Traffic difficulties
-
మార్చిలో దుర్గగుడి ఫ్లైఓవర్ రెడీ!
సాక్షి, అమరావతి బ్యూరో: బెజవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రూపుదిద్దుకుంటున్న కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నగరవాసుల ఆశలు తీర్చేలా ఫ్లైఓవర్ పనులు సంపూర్ణంగా పూర్తిచేసేందుకు అధికార యంత్రాంగం శరవేగంగా కృషిచేస్తోంది. మరో నెలరోజుల్లో.. అంటే మార్చి నెలాఖరుకల్లా తుది దశ పనులు పూర్తయ్యేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం ఏప్రిల్ మొదటి వారంలో ట్రయల్ రన్ నిర్వహించాలని యోచిస్తున్నారు. ఆ తర్వాత ఈ వంతెనపై అనధికారికంగా వాహనాల రాకపోకలకు వీలు కల్పిస్తారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం జరిగాక అధికారికంగా వాహనాలకు అనుమతిస్తారు. కొత్త సర్కారుతో ఊపందుకున్న పనులు 2.6 కిలోమీటర్ల మేర దాదాపు రూ.325 కోట్ల వ్యయంతో సోమా ఎంటర్ప్రైజెస్ సంస్థ ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. 46 స్పాన్లతో ఈ వంతెన నిర్మాణం జరుగుతోంది. 2015 డిసెంబర్ 28 నుంచి పనులు మొదలుపెట్టారు. వాస్తవానికి రెండేళ్లలోనే దీని నిర్మాణం పూర్తికావల్సి ఉన్నా పలు అవాంతరాలతో జాప్యం జరుగుతూ వచ్చింది. గత ఏడాది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ ఫ్లైఓవర్‌ను సత్వరమే పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించడంతో గడిచిన ఆరేడు నెలల్లో నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే స్పాన్లు, వింగ్స్ పూర్తయ్యాయి. ప్రస్తుతం కనకదుర్గ అమ్మవారి గుడి కొండపైకి వెళ్లే ప్రవేశ ద్వారానికి ఎదురుగా జరుగుతున్న రెండు స్పాన్ల పనులు ఈ నెలాఖరుకు పూర్తి కానున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద వై డక్ట్, రాజీవ్‌గాంధీ పార్క్ వైపు అప్రోచ్ రోడ్ల పనులు తుది దశలో ఉన్నాయి. ఈ పనులు కూడా నెలాఖరుకల్లా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు.. ఫ్లైఓవర్‌కు ఇప్పటికే అందమైన రంగులు అద్దారు. వంతెనపై విద్యుద్దీపాల ఏర్పాటు 75 శాతం పూర్తయింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ రెండ్రోజుల క్రితం కాంట్రాక్టరు ప్రతినిధులు, సంబంధిత అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. కనకదుర్గ ఫ్లైఓవర్ పనులన్నీ వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఏప్రిల్ మొదటి వారంలో ఈ ఫ్లైఓవర్‌పై ట్రయల్ రన్ నిర్వహించాలని యోచిస్తున్నట్టు కలెక్టర్ ఇంతియాజ్ ‘సాక్షి’కి తెలిపారు. రాజీవ్‌గాంధీ పార్క్ నుంచి సగం వరకు ఫినిషింగ్ వర్క్ పూర్తయిందని, భవానీపురం వైపు పనులు సత్వరమే పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఈ వంతెన పనులను పర్యవేక్షిస్తున్న ఆర్ అండ్ బీ సూపరింటెండింగ్ ఇంజినీర్ (క్వాలిటీ కంట్రోల్) జాన్‌మోషే ‘సాక్షి’కి చెప్పారు. చివరి దశలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమిస్తూ మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన నిర్ణీత గడువులో పూర్తవడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. -
హాయిగా.. ట్రాఫిక్‌లో జాలీగా..
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఐటీ కారిడార్ వరకూ సాఫీ ప్రయాణం.. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సులువుగా గమ్యస్థానం చేర్చడం.. ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడం.. ఇందుకోసం పలు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం, రహదారుల విస్తరణ చేపట్టనుంది జీహెచ్ఎంసీ. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, కొండాపూర్, హఫీజ్‌పేట, నాలెడ్జ్సిటీ తదితర ప్రాంతాలకు సులభంగా చేరేలా మూడు ఫ్లైఓవర్లు, ఒక అండర్‌పాస్ నిర్మించనుంది. మరో రహదారిని విస్తరించనుంది. ఈ నిర్మాణాలు పూర్తయితే శంషాబాద్ నుంచి ఐటీ కారిడార్‌కు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు ట్రాఫిక్ జంజాటాల్లేని సాఫీ ప్రయాణం సాధ్యమవుతుంది. మొత్తం రూ.505 కోట్లు ఖర్చు కానున్న ఈ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ నిధులతో వీటిని నిర్మించేందుకు పరిపాలనాపరమైన అనుమతులిస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ రెండు జీవోలు జారీ చేసింది. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. తప్పనున్న ట్రాఫిక్ చిక్కులు.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మెహిదీపట్నం వరకు సులభంగానే వస్తున్నప్పటికీ, ఆ తర్వాత ఐటీ కారిడార్ చేరుకునేందుకు ట్రాఫిక్ చిక్కులు ఎదురవుతున్నాయి. అలాగే విమానాశ్రయం నుంచి గచ్చి బౌలి చేరుకునేందుకు దాదాపు 20 నిమిషాలు పడితే గచ్చిబౌలి జంక్షన్ దాటేందుకే 15 నిమిషాలు పడుతోంది. ఇక నానల్‌నగర్ నుంచి మెహిదీపట్నం వరకు ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణాలు పూర్తయితే కొండాపూర్, హఫీజ్‌పేట, టోలిచౌకి తదితర ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి.. అలాగే విమానాశ్రయం నుంచి ఈ ప్రాంతాలకు ప్రయాణం సాఫీగా సాగుతుందని అధికారులు చెబుతున్నారు. రోజురోజుకూ రద్దీ పెరుగుతున్న నాలెడ్జ్సిటీ తదితర ఐటీ కారిడార్లలో భవిష్యత్ ట్రాఫిక్ చిక్కులకు ఇవి పరిష్కారం కానున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇవీ పనులు.. నానల్‌నగర్, రేతిబౌలి జంక్షన్ల వద్ద రెండు ఫ్లైఓవర్లు, ఒక అండర్‌పాస్ నిర్మించనున్నారు. టోలిచౌకి మార్గంలోని ఫోర్ సీజన్స్ రెస్టారెంట్ దగ్గర మొదలయ్యే రెండు లేన్ల ఫ్లైఓవర్.. ఒక లెవెల్లో నానల్‌నగర్ చౌరస్తా వద్ద కుడివైపు(లంగర్‌హౌస్)వైపు తిరిగి కేకే ఫంక్షన్‌హాల్ వరకు వెళ్తుంది. అదే ఫ్లైఓవర్ మెహిదీపట్నం వైపు కొనసాగుతూ రేతిబౌలి జంక్షన్ దగ్గర రెండో లెవెల్లో పీవీ ఎక్స్‌ప్రెస్ వేను క్రాస్ చేస్తూ అత్తాపూర్ రింగ్ రోడ్డు మీద దిగుతుంది. అత్తాపూర్ నుంచి మెహిదీపట్నం వచ్చే వారికి మరో ఫ్లైఓవర్ నిర్మిస్తారు. నానల్‌నగర్ దగ్గర మెహిదీపట్నం నుంచి టోలిచౌకి వైపు నేరుగా వెళ్లేందుకు ఒక అండర్‌పాస్ నిర్మించనున్నారు. వీటి ద్వారా వాహనాల వేగం గంటకు కనీసం 40 కి.మీ. నుంచి 50 కి.మీ.గా ఉండగలదని అంచనా వేశారు. గచ్చిబౌలి జంక్షన్ వద్ద.. మైండ్‌స్పేస్ నుంచి ఓఆర్ఆర్కు వెళ్లే వారు బయోడైవర్సిటీకి రాకుండా నేరుగా వెళ్లేందుకు గచ్చిబౌలి చౌరస్తా వద్ద ఆరు లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. దీంతో పాటు శిల్పా లేఔట్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ వరకు(వయా గ్యాస్ కంపెనీ) 120 అడుగులతో రహదారిని విస్తరించనున్నారు. ఈ పనులు పూర్తయితే శంషాబాద్ నుంచి కొండాపూర్ వైపు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్లేవారికి సాఫీ ప్రయాణం సాధ్యం కానుంది. ఈ ప్యాకేజీ అంచనా వ్యయం రూ.330 కోట్లు. గచ్చిబౌలి జంక్షన్ వద్ద ప్రస్తుతం రద్దీ సమయంలో వాహనాల సంఖ్య గంటకు 15,020గా ఉంది. ఈ రెండు ప్యాకేజీలకూ వెరసి మొత్తం రూ.505 కోట్లు ఖర్చు కానుంది. వీటిల్లో నానల్‌నగర్, రేతిబౌలి ఫ్లైఓవర్లు వన్వేవి కాగా, గచ్చిబౌలి వద్ద టూవే ఫ్లైఓవర్. మార్గాలివీ.. ఫ్లైఓవర్ 1 అత్తాపూర్ వైపు నుంచి మెహిదీపట్నం వైపు రెండు లేన్ల ఫ్లైఓవర్. దీని వెడల్పు 8.5 మీటర్లు. ఫ్లైఓవర్ 2 టోలిచౌకి అప్రోచ్ నుంచి రెండు లేన్ల ఫ్లైఓవర్. ఫస్ట్ లెవెల్ నానల్‌నగర్ జంక్షన్ వరకు కొనసాగుతుంది. అక్కడి వరకు 8.5 మీటర్ల వెడల్పు ఉంటుంది. క్రమేపీ ముందుకు సాగుతూ రేతిబౌలి జంక్షన్ దగ్గర రెండో లెవెల్ ఫ్లైఓవర్‌గా మారుతుంది. అక్కడ 7 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఒక డౌన్ ర్యాంప్ లంగర్‌హౌస్ వైపు వెళ్తుంది. మరొకటి పీవీ ఎక్స్‌ప్రెస్‌వేను రెండో లెవెల్లో క్రాస్ చేస్తుంది. అండర్ పాస్ మెహిదీపట్నం వైపు నుంచి టోలిచౌకి వైపు నేరుగా వెళ్లే వారి కోసం నానల్‌నగర్ జంక్షన్ వద్ద మూడు లేన్ల అండర్ పాస్ నిర్మిస్తారు. ఈ మూడు పనుల ప్యాకేజీ అంచనా వ్యయం రూ.175 కోట్లు. ప్రస్తుతం రేతిబౌలి వద్ద రద్దీ సమయంలో గంటకు 12,501 వాహనాలు, నానల్ నగర్ వద్ద 10,317 వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఫ్లైఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది. -
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నరకం
- మంగళవారం స్తంభించిపోయిన ప్రధాన రహదారులు - మెట్రో పనులకు తోడు వర్షంతో వాహనచోదకుల పాట్లు - అధ్వానమైన రోడ్లతో ముందుకు కదలని వాహనాలు సాక్షి, సిటీబ్యూరో మంగళవారం ఉదయం... దిల్సుఖ్నగర్ నుంచి బయలుదేరిన ద్విచక్ర వాహనచోదకుడు బంజారాహిల్స్ చేరుకోవడానికి 1.45 గంటలు పట్టింది. సాధారణ సమయాల్లో 13.6 కిమీ దూరాన్ని గరిష్టంగా 50 నిమిషాల్లో చేరుకోవచ్చు. సోమవారం రాత్రి నుంచి కురిసిన వర్షం, పొంగిపొర్లిన డ్రైనేజీలు, జలమయమైన రోడ్లు వీటన్నింటికీ తోడు ప్రధాన రహదారుల వెంట సాగుతున్న మెట్రో రైల్ పనులు... వెరసి వాహనచోదకుడు నరకాన్ని చవి చూడాల్సి వచ్చింది. కీలక ప్రాంతాల్లో దాదాపు రోజంతా ఇదే పరిస్థితి నెలకొంది. రహదారులపై సీజనల్ బాటిల్ నెక్స్... సిటీని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామంటూ ప్రకటిస్తున్న సర్కారు మౌలిక వసతుల అభివృద్ధి, ప్రాథమిక సమస్యలపై మాత్రం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టట్లేదు. ఫలితంగా చిన్నపాటి వర్షానికే రహదారులు హుస్సేన్‌సాగర్‌ను తలపిస్తుంటాయి. అడుగడుగుకీ ఉన్న వాటర్ లాగింగ్ ఏరియాలతో ఏది గొయ్యో, ఏది రహదారో తెలియని పరిస్థితి నెలకొంటోంది. ఫలితంగా అలా నీరు నిలిచిన ప్రాంతాలను తప్పించుకోవడానికి వాహనచోదకులు ఓ పక్కగా వెళ్లడమో, వేగాన్ని పూర్తిగా తగ్గించుకుని ముందుగు సాగడమో జరుగుతోంది. ఈ కారణంగానే రహదారులపై ఎక్కడిక్కడ సీజనల్ బాటిల్ నెక్స్ ఏర్పడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో వాహనాలు గరిష్టంగా గంటకు 10 కిమీ వేగంతోనూ వెళ్లలేకపోతున్నాయి. దీని ప్రభావం ఆ రహదారిలో ప్రయాణించే ప్రతి వాహనంపైనా ఉంటోంది. అన్నీ తాత్కాలిక ప్రాతికదికనే... ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభానికి ముందు జీహెచ్ఎంసీ సహా ప్రభుత్వ విభాగాలన్నీ అప్రమత్తమవుతాయి’. ఎలాంటి తవ్వకాలు, రహదారిపై నిర్మాణాలు చేపట్టకూడదంటూ అధికారులు ఆదేశిస్తూ ఉంటారు. వాస్తవానికి వచ్చే సరికి ఇవేవీ అమలుకావట్లేదు. మరోపక్క నగర వ్యాప్తంగా 250 ప్రాంతాలు వర్షం కురిస్తే చాలు నీరు నిలిచే వాటర్ లాగింగ్ ఏరియాలుగా మారినట్లు బల్దియా ఏళ్ల క్రితమే గుర్తించింది. ఒక్క మైత్రీవనం చౌరస్తా మినహా... మిగిలిన చోట్ల శాశ్వత ప్రాతిపదికన తీసుకున్న చర్యలు కనిపించవు. వీటి నిర్వహణకు ఏటా రూ.3 కోట్ల వరకు వెచ్చిస్తున్న బల్దియా అధికారులు రహదారులకు డెక్ట్ నిర్మాణం, నాలాల అభివృద్ధి తదితర అంశాలపై అవసరమైన స్థాయిలో దృష్టి పెట్టట్లేదు. ఫలితంగా ఏటా నిధులు ఖర్చవుతున్నా... ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి. దీంతో ఏమాత్రం వర్షం కురిసినా నగరంలోని రోడ్డుపై వాహనాలు బారులు తీరడం ఆనవాయితీగా మారిపోయింది. అడ్డంకిగా మారిన మెట్రో’ పనులు... సిటీలో ఏళ్లగా ఉన్న ఈ సమస్యలకు తోడు మెట్రో రైల్ నిర్మాణ పనులు కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. పిల్లర్లు, స్టేషన్ల నిర్మాణం కోసం రహదారిలో దాదాపు సగం ఆక్రయిస్తూ బారికేడ్లు ఏర్పాటవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ జరగకపోవడంతో ఈ బారికేడ్లు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. దీనికితోడు వీటి నిర్మాణానికి అవసరమైన భారీ సామాగ్రి రవాణా వాహనాలతో పాటు ఇతర కారణాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో రహదారులు గోతులు ఏర్పడుతున్నాయి. నిర్మాణం పూర్తయ్యే వరకు వీటిని అభివృద్ధి చేసేందుకు ఆస్కారం లేకపోవడంతో ఇవీ వాటర్‌లాగింగ్ ఏరియాలుగా మారి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్నాయి. డివైడర్ల నిర్మాణంలో లోపాలు సైతం... ట్రాఫిక్ చిక్కులు తగ్గించేందుకు... రైట్-లెఫ్ట్ రహదారుల్ని వేరు చేసేందుకు ఉద్దేశించిన డివైడర్లు సైతం నగర వాసులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వీటి నిర్మాణంలో శాస్త్రీయత కొరవడటం, అవసరమైన కనీస జాగ్రత్తలు, ప్రమాణాలు సైతం పాటించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. సాధారణంగా 100 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న రోడ్ల మధ్యలోనే డివైడర్లు నిర్మించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత అవసరాల దృష్ట్యా ఇందులో సగం ఉన్న రహదారుల్లోనూ వీటిని ఏర్పాటు చేయాల్సి వస్తోంది. మరోపక్క గతంలో అనేక ప్రాంతాల్లో డివైడర్లు మాత్రమే ఉండేవి. వీటి మధ్యలో వర్షపు నీరు ఓ పక్క నుంచి మరో పక్కకు పోయే అవకాశం ఉండేది. అయితే అడ్వర్టైజ్మెంట్ బోర్డులు, లాలీపాప్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయం ఆర్జించాలనే జీహెచ్ఎంసీ వైఖరి కారణంగా డివైడర్ల ప్లేస్‌లో సెంట్రల్ మీడియమ్స్ వచ్చి చేరుతుండటంతో వీటి నీరు వెళ్లే అవకాశం లేక ఇబ్బందులు పెరుగుతున్నాయి. -
గ్రేట్ రిలీఫ్!
► మలక్‌పేట వద్ద ‘మూడో మార్గానికి’ మార్గం సుగమం ► రైల్వే అండర్ పాస్‌కు సన్నాహాలు ► రూ.10 కోట్లు డిపాజిట్ చేసేందుకు ► మెట్రోరైల్ సంస్థ అంగీకారం వారంలో క్షేత్రస్థాయి సర్వే ► ఈ రూట్లో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ సాక్షి, సిటీబ్యూరో: మలక్‌పేట రైలు వంతెన సమీపంలో వాహనాల కోసం మరో అండర్ పాస్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇప్పటికే ఉన్న రెండింటికి తోడు మరోటి ఏర్పాటు చేయడానికి రైల్వే శాఖ అంగీకరించింది. ఇందుకు అవసరమైన ఖర్చు భరించడానికి హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) ముందుకు వచ్చింది. పనులు ప్రారంభించడానికి ముందే రూ.10 కోట్లు రైల్వే శాఖ దగ్గర డిపాజిట్ చేయడానికీ అంగీకరించింది. గురువారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో బల్దియా నేతృత్వంలో జరిగిన వివిధ శాఖల ఉమ్మడి కమిటీ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఇబ్బందుల్ని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు మూడో మార్గం కావాలంటూ ఈ ఏడాది జనవరిలోనే ప్రతిపాదనలు పంపారు. అత్యంత కీలక రహదారుల్లో ఒకటి... నగరంలోని అత్యంత కీలకమైన రహదారుల్లో దిల్సుఖ్నగర్-చాదర్‌ఘాట్ మధ్యలోనిది ప్రధానమైంది. ఈ రూట్లో నగరానికి చెందిన అంతర్గత వాహనాలే కాకుండా విజయవాడ వైపు వేళ్లేవీ నడుస్తుంటాయి. ఫలితంగా దాదాపు 24 గంటలూ ఈ మార్గం రద్దీగానే ఉంటుంది. మలక్‌పేట రైల్వేస్టేషన్ పక్కన ఉన్న రైలు వంతెన వద్ద ఉన్న బాటిల్ నెక్ ఈ రూట్లో తిరిగే వాహనచోదకులకు తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో చాదర్‌ఘాట్ వైపు మెట్రో రైల్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. దీని ప్రభావంతో రద్దీ వేళల్లో చాదర్‌ఘాట్ కాజ్ వే వరకు వాహనాలుబారులు తీరుతున్నాయి. ఈ మార్గాన్ని అనుసరించాలంటేనే వాహనచోదకులు హడలిపోతున్నారు. ‘మెట్రో’ వస్తే మరింత ఘోరం... మలక్‌పేట రైల్వేస్టేషన్ పక్కనే ఉన్న రైలు వంతెన అటు-ఇటు ఉన్న రహదారి కంటే ఇరుకుగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సర్వకాలసర్వావస్థల్లోనూ ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఇక్కట్లు తప్పట్లేదు. ఆర్టీసీ బస్సుల రద్దీ ఎక్కువగా ఉండే పండుగల సీజన్లో... ప్రధానంగా రాత్రి వేళ ఈ ప్రాంతంలో మరింత నరకం చవిచూడాల్సిందే. ఇప్పటికే ఉన్న ఈ ఇబ్బందులకు తోడు మెట్రోరైల్ ప్రారంభమైతే పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ రైల్ వంతెనకు సమీపంలోనే మెట్రో రైల్స్టేషన్ నిర్మాణం జరుగుతోంది. అది కూడా పూర్తైఅందుబాటులోకి వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు రెట్టింపు అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ వివరాలన్నింటినీ పొందుపరుస్తూ జనవరిలో జరిగిన సమావేశంలో రైల్వే శాఖకు ప్రతిపాదనలు ఇచ్చారు. ఇప్పటికే రెండు చోట్ల నిర్మాణం... ఇప్పటికే నగరంలోని రెండుచోట్ల రైల్ అండర్ పాస్‌లు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ రైల్ నిలయం, కాలాడేరా ప్రాంతంలో చేపట్టిన ఈ చర్యలతో చెప్పుకోదగ్గ ఊరట లభించింది. ఇలానే మలక్‌పేట రైల్ వంతెన వద్ద మూడో మార్గం ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ అధికారులు కోరారు. తర్వాతి దశలో మూసీపై వంతెన మలక్‌పేటలో మూడో అండర్ పాస్ ఏర్పాటుకు రూ.10 కోట్లు ఖర్చవుతాయని రైల్వే శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ మొత్తం చెల్లించేందుకు హెచ్ఎంఆర్ ముందుకు రావడంతో రైల్వే అధికారులు సుముఖత వ్యక్తం చేశారు. వారం రోజుల్లో అన్ని విభాగాల అధికారులతో ఉన్న ఉమ్మడి కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన చేపడతాం. వీలైనంత త్వరలో పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ అండర్ పాస్ నిర్మాణం పూర్తయిన తర్వాత మలక్‌పేట వైపు మూసీపై ఉన్న వంతెన విస్తరణ అంశానికి సంబంధించి ప్రతిపాదనలు రూపొందిస్తాం’. - ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ -
జంక్షన్ జామ్‌లకు చెక్!
కూడళ్ల ఆధునీకరణకు అధికారుల నిర్ణయం జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ అధికారులతో కమిటీ నేడు, రేపు వరుస సమావేశాలు.. బుధ, గురువారాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు గరిష్టంగా రెండు నెలల్లో అమలులోకి: డీసీపీ సిటీబ్యూరో: నగరంలో సాధారణ ప్రాంతాల్లో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయో... జంక్షన్లలో అంతకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటికి పరిష్కారం వెతికేందుకు ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నా.. ‘భూ సమస్యల’ నేపథ్యంలో కొలిక్కిరావట్లేదు. ఈ సమస్యల్ని అధిగమించేందుకు జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. రెండు విభాగాలకు చెందిన ముగ్గురు అధికారులు కీలకపాత్ర పోషించే ఈ కమిటీ..నగరంలోని జంక్షన్ల సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు రెండు నెలల్లో ఇబ్బందులు తీరేలా చర్యలు తీసుకుంటుంది. ఈ కమిటీ ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెడుతోంది. ఫ్రీగా ఉండే ఫ్రీ లెఫ్ట్... సిటీ వ్యాప్తంగా మోడల్ జంక్షన్ల అమలు కోసం ఏర్పాటైన ఈ కమిటీ ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెడుతోంది. దాదాపు ప్రతి జంక్షన్‌లోనూ ‘ఫ్రీ లెఫ్ట్’ తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఏదైనా జంక్షన్లో రెడ్ సిగ్నల్ పడినప్పుడు నేరుగా వెళ్లేందుకు ఆగుతున్న వాహనాల కారణంగా ఎడమ వైపు వెళ్లే వాహనాలు సైతం ఆగిపోవాల్సి వస్తోంది. దీనికోసం ఇప్పటికే కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా ‘ఫ్రీ లెఫ్ట్’ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అయితే కొన్ని జంక్షన్ల విస్తీర్ణం తక్కువగా ఉండటంతో ఈ ‘ఫ్రీ’ విధానాలు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. మోడల్ జంక్షన్ల ఏర్పాటులో భాగంగా ఫ్రీ లెఫ్ట్‌కు అనుగుణంగా జంక్షన్ల విస్తరణకు భూ సమీకరణ చేయాలని భావిస్తున్నారు. అడ్డంకులు లేకుండా యూ టర్న్... పీక్, నాన్-పీక్ వేళల్లో వివిధ జంక్షన్లలో ట్రాఫిక్ జామ్స్, రెడ్, గ్రీన్ సిగ్నల్స్‌కు మధ్యలో వందల మీటర్ల పరిధిలో నిలిచిపోతున్న వాహనాలు పరిపాటిగా మారాయి. ఈ సమస్యకు పరిష్కారంగా జంట కమిషనరేట్ల అధికారులు అనేక జంక్షన్లను మూసేశారు. ఉప్పల్, హబ్సిగూడ, కేసీపీ తదితరాలు ఈ కోవలోకే వస్తాయి. ఆయా జంక్షన్ల నుంచి నేరుగా వెళ్లాల్సిన వాహనాలను ఎడమ వైపు కొద్దిదూరం మళ్లిస్తున్నారు. అక్కడ యూ టర్న్ ఇవ్వడం ద్వారా వాహనం మళ్లీ జంక్షన్ వద్దకు చేరుకుని ఎడమ వైపు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. సిటీలోని అనేక ప్రాంతాల్లో ఈ యూ టర్న్స్ ఇరుకుగా ఉండటంతో బస్సులతో పాటు కొన్ని పెద్ద వాహనాలకు ఇబ్బందిగా మారింది. దీంతో ‘టర్న్’ దగ్గర జామ్స్ ఏర్పడుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ‘యూ టర్న్స్’ను విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బస్సుల కోసం పక్కా బస్ బేస్... హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో అనేక జంక్షన్లకు సమీపంలో, కీలక రహదారులపై బస్టాప్స్ ఉన్నాయి. సరైన విస్తీర్ణం లేని రోడ్లలో ప్రయాణికుల్ని దించడానికి, ఎక్కించుకోవడానికి ఆగుతున్న బస్సుల కారణంగా ట్రాఫిక్ జామ్స్ ఏర్పడుతున్నాయి. ఆగిన బస్సు ముందుకు కదిలేవరకు దాని వెనుక ఉండే వాహనాలు ఆగిపోవాల్సిన పరిస్థితులతోనే ఇలా జరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న అధికారులు బస్ బేల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతి బస్టాప్‌లోనూ బస్బే ఉండాలనే లక్ష్యంతో వాటికి సమీపంలో భూ సమీకరణకు అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఆ అవకాశం లేని ప్రాంతాల్లో బస్టాప్స్నీ కాస్త ముందుకు తరలించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అవసరమైన పక్షంలో కొన్ని ప్రాంతాల్లోని ‘యూ టర్న్స్’ను ముందుకు తీసుకువెళ్లే యోచనలో ఉన్నారు. రెండు విభాగాల అధికారులతో... పోలీసు, బల్దియా ఉన్నతాధికారులు నిర్ణయంతో ఏర్పాటైన ప్రత్యేక కమిటీలో రెండు విభాగాల అధికారులూ ఉన్నారు. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ సురేంద్ర మోహన్, హైదరాబాద్, సైబరాబాద్ ట్రాఫిక్ విభాగాల డీసీపీలు ఏవీ రంగనాథ్, అవినాష్ మహంతిల నేతృత్వంలో బల్డియా చీఫ్ ఇంజనీర్‌తో పాటు ఇతర అధికారులకూ ఇందులో ప్రాతినిధ్యం కల్పించారు. ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు అనేక ప్రాంతాల్లో ప్రాథమికంగా అధ్యయనం పూర్తి చేశారు. వీటిపై రూపొందించిన నివేదికల్ని సోమ, మంగళవారాల్లో జరిగే సమావేశాల్లో కమిటీ చర్చించనుంది. ఆపై బుధ, గురువారాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తుంది. ఏఏ ప్రాంతాల్లో భూమిని సేకరించాలి? ఎంత మేర సేకరించాల్సిన అవసరం ఉంది? ముందుకు జరపాల్సిన బస్టాప్స్, యూ టర్న్స్ ఎన్ని? ఎక్కడెక్కడ? తదితర అంశాలను క్షేత్రస్థాయి పర్యటనలో నిర్ణయించనున్నారు.