- మంగళవారం స్తంభించిపోయిన ప్రధాన రహదారులు
- మెట్రో పనులకు తోడు వర్షంతో వాహనచోదకుల పాట్లు
- అధ్వానమైన రోడ్లతో ముందుకు కదలని వాహనాలు
సాక్షి, సిటీబ్యూరో
మంగళవారం ఉదయం... దిల్‌సుఖ్‌నగర్ నుంచి బయలుదేరిన ద్విచక్ర వాహనచోదకుడు బంజారాహిల్స్ చేరుకోవడానికి 1.45 గంటలు పట్టింది. సాధారణ సమయాల్లో 13.6 కిమీ దూరాన్ని గరిష్టంగా 50 నిమిషాల్లో చేరుకోవచ్చు. సోమవారం రాత్రి నుంచి కురిసిన వర్షం, పొంగిపొర్లిన డ్రైనేజీలు, జలమయమైన రోడ్లు వీటన్నింటికీ తోడు ప్రధాన రహదారుల వెంట సాగుతున్న మెట్రో రైల్ పనులు... వెరసి వాహనచోదకుడు నరకాన్ని చవి చూడాల్సి వచ్చింది. కీలక ప్రాంతాల్లో దాదాపు రోజంతా ఇదే పరిస్థితి నెలకొంది. రహదారులపై సీజనల్ బాటిల్ నెక్స్... సిటీని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామంటూ ప్రకటిస్తున్న సర్కారు మౌలిక వసతుల అభివృద్ధి, ప్రాథమిక సమస్యలపై మాత్రం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టట్లేదు. ఫలితంగా చిన్నపాటి వర్షానికే రహదారులు హుస్సేన్‌సాగర్‌ను తలపిస్తుంటాయి. అడుగడుగుకీ ఉన్న వాటర్ లాగింగ్ ఏరియాలతో ఏది గొయ్యో, ఏది రహదారో తెలియని పరిస్థితి నెలకొంటోంది.
ఫలితంగా అలా నీరు నిలిచిన ప్రాంతాలను తప్పించుకోవడానికి వాహనచోదకులు ఓ పక్కగా వెళ్లడమో, వేగాన్ని పూర్తిగా తగ్గించుకుని ముందుగు సాగడమో జరుగుతోంది. ఈ కారణంగానే రహదారులపై ఎక్కడిక్కడ సీజనల్ బాటిల్ నెక్స్ ఏర్పడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో వాహనాలు గరిష్టంగా గంటకు 10 కిమీ వేగంతోనూ వెళ్లలేకపోతున్నాయి. దీని ప్రభావం ఆ రహదారిలో ప్రయాణించే ప్రతి వాహనంపైనా ఉంటోంది. అన్నీ తాత్కాలిక ప్రాతికదికనే... ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభానికి ముందు జీహెచ్‌ఎంసీ సహా ప్రభుత్వ విభాగాలన్నీ అప్రమత్తమవుతాయి’. ఎలాంటి తవ్వకాలు, రహదారిపై నిర్మాణాలు చేపట్టకూడదంటూ అధికారులు ఆదేశిస్తూ ఉంటారు. వాస్తవానికి వచ్చే సరికి ఇవేవీ అమలుకావట్లేదు. మరోపక్క నగర వ్యాప్తంగా 250 ప్రాంతాలు వర్షం కురిస్తే చాలు నీరు నిలిచే వాటర్ లాగింగ్ ఏరియాలుగా మారినట్లు బల్దియా ఏళ్ల క్రితమే గుర్తించింది. ఒక్క మైత్రీవనం చౌరస్తా మినహా... మిగిలిన చోట్ల శాశ్వత ప్రాతిపదికన తీసుకున్న చర్యలు కనిపించవు. వీటి నిర్వహణకు ఏటా రూ.3 కోట్ల వరకు వెచ్చిస్తున్న బల్దియా అధికారులు రహదారులకు డెక్ట్ నిర్మాణం, నాలాల అభివృద్ధి తదితర అంశాలపై అవసరమైన స్థాయిలో దృష్టి పెట్టట్లేదు. ఫలితంగా ఏటా నిధులు ఖర్చవుతున్నా... ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి.
దీంతో ఏమాత్రం వర్షం కురిసినా నగరంలోని రోడ్డుపై వాహనాలు బారులు తీరడం ఆనవాయితీగా మారిపోయింది. అడ్డంకిగా మారిన మెట్రో’ పనులు... సిటీలో ఏళ్లగా ఉన్న ఈ సమస్యలకు తోడు మెట్రో రైల్ నిర్మాణ పనులు కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. పిల్లర్లు, స్టేషన్ల నిర్మాణం కోసం రహదారిలో దాదాపు సగం ఆక్రయిస్తూ బారికేడ్లు ఏర్పాటవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ జరగకపోవడంతో ఈ బారికేడ్లు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. దీనికితోడు వీటి నిర్మాణానికి అవసరమైన భారీ సామాగ్రి రవాణా వాహనాలతో పాటు ఇతర కారణాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో రహదారులు గోతులు ఏర్పడుతున్నాయి. నిర్మాణం పూర్తయ్యే వరకు వీటిని అభివృద్ధి చేసేందుకు ఆస్కారం లేకపోవడంతో ఇవీ వాటర్‌లాగింగ్ ఏరియాలుగా మారి ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్నాయి. డివైడర్ల నిర్మాణంలో లోపాలు సైతం... ట్రాఫిక్ చిక్కులు తగ్గించేందుకు... రైట్-లెఫ్ట్ రహదారుల్ని వేరు చేసేందుకు ఉద్దేశించిన డివైడర్లు సైతం నగర వాసులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి.
వీటి నిర్మాణంలో శాస్త్రీయత కొరవడటం, అవసరమైన కనీస జాగ్రత్తలు, ప్రమాణాలు సైతం పాటించకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. సాధారణంగా 100 అడుగుల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న రోడ్ల మధ్యలోనే డివైడర్లు నిర్మించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత అవసరాల దృష్ట్యా ఇందులో సగం ఉన్న రహదారుల్లోనూ వీటిని ఏర్పాటు చేయాల్సి వస్తోంది. మరోపక్క గతంలో అనేక ప్రాంతాల్లో డివైడర్లు మాత్రమే ఉండేవి. వీటి మధ్యలో వర్షపు నీరు ఓ పక్క నుంచి మరో పక్కకు పోయే అవకాశం ఉండేది. అయితే అడ్వర్‌టైజ్‌మెంట్ బోర్డులు, లాలీపాప్స్ ఏర్పాటు చేయడం ద్వారా ఆదాయం ఆర్జించాలనే జీహెచ్‌ఎంసీ వైఖరి కారణంగా డివైడర్ల ప్లేస్‌లో సెంట్రల్ మీడియమ్స్ వచ్చి చేరుతుండటంతో వీటి నీరు వెళ్లే అవకాశం లేక ఇబ్బందులు పెరుగుతున్నాయి.
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నరకం
Published Tue, Jun 28 2016 7:43 PM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM
Advertisement
Advertisement