సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను పరిష్కరించడంలో నాన్చివేత ధోరణి అవలంబిస్తున్న కేంద్రంపై మరోసారి ఒత్తిడి తేవడానికి వీలుగా పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు రెండురోజుల పాటు ఢిల్లీలో మకాం వేయనున్నారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులను కలిసి పెండింగ్‌లో ఉన్న పలు ప్రాజెక్టులకుపై వివరించే ప్రయత్నం చేయనున్నారు. కేంద్రం తన మంకుపట్టు వీడి ప్రాజెక్టులు, పథకాలు, అభివృద్ధి, ఆర్థికాంశాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించని పక్షంలో ప్రజల్లో ఎండగట్టే కార్యక్రమాన్ని చేపట్టాలని బీఆర్‌ఎస్ నిర్ణయించినట్లు సమాచారం.
శుక్ర, శనివారాల్లో కేటీఆర్ కేంద్ర మంత్రులను కలవనున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం ఎస్సార్డీపీ కార్యక్రమంలో భాగంగా తలపెట్టిన స్కైవేల నిర్మాణం కోసం రక్షణ శాఖ నుంచి అడుగుతున్న కంటోన్మెంట్ భూముల వ్యవహారంలో ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం ఏటూ తేల్చడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ అంశంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి కంటోన్మెంట్ భూముల అంశాన్ని లేవనెత్తనున్నట్లు సమాచారం.
రసూల్‌పుర వద్ద చేపట్టిన రోడ్డు అభివృద్ధి కార్యక్రమాలకు హోంశాఖ పరిధిలో ఉన్న భూముల అవసరం ఉన్నందున, ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కేటీఆర్ కలిసి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్ మామునూరు విమానాశ్రయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా తేల్చకుండా తీవ్ర జాప్యం చేస్తున్న నేపథ్యంలో పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింథియా లేదా వీకే సింగ్‌లతో సమావేశమై విమానాశ్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరే అవకాశం ఉంది.
పట్టణాభివృద్ధి శాఖ అంశాలకు సంబంధించిన పలు అంశాలపైన కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పూరితోనూ సమావేశం కానున్నారు. హైదరాబాద్ మెట్రోరైల్ పరిధిని మరింత విస్తరించాలని ఇప్పటికే అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా స్పందించడం లేదని కేటీఆర్ పలు సందర్భాల్లో ఆరోపించిన సంగతి తెలిసిందే. మెట్రో విస్తరణ అంశాన్ని పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో చర్చించనున్నారు. వీరితోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలపైనా పలువురు కేంద్ర మంత్రులను కేటీఆర్ కలవనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment