జంక్షన్ జామ్‌లకు చెక్! | Junction Jam to check! | Sakshi
Sakshi News home page

జంక్షన్ జామ్‌లకు చెక్!

Published Mon, Mar 28 2016 1:24 AM | Last Updated on Sun, Sep 3 2017 8:41 PM

జంక్షన్ జామ్‌లకు చెక్!

జంక్షన్ జామ్‌లకు చెక్!

కూడళ్ల ఆధునీకరణకు అధికారుల నిర్ణయం
జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ అధికారులతో కమిటీ
నేడు, రేపు వరుస సమావేశాలు..
బుధ, గురువారాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు
గరిష్టంగా రెండు నెలల్లో అమలులోకి: డీసీపీ

 

సిటీబ్యూరో:  నగరంలో సాధారణ ప్రాంతాల్లో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయో... జంక్షన్లలో అంతకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటికి పరిష్కారం వెతికేందుకు ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నా.. ‘భూ సమస్యల’ నేపథ్యంలో కొలిక్కిరావట్లేదు. ఈ సమస్యల్ని అధిగమించేందుకు జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. రెండు విభాగాలకు చెందిన ముగ్గురు అధికారులు కీలకపాత్ర పోషించే ఈ కమిటీ..నగరంలోని జంక్షన్ల సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు రెండు నెలల్లో ఇబ్బందులు తీరేలా చర్యలు తీసుకుంటుంది. ఈ కమిటీ ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెడుతోంది.


ఫ్రీగా ఉండే ఫ్రీ లెఫ్ట్...
సిటీ వ్యాప్తంగా మోడల్ జంక్షన్ల అమలు కోసం ఏర్పాటైన ఈ కమిటీ  ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెడుతోంది. దాదాపు ప్రతి జంక్షన్‌లోనూ ‘ఫ్రీ లెఫ్ట్’ తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఏదైనా జంక్షన్‌లో రెడ్ సిగ్నల్ పడినప్పుడు నేరుగా వెళ్లేందుకు ఆగుతున్న వాహనాల కారణంగా ఎడమ వైపు వెళ్లే వాహనాలు సైతం ఆగిపోవాల్సి వస్తోంది. దీనికోసం ఇప్పటికే కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా ‘ఫ్రీ లెఫ్ట్’ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అయితే కొన్ని జంక్షన్ల విస్తీర్ణం తక్కువగా ఉండటంతో ఈ ‘ఫ్రీ’ విధానాలు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. మోడల్ జంక్షన్ల ఏర్పాటులో భాగంగా ఫ్రీ లెఫ్ట్‌కు అనుగుణంగా జంక్షన్ల విస్తరణకు భూ సమీకరణ చేయాలని భావిస్తున్నారు.

 
అడ్డంకులు లేకుండా యూ టర్న్...

పీక్, నాన్-పీక్ వేళల్లో వివిధ జంక్షన్లలో ట్రాఫిక్ జామ్స్, రెడ్, గ్రీన్ సిగ్నల్స్‌కు మధ్యలో వందల మీటర్ల పరిధిలో నిలిచిపోతున్న వాహనాలు పరిపాటిగా మారాయి. ఈ సమస్యకు పరిష్కారంగా జంట కమిషనరేట్ల అధికారులు అనేక జంక్షన్లను మూసేశారు. ఉప్పల్, హబ్సిగూడ, కేసీపీ తదితరాలు ఈ కోవలోకే వస్తాయి. ఆయా జంక్షన్ల నుంచి నేరుగా వెళ్లాల్సిన వాహనాలను ఎడమ వైపు కొద్దిదూరం మళ్లిస్తున్నారు. అక్కడ యూ టర్న్ ఇవ్వడం ద్వారా వాహనం మళ్లీ జంక్షన్ వద్దకు చేరుకుని ఎడమ వైపు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. సిటీలోని అనేక ప్రాంతాల్లో ఈ యూ టర్న్స్ ఇరుకుగా ఉండటంతో బస్సులతో పాటు కొన్ని పెద్ద వాహనాలకు ఇబ్బందిగా మారింది. దీంతో ‘టర్న్’ దగ్గర జామ్స్ ఏర్పడుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ‘యూ టర్న్స్’ను విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

 
బస్సుల కోసం పక్కా బస్ బేస్...

హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో అనేక జంక్షన్లకు సమీపంలో, కీలక రహదారులపై బస్టాప్స్ ఉన్నాయి. సరైన విస్తీర్ణం లేని రోడ్లలో ప్రయాణికుల్ని దించడానికి, ఎక్కించుకోవడానికి ఆగుతున్న బస్సుల కారణంగా ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. ఆగిన బస్సు ముందుకు కదిలేవరకు దాని వెనుక ఉండే వాహనాలు ఆగిపోవాల్సిన పరిస్థితులతోనే ఇలా జరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు బస్ బేల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి బస్టాప్‌లోనూ బస్‌బే ఉండాలనే లక్ష్యంతో వాటికి సమీపంలో భూ సమీకరణకు అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఆ అవకాశం లేని ప్రాంతాల్లో బస్టాప్స్‌నీ కాస్త ముందుకు తరలించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అవసరమైన పక్షంలో కొన్ని ప్రాంతాల్లోని ‘యూ టర్న్స్’ను ముందుకు తీసుకువెళ్లే యోచనలో ఉన్నారు.

 
రెండు విభాగాల అధికారులతో...

పోలీసు, బల్దియా ఉన్నతాధికారులు నిర్ణయంతో ఏర్పాటైన ప్రత్యేక కమిటీలో రెండు విభాగాల అధికారులూ ఉన్నారు. జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ సురేంద్ర మోహన్, హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ విభాగాల డీసీపీలు ఏవీ రంగనాథ్, అవినాష్ మహంతిల నేతృత్వంలో బల్డియా చీఫ్ ఇంజనీర్‌తో పాటు ఇతర అధికారులకూ ఇందులో ప్రాతినిధ్యం కల్పించారు. ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు అనేక ప్రాంతాల్లో ప్రాథమికంగా అధ్యయనం పూర్తి చేశారు. వీటిపై రూపొందించిన నివేదికల్ని సోమ, మంగళవారాల్లో జరిగే సమావేశాల్లో కమిటీ చర్చించనుంది. ఆపై బుధ, గురువారాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తుంది. ఏఏ ప్రాంతాల్లో భూమిని సేకరించాలి? ఎంత మేర సేకరించాల్సిన అవసరం ఉంది? ముందుకు జరపాల్సిన బస్టాప్స్, యూ టర్న్స్ ఎన్ని? ఎక్కడెక్కడ? తదితర అంశాలను క్షేత్రస్థాయి పర్యటనలో నిర్ణయించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement