సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఐటీ కారిడార్ వరకూ సాఫీ ప్రయాణం.. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సులువుగా గమ్యస్థానం చేర్చడం.. ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడం.. ఇందుకోసం పలు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం, రహదారుల విస్తరణ చేపట్టనుంది జీహెచ్‌ఎంసీ. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, కొండాపూర్, హఫీజ్‌పేట, నాలెడ్జ్‌సిటీ తదితర ప్రాంతాలకు సులభంగా చేరేలా మూడు ఫ్లైఓవర్లు, ఒక అండర్‌పాస్ నిర్మించనుంది. మరో రహదారిని విస్తరించనుంది. ఈ నిర్మాణాలు పూర్తయితే శంషాబాద్ నుంచి ఐటీ కారిడార్‌కు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు ట్రాఫిక్ జంజాటాల్లేని సాఫీ ప్రయాణం సాధ్యమవుతుంది. మొత్తం రూ.505 కోట్లు ఖర్చు కానున్న ఈ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జీహెచ్‌ఎంసీ నిధులతో వీటిని నిర్మించేందుకు పరిపాలనాపరమైన అనుమతులిస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ రెండు జీవోలు జారీ చేసింది. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు.
తప్పనున్న ట్రాఫిక్ చిక్కులు..
శంషాబాద్ విమానాశ్రయం నుంచి మెహిదీపట్నం వరకు సులభంగానే వస్తున్నప్పటికీ, ఆ తర్వాత ఐటీ కారిడార్ చేరుకునేందుకు ట్రాఫిక్ చిక్కులు ఎదురవుతున్నాయి. అలాగే విమానాశ్రయం నుంచి గచ్చి బౌలి చేరుకునేందుకు దాదాపు 20 నిమిషాలు పడితే గచ్చిబౌలి జంక్షన్ దాటేందుకే 15 నిమిషాలు పడుతోంది. ఇక నానల్‌నగర్ నుంచి మెహిదీపట్నం వరకు ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాలు పూర్తయితే కొండాపూర్, హఫీజ్‌పేట, టోలిచౌకి తదితర ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి.. అలాగే విమానాశ్రయం నుంచి ఈ ప్రాంతాలకు ప్రయాణం సాఫీగా సాగుతుందని అధికారులు చెబుతున్నారు. రోజురోజుకూ రద్దీ పెరుగుతున్న నాలెడ్జ్‌సిటీ తదితర ఐటీ కారిడార్లలో భవిష్యత్ ట్రాఫిక్ చిక్కులకు ఇవి పరిష్కారం కానున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
ఇవీ పనులు..
నానల్‌నగర్, రేతిబౌలి జంక్షన్ల వద్ద రెండు ఫ్లైఓవర్లు, ఒక అండర్‌పాస్ నిర్మించనున్నారు. టోలిచౌకి మార్గంలోని ఫోర్ సీజన్స్ రెస్టారెంట్ దగ్గర మొదలయ్యే రెండు లేన్ల ఫ్లైఓవర్.. ఒక లెవెల్‌లో నానల్‌నగర్ చౌరస్తా వద్ద కుడివైపు(లంగర్‌హౌస్)వైపు తిరిగి కేకే ఫంక్షన్‌హాల్ వరకు వెళ్తుంది. అదే ఫ్లైఓవర్ మెహిదీపట్నం వైపు కొనసాగుతూ రేతిబౌలి జంక్షన్ దగ్గర రెండో లెవెల్‌లో పీవీ ఎక్స్‌ప్రెస్ వేను క్రాస్ చేస్తూ అత్తాపూర్ రింగ్ రోడ్డు మీద దిగుతుంది. అత్తాపూర్ నుంచి మెహిదీపట్నం వచ్చే వారికి మరో ఫ్లైఓవర్ నిర్మిస్తారు. నానల్‌నగర్ దగ్గర మెహిదీపట్నం నుంచి టోలిచౌకి వైపు నేరుగా వెళ్లేందుకు ఒక అండర్‌పాస్ నిర్మించనున్నారు. వీటి ద్వారా వాహనాల వేగం గంటకు కనీసం 40 కి.మీ. నుంచి 50 కి.మీ.గా ఉండగలదని అంచనా వేశారు.
గచ్చిబౌలి జంక్షన్ వద్ద..
మైండ్‌స్పేస్ నుంచి ఓఆర్‌ఆర్‌కు వెళ్లే వారు బయోడైవర్సిటీకి రాకుండా నేరుగా వెళ్లేందుకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ఆరు లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. దీంతో పాటు శిల్పా లేఔట్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు(వయా గ్యాస్ కంపెనీ) 120 అడుగులతో రహదారిని విస్తరించనున్నారు. ఈ పనులు పూర్తయితే శంషాబాద్ నుంచి కొండాపూర్ వైపు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్లేవారికి సాఫీ ప్రయాణం సాధ్యం కానుంది. ఈ ప్యాకేజీ అంచనా వ్యయం రూ.330 కోట్లు. గచ్చిబౌలి జంక్షన్ వద్ద ప్రస్తుతం రద్దీ సమయంలో వాహనాల సంఖ్య గంటకు 15,020గా ఉంది. ఈ రెండు ప్యాకేజీలకూ వెరసి మొత్తం రూ.505 కోట్లు ఖర్చు కానుంది. వీటిల్లో నానల్‌నగర్, రేతిబౌలి ఫ్లైఓవర్లు వన్‌వేవి కాగా, గచ్చిబౌలి వద్ద టూవే ఫ్లైఓవర్.
మార్గాలివీ..
ఫ్లైఓవర్ 1
అత్తాపూర్ వైపు నుంచి మెహిదీపట్నం వైపు రెండు లేన్ల ఫ్లైఓవర్. దీని వెడల్పు 8.5 మీటర్లు.
ఫ్లైఓవర్ 2
టోలిచౌకి అప్రోచ్ నుంచి రెండు లేన్ల ఫ్లైఓవర్. ఫస్ట్ లెవెల్ నానల్‌నగర్ జంక్షన్ వరకు కొనసాగుతుంది. అక్కడి వరకు 8.5 మీటర్ల వెడల్పు ఉంటుంది. క్రమేపీ ముందుకు సాగుతూ రేతిబౌలి జంక్షన్ దగ్గర రెండో లెవెల్ ఫ్లైఓవర్‌గా మారుతుంది. అక్కడ 7 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఒక డౌన్ ర్యాంప్ లంగర్‌హౌస్ వైపు వెళ్తుంది. మరొకటి పీవీ ఎక్స్‌ప్రెస్‌వేను రెండో లెవెల్‌లో క్రాస్ చేస్తుంది.
అండర్ పాస్
మెహిదీపట్నం వైపు నుంచి టోలిచౌకి వైపు నేరుగా వెళ్లే వారి కోసం నానల్‌నగర్ జంక్షన్ వద్ద మూడు లేన్ల అండర్ పాస్ నిర్మిస్తారు. ఈ మూడు పనుల ప్యాకేజీ అంచనా వ్యయం రూ.175 కోట్లు. ప్రస్తుతం రేతిబౌలి వద్ద రద్దీ సమయంలో గంటకు 12,501 వాహనాలు, నానల్ నగర్ వద్ద 10,317 వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఫ్లైఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది.
Comments
Please login to add a commentAdd a comment