విలీనమేదీ? | GHMC Pending Greater RTC Merger Hyderabad | Sakshi
Sakshi News home page

విలీనమేదీ?

Published Wed, Jun 26 2019 8:33 AM | Last Updated on Wed, Jul 3 2019 11:23 AM

GHMC Pending Greater RTC Merger Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ప్రతిరోజు లక్షలాది మందికి రవాణా సదుపాయాన్నిఅందజేస్తున్న గ్రేటర్‌ ఆర్టీసీని జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు ఐదేళ్ల క్రితమే ప్రతిపాదనలు రూపొందించారు. నగరవాసులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలను అందజేస్తున్న జీహెచ్‌ఎంసీనే రవాణా సదుపాయాన్ని కూడా అందజేయాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. ముంబై తరహాలో ప్రజా రవాణాను నగరపాలక సంస్థ పరిధిలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేపట్టారు. ముంబై ప్రజా రవాణా వ్యవస్థను అధ్యయనం కూడా చేశారు. కానీ ఆ తర్వాత ఈ ప్రతిపాదన ఆచరణకు నోచుకోలేదు. అనంతరం ప్రతిఏటా ఆర్థిక సహాయం అందజేసి ఆదుకోవాలని ప్రతిపాదించారు. ఈ మేరకు రెండేళ్ల పాటు ఆపన్నహస్తం అందజేసిన జీహెచ్‌ఎంసీ ఆ తర్వాత చేతులెత్తేసింది. ఆర్టీసీ భారాన్ని మోయడం తమ వల్ల కాదని తేల్చేసింది. దీంతో అటు ఆర్థిక సహాయం లభించక, ఇటు జీహెచ్‌ఎంసీలో విలీనానికి నోచక ఆర్టీసీ పరిస్థితి ఏ క్షణంలో మునుగుతుందో తెలియని నావలా తయారైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు గ్రేటర్‌ ఆర్టీసీ నష్టాలు రూ.544 కోట్లకు చేరుకున్నాయి. అంతర్గత పనితీరును మెరుగుపర్చుకున్నప్పటికీ ఇంధనం, నిర్వహణ భారం మాత్రం ఆర్టీసీని దారుణంగా కుంగదీస్తోంది. 

రోజుకు రూ.కోటి నష్టం..  
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మొత్తం నష్టాలు రూ.928 కోట్లు కాగా.. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఆర్టీసీ నష్టాలే రూ.544 కోట్లు ఉన్నాయి. గతేడాది రూ.465 కోట్ల నష్టాలుంటే.. ఈ ఏడాది అదనంగా మరో రూ.79 కోట్లు పెరిగాయి. ఏరోజుకారోజు వచ్చి పడే నష్టాలు, నిర్వహణ ఖర్చులు, భారీగా పెరిగిన ఇంధన వ్యయం ఆర్టీసీని దెబ్బతీస్తున్నాయి. ఏటేటా పెరుగుతున్న నష్టాలు ఆ సంస్థ భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆర్టీసీ మొత్తంగా ఎదుర్కొనే నష్టాల్లో సగానికి పైగా ఒక్క హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి. 29 డిపోలు, 3,804 బస్సులతో  ప్రతిరోజు సుమారు 33 లక్షల మంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్న గ్రేటర్‌ ఆర్టీసీ రోజుకు సగటున కోటి రూపాయల నష్టాల్లో నడుస్తోంది. ప్రయాణికులపై టికెట్‌ చార్జీల రూపంలో ప్రతిరోజు రూ.3.68 కోట్ల  ఆదాయం లభిస్తుండగా, రూ.4.65 కోట్ల చొప్పున ఖర్చులు నమోదవుతున్నాయి. రోజుకు రూ.97 లక్షలకు పైగా నష్టాలు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఒక్క డీజిల్‌పైనే  రూ.62.57 కోట్లకు పైగా ఖర్చు చేశారు. సిబ్బందికి 16 శాతం చొప్పున రూ.68 కోట్ల మధ్యంతర భృతిని అందజేశారు. ఈ  ఏడాది గ్రేటర్‌ ఆర్టీసీకి రూ.79.83 కోట్ల ఆదాయం లభించినప్పటికీ బస్సుల నిర్వహణ, ఇంధనం, ఉద్యోగుల జీతభత్యాలు అన్నీ కలిపి ఆదాయానికి రెట్టింపు ఖర్చులతో నష్టాలు రూ.79 కోట్లకు పెరిగాయి. ‘ఈ ఏడాది అంతర్గత సామర్థ్యాన్ని 6 శాతం పెంచుకున్నప్పటికీ ఖర్చులు 17.40 శాతం పెరిగాయని’ ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. మరోవైపు భారీ నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్‌ ఆర్టీసీని  జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడం ఒక్కటే పరిష్కారమని, లాభనష్టాలతో ప్రమేయం లేకుండా  ప్రజలకు రవాణా సదుపాయాన్ని అందజేయాల్సిన బాధ్యత జీహెచ్‌ఎంసీపై ఉందని రవాణారంగ నిపుణులు పేర్కొంటున్నారు.  

మెట్రోతో డీలా...
ఆర్టీసీలో చార్జీలు పెరగలేదు. కొత్తగా ఒక్క బస్సును కూడా కొనుగోలు చేయలేదు. డ్రైవర్లను, కండక్టర్‌లను భర్తీ చేయలేదు. కానీ నష్టాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. సుమారు దశాబ్ద కాలంగా డొక్కు బస్సులే ప్రజలకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు నిధులు లేకపోవడంతో అద్దె ప్రాతిపదికన బస్సులను నడుపుతున్నారు. ఏ ఒక్క అంశంలోనూ ఆర్టీసీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. అంతర్జాతీయ స్థాయికి తగ్గట్లుగా ప్రజా రవాణా సదుపాయాలు ఉండాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఏసీ బస్సులు తెల్ల ఏనుగులుగా మారాయి. మెట్రో రైలు అందుబాటులోకి రావడంతో ఏసీ బస్సులపైన నష్టాలు మరింత పెరిగాయి. ఎల్‌బీనగర్‌–మియాపూర్‌–బీహెచ్‌ఈఎల్, సికింద్రాబాద్‌–హైటెక్‌ సిటీ తదితర మార్గాల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీ బాగా పడిపోయింది. దీంతో ఆ రూట్లలో తిరిగే  సుమారు 30 బస్సులను ఇతర మార్గాల్లోకి మళ్లించారు. వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు అద్దె ప్రాతిపదికన నడుపుతున్న ఎలక్ట్రికల్‌ ఏసీ బస్సులు కూడా నష్టాలనే మిగిలిస్తున్నాయి. ఇక హైటెక్‌సిటీకి మెట్రో రైలు అందుబాటులోకి రావడంతో ఐటీ కారిడార్‌ ఉద్యోగులు చాలా వరకు ఆర్టీసీకి దూరమయ్యారు. హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్‌ తదితర ప్రాంతాల్లోని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టిన మెట్రో లగ్జరీ ఓల్వో బస్సులు సైతం వరుస నష్టాలనే చవి చూస్తున్నాయి. మొత్తం 163 ఏసీ  బస్సులుంటే వాటిపైన నెలకు రూ.2.44 కోట్ల చొప్పున గత నాలుగేళ్లలో సుమారు రూ.117.36 కోట్ల నష్టాలు వచ్చినట్లు అంచనా. 

ఇంధన భారం...  
సిటీ బస్సులు రోజుకు 9.7లక్షల కిలోమీటర్ల మేర తిరుగుతున్నాయి. 42 వేల ట్రిప్పుల్లో ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. నగరంలో వాహనాల రద్దీ, ఎక్కువ సేపు బస్సులను ఐడలింగ్‌లో ఉంచడం, సగానికి పైగా డొక్కు బస్సులే కావడం వల్ల  గ్రేటర్‌ ఆర్టీసీలో డీజిల్‌ వినియోగం సగటున ఒక లీటర్‌కు 4 కిలోమీటర్‌లే ఉంటోంది. ఏసీ బస్సులు ఒక లీటర్‌కు 2.5 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్లు, మిగతా వాటికి 4 కిలోమీటర్ల చొప్పున ఖర్చవుతోంది. మొత్తంగా సిటీ బస్సుల కోసం ప్రతిరోజు 2.19 లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగిస్తున్నారు. ఈ ఏడాది ఒక్క డీజిల్‌పైనే రూ.62.57 కోట్లు ఖర్చు కావడం గమనార్హం. 

ఏదీ సాయం?  
నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న గ్రేటర్‌ ఆర్టీసీని నగరపాలక సంస్థలో విలీనం చేయాలని మొదట ప్రతిపాదించారు. ఈ మేరకు అప్పట్లో మంత్రుల బృందం ముంబైలో పర్యటించి వచ్చింది. అక్కడి సదుపాయాలు, నిర్వహణ, వ్యయం తదితర అంశాలపై అధ్యయనం చేసింది. కానీ ఆ ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు. ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ నుంచి ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు ప్రభుత్వం జీవోను కూడా వెలువరించింది. దీంతో 2015 నుంచి రెండేళ్ల పాటు రూ.336 కోట్ల సహాయాన్ని అందజేశారు. అప్పట్లో ఆర్టీసీకి పెద్ద ఊరట లభించింది. కానీ ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ చేతులెత్తేయడంతో ఆర్టీసీ నష్టాల గాథ మళ్లీ మొదటికొచ్చింది. ‘ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం సాయం అందజేస్తే ఇప్పటి వరకు కనీసం రూ.900 కోట్ల మేర ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సహాయమే అందితే ఆర్టీసీ లాభాల్లో పరుగులు తీస్తుంది’ అని  ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement