Urban Development Department
-
అరవింద్ కుమార్‌కు ‘విపత్తు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌ను ప్రభుత్వం రెవెన్యూ శాఖ పరిధిలోని విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దాన కిశోర్‌ను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా స్థానచలనం కల్పించింది. కీలకమైన హెచ్ఎండీఏ కమిషనర్, పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ పదవుల అదనపు బాధ్యతల నుంచి సైతం అరవింద్‌కుమార్‌ను తప్పించింది. ఆ రెండు పోస్టుల అదనపు బాధ్యతలనూ దానకిశోర్కే అప్పగించింది. ఈ మేరకు రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో లీజుపై అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) అప్పగింతపై నిర్వహించిన టెండర్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయని అప్పట్లో రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై హెచ్ఎండీఏ కమిషనర్‌గా అరవింద్ కుమార్ స్పందిస్తూ రేవంత్‌రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. ఈ పరిణామాల నేపథ్యంలో అరవింద్‌కుమార్‌ను అప్రధానమైన విపత్తుల నిర్వహణ విభాగానికి బదిలీ చేయడం గమనార్హం. గత ప్రభుత్వంలో సీఎం కార్యదర్శిగా వ్యవహరించిన రాహుల్ బొజ్జాను సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఎస్సీల అభివృద్ధి శాఖ కార్యదర్శి, కమిషనర్‌గా అదనపు బాధ్యతల్లో ఆయన్ను కొనసాగించింది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణను తప్పించి ఆమెను స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు బదిలీ చేసింది. ఆమె స్థానంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంను విద్యాశాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. గత ప్రభుత్వంలో అప్రాధాన్య పోస్టుల్లో ఉన్న వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ క్రిస్ట్రీనా జెడ్.చొంగ్తును కీలకమైన వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమించడం విశేషం. -
రూపు మారిన పురాలు
సాక్షి, హైదరాబాద్: తొమ్మిదేళ్లలో తెలంగాణలోని పట్టణాల అభివృద్ధిలో గణనీయమైన మార్పు వచ్చిందని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. పురపాలక శాఖ ద్వారా రూ.1.21 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో 70% పట్టణాల నుంచేనని, ఈ నేపథ్యంలో పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కోసం అప్పులు తెచ్చినట్లు తెలిపారు. మౌలిక వసతుల కోసం తెచ్చే అప్పులు భవి ష్యత్తు పెట్టుబడేనని ఆయన పేర్కొన్నారు. బుధవారం మెట్రోరైల్ భవన్లో జరిగిన కార్యక్రమంలో తొమ్మిదేళ్లలో పురపాలక శాఖ అభివృద్ధి నివేదిక, ఎంఏయూడీ వార్షిక నివేదికను మంత్రి విడుదల చేశారు. పట్టణాల అభివృద్ధిపై 2014 మొదలుకుని ప్రతి ఏటా ప్రగతి నివేదికను విడుదల చేస్తున్నామని, ఈసారి దశాబ్ది నివేదిక పేరిట 2014 నుంచి సాధించిన ప్రగతిని అందులో పొందుపరిచినట్లు తెలిపారు. గత పదేళ్లలో 462 శాతం ఎక్కువ వ్యయం 2004 నుంచి 2014 వరకు పట్టణాల్లో మౌలిక వసతుల కోసం చేసిన రూ.26,211.50 కోట్ల ఖర్చుతో పోలిస్తే.. గత పదేళ్లలో 462 శాతం ఎక్కువ వెచ్చించామన్నారు. ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.1,21,294 కోట్లలో రూ. 1,11,360 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కాగా, కేవలం రూ.9,934 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వ నిధులని తెలిపారు. అన్ని రంగాలలో గతంలో కంటే అనేక రెట్లు ఎక్కువ ఖర్చు చేశామని, మౌలిక వసతుల కల్పనలో గణనీయమైన వృద్ధి సాధించామని, ఇందులో భాగంగానే 26 మున్సిపాలిటీలకు కేంద్రం అవార్డులు ఇచ్చిందని చెప్పారు. అధిక శాతం జీహెచ్ఎంసీ పరిధిలోనే.. పదేళ్లలో పట్టణాల్లో మౌలిక సదుపాయాల కోసం చేసిన వేల కోట్ల వ్యయంలో అధిక భాగం జీహెచ్ఎంసీ పరిధిలోనే జరిగిందని కేటీఆర్ వివరించారు. 2004–14 కాలంలో రూ.4,636.38 కోట్లు వెచ్చిస్తే, 2014–23 మధ్య కాలంలో రూ.44,021.99 కోట్లు వెచ్చించామని, ఇది దాదాపు 850 శాతం అధికమని అన్నారు. ౖఈ మధ్య కాలంలో జీహెచ్ఎంసీ ఎస్ఆర్డీపీ, సీఆర్ఎంపీ, హెచ్ఆర్డీసీ, ఎస్ఎన్డీపీ వంటి ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసి ప్రణాళికా బద్ధంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పారు. ఎస్ఆర్డీపీ ద్వారా సుమారు 35 ఫ్లై ఓవర్లు నిర్మించామని, కానీ ఉప్పల్, అంబర్‌పేట ఫ్లై ఓవర్లను నేషనల్ హైవే అథారిటీ పూర్తి చేయలేక పోతోందని అన్నారు. మున్సిపాలిటీల్లో రూ.238 కోట్లతో పనులు హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో రూ.238 కోట్లతో 19 పనులు చేపట్టామని, అందులో ఏడు పనులు పూర్తి కాగా, మిగతావి కూడా వేగంగా జరిగేలా ఆదేశాలిచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. నగరంలో ప్రధాన రహదారుల నాణ్యత పెరిగిందని, వరద ఇబ్బందులను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చెరువుల సుందరీకరణను పెద్ద ఎత్తున చేపట్టామని, ఎస్ఎన్డీపీ కింద నాలాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. గతంలో ముంపు వల్ల 150 కాలనీలు ఇబ్బంది పడేవని, ఎస్ఎన్డీపీ వల్ల ఈ బాధ తప్పిందని పేర్కొన్నారు. 2050 నాటికి నగరంలో తాగునీటి సమస్య లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ప్రజారవాణాను మెరుగుపర్చడంలో భాగంగా మెట్రో విస్తరణ, బస్సుల ఎలక్ట్రిఫికేషన్, పాతబస్తికీ మెట్రో కనెక్టివిటీ, భవిష్యత్తులో నిరంతర నీటి సరఫరా, నాలాల మరమ్మతు లాంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా చర్యలు చేపట్టినట్లు వివరించారు. శామీర్‌పేట్, మేడ్చల్ వైపు డబుల్ డెక్కర్ స్కైవేలు కట్టనున్నట్లు చెప్పారు. మెట్రో రైళ్లలో రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కోచ్‌ల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. -
రాష్ట్ర సమస్యలపై కేంద్రంపై ఒత్తిడి పెంచేలా...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించడంలో నాన్చివేత ధోరణి అవలంబిస్తున్న కేంద్రంపై మరోసారి ఒత్తిడి తేవడానికి వీలుగా పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు రెండురోజుల పాటు ఢిల్లీలో మకాం వేయనున్నారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టులకుపై వివరించే ప్రయత్నం చేయనున్నారు. కేంద్రం తన మంకుపట్టు వీడి ప్రాజెక్టులు, పథకాలు, అభివృద్ధి, ఆర్థికాంశాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించని పక్షంలో ప్రజల్లో ఎండగట్టే కార్యక్రమాన్ని చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు సమాచారం. శుక్ర, శనివారాల్లో కేటీఆర్ కేంద్ర మంత్రులను కలవనున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం ఎస్సార్డీపీ కార్యక్రమంలో భాగంగా తలపెట్టిన స్కైవేల నిర్మాణం కోసం రక్షణ శాఖ నుంచి అడుగుతున్న కంటోన్మెంట్ భూముల వ్యవహారంలో ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఏటూ తేల్చడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ అంశంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి కంటోన్మెంట్ భూముల అంశాన్ని లేవనెత్తనున్నట్లు సమాచారం. రసూల్‌పుర వద్ద చేపట్టిన రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలకు హోంశాఖ పరిధిలో ఉన్న భూముల అవసరం ఉన్నందున, ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కేటీఆర్ కలిసి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్ మామునూరు విమానాశ్రయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా తేల్చకుండా తీవ్ర జాప్యం చేస్తున్న నేపథ్యంలో పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింథియా లేదా వీకే సింగ్‌లతో సమావేశమై విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. పట్టణాభివృద్ధి శాఖ అంశాలకు సంబంధించిన పలు అంశాలపైన కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరితోనూ సమావేశం కానున్నారు. హైదరాబాద్ మెట్రోరైల్ పరిధిని మరింత విస్తరించాలని ఇప్పటికే అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా స్పందించడం లేదని కేటీఆర్ పలు సందర్భాల్లో ఆరోపించిన సంగతి తెలిసిందే. మెట్రో విస్తరణ అంశాన్ని పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో చర్చించనున్నారు. వీరితోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపైనా పలువురు కేంద్ర మంత్రులను కేటీఆర్ కలవనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. -
ఇళ్లు ఫుల్ స్పీడ్!
సాక్షి, అమరావతి: సీఆర్డీఏ పరిధిలో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన దాదాపు 50 వేల మంది నిరుపేదల సొంతింటి కల సాకారం అవుతోంది. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద వీరికి ఇళ్ల పట్టాల జారీ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇది ఇళ్లు లేని నిరుపేదల చిరకాల వాంఛను నెరవేర్చే బృహత్తర కార్యక్రమమని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పన పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై గురువారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హైకోర్టుకు అదనపు భవనం.. కోర్టు హాళ్లలో సదుపాయాలు అమరావతిలో 50,004 మంది పేదలకు 1,402.58 ఎకరాల్లో ఇళ్ల పట్టాలకు సంబంధించి జంగిల్ క్లియరెన్స్, ల్యాండ్ లెవలింగ్ పనులు ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. గుంటూరు జిల్లాకు చెందిన లబ్ధిదారులకు పది లేఅవుట్లలో, ఎన్టీఆర్ జిల్లా లబ్ధిదారులకు 11 లే అవుట్లలో ఇళ్ల పట్టాలు కేటాయించనున్నారు. దాదాపు 180 కి.మీ మేర అంతర్గత గ్రావెల్ రోడ్ల పనులు కూడా చేపడుతున్నట్లు తెలిపారు. హైకోర్టు అదనపు భవన నిర్మాణం కూడా పూర్తవుతున్నట్లు చెప్పారు. 76,300 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ భవనం అందుబాటులోకి వస్తోందని, 14 కోర్టు హాళ్లకు అవసరమైన సదుపాయాల కల్పన పనులు కూడా జరుగుతున్నట్లు వివరించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సుందరంగా బెజవాడ రివర్ బెడ్ విజయవాడలో కృష్ణానది వరద ముప్పు తప్పించేందుకు నిర్మించిన రిటైనింగ్ వాల్ ద్వారా ఏర్పడిన రివర్ బెడ్‌ను అందంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రివర్ బెడ్‌పై వాకింగ్ ట్రాక్ సహా వివిధ సుందరీకరణ పనుల గురించి అధికారులు వివరించారు. నగర వాసులకు ఆహ్లాదం కలిగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. పరిశుభ్రంగా విశాఖ బీచ్‌లు విశాఖలో బీచ్‌ల పరిశుభ్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. అందుకు అవసరమైన ప్రత్యేక యంత్రాలను బీచ్‌లో అందుబాటులో ఉంచాలన్నారు. వీటి ద్వారా ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించాలన్నారు. పరిశుభ్రమైన బీచ్‌లతోనే పర్యాటక రంగం మెరుగుపడుతుందన్నారు. గుడివాడ టిడ్కో ఇళ్లు జూన్‌లో పంపిణీ ఫేజ్–1 కింద 1,50,000 టిడ్కో ఇళ్లకు సంబంధించి 1.39 లక్షల గృహాల నిర్మాణం పూర్తి కాగా ఇప్పటికే 30 ప్రాంతాల్లో 51,564 ఇళ్లను అప్పగించినట్లు అధికారులు తెలిపారు. జూన్ నాటికి మిగతా ఇళ్లను కూడా లబ్ధిదారులకు అప్పగిస్తామన్నారు. రెండో విడతకు సంబంధించి 1,12,092 ఇళ్లను సెప్టెంబరు – డిసెంబరు మధ్య లబ్ధిదారులకు అందిస్తామన్నారు. గుడివాడలో 8,912 టిడ్కో ఇళ్లను జూన్ మొదటి వారంలో సీఎం చేతుల మీదుగా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమీక్షలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏపీసీఆర్డీఏ కమిషనర్ వివేక్‌యాదవ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ పి.బసంత్‌కుమార్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, రీసర్వే ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ సుబ్బారావు, మెప్మా ఎండీ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం
-
రాజమండ్రిలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణానికి సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్
సాక్షి, తాడేపల్లి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగరాలు, పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ, సమస్యలపై సత్వర పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. దీర్ఘకాలంలో నిర్మాణాత్మక వ్యవస్థ ఏర్పాటుపై ప్రభుత్వం ఫెకస్ పెట్టింది. దీనికోసం పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నది. ఏపీ సీఎం ఎంఎస్ (ఏపీ కన్సిస్టెంట్ మానిటరింగ్ ఆఫ్ మున్సిపల్ సర్వీసెస్) యాప్‌తో రియల్‌టైం మానిటరింగ్ చేయనున్నారు. మరో నెలరోజుల్లో యాప్ రెడీ.. రోడ్లపై గుంతలు, రోడ్లకు మరమ్మతులు, పచ్చదనం, సుందరీకరణ, వీధిలైట్ల నిర్వహణ, పుట్‌పాత్స్, మురుగు కాల్వల్లో పూడిక తొలగింపు, భూగర్భ మురుగునీటి వ్యవస్థల నిర్వహణ, పబ్లిక్ టాయ్లెట్ల ఏర్పాటు, వాటి నిర్వహణ, ట్రాఫిక్ జంక్షన్లు, వాటి నిర్వహణ అంశాలపై యాప్ ద్వారా రియల్ టైం మానిటరింగ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన యాప్ మరో నెల రోజుల్లో అందుబాటులోకి రానుంది. ఈ యాప్ ద్వారా రాష్ట్రంలోని 4,119 వార్డు సచివాలయాల పరిధిలో ఈ మౌలికసదుపాయాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ. వార్డు సెక్రటరీలు తమ పరిధిలో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి 12 గంటలవరకూ తనిఖీలు. తమ పరిధిలోని సుమారు 6–7 కి.మీ. మేరరోడ్లపై నిరంతర పర్యవేక్షణతోపాటు, పైన పేర్కొన్న వాటిపై నిరంతర తనిఖీలు.ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే ఫొటో తీసి యాప్ ద్వారా అప్లోడ్ చేయాలి. గుర్తించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు పౌరులకూ ఫోటోలు అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా తమ దృష్టికి వచ్చిన అంశాలను యాప్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పించారు. ఎప్పటికప్పుడు ఈ సమస్యలు సంబంధిత విభాగాలకు చేరి అక్కడనుంచి పరిష్కారం అవుతాయి. నివేదించిన ప్రతి సమస్య పరిష్కారంపైనా మానిటరింగ్ జరుగుతుంది. సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. మున్సిపల్ సర్వీసుల కోసం నగరాలు, పట్టణాల్లో తీసుకు వస్తున్న యాప్‌ను గ్రామాల్లోకూడా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశం. నగరాల్లో, పట్టణాల్లో రోడ్లు, మురుగునీటి కాల్వలు సహా ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణ బాగుండాలన్నారు. ఇప్పుడు తీసుకొస్తున్న యాప్ ద్వారా వచ్చే గ్రీవెన్స్‌ను పరిష్కరించే వ్యవస్థ బలోపేతంగా ఉండాలన్నారు. వర్షాకాలం సహా అన్ని కాలాల్లోనూ బాగుండేలా రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీ అంశంపైనాకూడా దృష్టిపెట్టాలని ఆదేశించారు. మున్సిపల్ సర్వీసులు పారదర్శకంగా ప్రజలకు అందాలి. టౌన్ ప్లానింగ్ సహా ఇతరత్రా విభాగాల్లో సాఫ్ట్వేర్ అప్లికేషన్స్‌ను పరిశీలన చేయాలి. ప్రజలకు సత్వరంగా సేవలు అందడం, నిర్దేశిత సమయంలోగా అనుమతులు రావడం, అవినీతి లేకుండా చూడటమే లక్ష్యంగా మార్పులు తీసుకురావాలి. సాఫ్ట్వేర్ అప్లికేషన్ల్‌పై నిశిత సమీక్షచేసి తగిన ప్రణాళికను రూపొందించాలి. రాజమండ్రిలోనూ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటు నిర్మాణ ప్రతిపాదనకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 28 అర్భన్ లోకల్ బాడీస్‌ను కవర్ చేస్తూ ప్లాంట్ నిర్మాణం జరుగనుంది. 7.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యంతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్. ఈ సమీక్షా సమావేశంలో పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, ఏపీసీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ డాక్టర్ పి సంపత్ కుమార్, ఏపీజీబీసీఎల్ ఎండీ బి రాజశేఖరరెడ్డి, మెప్మా ఎండీ విజయలక్ష్మీ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: (Yanamala Brothers: నాలుగు దశాబ్దాల చరిత్ర చెబుతున్నది ఇదే) -
పట్టణ సర్వే సిబ్బందికి మరో దఫా శిక్షణ
సాక్షి, అమరావతి: పట్టణాల్లోని ఆస్తుల సమగ్ర సర్వే కోసం పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా సిబ్బందికి సమగ్ర శిక్షణ ఇచ్చిన మునిసిపల్ అధికారులు నవంబర్ 1 నుంచి సర్వే చేపట్టాలని భావించారు. సర్వే విధానంపై సిబ్బందికి గల అనుమానాలను నివృత్తి చేసేందుకు మంగళవారం 400 మందికి శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రతి యూఎల్బీ నుంచి ముగ్గురు చొప్పున రాష్ట్రంలోని 123 యూఎల్బీల నుంచి సిబ్బంది హాజరు కానున్నారు. సర్వే పనుల కోసం వివిధ విభాగాల అధికారులతో ఇప్పటికే ప్రత్యేకంగా ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్(పీఎంయూ)ను ఏర్పాటు చేయడంతోపాటు, ఆయా కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో సైతం పీఎంయూలను ఏర్పాటు చేయడంతో పాటు పరిపాలనాధికారిని కూడా నియమించారు. మంగళవారం జరిగే శిక్షణలో పీఎంయూ అధికారితో పాటు వార్డు పరిపాలనా కార్యదర్శి, ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొననున్నారు. ప్రజల ఆస్తులను సర్వేచేసి, సరిహద్దులను గుర్తించి హక్కుదారుకు సమగ్రమైన వివరా లతో కూడిన హక్కుపత్రం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్షా పథకం’ ప్రవేశపెట్టింది. మొత్తం 123 యూఎల్బీల్లోను 38 లక్షల ఆస్తులు ఉన్నాయని, సర్వేలో మరో పది శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. వారం, పది రోజుల్లో క్షేత్ర స్థాయి పరిశీలన సర్వేలో ప్రతి వార్డు నుంచి ఆరుగురు సిబ్బంది చొప్పున మొత్తం 20 వేలమంది పాలుపంచుకునేలా చర్యలు తీసుకున్నారు. వారం, పది రోజుల్లో క్షేత్ర స్థాయి సర్వే ప్రక్రియ ప్రారంభించాలని యోచిస్తున్న అధికారులు మ్యాపింగ్, రికార్డుల పరిశీలనలో తలెత్తే సమస్యలపై వివరించనున్నారు. ఇప్పటికే నాలుగు దఫాలుగా వివిధ స్థాయిల్లో వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలతో పాటు ఇతర మునిసిపల్ సిబ్బందికి మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ ఇచ్చారు. ఈసారి వారికి రికార్డుల ప్రకారం ఆస్తుల గుర్తింపు, మునిసిపాలిటీ పరిధి మ్యాపింగ్‌తో పాటు, ప్రతి వార్డు మ్యాప్, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్, ఆర్ఎస్ఆర్, టీఎస్ఆర్, కేఎంఎల్ ఫైల్స్ పరిశీలనపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 123 నగర, పురపాలక సంఘాల్లో సమీప గ్రామాలు విలీనమయ్యాయి. విలీనమైన వాటిలో 648 రెవెన్యూ గ్రామాలున్నాయి. పకడ్బందీగా సర్వే చేపట్టాలని నిర్ణయించామని పట్టణ ఆస్తుల సర్వే ప్రత్యేకాధికారి సుబ్బారావు ‘సాక్షి’కి తెలిపారు. -
పట్టణ రోడ్ల నిర్వహణకు ప్రత్యేక యాప్
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లోని రోడ్లు, వీధిలైట్లు, డ్రెయినేజీల నిర్వహణకు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనుంది. ప్రస్తుతం కొంతమేర టెక్నాలజీ వాడుతున్నప్పటికీ.. ఇకపై గుంతల గుర్తింపుతోపాటు అన్ని పనులకు ఉపయోగపడేలా ప్రత్యేకంగా ‘యాప్’ను రూపొందిస్తున్నారు. గత వారం మునిసిపల్ విభాగంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ తరహా పనులకు డిజిటల్ విధానాన్ని అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సీఎం సూచనలకు అనుగుణంగా యాప్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు సీడీఎంఏ ప్రవీణ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. ఉన్నతస్థాయి అధికారులు పరిశీలించేలా.. రోడ్లపై గుంతల పూడ్చివేత నుంచి రోడ్డు పక్కనున్న మొక్కలు, చెట్ల వరకు అన్ని వివరాలను ఈ యాప్‌లో పొందుపరచనున్నారు. ప్రాథమిక స్థాయిలో వార్డు సచివాలయంలోని ఎమినిటీ కార్యదర్శి వివరాలు అప్లోడ్ చేస్తే వెనువెంటనే స్థానిక మునిసిపల్ కమిషనర్‌తో పాటు సీడీఎంఏలోని ఉన్నతస్థాయి అధికారులు సైతం పరిశీలించేలా యాప్‌ను రూపొందిస్తున్నారు. దీనివల్ల రోడ్ల మరమ్మతుల విధానం సులభతరం అవుతుందని, రెండో దశ గుంతల పూడ్చివేతను ఈ విధానంలోనే చేపట్టనున్నామని సీడీఎంఏ ప్రవీణ్‌కుమార్ వివరించారు. మొదటి దశలో రూ.58.20 కోట్లతో మొత్తం 123 యూఎల్బీల్లో 41,412 గుంతలను పూడ్చినట్టు చెప్పారు. ఇకపై యాప్ ద్వారా రోడ్ల నిర్వహణతో పాటు మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో వీధిలైట్లు, డ్రెయినేజీలతో పాటు వాటిని ఆనుకుని ఉన్న చెట్లు, మొక్కలను కూడా యాప్ ద్వారా పర్యవేక్షిస్తామని వివరించారు. అప్లోడ్ చేసిన వెంటనే పనులు ప్రస్తుతం వార్డు సచివాలయం పరిధిలోని రోడ్లపై పడే గుంతలను వార్డు ఎమినిటీ కార్యదర్శి ఫొటోలు తీసుకుని, వాటిని కంప్యూటర్ ద్వారా అప్లోడ్ చేస్తున్నారు. వీటిని స్థానిక యూఎల్బీల్లో అధికారులు పరిశీలించి, ఉన్నతస్థాయి అనుమతి తీసుకుని పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో పనులు చేపట్టడం ఆలస్యం అవుతోంది. ఇకపై అలాంటి వాటికి తావు లేకుండా వార్డు ఎమినిటీ కార్యదర్శి ఫొటో అప్లోడ్ చేయగానే వెంటనే అది స్థానిక మునిసిపల్ కమిషనర్, ఇంజనీర్‌తో పాటు సీడీఎంఏలోని సంబంధిత విభాగం ఉన్నతాధికారికి చేరుతుంది. ఫొటో సైతం ఎక్కడ తీశారో అక్షాంశాలు, రేఖాంశాలతో నమోదవుతుంది. వార్డు సచివాలయం పరిధిలో ఎన్ని కి.మీ. మేర రోడ్లు ఉన్నాయి, వాటిలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు ఎన్ని, ఆయా మార్గాల్లోని వీధిలైట్లు, రోడ్డుకు ఆనుకుని ఉన్న మురుగు కాలువలు, మొక్కలు, చెట్లు వంటి వాటి వివరాలు సైతం అప్లోడ్ చేయనున్నారు. ఆయా మార్గాల్లో గుంతలు పడినా, ఎవరైనా తవ్వకాలు చేపట్టినా గుర్తించి వాటి ఫొటోలను యాప్‌లో ఉంచుతారు. ఉన్నత స్థాయిలో పర్యవేక్షణ ఉండటంతో ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే చర్యలు తీసుకునేందుకు అవకాశం కలుగుతుందని మునిసిపల్ అధికారులు చెబుతున్నారు. -
శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ
గార్బేజ్ స్టేషన్ల నిర్వహణలో అత్యుత్తమ విధానాలు పాటించాలి. ఆయా పట్టణాలు, నగరాల్లో చెత్తను, మురుగు నీటిని శుద్ధి చేసేందుకు ఇప్పటికే ఉన్న సౌకర్యాలు, వసతులు.. ఇంకా కల్పించాల్సిన సదుపాయాలపై నివేదిక తయారు చేయాలి. అవసరమైన వసతులు లేని చోట్ల వెంటనే కల్పించి సమర్థవంతంగా నిర్వహించాలి. మురుగునీటి శుద్ధి, వేస్ట్ మేనేజ్మెంట్లో ప్రతి మున్సిపాలిటీ నూరు శాతం పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ ప్లెక్సీలను పూర్తిగా నిషేధించింది. నవంబర్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. దీన్ని సంపూర్ణంగా అమలు చేసేందుకు సంబంధిత వ్యాపారులతో కలెక్టర్లు సమావేశాలు నిర్వహించాలి. వ్యాపారులు ప్లాస్టిక్ నుంచి వస్త్రం వైపు మళ్లేందుకు కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు వారికి రుణాలు ఇప్పించి అండగా నిలవాలి. ఇచ్చిన రుణాలను సకాలంలో చెల్లించే వారికి ప్రభుత్వం నుంచే వడ్డీ రాయితీ కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: నగరాలు, పట్టణాల్లో పారిశుధ్యంపై మరింత దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. గార్బేజ్ స్టేషన్ల కారణంగా పరిసరాల్లోని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏమాత్రం ఉండకూడదని, ఇలాంటి ప్రాంతాల్లో సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. చెత్త నిర్వహణలో ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నామో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నగరాల్లో పరిశుభ్రత, వేస్ట్ మేనేజ్మెంట్, మురుగునీటి శుద్ధి, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్తో పాటు సుందరీకరణ పనులు, పచ్చదనం పెంపు, టిడ్కో ఇళ్లు, వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్, జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ తదితర అంశాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే చేపట్టిన పనుల ప్రగతి, మెరుగైన ఫలితాలు వచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి మున్సిపాలిటీలోను వేస్ట్ ప్రాసెసింగ్ ప్రక్రియ అమలు తీరుపై శ్రద్ధ పెట్టాలని చెప్పారు. అన్ని యూఎల్బీల్లోనూ (అర్బన్ లోకల్ బాడీస్) ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో ఉందా? లేదా? అన్నదానిపై సంబంధిత అధికారులు నిరంతరం పరిశీలించాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. టిడ్కో ఇళ్లు, వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్, జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్‌పై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్ కృష్ణా వరద గోడకు సుందరీకరణ ► ఏటా వచ్చే వరదలకు కృష్ణా నది పొంగి విజయవాడ నగర పాలక సంస్థలోని పలు ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యేవి. ఈ ఇబ్బందులను తప్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం రిటైనింగ్ వాల్‌ను నిర్మించింది. ఈ నేపథ్యంలో ఈ గోడకు ఆనుకుని ఉన్న ప్రాంతాల నుంచి మురుగు నీరు చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలి. రిటైనింగ్ వాల్ బండ్‌ను చెట్లు, విద్యుత్ దీపాలతో అందంగా తీర్చిదిద్దాలి. ► విజయవాడ నుంచి గన్నవరం విమనాశ్రయానికి వెళ్లే రహదారికి ఇరువైపులా చేపట్టిన సుందరీకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. అంబేడ్కర్ పార్కుకు వెళ్లే రోడ్లను సైతం అందంగా తీర్చిదిద్దాలి. విశాఖపట్నం నగరంలో సైతం సుందరీకరణ పనులు చేపట్టాలి. ► వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను బాగు చేయండి. మళ్లీ డ్రైవ్ చేపట్టి, మే 31 నాటికి అన్ని రోడ్లనూ బాగు చేయాలి. జగనన్న కాలనీల్లో నీరు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం ► ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీల్లో మురుగు నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలి. కాలనీల నిర్మాణం పూర్తయ్యేలోగా వాటిలో మౌలిక సదుపాయాలను కూడా కల్పించాలి. ప్రాధాన్యత క్రమంలో నీరు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసి తర్వాత మురుగు నీటి శుద్ధి కేంద్రాలను అందుబాటులోకి తేవాలి. ► రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లపై అధికారులు శ్రద్ధ పెట్టాలి. ప్రతి నియోజకవర్గానికి ఒక లే అవుట్‌ను తీర్చిదిద్దాలి. ఈ పనుల ప్రగతిపై ఉన్నతాధికారులు జిల్లాల వారీగా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించాలి. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష కార్యక్రమం పట్టణ ప్రాంతాల్లో చేపట్టడంపై దృష్టి సారించాలి. ► వైఎస్సార్ చేయూత లబ్ధిదారుల్లో సాధికారిత కోసం కృషి చేయాలి. ఏటా 45 ఏళ్లు నిండిన మహిళల్లో అర్హత ఉన్న వారికి ఈ పథకం కింద నేరుగా వారి ఖాతాల్లో డబ్బు జమ చేయాలి. ఈ డబ్బుతో వారు స్వయం ఉపాధి పొందేలా తగిన చర్యలు తీసుకోవాలి. అర్హత సాధించిన తొలి ఏడాదిలోనే వారికి స్వయం ఉపాధి మార్గాలు చూపించడం ద్వారా వారిలో సంపూర్ణ సాధికారితకు కృషి చేయాలి. ► ఈ సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ పి.సంపత్ కుమార్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏపీయూఎఫ్ఐడీసీ ఎండీ లక్ష్మీశా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
Andhra Pradesh : మిషన్ ‘క్లీన్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యమివ్వాలని అధికార యంత్రాంగాన్ని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణలో సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని పేర్కొంటూ పట్టణాలు, నగరాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నదీ జలాలు కలుషితం కాకుండా తగిన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. విజయవాడలో పంట కాలువల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పారవేయకుండా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖల్లో పనుల పురోగతిపై సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ పలు సూచనలు చేశారు. పట్టణాల్లో పరిశుభ్రత కోసం పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు మరెవరూ చేయలేరని సీఎం పేర్కొన్నారు. 2015 నుంచి 2018 సెప్టెంబర్ వరకు చంద్రబాబు హయాంలో మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది వేతనాలు కేవలం రూ.10 వేలు మాత్రమే ఉండేవన్నారు. ఎన్నికలకు కేవలం నాలుగు నెలల ముందు మాత్రమే రూ.12 వేలు చేశారన్నారు. అంటే టీడీపీ ఐదేళ్ల పాలనలో పారిశుధ్య కార్మికులకు ఇచ్చింది నెలకు రూ.10 వేలు మాత్రమేనన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారిని..,వారి సేవలను గుర్తిస్తూ వేతనాలను రూ.12 వేల నుంచి రూ.18 వేలకు పెంచిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే పారిశుధ్య కార్మికుల వేతనాలను 80 శాతం పెంచినట్లైందని సీఎం తెలిపారు. రూ.వేల కోట్లతో టిడ్కో ఇళ్లకు సదుపాయాలు పట్టణ పేదల కోసం చేపట్టిన టిడ్కో ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రి సమీక్షిస్తూ నిర్దేశించుకున్న గడువులోగా పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు అందించాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనతో పాటు రిజిస్ట్రేషన్లు కూడా పూర్తిచేసి లబ్ధిదారులకు ఇవ్వాలన్నారు. టిడ్కో ఇళ్లలో మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగంగా జరుగుతున్నాయని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక మూడేళ్లలో రూ.4,500 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు వివరించారు. మరో రూ.6 వేల కోట్ల ఖర్చుతో పనులు చేపట్టామని తెలిపారు. 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయికే పేదలకు అందించిందన్నారు. ఇక 365, 430 చదరపు అడుగుల ఇళ్లకు సంబంధించి గత సర్కారు లబ్ధిదారుడి వాటాగా పెనుభారం మోపగా ఇప్పుడు వారికి కూడా ఉపశమనం కలిగిస్తూ 50 శాతాన్ని ప్రభుత్వమే భరిస్తున్నట్లు చెప్పారు. పట్టణ రోడ్లకు మెరుగులు నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల్లో 16,762 రహదారులకు సంబంధించి 4,396.65 కి.మీ మేర రోడ్ల నిర్మాణ పనులు చేపట్టామని, ఇందుకోసం రూ.1,826.22 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. పనుల ప్రగతిని ఈ సందర్భంగా సీఎం పరిశీలించారు. ఇప్పటికే 55.15 శాతం పనులు పూర్తి చేశామని, రోడ్లపై గుంతలు పూడ్చివేతను ముమ్మరంగా చేపట్టామని అధికారులు తెలిపారు. ఇప్పటిదాకా 51.92 శాతం గుంతల పూడ్చివేత పనులు పూర్తయ్యాయని, జూలై 15 నాటికల్లా మొత్తం పూర్తి చేస్తామని వెల్లడించారు. జూలై 20 నాటికి మునిసిపాలిటీల్లో రోడ్ల పరిస్థితిని తెలియచేస్తూ నాడు – నేడు ద్వారా ఫొటో గ్యాలరీలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మరింత సుందరంగా ఎయిర్‌పోర్టు రోడ్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇటీవల ప్రారంభించిన జగనన్న హరిత నగరాలు కార్యక్రమంపై సీఎం సమీక్షించారు. ఎయిర్ పోర్టుల నుంచి నగరాలకు వెళ్లే రోడ్లను అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. గన్నవరం – విజయవాడ, భోగాపురం – విశాఖ వెళ్లే రహదారుల్లో మార్పు స్పష్టంగా కనిపించాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులు నగరాల అందాలను మెరుగుపరిచేలా ఉండాలన్నారు. రాష్ట్రంలో ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎంపిక చేసిన రోడ్లను కూడా ఇదే తరహాలో అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దాలన్నారు. విజయవాడలోని రామవరప్పాడు నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టు వరకు ఉన్న రోడ్డును ఇటీవల ఏపీ అర్బన్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది. ఆయా ప్రాంతాల్లో నాటే మొక్కలపై గ్రీనింగ్ కార్పొరేషన్ అధికారులు సీఎంకు వివరించారు. నియోజకవర్గానికో స్మార్ట్ టౌన్షిప్ నగరాలు, పట్టణాల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్లు, ఆర్వోబీలను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అనుమతులు మంజూరైన చోట వెంటనే నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక స్మార్ట్ టౌన్షిప్ తప్పనిసరిగా ప్రారంభం కావాలని, ఈమేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరిన్ని మహిళా మార్టులు.. మెప్మా ఆధ్వర్యంలో ఆరు పట్టణాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటైన జగనన్న మహిళా మార్టుల పనితీరుపై అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు. ఇవి విజయవంతమయ్యాయని, జూలైలో కొత్తగా మరిన్ని మహిళా మార్టులను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సుందర విజయవాడ.. విజయవాడలో కాలువల సుందరీకరణపై నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ముఖ్యంగా పంట కాలువల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు పారవేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పట్టణ పరిశుభ్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలను సమర్ధంగా నిర్వహించాలన్నారు. నగరంలో చెత్త వేసే ప్రాంతాలను గుర్తించి మ్యాపింగ్ చేసి పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్నారు. సీఆర్డీఏ పరిధిలోని కృష్ణా కరకట్ట రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, అఖిల భారత సర్వీసు అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాల నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయని అధికారులు తెలిపారు. సీడ్ యాక్సిస్ రోడ్డులోని నాలుగు గ్యాప్‌లను పూర్తిచేసే పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్‌శర్మ, పురపాలక, పట్ణణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఏపీ సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఎండీ సంపత్‌కుమార్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. పరిశుభ్ర కృష్ణా, గోదావరి.. మిషన్ క్లీన్ కృష్ణా, గోదావరి ప్రాజెక్టును సమర్థంగా నిర్వహించేందుకు ఇదే సరైన సమయమని సీఎం జగన్ పేర్కొన్నారు. కాలుష్యాన్ని అరికట్టడంలో కాలుష్య నియంత్రణ మండలి, స్వచ్ఛాంధ్రతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలు భాగస్వామ్యం కావాలన్నారు. పట్టణ, నగర ప్రాంతాల నుంచి వస్తున్న మురుగునీటితో కృష్ణా, గోదావరి నదులు, పంట కాలువలు కలుషితం అవుతున్నాయని సీఎం జగన్ పేర్కొన్నారు. శుద్ధి చేసిన తరువాతే నదులు, కాలువల్లోకి వదిలేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. మురుగునీటి శుద్ధి కోసం ఇప్పటిదాకా చేపట్టిన పనులు, ఎక్కడెక్కడ శుద్ధి సదుపాయాలు ఉన్నాయి? ఎక్కడెక్కడ చేపట్టాలి? తదితర అంశాలపై పూర్తిస్థాయి కార్యాచరణతో నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. -
పట్టణాభివృద్ధిశాఖపై సీఎం జగన్ సమీక్ష
-
YS Jagan: పట్టణాభివృద్ధిపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలపై సీఎం సమీక్షించారు. త్వరగా ఇళ్లను పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రభుత్వం వచ్చాక మూడేళ్లలో రూ.4500 కోట్లు ఖర్చుచేశామని, ఇంకా కనీసంగా మరో రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని అధికారులు వివరించారు. చదవండి: ఆత్మకూరు ఉప ఎన్నికల్లో టీడీపీ తొండాట.. నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థల్లో రోడ్ల అభివృద్ధిపై సీఎం సమీక్షించారు. 16762 రోడ్లకు సంబంధించి 4396,65 కి.మీ మేర రోడ్ల కోసం రూ.1826.22 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇప్పటికే 55.15 శాతం పనులు పూర్తయ్యాయి. వీటితో పాటు రోడ్లపై గుంతలు పూడ్చే పనులు కూడా ముమ్మరంగా చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. 15 జులై కల్లా రోడ్లపై గుంతలు లేకుండా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పటికే 51.92శాతం పనులు పూర్తయినట్లు అధికారులు వివరించారు. జగనన్న హరిత నగరాలు కార్యక్రమంపై సీఎం సమీక్ష ఎయిర్ పోర్టుల నుంచి నగరాలకు వెళ్లే రోడ్లను అందంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. గన్నవరం నుంచి విజయవాడ, భోగాపురం నుంచి విశాఖపట్నంకు వెళ్లే రహదారులు అందంగా తీర్చిదిద్దాలన్నారు. నగరం అందాలను మెరుగుపరిచేలా ఉంచాలని, రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎంపిక చేసిన రోడ్లను ఇదే రకంగా అభివృద్ధి చేసి అందంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. మురుగునీటి జలాల శుద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. ‘‘కృష్ణా గోదావరి నదులు, వాటి పంటకాల్వలు మురుగునీటి వల్ల కలుషితం అవుతున్నాయి. శుద్ధిచేసిన తర్వాతనే అవి కాల్వల్లోకి, నదుల్లోకి చేరాలి. ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టిపెట్టండి. ఇప్పటివరకూ చేపట్టిన పనులు, ఎక్కడెక్కడ మురునీటి శుద్ధి సదుపాయాలు ఉన్నాయి? ఎక్కడెక్కడ పెట్టాలి? తదితర అంశాలపై పూర్తిస్థాయి కార్యాచరణతో నివేదిక సమర్పించాలని’’ సీఎం పేర్కొన్నారు. విజయవాడలో కాల్వల సుందరీకరణపైనా నివేదిక ఇవ్వాలన్నారు. పంట కాల్వల్లో చెత్త , ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నగరాలు, పట్టణాల్లో నిర్మాణాల్లో ఉన్న ఫ్లై ఓవర్లను, ఆర్వోబీలను సత్వరమే పూర్తి చేయాలన్నారు. అనుమతులు మంజూరైన చోట వెంటనే నిర్మాణాలు ప్రారంభించేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. -
అన్ని రంగాల్లో పురోగతి
సాక్షి, హైదరాబాద్: ఎనిమిదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ‘దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి జిల్లాకు, స్థానిక సంస్థలకు అదనపు కలెక్టర్లను నియమించి వాటి ప్రగతికి కృషి చేస్తున్నాం. మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తాం. 50 వేల జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో రెండు వార్డులకు ఒకరు చొప్పున, అంతకుమించి జనాభా ఉన్న వాటిల్లో ఒక్కో వార్డుకు ఒకరు చొప్పున వార్డు ఆఫీసర్ పోస్టులను ఈ ఏడాదిలోనే భర్తీ చేస్తాం’ అని చెప్పారు. పురపాలక శాఖ ఆధ్వర్యంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులకు సంబంధించిన వార్షిక ప్రగతి నివేదికను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని జాతీయ, అంతర్జాతీయ సంస్థలతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి అవార్డులతో సత్కరించిందని గుర్తు చేశారు. విపక్షాలు, ప్రజలు అడగకున్నా పారదర్శకత కోసం వార్షిక నివేదికల ద్వారా అభివృద్ధి వివరాలను విడుదల చేస్తున్నామన్నారు. రహదారులు, ఫ్లైఓవర్లు, వైకుంఠధామాలు, వ్యర్థాల నిర్వహణ తదితర వాటిని క్షేత్రస్థాయిలో అమలయ్యేలా కృషి చేస్తున్నామని చెప్పారు. తమిళనాడు, కేరళ తర్వాత... తమిళనాడు, కేరళ తర్వాత తెలంగాణలో 46.8 శాతం మంది పట్టణాల్లోనే ఉంటున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘హైదరాబాద్ ఇళ్ల అమ్మకాల్లో 142 శాతం వృద్ధి నమోదైంది. నిర్మాణం ప్రారంభించిన తర్వాత 26 నెలల్లోనే ఇళ్ల అమ్మకాలు జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. పట్టణప్రాంత జనాభా అధికంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం మరిన్ని స్మార్ట్ సిటీలు మంజూరు చేసి అందుకు అనుగుణంగా నిధులు మంజూరు చేయాలి’ అని చెప్పారు. 111జీఓలోని ఆంక్షల ఎత్తివేత నేపథ్యంలో జంట జలాశయాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, ఎంఏయూడీ డైరెక్టర్ సత్యనారాయణ, జలమండలి ఎండీ దానకిషోర్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు. త్వరలో మూసీపై బ్రిడ్జీ్జల పనులు రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన కొత్త మున్సిపాలిటీలతోపాటు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో వ్యర్థాలతో 62 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని వెల్లడించారు. అన్ని మున్సిపాలిటీల్లో మానవ వ్యర్థాల శుద్ధీకరణ చేపట్టామన్నారు. రూ.100 కోట్లతో ఔటర్ రింగ్‌రోడ్డు మొత్తం ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశామన్నారు. ‘దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ హైదరాబాద్‌లోనే ఉంది. రూ.3,800 కోట్లతో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. నగరంలో 27 కి.మీ. మేర సోలార్ రూప్‌టాప్‌తో సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీల్లో గతేడాది రూ.3,700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. అన్ని పట్టణాల్లో టెన్ పాయింట్ ఎజెండాతో మౌలిక వసతులు కల్పిస్తున్నాం’ అని కేటీఆర్ చెప్పారు. మూసీనదిపై రూ.540 కోట్లతో 14 బ్రిడ్జిల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. నానక్‌రామ్‌గూడ నుంచి టీఎస్పీఏ వరకు సర్వీస్ రోడ్డు విస్తరిస్తున్నామని తెలిపారు. రూ.2,410 కోట్లతో 104 కొత్త లింక్ రోడ్లను నిర్మించబోతున్నట్టు వెల్లడించారు. -
సత్వర సేవలు..
సాక్షి, అమరావతి: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, అలసత్వానికి ఏమాత్రం తావులేదని అధికార యంత్రాంగానికి సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో చాలా ప్రభుత్వాలు మారినా ప్రజా సమస్యలకు పరిష్కారం చూపడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని, ఇప్పుడు అలాంటి వాటికి చోటులేదని పేర్కొన్నారు. అధికారులు ప్రజల మధ్య ఉంటేనే సమస్యలు వెలుగులోకి వచ్చి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పట్టణ పేదలకు 1.39 లక్షల యూనిట్ల టిడ్కో ఇళ్లను అన్ని మౌలిక సదుపాయాలతో జూన్ నాటికి పూర్తి చేయాలని నిర్దేశించారు. గత సర్కారు నీరు, రోడ్లు లాంటి కనీస సదుపాయాలను కూడా కల్పించకపోగా అరకొరగా పనులు చేపట్టి సగం ఇళ్లను కూడా పూర్తి చేయలేదని చెప్పారు. మౌలిక వసతులు శూన్యమని, కరెంట్ కూడా లేదన్నారు. అలాంటి దశలో ఉన్న ఇళ్లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అన్ని సదుపాయాలతో నిర్మిస్తోందని తెలిపారు. టిడ్కో ఇళ్లకు మూడేళ్లలో రూ.5,500 కోట్లు వ్యయం చేశామని, అవసరాన్ని బట్టి ఇంకా ఖర్చు చేస్తామని చెప్పారు. దాదాపు రూ.14 వేల కోట్ల వ్యయంతో విశాఖలో తలపెట్టిన 76.9 కి.మీ మెట్రో రైలు ప్రాజెక్టుపై వారం రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పట్టణ ప్రాంత మహిళా స్వయం సహాయక సంఘాలతో విజయవంతంగా నడుస్తున్న మహిళా మార్ట్లను మరిన్ని అందుబాటులోకి తేవడంపై పరిశీలన చేయాలని సూచించారు. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ ద్వారా మధ్య తరగతి ప్రజల కోసం ఉద్దేశించిన ఎంఐజీ లే అవుట్లను ప్రతి నియోజకవర్గంలో అన్ని వసతులతో ఆదర్శంగా రూపొందించాలన్నారు. పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణపై అవగాహన పెంపొందించాలని సూచించారు. అన్ని పట్టణాల్లో గుంతలు లేని రహదారులు ఉండాలని నాడు – నేడు ద్వారా వాటిని తీర్చిదిద్ది వ్యత్యాసాన్ని ఫొటోల ద్వారా ప్రజలకు తెలియచేయాలన్నారు. సీఎం సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉత్తమ జీవన ప్రమాణాలతో టిడ్కో ఇళ్లు గత పాలకులు పట్టణ ప్రాంత ప్రజల కోసం ఉద్దేశించిన టిడ్కో ఇళ్లను నిర్లక్ష్యం చేశారని, కనీస మౌలిక వసతులైన రోడ్లు, తాగునీరు, మురుగు శుద్ధి లాంటి సదుపాయాలు లేకుండా అస్తవ్యస్థంగా చేశారని సీఎం జగన్ పేర్కొన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆయా ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. సీసీ రోడ్లు, తాగునీటి కోసం ట్యాంకులు, మురుగునీటి శుద్ధి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అవి లేకపోతే ఆయా ప్రాంతాలు మురికివాడలుగా మారే అవకాశం ఉందన్నారు. పట్టణ పేదలకు మంచి జీవన ప్రమాణాలు కల్పించే దిశగా టిడ్కో ఇళ్లను తీర్చిదిద్దుతున్నామన్నారు. జూన్ నాటికి 1.39 లక్షల యూనిట్లు పూర్తి చేసేలా రూ.1,685 కోట్లు సమకూరుస్తామన్నారు. వడివడిగా విశాఖ మెట్రో విశాఖపట్నంలో సమారు 76.9 కిలోమీటర్ల మేర తలపెట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, దీనిపై వారం రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం జగన్ సంబంధిత అధికారులను అదేశించారు. దాదాపు రూ.14 వేల కోట్లతో నాలుగు కారిడార్లలో నిర్మించే ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మంగా తీసుకోవాలని, కోచ్‌ల డిజైన్‌తో పాటు మెట్రో స్టేషన్లలో కల్పించే సౌకర్యాలు, వసతులతో నివేదిక సమగ్రంగా సమర్పించాలన్నారు. ఈ ప్రాజెక్టులో పర్యావరణ హిత విధానాలకు పెద్దపీట వేయాలని సూచించారు. ప్రాజెక్టుకు అవసరమైన వనరుల సమీకరణపైనా అధికారులతో చర్చించారు. ప్రజలు కోరుకునేలా జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ పట్టణ ప్రాంత ప్రజలకు అనువుగా ఉండేలా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక ఎంఐజీ లే అవుట్‌ను మోడల్ మాదిరిగా సిద్ధం చేయాలని సీఎం సూచించారు. క్లియర్ టైటిల్ డీడ్‌తో పాటు న్యాయపరమైన చిక్కులు లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూపొందించాలని, ప్రజలు కోరుకునే రీతిలో తీర్చిదిద్దాలని నిర్దేశించారు. ఈ లే అవుట్లు ఆదర్శంగా ఉండాలన్నారు. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్ (ఎంఐజీ లేఅవుట్స్) కోసం ఇప్పటిదాకా 82 అర్బన్ నియోజకవర్గాల్లో 6,791 ఎకరాలను గుర్తించామని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లాతోపాటు తిరుపతిలో రెండు చోట్ల లే అవుట్లు పనులు పూర్తయ్యాయని, మరో 864.29 ఎకరాల్లో ఈ నెల చివరినాటికి సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. తాగునీరు, పారిశుధ్యంపై ట్రాకింగ్ సిస్టమ్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ద్వారా పారిశుధ్యం మెరుగుపడేలా అధికారులు మరింత శ్రద్ధ తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. తడిచెత్త, పొడిచెత్త, ప్రమాదకర వ్యర్థాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. చెత్త వేసేందుకు అందచేసిన డస్ట్బిన్లలో ఏ రంగు డబ్బాలో ఎలాంటి చెత్త వేయాలో సూచిస్తూ ఇంటింటికీ కరపత్రాలను పంచాలని సూచించారు. తాగునీరు, పారిశుధ్యానికి సంబంధించి ఎస్‌వోపీలు రూపొందించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ట్రాకింగ్ సిస్టమ్ తేవాలని సూచించారు. చెత్త తొలగింపు ఎప్పటికప్పుడు జరుగుతోందా? లేదా?.. తాగునీటి సరఫరా సజావుగా జరుగుతోందా? అనే అంశాలను పరిశీలించాలన్నారు. తద్వారా ఏవైనా ఇబ్బందులుంటే గుర్తించి వెంటనే పరిష్కరించే వీలుంటుందన్నారు. ఇప్పటికే 1.12 కోట్ల చెత్త డబ్బాలను పంపిణీ చేయగా మరో 8 లక్షల డబ్బాల పంపిణీని ఈనెల 22 నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్‌లో 2,426 ఆటోలు సేవలు అందిస్తుండగా మరో 400 ఆటోలు ఈ నెలాఖరు నాటికి, 1,123 ఈ–ఆటోలు జూన్ నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. డిసెంబర్ నాటికి గార్బేజ్ ట్రాన్స్పర్ స్ట్రేషన్లు (జీటీఎస్) పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. మరిన్ని మహిళా మార్ట్‌లపై పరిశీలన పట్టణ ప్రాంత మహిళా స్వయం సహాయక సంఘాలతో విజయవంతంగా నడుస్తున్న మహిళా మార్ట్లను మరిన్ని తేవడంపై అధ్యయనం చేయాలని సీఎం జగన్ అదేశించారు. మార్ట్ల కోసం అనువైన ప్రాంతాల్లో భవనాలను గుర్తించి ప్రభుత్వం నుంచి తగిన సహకారం అందించాలని సూచించారు. కృష్ణా కరకట్ట విస్తరణ పనులు వేగవంతం విజయవాడలో కృష్ణా కరకట్ట రోడ్డు విస్తరణ పనులు వేగవంతం అయ్యాయని, ఇప్పటికే విద్యుత్ స్తంభాలను తొలగించామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. సీడ్ యాక్సెస్ రోడ్డుపైనా దృష్టిపెట్టామన్నారు. రాయపూడి వద్ద నిర్మిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నట్లు చెప్పారు. సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ సమీర్‌శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, కార్యదర్శి వి.రామ మనోహరరావు, కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, ఏపీ సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఎండీ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జూన్‌కి రోడ్ల మరమ్మతులు పూర్తి కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో రహదారులపై అధికారులు దృష్టి పెట్టాలని, అన్ని చోట్లా గుంతలు లేని రోడ్లు కనిపించాలని సీఎం జగన్ ఆదేశించారు. నాడు–నేడు ద్వారా బాగు చేసిన రోడ్ల పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలన్నారు. జూన్ నాటికి రోడ్ల మరమ్మతుల పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. -
రూ.1,445 కోట్లతో వ్యర్థాల శుద్ధి
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లో పర్యావరణానికి హానికరంగా మారిన మానవవ్యర్థాలు, మురుగునీటి శుద్ధికి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఆయా వ్యర్థాలను వదిలించుకునేందుకు ఇప్పటిదాకా అనుసరిస్తున్న సంప్రదాయ విధానాలతో నేల, నీరు, గాలి కలుషితమవుతుండడంతో.. ఇకపై ఆయా వ్యర్థాలను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ట్రీట్మెంట్ చేసి సాధ్యమైనంత మేరకు ఎరువులుగా, పునర్ వినియోగానికి అవసరమయ్యే రీతిలో మార్చనున్నారు. దాదాపు రూ.1,445.07 కోట్లతో రాష్ట్రంలోని 74 పట్టణ స్థానిక సంస్థల్లో చేపట్టే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభత్వం నుంచి అనుమతి రావడంతోపాటు, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఇటీవల సంబంధిత ఫైలుపై సంతకం కూడా చేశారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు చేపట్టేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ సిద్ధమవుతోంది. స్వచ్ఛభారత్ మిషన్ రెండోదశ ప్రాజెక్టులో చేపడుతున్న ఈ యూనిట్లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించాలని భావిస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గడమేగాక కొన్నేళ్లపాటు నిర్వహణను ఆయా సంస్థలే చేపట్టడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలోని 74 పట్టణ స్థానిక సంస్థలను ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0లో భాగంగా ఆయా ప్రాంతాల్లో రెండు విభాగాలుగా ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. మొదటి విభాగంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటుచేసి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ)కి అనుసంధానం చేస్తారు. అంటే ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చే వ్యర్థజలాలు ఎస్టీపీకి చేరతాయి. ఇక్కడ ఆ నీటిని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం వివిధ పద్ధతుల్లో శుద్ధిచేసి మలినాలను వేరుచేసి బయో ఎరువుల తయారీకి తరలిస్తారు. జలాలను తాగడానికి మినహా ఇతర అవసరాలైన గార్డెనింగ్, పరిశ్రమల్లో వినియోగిస్తారు. రెండో విభాగంలో ప్రతి స్థానిక పట్టణ సంస్థలో ఒక ఫెకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్ఎస్టీపీ) నిర్మించి, సెప్టిక్ ట్యాంకుల్లోని మలాన్ని ఆ ప్లాంట్‌లో శుద్ధిచేసి ఘనవ్యర్థాన్ని బయో ఎరువుగా మారుస్తారు. నీటిని ట్రీట్మెంట్ ప్లాంట్‌కు తరలించి శుద్ధిచేసి పరిశ్రమలకు వినియోగిస్తారు. ఈ రెండు విభాగాలు అనుసంధానమై ఉంటాయి. రెండు విభాగాలను ఏకకాలంలో చేపట్టి, వేగంగా పనులు పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆమోదం రావడంతో త్వరలోనే టెండర్లు పిలిచి పనులు అప్పగించనున్నారు. ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా అడుగులు ఇప్పటివరకు పట్టణ ప్రాంతాల్లో మురుగునీటి కాలువలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను స్థానికంగా ఉండే చెరువులు, నదులకు అనుసంధానించేవారు. ఇక మానవవ్యర్థాలను సెప్టిక్ ట్యాంక్‌ల నుంచి సేకరించి సమీపంలో ఉండే ఖాళీ స్థలంలో పారబోయడం లేదా అండర్‌గ్రౌండ్ వ్యవస్థలు ఉన్నచోట నదులకు అనుసంధానం చేయడం వంటి విధానాలు అనుసరించేవారు. దీనివల్ల నీరు, నేల తీవ్రంగా కలుషితమవుతున్నాయని, ప్రజారోగ్య సమస్య ఉత్పన్నమవుతోందని గుర్తించిన ప్రభుత్వం మురుగును రీసైక్లింగ్ చేయడమే ప్రత్యామ్నాయంగా భావించి ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. పట్టణాలకు తాగునీటి వనరుగా ఉన్న నదులు, చెరువులను కాలుష్యం నుంచి పూర్తిగా ప్రక్షాళన చేసేదిశగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మురుగునీటి ట్రీట్మెంట్ ప్లాంట్లలో రసాయనాలను ఉపయోగించి 95 శాతం పర్యావరణానికి అనుకూలంగా, వినియోగానికి అనువుగా మార్చడంతోపాటు అడుగున ఉన్న బయోసాలిడ్ (బురద)ను వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడే ఎరువుగా మారుస్తారు. -
రాజధాని ఏ ఒక్క సామాజికవర్గానిదో కాదు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాజధాని ఏ ఒక్కరిదో, ఏ ఒక్క సామాజిక వర్గానికో చెందింది కాదని, ఐదు కోట్ల మంది ప్రజలదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విజయనగరంలో విలేకరులతో మాట్లాడారు. అమరావతి రాజధాని నిర్మాణానికి అనువైన ప్రాంతం కాదని, వరదముప్పు ఉందని, పైగా ఎక్కువ ఖర్చుతోకూడుకున్నదని శివరామకృష్ణ కమిటీ తన సిఫార్సుల్లో పేర్కొందని, కానీ వాటిని గత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని,ఈ అంశంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. రాజధాని ప్రాంతానికి వరద ముంపు ఉందని, ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీటికే రాజధాని ప్రాంతం ముంపునకు గురైందని మంత్రి గుర్తు చేశారు. పదకొండు లక్షల క్యూసెక్కుల నీరు వస్తే రాజధాని పరిస్థితి ఏమిటో ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని కోరారు. రాజధాని నిర్మాణ వ్యయం ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆ ప్రాంతంలో ఎక్కువవుతుందని పునరుద్ఘాటించారు. రాజధాని విషయంలో పవన్ వ్యాఖ్యలు ద్వంద్వ అర్థాన్ని తలపిస్తున్నాయని బొత్స వ్యాఖ్యానించారు. -
ఆ ఉద్యోగాలకు.. దరఖాస్తుల వెల్లువ
సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఆదివారానికి పది లక్షలు దాటిపోయింది. రికార్డు స్థాయిలో 1,26,728 ప్రభుత్వోద్యోగాల భర్తీకి నిర్వహించే రాతపరీక్షకు ఆగస్టు పదో తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు జూలై 27 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. ఆదివారం సాయంత్రం వరకు 10,73,532 మంది దరఖాస్తు చేసుకున్నారు. సాధారణ పనిదినాల్లో రోజుకు అందే దరఖాస్తుల సంఖ్య లక్ష దాటుతోందని.. ఈ పరిస్థితి బట్టి చూస్తే గడువు ముగిసే సమయానికి దరఖాస్తుల సంఖ్య 20 లక్షలు దాటిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా.. కర్నూలు, అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల నుంచి లక్షకు పైగా దరఖాస్తులు అందాయని.. నెల్లూరు, విజయనగరం జిల్లాల నుంచి తక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. సందేహాల నివృత్తికి ప్రత్యేక సెల్ ఇదిలా ఉంటే.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. దరఖాస్తు, రాతపరీక్షపై అభ్యర్థులకు తలెత్తే సందేహాలు నివృత్తి చేయడానికి పంచాయతీరాజ్ శాఖ ఐదు మొబైల్ నెంబర్లతో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేసింది. ఇందుకు 20 మందిని కేటాయించింది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ విజయకుమార్‌లు సైతం వ్యక్తిగతంగా సామాజిక మాధ్యమాల ద్వారా ఇందుకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ట్విటర్లో పోస్టులు పెడుతున్నారు. పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయాల్లో సందేహాల నివృత్తికి అదనంగా ప్రత్యేక సెల్‌ను కూడా ఏర్పాటుచేశారు. ఇతర రాష్ట్రాల వారూ దరఖాస్తు ఈ పోస్టులకు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లాల వారీగా భర్తీచేసే మొత్తం ఉద్యోగాల్లో 80 శాతం స్థానికులకు రిజర్వు చేసిన విషయం తెలిసిందే. మిగిలిన 20 శాతం ఉద్యోగాలకు ఆ జిల్లాలోని స్థానికులతో పాటు ఇతర జిల్లాల వారూ, ఇతర రాష్ట్రాల వారు కూడా ఒపెన్ కేటగిరిలో పోటీపడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో.. ఆదివారం నాటికి 2,332 మంది ఇతర రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకున్నట్లు గోపాలకృష్ణ ద్వివేది ట్విట్టర్ ద్వారా తెలిపారు. రాతపరీక్ష తేదీల్లో మార్పులపై 6న ప్రకటన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే రాతపరీక్ష తేదీల్లో మార్పులు, చేర్పులపై ఈ నెల 6న ఓ ప్రకటన చేయనున్నట్లు ద్వివేది వెల్లడించారు. మొత్తం 19 రకాల ఉద్యోగాలను నాలుగు రకాలుగా వర్గీకరించి.. వాటికి సెప్టెంబరు 1, 8 తేదీలలో ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేర్వేరుగా రాతపరీక్ష నిర్వహించనున్నారు. అయితే, ఉద్యోగాల వర్గీకరణలో కేటగిరి–2లో పేర్కొన్న గ్రూపు–ఏ, గ్రూపు–బీలో నాలుగు రకాల ఉద్యోగాలకు సెప్టెంబరు 1వ తేదీ సాయంత్రం రాతపరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ పరీక్షకు సివిల్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు అర్హత ఉండడంతో ఆయా పరీక్షలను ఒకే సమయంలో కాకుండా వేర్వేరుగా నిర్వహించాలని వారి నుంచి పెద్ద సంఖ్యలో వినతులు అధికారులకు చేరాయి. దీంతో పూర్తిస్థాయి రాతపరీక్ష షెడ్యూల్‌పై 6న స్పష్టత ఇవ్వనున్నట్టు ద్వివేది తెలిపారు. -
నగరంలో మరో బస్టాండ్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అధునాతన ఇంటర్సిటీ బస్టాండ్ ఏర్పాటు కానుంది. 21 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొత్తపేట పండ్ల మార్కెట్ స్థలంలో బస్టాండ్ ప్రాంగణం, దిల్సుఖ్నగర్, హైదరాబాద్–3 డిపోలను నిర్మించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందుకు సంబంధించి నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించనుంది. మెట్రోరైల్ స్టేషన్‌తో అనుసంధానిస్తూ నిర్మించే ఈ ప్రాంగణం విజయవాడవైపు రాకపోకలు సాగించే జిల్లా బస్సులతోపాటు దిల్సుఖ్నగర్ మీదుగా ప్రయాణించే సిటీ బస్సులకు కూడా కేంద్రంగా మారనుంది. నగరంలో ఇప్పటికే ఉన్న ఎంజీబీఎస్, సికింద్రాబాద్‌లోని జేబీఎస్ బస్టాండ్ల తర్వాత ఇది మరో పెద్ద బస్టాండ్‌గా ఏర్పడనుంది. వాణిజ్యపరంగా కీలక ప్రాంతం కావడంతో కొత్తపేటలో బస్టాండ్‌ను వాణిజ్య హంగులతో నిర్మిస్తే ఆర్టీసీకి పెద్ద ఆదాయ వనరుగా మారనుంది. అయితే ఇది భారీ ఖర్చుతో కూడుకోవడం, ఆర్టీసీకి అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో ప్రభుత్వం సహకరిస్తేనే ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. కొత్త బస్టాండ్ వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉండటం, దిల్సుఖ్నగర్ ట్రాఫిక్ సమస్యను తగ్గించే ప్రాజెక్టు కావడంతో ప్రభుత్వం కూడా ఇందుకు సహకరిస్తుందన్న ఆశతో ఆర్టీసీ ఉంది. – సాక్షి, హైదరాబాద్ కొత్తపేట మార్కెట్ తరలింపుతో... కొత్తపేటలోని పండ్ల మార్కెట్‌కు నిత్యం వందల సంఖ్యలో లారీలు వస్తుండటంతో ఆ ప్రాంతంలో తరచూ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. వాణిజ్యపరంగా కీలక ప్రాంతం కావడంతో షాపింగ్ మాల్స్, విద్యాసంస్థలు, చిరువ్యాపారాలు అక్కడ అధికం. కొత్తపేట పరిసరాల్లో వందల సంఖ్యలో కాలనీలు ఉండటం, గత పదేళ్లలో అక్కడ భారీగా అపార్ట్మెంట్లు వెలియడంతో జనాభా కూడా పెరిగి రోడ్లపై వాహనాల సంఖ్య పెరిగిపోయింది. వెరసి కీలక సమయాల్లో గంటల తరబడి ట్రాఫిక్‌జాం నెలకొంటోంది. మెట్రోరైలు అందుబాటులోకి వచ్చినా సమస్య పరిష్కారం కాలేదు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని కొత్తపేట పండ్ల మార్కెట్‌ను అక్కడి నుంచి తరలించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఔటర్ రింగురోడ్డుకు చేరువగా ఉన్న కోహెడలో ఇందుకు స్థలాన్ని సేకరించింది. త్వరలో మార్కెట్ అక్కడికి మారనుంది. మార్కెట్ తరలింపుతో కొత్తపేటలో 21 ఎకరాల స్థలం అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం దిల్సుఖ్నగర్ ప్రధాన రహదారిపై బస్టాండ్ ఉంది. విజయవాడ వైపు వెళ్లే బస్సులతోపాటు సిటీ బస్సులు అక్కడ ఆగుతాయి. ఆ పక్కనే దిల్సుఖ్నగర్, హైదరాబాద్–3 డిపోలున్నాయి. వెరసి ఆ రోడ్డు చిక్కుముడిలా మారింది. దీంతో ఆర్టీసీ ప్రాంగణాలను కొత్తపేట మార్కెట్ స్థలంలోకి తరలించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. విజయవాడ వైపు నిత్యం వందలాదిగా వచ్చే బస్సులను కొత్తపేట బస్టాండ్ వరకే పరిమితం చేస్తే ఎంజీబీఎస్పైనా భారం తగ్గుతుందని ఆర్టీసీ భావిస్తోంది. కరీంనగర్, ఆదిలాబాద్, సిద్దిపేట, నిజామాబాద్‌ల వైపు నుంచి వచ్చే బస్సుల్లో మూడొంతులను సికింద్రాబాద్‌లోని జేబీఎస్‌కే పరిమితం చేయడం వల్ల ట్రాఫిక్ తగ్గిందని, ఇదే పద్ధతిని కొత్తపేట బస్టాండ్ వద్ద అమలు చేయాలనుకుంటోంది. ఆర్టీసీకి ఆదాయ వనరు... దిల్సుఖ్నగర్ ప్రాంతం వాణిజ్యపరంగా కీలకమైంది. ఇక్కడ ఆర్టీసీ షాపింగ్ మాల్ నిర్మిస్తే ఎంతో ఆదాయం సమకూరుతుంది. మల్టీప్లెక్స్‌లు, గేమింగ్ జోన్, రెస్టారెంట్ల వంటివి ఏర్పాటు చేయడం ద్వారా సొంతంగా ఆదాయాన్ని ఆర్జించ వచ్చని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు దిల్సుఖ్నగర్ ప్రధాన రహదారిపై 8 ఎకరాల్లో ఉన్న బస్టాండ్, రెండు డిపోలను తొలగించి ఆ స్థలంలో భారీ మల్టీలెవల్ పార్కింగ్ టవర్ నిర్మించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. కొత్తపేట మార్కెట్ స్థలాన్ని ఆర్టీసీకి కేటాయిస్తే, ఆర్టీసీ తన స్థలాన్ని జీహెచ్ఎంసీకి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. వీటన్నింటిపై నిర్ణయం తీసుకునేందుకు త్వరలో ఆర్టీసీ, మార్కెటింగ్‌శాఖ, జీహెచ్ఎంసీ, పురపాలన, పట్టణాభివృద్ధిశాఖల ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. -
హాయిగా.. ట్రాఫిక్‌లో జాలీగా..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఐటీ కారిడార్ వరకూ సాఫీ ప్రయాణం.. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సులువుగా గమ్యస్థానం చేర్చడం.. ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడం.. ఇందుకోసం పలు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం, రహదారుల విస్తరణ చేపట్టనుంది జీహెచ్ఎంసీ. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, కొండాపూర్, హఫీజ్‌పేట, నాలెడ్జ్సిటీ తదితర ప్రాంతాలకు సులభంగా చేరేలా మూడు ఫ్లైఓవర్లు, ఒక అండర్‌పాస్ నిర్మించనుంది. మరో రహదారిని విస్తరించనుంది. ఈ నిర్మాణాలు పూర్తయితే శంషాబాద్ నుంచి ఐటీ కారిడార్‌కు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు ట్రాఫిక్ జంజాటాల్లేని సాఫీ ప్రయాణం సాధ్యమవుతుంది. మొత్తం రూ.505 కోట్లు ఖర్చు కానున్న ఈ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ నిధులతో వీటిని నిర్మించేందుకు పరిపాలనాపరమైన అనుమతులిస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ రెండు జీవోలు జారీ చేసింది. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. తప్పనున్న ట్రాఫిక్ చిక్కులు.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మెహిదీపట్నం వరకు సులభంగానే వస్తున్నప్పటికీ, ఆ తర్వాత ఐటీ కారిడార్ చేరుకునేందుకు ట్రాఫిక్ చిక్కులు ఎదురవుతున్నాయి. అలాగే విమానాశ్రయం నుంచి గచ్చి బౌలి చేరుకునేందుకు దాదాపు 20 నిమిషాలు పడితే గచ్చిబౌలి జంక్షన్ దాటేందుకే 15 నిమిషాలు పడుతోంది. ఇక నానల్‌నగర్ నుంచి మెహిదీపట్నం వరకు ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాలు పూర్తయితే కొండాపూర్, హఫీజ్‌పేట, టోలిచౌకి తదితర ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి.. అలాగే విమానాశ్రయం నుంచి ఈ ప్రాంతాలకు ప్రయాణం సాఫీగా సాగుతుందని అధికారులు చెబుతున్నారు. రోజురోజుకూ రద్దీ పెరుగుతున్న నాలెడ్జ్సిటీ తదితర ఐటీ కారిడార్లలో భవిష్యత్ ట్రాఫిక్ చిక్కులకు ఇవి పరిష్కారం కానున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇవీ పనులు.. నానల్‌నగర్, రేతిబౌలి జంక్షన్ల వద్ద రెండు ఫ్లైఓవర్లు, ఒక అండర్‌పాస్ నిర్మించనున్నారు. టోలిచౌకి మార్గంలోని ఫోర్ సీజన్స్ రెస్టారెంట్ దగ్గర మొదలయ్యే రెండు లేన్ల ఫ్లైఓవర్.. ఒక లెవెల్లో నానల్‌నగర్ చౌరస్తా వద్ద కుడివైపు(లంగర్‌హౌస్)వైపు తిరిగి కేకే ఫంక్షన్‌హాల్ వరకు వెళ్తుంది. అదే ఫ్లైఓవర్ మెహిదీపట్నం వైపు కొనసాగుతూ రేతిబౌలి జంక్షన్ దగ్గర రెండో లెవెల్లో పీవీ ఎక్స్‌ప్రెస్ వేను క్రాస్ చేస్తూ అత్తాపూర్ రింగ్ రోడ్డు మీద దిగుతుంది. అత్తాపూర్ నుంచి మెహిదీపట్నం వచ్చే వారికి మరో ఫ్లైఓవర్ నిర్మిస్తారు. నానల్‌నగర్ దగ్గర మెహిదీపట్నం నుంచి టోలిచౌకి వైపు నేరుగా వెళ్లేందుకు ఒక అండర్‌పాస్ నిర్మించనున్నారు. వీటి ద్వారా వాహనాల వేగం గంటకు కనీసం 40 కి.మీ. నుంచి 50 కి.మీ.గా ఉండగలదని అంచనా వేశారు. గచ్చిబౌలి జంక్షన్ వద్ద.. మైండ్‌స్పేస్ నుంచి ఓఆర్ఆర్కు వెళ్లే వారు బయోడైవర్సిటీకి రాకుండా నేరుగా వెళ్లేందుకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ఆరు లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. దీంతో పాటు శిల్పా లేఔట్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు(వయా గ్యాస్ కంపెనీ) 120 అడుగులతో రహదారిని విస్తరించనున్నారు. ఈ పనులు పూర్తయితే శంషాబాద్ నుంచి కొండాపూర్ వైపు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్లేవారికి సాఫీ ప్రయాణం సాధ్యం కానుంది. ఈ ప్యాకేజీ అంచనా వ్యయం రూ.330 కోట్లు. గచ్చిబౌలి జంక్షన్ వద్ద ప్రస్తుతం రద్దీ సమయంలో వాహనాల సంఖ్య గంటకు 15,020గా ఉంది. ఈ రెండు ప్యాకేజీలకూ వెరసి మొత్తం రూ.505 కోట్లు ఖర్చు కానుంది. వీటిల్లో నానల్‌నగర్, రేతిబౌలి ఫ్లైఓవర్లు వన్వేవి కాగా, గచ్చిబౌలి వద్ద టూవే ఫ్లైఓవర్. మార్గాలివీ.. ఫ్లైఓవర్ 1 అత్తాపూర్ వైపు నుంచి మెహిదీపట్నం వైపు రెండు లేన్ల ఫ్లైఓవర్. దీని వెడల్పు 8.5 మీటర్లు. ఫ్లైఓవర్ 2 టోలిచౌకి అప్రోచ్ నుంచి రెండు లేన్ల ఫ్లైఓవర్. ఫస్ట్ లెవెల్ నానల్‌నగర్ జంక్షన్ వరకు కొనసాగుతుంది. అక్కడి వరకు 8.5 మీటర్ల వెడల్పు ఉంటుంది. క్రమేపీ ముందుకు సాగుతూ రేతిబౌలి జంక్షన్ దగ్గర రెండో లెవెల్ ఫ్లైఓవర్‌గా మారుతుంది. అక్కడ 7 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఒక డౌన్ ర్యాంప్ లంగర్‌హౌస్ వైపు వెళ్తుంది. మరొకటి పీవీ ఎక్స్‌ప్రెస్‌వేను రెండో లెవెల్లో క్రాస్ చేస్తుంది. అండర్ పాస్ మెహిదీపట్నం వైపు నుంచి టోలిచౌకి వైపు నేరుగా వెళ్లే వారి కోసం నానల్‌నగర్ జంక్షన్ వద్ద మూడు లేన్ల అండర్ పాస్ నిర్మిస్తారు. ఈ మూడు పనుల ప్యాకేజీ అంచనా వ్యయం రూ.175 కోట్లు. ప్రస్తుతం రేతిబౌలి వద్ద రద్దీ సమయంలో గంటకు 12,501 వాహనాలు, నానల్ నగర్ వద్ద 10,317 వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఫ్లైఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది. -
ఆస్ట్రేలియా సంస్థలతో రెండు ఒప్పందాలు
సాక్షి, అమరావతి: ఆస్ట్రేలియాకు చెందిన సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం రెండు ఒప్పందాలు కుదుర్చుకుంది. సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. పశ్చిమ ఆస్ట్రేలియా పెర్త్‌లో ఉన్న కర్టిన్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) మధ్య జరిగిన మొదటి ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో గనులకు సంబంధించిన పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే గనుల విశ్వవిద్యాలయంలో సంబంధిత అంశాలకు సంబంధించి ఈ కేంద్రం భాగస్వామిగా ఉంటుంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఐరన్ ఓర్, బాక్సైట్, బీచ్‌శాండ్, లైమ్‌స్టోన్ వంటి విలువైన ఖనిజ సంపద ఏపీలో విస్తారంగా ఉందని చెప్పారు. అమరావతిలో వాటర్ సెన్సిటివ్ కోఆపరేటివ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కోసం సీఆర్డీఏ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆస్ట్రేలియాతో మరో ఒప్పందం కుదుర్చుకున్నాయి. -
రాజధాని తొలిదశకు 21వేల కోట్లు
30 వేల ఎకరాలు పట్టణాభివృద్ధిశాఖ అంచనా రూపకల్పన విజయవాడకు 12 కి.మీ. వాయవ్యంగా.. గుంటూరుకు 20 కి.మీ. ఈశాన్యంగా రాజధాని సాక్షి, హైదరాబాద్: రాజధానికి తొలిదశలో 30 వేల ఎకరాలు అవసరమని, నిర్మాణానికి 20,935 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ అంచనాలను రూపొందించింది. తొలిదశ రాజధాని నిర్మాణం మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి మండలాల్లోని 31 గ్రామాలు, నివాస ప్రాంతాల్లో ఉంటుందని పేర్కొంది. గుంటూరు జిల్లాలోని 122 చదరపు కిలోమీటర్ల పరిధిలో నిర్మాణాలు వస్తాయి. ఈ రాజధాని కృష్ణానదిని ఆనుకుని విజయవాడ నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో వాయవ్యదిశగా, గుంటూ రు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఈశాన్యదిశగా ఉంటుందని మున్సిపల్ శాఖ పేర్కొంది. తొలిదశ రాజధాని నిర్మాణంలో భాగంగా 8.5 లక్షల జనాభాకు సరిపడా వచ్చే పదేళ్లలో ఇళ్లు నిర్మించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణ ప్రాంతం ఐటీ, వ్యాపారం, పర్యాటక, వైద్య సౌకర్యాలతో ఉంటుంది. పార్కులు, రిక్రియేషనల్ సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రీడా సిటీ, క్రీడా ప్రాంగణాలు ఉంటాయి. కృష్ణానది వ్యూతో నిర్మిస్తున్నందున పర్యాటకులను ఆకర్షించేలా ఉంటుందన్నారు. నూతన రాజధాని తొలిదశ నిర్మాణ అంచనాలు ఈ విధంగా ఉన్నాయి. C - కమర్షియల్ జోన్ JB - జంగిల్ సఫారీ LH - లాజిస్టిక్ హబ్ KP - నాలెడ్జ్ పార్క్ CM - సీఎం ఇల్లు G - స్టేట్ గెస్ట్ హౌస్ CH - సర్క్యూట్ హౌస్ RF - రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ GQF - గవర్నమెంట్ హౌసింగ్ ఫీచర్ GQ - గవర్నమెంట్ హౌసింగ్ R - రెసిడెన్షియల్ జోన్ MQ - మినిస్టర్స్ క్వార్టర్స్ OQ - ఆఫీసర్స్ క్వార్టర్స్ R - రెసిడెన్షియల్ జోన్ VS - విధాన సభ CC - క్యాపిటల్ కాంప్లెక్స్ GO - గవర్నమెంట్ ఆఫీస్ CP - సెంట్రల్ పార్క్ CBD - సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ OC - ఆఫీస్ కాంప్లెక్స్ I - ఇండస్ట్రియల్ జోన్ గృహ నిర్మాణాలకు రిజర్వ్ చేసే విస్తీర్ణం రంగాల వారీగా ఈ విధంగా ఉంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాల గృహాలకు - 400.62 హెక్టార్లు తక్కువ ఆదాయ వర్గాల గృహాలకు - 801.24 హెక్టార్లు మధ్య ఆదాయ వర్గాల గృహాలకు- 934.78 హెక్టార్లు అధిక ఆదాయ వర్గాల గృహాలకు- 534.16 హెక్టార్లు రాజధాని ప్రాంతంలో భూ వినియోగం ఇలా.. 1. హౌసింగ్ డెవలప్మెంట్ కోసం రిజర్వు చేసింది: 22% 2.నగరస్థాయి మౌలిక సదుపాయాలకు: 20% 3. రంగాలవారీ మౌలిక సదుపాయాలకు: 15% 4. రాజధాని కాంప్లెక్స్, ప్రభుత్వ భవనాలకు: 5% 5.గవర్నర్, సీఎం, మంత్రుల నివాసాలకు: 1% 6.ప్రభుత్వ గృహాల కోసం: 1% 7.సామాజిక మౌలిక సదుపాయాలకు:3% 8.రిక్రియేషన్‌కు:5% 9.ప్రాజెక్టు బాధితులకు: 9% 10. పర్యావరణ ప్రాజెక్టులకు: 8% 11.సి.బి.డి. కోసం : 1% 12.కార్యాలయాలకు: 2% 13.బహిరంగ ప్రాంగణం కోసం : 8% -
టీఎంసీ సరిహద్దుల పెంపునకు యూడీడీ పచ్చజెండా
నాసిక్: త్రయంబకేశ్వర్ మున్సిపాలిటీ సరిహద్దు పరిధి పెంపునకు పట్టణ అభివృద్ధి విభాగం (యూడీడీ) ఆమోదం తెలిపింది. కుంభమేళా సమీపిస్తున్న నేపథ్యంలో ఇక్కడికి వచ్చే భక్తులకు మౌలిక వసతులు కల్పించేందుకు, తగు సేవలు అందించేందుకుగాను సరిహద్దుల పెంపునకు అనుమతించాలని కోరుతూ త్రయంబకేశ్వర్ మున్సిపల్ కౌన్సిల్ (టీఎంసీ) కొద్దిరోజుల క్రితం ఓ ప్రతిపాదనను పట్టణ అభివృద్ధి విభాగం (యూడీడీ)కి పంపిన సంగతి విదితమే. ఇందుకు ఆమోదం తెలిపిన యూడీడీ దానిని న్యాయమంత్రిత్వ శాఖకు పంపించింది. న్యాయమంత్రిత్వ శాఖ ఆమోదం లభించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా ఓ ప్రకటన చేయనుంది. ఈ విషయమై టీఎంసీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ అపెక్స్ కమిటీలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కుంభమేళాకు సంబంధించి 90 శాతం పనులను పూర్తిచేశామన్నారు. తమ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే టీఎంసీ సరిహద్దు పరిధి 1.89 కిలోమీటర్లనుంచి 11.794 కిలోమీటర్లకు పెరుగుతుందన్నారు. ప్రణాళికాబద్ధంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొ చ్చన్నారు. టీఎంసీ చుట్టుపక్కల గ్రామాలు రెవె న్యూ విభాగం పరిధిలో ఉన్నాయని, ఏ గ్రామపంచాయితీ పరిధిలో లేవన్నారు. అందువల్ల ప్రతి చిన్నపనికీ కలెక ్టర్ కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుందన్నారు. అయితే తమ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ప్రజలు కలెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించాల్సిన అవసరం ఉండదన్నారు. వారు తమను నేరుగా సంప్రదించే వెసులుబాటు లభిస్తుంది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ఈ పరిస్థితి మారిపోతుందన్నారు. -
నగరం చుట్టూ ఎనిమిది సిటీ క్లస్టర్లు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెంగళూరుపై ఒత్తిడి తగ్గించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించడానికి నగరం చుట్టూ ఎనిమిది సిటీ క్లస్టర్లను అభివృద్ధి చేయాలని సంకల్పించినట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వినయ్ కుమార్ సొరకె వెల్లడించారు. సోమవారం ఆయనిక్కడ తన శాఖ వంద రోజుల సాధనల జాబితాను విడుదల చేసిన సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రాజెక్టుకు రూ.2,100 కోట్లు ఖర్చవుతుందని, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి ఆర్థిక సాయం తీసుకోదలిచామని తెలిపారు. ప్రతిపాదిత సిటీ క్లస్టర్లలో నెలమంగల, మాగడి, ఆనేకల్, బిడది, డాబస్‌పేట, హరోహళ్లి, దేవనహళ్లి, హొసకోటెలు ఉంటాయని వివరించారు. బెంగళూరుపై వచ్చి పడుతున్న పెట్టుబడులను మరల్చడానికి ఈ ప్రాజెక్టును చేపట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా ఐదు కారిడార్లతో కూడిన బెంగళూరు సబర్బన్ రైలు వ్యవస్థ కోసం రూ.8,759 కోట్లతో చేపట్టదలచిన తొలి దశ ప్రాజెక్టు నివేదిక త్వరలో సిద్ధమవుతుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో నగరం నుంచి తుమకూరు, రామనగర, బంగారుపేటలకు రైల్వే సేవలు అందించే ప్రతిపాదనలున్నాయని తెలిపారు. దీనిని చేపట్టడానికి బెంగళూరు సబర్బన్ రైల్ కార్పొరేషన్‌ను త్వరలోనే స్థాపించనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరంలో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గిపోతాయన్నారు. సీఎంసీల స్థాయి పెంపు తుమకూరు, శివమొగ్గ, బిజాపుర సిటీ మునిసిపల్ కౌన్సిళ్ల (సీఎంసీ) స్థాయిని పెంచడానికి కేబినెట్ నోట్‌ను సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. జేఎన్ నర్మ్ కింద 61 ప్రాజెక్టులను చేపట్టడానికి రూ.5,265.22 కోట్లు వ్యయం కాగల ప్రతిపాదనలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు పంపినట్లు తెలిపారు. ఇందులో రూ.168 కోట్లకు ఇదివరకే ఆమోదం లభించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 నీటి సరఫరా ప్రాజెక్టులను చేపట్టడానికి రూ.711.92 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. బెల్గాం, గుల్బర్గ, హుబ్లీ-ధార్వాడ నగరాలకు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో నిరంతర నీటి సరఫరాకు రూ.1,760 కోట్లు వ్యయం కాగల ప్రాజెక్టును సిద్ధం చేసినట్లు వెల్లడించారు. దీనికి ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయాన్ని కోరినట్లు చెప్పారు. వార్డు కమిటీలు రాష్ర్టంలోని అన్ని మహా నగర పాలికెల్లో వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామ పంచాయతీల పరిధిలో గ్రామ సభలను నిర్వహించే విధంగా వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. దీని వల్ల ఆయా వార్డులకు కేటాయించిన నిధులను సద్వినియోగం చేయడానికి, పనుల నాణ్యతను పరిశీలించడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఇదివరకే మైసూరులో ప్రయోగాత్మకంగా ఇలాంటి కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. మున్ముందు ఇతర పాలికెలకు విస్తరిస్తామన్నారు.