జీహెచ్‌ఎంసీ నెత్తిన ఆర్టీసీ గుదిబండ.. | rtc is very burden to ghmc | Sakshi
Sakshi News home page

జీహెచ్‌ఎంసీ నెత్తిన ఆర్టీసీ గుదిబండ..

Published Fri, Aug 19 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM

జీహెచ్‌ఎంసీ నెత్తిన ఆర్టీసీ గుదిబండ..

జీహెచ్‌ఎంసీ నెత్తిన ఆర్టీసీ గుదిబండ..

సాక్షి, సిటీబ్యూరో: పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో ఉన్న జీహెచ్‌ఎంసీకి ఆర్టీసీ గుదిబండగా మారింది. బస్సులన్నీ ఫుల్‌ ఆక్యుపెన్సీతో ఉన్నా ఎప్పుడూ నష్టాలే చూపే ఆర్టీసీని గట్టెక్కించేందుకు.. ఆర్టీసీకి కలిగే నష్టాన్ని జీహెచ్‌ఎంసీ భరించాల్సిందిగా సీఎం ఆదేశించడంతో ఆ సంస్థ నష్టాలు జీహెఎంసీని ముంచుతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు ఏటా వందల కోట్లు ఆర్టీసీకి చెల్లిస్తుండడంతో జీహెచ్‌ఎంసీ కోలుకోలేని విధంగా దెబ్బతింటోంది. గతంలో జరిగిన ఓ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రేటర్‌లో ఆర్టీసీకి ఏర్పడ్డ నష్టాన్ని జీహెచ్ఎంసీ నిధులతో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

ఆ మేరకు జీహెచ్‌ఎంసీ.. ఆర్టీసీకి చెల్లింపులు చేస్తున్నప్పటికీ, ప్రయాణికులకు రవాణా సదుపాయాలు మెరుగయ్యాయా.. అంటే లేనేలేదు. అటు సిటీ ప్రయాణికులకు ఇబ్బందులు తొలగకుండా.. ఇటు జీహెచ్‌ఎంసీ ఖజానాకు ఏర్పడుతున్న లోటుతో పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. సీఎం హామీ మేరకు జీహెచ్‌ఎంసీ ఇప్పటికే ఆర్టీసీకి రూ. 306 కోట్లు చెల్లించింది. ఇందులో 2015–16కు రూ.170 కోట్లు చెల్లించింది. 2016–17కు రూ.198 కోట్లు చెల్లించాలనడంతో ఒకేసారి అంత మొత్తం చెల్లించలేక వాయిదా పద్ధతిలో చెల్లిస్తున్నారు. ఈ మొత్తంలో ఇంకా రూ. 62 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇదిలా ఉండగానే మరో రూ.290 కోట్లు చెల్లించాల్సిందిగా ఆర్టీసీ నుంచి ఇటీవల లేఖ అందింది. దీంతో ఏం చేయాలో పాలుపోక జీహెచ్‌ఎంసీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

మెరుగుపడని సదుపాయాలు..
జీహెచ్‌ఎంసీ నుంచి అందిన నిధులతో ఆర్టీసీ మెరుగుపడిన దాఖలాల్లేవు. ఆ నిధులతో ఏం చేస్తున్నారో జీహెచ్‌ఎంసీకీ తెలియదు. దానిపై ఎలాంటి అజమాయిషీ లేదు. జీహెచ్‌ఎంసీ నుంచి ఆర్టీసీకి నిధులివ్వడమే కాక ఆర్టీసీ బోర్డులో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను డైరెక్టర్‌గా నియమిస్తే ఖర్చుల గురించి తెలియడంతో పాటు, బస్సులపై, బస్‌షెల్టర్లలో ప్రకటనల పన్నుల వంటి వాటిద్వారా ఆర్టీసీ, జీహెచ్‌ఎంసీ రెండింటి ఆదాయాన్ని కూడా పెంచుకునే వెసులుబాటు ఉంటుందని భావించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను బోర్డులో డైరెక్టర్‌గా నియమించినప్పటికీ, ఎలాంటి అజమాయిషీ లేదు. నష్టాల పేరిట కోట్లు చెల్లించాలంటూ ఆర్టీసీ లేఖలు రాయడం.. జీహెచ్‌ఎంసీ చెల్లించడం పరిపాటిగా మారింది.

ఇప్పటికే వివిధ కారణాలతో దివాళా బాటలో ఉన్న జీహెచ్‌ఎంసీకి ఆర్టీసీ భారం మోయలేని గుదిబండగా మారింది. ప్రభుత్వం ఈ అంశంలో తగిన చర్యలు తీసుకుని జీహెచ్‌ఎంసీని గట్టెక్కించాల్సి ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. లేకుంటే జీహెచ్‌ఎంసీ సైతం అప్పుల పాలవక తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రయాణికులకు అవసరమైన బస్‌షెల్టర్ల నిర్మాణం బాధ్యత సైతం జీహెచ్‌ఎంసీ పైనే ఉంది. ఈ పనిని ఆర్టీసీకి అప్పగిస్తే ప్రయాణికుల అవసరాల కనుగుణంగా షెల్టర్లను ఏర్పాటు చేయడమే కాక వచ్చే ఆదాయాన్ని సైతం ఆర్టీసీయే పొందవచ్చు. కానీ అలా జరగడం లేదు.

లోటు బాటలో జీహెచ్‌ఎంసీ
2015–16 ఆర్థిక సంవత్సరానికి పాలకమండలి లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.130 కోట్లు రాలేదు. 14వ ఆర్థిక సంఘం నుంచి మొదటి సంవత్సరం రావాల్సిన రూ.200 కోట్లు వచ్చే అవకాశం లేకుండా పోయింది.

►  2014–15లో దాదాపు రూ. 450 కోట్ల గ్రాంట్లు అందగా, ప్రస్తుతం రూ.40 కోట్లకు పరిమితమైంది.
►    గ్రేటర్‌లో రూ. 1200 లోపు ఆస్తిపన్ను వారికి ప్రభుత్వం రాయితీనివ్వడం, నిర్ణీత వ్యవధిలోగా ఆస్తిపన్ను చెల్లించిన వారికి  రాయితీ నివ్వడం వంటి వాటితో దాదాపు రూ. 100 కోట్ల రాబడి తగ్గింది.   జీతాల పెంపు వల్ల రూ. 180 కోట్ల అదనపు భారం పడింది.
►    మోటారు వాహన పన్ను వాటాగా జీహెచ్‌ఎంసీకి ఏటా రూ.80 కోట్లు రావాల్సి ఉండగా, కేవలం రూ. 50 లక్షలతో చేతులు దులుపుకుంటున్నారు.
►    శివారు ప్రాంతాలకు తాగునీరు, డ్రైనేజీ సదుపాయాల కోసమని ఆస్తిపన్నులో 15 శాతం జలమండలికి చెల్లిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో చేపట్టే ఈ పనులకు 70 శాతం స్థానికులు భరిస్తుండగా, మిగతా 30 శాతం నిధులను జీహెచ్‌ఎంసీయే వెచ్చిస్తోంది. ఈ నిధులు వెచ్చించినప్పుడు ఆస్తిపన్నులో 15 శాతం చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నప్పటికీ, ప్రభుత్వ ఆదేశాల మేరకు చెల్లించక తప్పని పరిస్థితి.
►   ‘స్చచ్ఛ హైదరాబాద్‌’ కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులు చెత్త తరలించేందుకు 2 వేల ఆటో టిప్పర్లు కొన్నారు. వాటి కోసం ప్రతినెలా కోటి రూపాయల  బ్యాంక్‌ ఈఎంఐని జీహెచ్‌ఎంసీయే చెల్లిస్తోంది.
►    జీహెచ్‌ఎంసీ గత ఏడాది కంటే ఈ సంవత్సరం ఇప్పటిదాకా రూ.122 కోట్లు ఆస్తిపన్ను అదనంగా వసూలు చేసినా, ట్రేడ్‌ లైసెన్సుల ఫీజులు ఏడాది లక్ష్యాన్ని ఇప్పటికే అధిగమించినా ఖజానా లోటులోనే ఉంది.
►    సిబ్బంది జీతభత్యాలు, పెన్షన్‌ తదితర వాటికోసం జీహెచ్‌ఎంసీ ప్రతినెలా దాదాపు రూ. 100 కోట్ల చెల్లిస్తోంది. ఖజానాలో మిగులు నిధులు రూ. 50 కోట్లు కూడా లేవు. అంటే.. జీతాలు చెల్లించేందుకైనా ప్రతినెలా వివిధ మార్గాల ద్వారా వంద కోట్లు ఖజానాకు చేరాలి. లేదంటే అప్పులు తప్పవు. ఇది ఎంతో దూరం లేదని జీహెచ్‌ఎంసీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement