రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అధునాతన ఇంటర్‌సిటీ బస్టాండ్ ఏర్పాటు కానుంది. 21 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొత్తపేట పండ్ల మార్కెట్ స్థలంలో బస్టాండ్ ప్రాంగణం, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్–3 డిపోలను నిర్మించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించి నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించనుంది. మెట్రోరైల్ స్టేషన్‌తో అనుసంధానిస్తూ నిర్మించే ఈ ప్రాంగణం విజయవాడవైపు రాకపోకలు సాగించే జిల్లా బస్సులతోపాటు దిల్‌సుఖ్‌నగర్ మీదుగా ప్రయాణించే సిటీ బస్సులకు కూడా కేంద్రంగా మారనుంది. నగరంలో ఇప్పటికే ఉన్న ఎంజీబీఎస్, సికింద్రాబాద్‌లోని జేబీఎస్ బస్టాండ్ల తర్వాత ఇది మరో పెద్ద బస్టాండ్‌గా ఏర్పడనుంది. వాణిజ్యపరంగా కీలక ప్రాంతం కావడంతో కొత్తపేటలో బస్టాండ్‌ను వాణిజ్య హంగులతో నిర్మిస్తే ఆర్టీసీకి పెద్ద ఆదాయ వనరుగా మారనుంది. అయితే ఇది భారీ ఖర్చుతో కూడుకోవడం, ఆర్టీసీకి అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో ప్రభుత్వం సహకరిస్తేనే ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. కొత్త బస్టాండ్ వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉండటం, దిల్‌సుఖ్‌నగర్ ట్రాఫిక్ సమస్యను తగ్గించే ప్రాజెక్టు కావడంతో ప్రభుత్వం కూడా ఇందుకు సహకరిస్తుందన్న ఆశతో ఆర్టీసీ ఉంది.
– సాక్షి, హైదరాబాద్
కొత్తపేట మార్కెట్ తరలింపుతో...
కొత్తపేటలోని పండ్ల మార్కెట్‌కు నిత్యం వందల సంఖ్యలో లారీలు వస్తుండటంతో ఆ ప్రాంతంలో తరచూ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. వాణిజ్యపరంగా కీలక ప్రాంతం కావడంతో షాపింగ్ మాల్స్, విద్యాసంస్థలు, చిరువ్యాపారాలు అక్కడ అధికం. కొత్తపేట పరిసరాల్లో వందల సంఖ్యలో కాలనీలు ఉండటం, గత పదేళ్లలో అక్కడ భారీగా అపార్ట్‌మెంట్లు వెలియడంతో జనాభా కూడా పెరిగి రోడ్లపై వాహనాల సంఖ్య పెరిగిపోయింది. వెరసి కీలక సమయాల్లో గంటల తరబడి ట్రాఫిక్‌జాం నెలకొంటోంది. మెట్రోరైలు అందుబాటులోకి వచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని కొత్తపేట పండ్ల మార్కెట్‌ను అక్కడి నుంచి తరలించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఔటర్ రింగురోడ్డుకు చేరువగా ఉన్న కోహెడలో ఇందుకు స్థలాన్ని సేకరించింది. త్వరలో మార్కెట్ అక్కడికి మారనుంది.
మార్కెట్ తరలింపుతో కొత్తపేటలో 21 ఎకరాల స్థలం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన రహదారిపై బస్టాండ్ ఉంది. విజయవాడ వైపు వెళ్లే బస్సులతోపాటు సిటీ బస్సులు అక్కడ ఆగుతాయి. ఆ పక్కనే దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్–3 డిపోలున్నాయి. వెరసి ఆ రోడ్డు చిక్కుముడిలా మారింది. దీంతో ఆర్టీసీ ప్రాంగణాలను కొత్తపేట మార్కెట్ స్థలంలోకి తరలించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. విజయవాడ వైపు నిత్యం వందలాదిగా వచ్చే బస్సులను కొత్తపేట బస్టాండ్ వరకే పరిమితం చేస్తే ఎంజీబీఎస్‌పైనా భారం తగ్గుతుందని ఆర్టీసీ భావిస్తోంది. కరీంనగర్, ఆదిలాబాద్, సిద్దిపేట, నిజామాబాద్‌ల వైపు నుంచి వచ్చే బస్సుల్లో మూడొంతులను సికింద్రాబాద్‌లోని జేబీఎస్‌కే పరిమితం చేయడం వల్ల ట్రాఫిక్ తగ్గిందని, ఇదే పద్ధతిని కొత్తపేట బస్టాండ్ వద్ద అమలు చేయాలనుకుంటోంది.
ఆర్టీసీకి ఆదాయ వనరు...
దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతం వాణిజ్యపరంగా కీలకమైంది. ఇక్కడ ఆర్టీసీ షాపింగ్ మాల్ నిర్మిస్తే ఎంతో ఆదాయం సమకూరుతుంది. మల్టీప్లెక్స్‌లు, గేమింగ్ జోన్, రెస్టారెంట్ల వంటివి ఏర్పాటు చేయడం ద్వారా సొంతంగా ఆదాయాన్ని ఆర్జించ వచ్చని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు దిల్‌సుఖ్‌నగర్ ప్రధాన రహదారిపై 8 ఎకరాల్లో ఉన్న బస్టాండ్, రెండు డిపోలను తొలగించి ఆ స్థలంలో భారీ మల్టీలెవల్ పార్కింగ్ టవర్ నిర్మించాలని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. కొత్తపేట మార్కెట్ స్థలాన్ని ఆర్టీసీకి కేటాయిస్తే, ఆర్టీసీ తన స్థలాన్ని జీహెచ్‌ఎంసీకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. వీటన్నింటిపై నిర్ణయం తీసుకునేందుకు త్వరలో ఆర్టీసీ, మార్కెటింగ్‌శాఖ, జీహెచ్‌ఎంసీ, పురపాలన, పట్టణాభివృద్ధిశాఖల ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment