
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్‌ను భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఖండించారు. నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు కార్పొరేటర్ లను అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారాయన. ఇవాళ్టి సర్వసభ్య సమావేశంలో బీఆర్‌ఎస్ కార్పొరేటర్లపై సస్పెన్షన్ వేటు పడగా.. ఆపై ఆందోళనకు దిగిన వాళ్లను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
‘‘కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని కోటి మంది నగర ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటకి గెంటేస్తారా?. గత సంవత్సరం పెట్టిన బడ్జెట్ నిధులను కనీసం కూడా ఖర్చు చేయకుండా.. మరోసారి అవే కాగితాల పైన అంకెలు మార్చి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు మా ప్రజా ప్రతినిధుల గొంతు నొక్కుతారా?.
.. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస ప్రజా సౌకర్యాలను కూడా సరిగ్గా నిర్వహించలేని జీహెచ్ఎంసీ అసమర్ధ తీరును ప్రశ్నిస్తే కూడా ఈ ప్రభుత్వం జీర్ణించుకోవడం లేదు. హైదరాబాద్ నగర ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలి. అప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పురపాలక శాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రిని నిలదీస్తూనే ఉంటాం.
అరెస్టు చేసిన కార్పొరేటర్‌లను, పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలి. ఇచ్చిన హామీలను అమలను చేయకుండా అరెస్టుల పేరుతో ప్రజాప్రతినిధులను అణగదొక్కాలని చూస్తే ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని మా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అని అన్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment