌లో పనిచేస్తున్న ముంబయికి చెందిన రాజు, ఖయ్యూం త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఇద్దరు ఎటువంటి ఇనుప సామానులను పట్టుకోకుండా ధైర్యాన్ని కూడదీసుకుని పది నిముషాల పాటు అక్కడే ఉండి జాగ్రత్తగా బయటపడ్డారు.