ఆ ఉద్యోగాలకు.. దరఖాస్తుల వెల్లువ | Huge Applications Flow For AP Grama Volunteer Jobs | Sakshi
Sakshi News home page

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు.. దరఖాస్తుల వెల్లువ

Published Mon, Aug 5 2019 3:53 AM | Last Updated on Mon, Aug 5 2019 12:11 PM

Huge Applications Flow For AP Grama Volunteer Jobs - Sakshi

సాక్షి, అమరావతి : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఆదివారానికి పది లక్షలు దాటిపోయింది. రికార్డు స్థాయిలో 1,26,728 ప్రభుత్వోద్యోగాల భర్తీకి నిర్వహించే రాతపరీక్షకు ఆగస్టు పదో తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు జూలై 27 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. ఆదివారం సాయంత్రం వరకు 10,73,532 మంది దరఖాస్తు చేసుకున్నారు. సాధారణ పనిదినాల్లో రోజుకు అందే దరఖాస్తుల సంఖ్య లక్ష దాటుతోందని.. ఈ పరిస్థితి బట్టి చూస్తే గడువు ముగిసే సమయానికి దరఖాస్తుల సంఖ్య 20 లక్షలు దాటిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా.. కర్నూలు, అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల నుంచి లక్షకు పైగా దరఖాస్తులు అందాయని.. నెల్లూరు, విజయనగరం జిల్లాల నుంచి తక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు.  

సందేహాల నివృత్తికి ప్రత్యేక సెల్‌ 
ఇదిలా ఉంటే.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి శాఖలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. దరఖాస్తు, రాతపరీక్షపై అభ్యర్థులకు తలెత్తే సందేహాలు నివృత్తి చేయడానికి పంచాయతీరాజ్‌ శాఖ ఐదు మొబైల్‌ నెంబర్లతో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేసింది. ఇందుకు 20 మందిని కేటాయించింది. పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ విజయకుమార్‌లు సైతం వ్యక్తిగతంగా సామాజిక మాధ్యమాల ద్వారా ఇందుకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ట్విటర్‌లో పోస్టులు పెడుతున్నారు. పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయాల్లో సందేహాల నివృత్తికి అదనంగా ప్రత్యేక సెల్‌ను కూడా ఏర్పాటుచేశారు.  

ఇతర రాష్ట్రాల వారూ దరఖాస్తు 
ఈ పోస్టులకు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లాల వారీగా భర్తీచేసే మొత్తం ఉద్యోగాల్లో 80 శాతం స్థానికులకు రిజర్వు చేసిన విషయం తెలిసిందే. మిగిలిన 20 శాతం ఉద్యోగాలకు ఆ జిల్లాలోని స్థానికులతో పాటు ఇతర జిల్లాల వారూ, ఇతర రాష్ట్రాల వారు కూడా ఒపెన్‌ కేటగిరిలో పోటీపడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో.. ఆదివారం నాటికి 2,332 మంది ఇతర రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకున్నట్లు గోపాలకృష్ణ ద్వివేది ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. 

రాతపరీక్ష తేదీల్లో మార్పులపై 6న ప్రకటన 
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే రాతపరీక్ష తేదీల్లో మార్పులు, చేర్పులపై ఈ నెల 6న ఓ ప్రకటన చేయనున్నట్లు ద్వివేది వెల్లడించారు. మొత్తం 19 రకాల ఉద్యోగాలను నాలుగు రకాలుగా వర్గీకరించి.. వాటికి సెప్టెంబరు 1, 8 తేదీలలో ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేర్వేరుగా రాతపరీక్ష నిర్వహించనున్నారు. అయితే, ఉద్యోగాల వర్గీకరణలో కేటగిరి–2లో పేర్కొన్న గ్రూపు–ఏ, గ్రూపు–బీలో నాలుగు రకాల ఉద్యోగాలకు సెప్టెంబరు 1వ తేదీ సాయంత్రం రాతపరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ పరీక్షకు సివిల్‌ ఇంజనీరింగ్‌ చదివిన విద్యార్థులకు అర్హత ఉండడంతో ఆయా పరీక్షలను ఒకే సమయంలో కాకుండా వేర్వేరుగా నిర్వహించాలని వారి నుంచి పెద్ద సంఖ్యలో వినతులు అధికారులకు చేరాయి. దీంతో పూర్తిస్థాయి రాతపరీక్ష షెడ్యూల్‌పై 6న స్పష్టత ఇవ్వనున్నట్టు ద్వివేది తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement