
సాక్షి, అమరావతి: ఆస్ట్రేలియాకు చెందిన సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం రెండు ఒప్పందాలు కుదుర్చుకుంది. సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. పశ్చిమ ఆస్ట్రేలియా పెర్త్‌లో ఉన్న కర్టిన్ యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్ మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) మధ్య జరిగిన మొదటి ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో గనులకు సంబంధించిన పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తారు.
రాష్ట్రంలో ఏర్పాటు చేసే గనుల విశ్వవిద్యాలయంలో సంబంధిత అంశాలకు సంబంధించి ఈ కేంద్రం భాగస్వామిగా ఉంటుంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఐరన్ ఓర్, బాక్సైట్, బీచ్‌శాండ్, లైమ్‌స్టోన్ వంటి విలువైన ఖనిజ సంపద ఏపీలో విస్తారంగా ఉందని చెప్పారు. అమరావతిలో వాటర్ సెన్సిటివ్ కోఆపరేటివ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కోసం సీఆర్‌డీఏ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఆస్ట్రేలియాతో మరో ఒప్పందం కుదుర్చుకున్నాయి.