పట్టణాభివృద్ధి శాఖ 2021–22 వార్షిక నివేదికను విడుదల చేస్తున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎనిమిదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. ‘దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి జిల్లాకు, స్థానిక సంస్థలకు అదనపు కలెక్టర్లను నియమించి వాటి ప్రగతికి కృషి చేస్తున్నాం. మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తాం. 50 వేల జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో రెండు వార్డులకు ఒకరు చొప్పున, అంతకుమించి జనాభా ఉన్న వాటిల్లో ఒక్కో వార్డుకు ఒకరు చొప్పున వార్డు ఆఫీసర్ పోస్టులను ఈ ఏడాదిలోనే భర్తీ చేస్తాం’ అని చెప్పారు.
పురపాలక శాఖ ఆధ్వర్యంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులకు సంబంధించిన వార్షిక ప్రగతి నివేదికను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని జాతీయ, అంతర్జాతీయ సంస్థలతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి అవార్డులతో సత్కరించిందని గుర్తు చేశారు. విపక్షాలు, ప్రజలు అడగకున్నా పారదర్శకత కోసం వార్షిక నివేదికల ద్వారా అభివృద్ధి వివరాలను విడుదల చేస్తున్నామన్నారు. రహదారులు, ఫ్లైఓవర్లు, వైకుంఠధామాలు, వ్యర్థాల నిర్వహణ తదితర వాటిని క్షేత్రస్థాయిలో అమలయ్యేలా కృషి చేస్తున్నామని చెప్పారు.
తమిళనాడు, కేరళ తర్వాత...
తమిళనాడు, కేరళ తర్వాత తెలంగాణలో 46.8 శాతం మంది పట్టణాల్లోనే ఉంటున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ‘హైదరాబాద్ ఇళ్ల అమ్మకాల్లో 142 శాతం వృద్ధి నమోదైంది. నిర్మాణం ప్రారంభించిన తర్వాత 26 నెలల్లోనే ఇళ్ల అమ్మకాలు జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. పట్టణప్రాంత జనాభా అధికంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం మరిన్ని స్మార్ట్ సిటీలు మంజూరు చేసి అందుకు అనుగుణంగా నిధులు మంజూరు చేయాలి’ అని చెప్పారు.
111జీఓలోని ఆంక్షల ఎత్తివేత నేపథ్యంలో జంట జలాశయాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, ఎంఏయూడీ డైరెక్టర్ సత్యనారాయణ, జలమండలి ఎండీ దానకిషోర్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
త్వరలో మూసీపై బ్రిడ్జీ్జల పనులు
రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన కొత్త మున్సిపాలిటీలతోపాటు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో వ్యర్థాలతో 62 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని వెల్లడించారు. అన్ని మున్సిపాలిటీల్లో మానవ వ్యర్థాల శుద్ధీకరణ చేపట్టామన్నారు. రూ.100 కోట్లతో ఔటర్ రింగ్‌రోడ్డు మొత్తం ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేశామన్నారు.
‘దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ హైదరాబాద్‌లోనే ఉంది. రూ.3,800 కోట్లతో సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. నగరంలో 27 కి.మీ. మేర సోలార్ రూప్‌టాప్‌తో సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీల్లో గతేడాది రూ.3,700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. అన్ని పట్టణాల్లో టెన్ పాయింట్ ఎజెండాతో మౌలిక వసతులు కల్పిస్తున్నాం’ అని కేటీఆర్ చెప్పారు. మూసీనదిపై రూ.540 కోట్లతో 14 బ్రిడ్జిల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. నానక్‌రామ్‌గూడ నుంచి టీఎస్‌పీఏ వరకు సర్వీస్ రోడ్డు విస్తరిస్తున్నామని తెలిపారు. రూ.2,410 కోట్లతో 104 కొత్త లింక్ రోడ్లను నిర్మించబోతున్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment