మెట్రో జర్నీ విత్‌ బైక్‌.. కార్‌ | Rental Bikes And Cars In Hyderabad Metro Stations | Sakshi
Sakshi News home page

మెట్రో జర్నీ విత్‌ బైక్‌.. కార్‌

Published Wed, Jul 25 2018 11:55 AM | Last Updated on Tue, Oct 16 2018 5:14 PM

Rental Bikes And Cars In Hyderabad Metro Stations - Sakshi

మియాపూర్‌ మెట్రో స్టేషన్‌లోని బైక్‌లు ,కార్లు

గచ్చిబౌలి: ఉప్పల్‌లో ఉండే సందీప్‌ మార్కెటింగ్‌ఎగ్జిక్యూటివ్‌. మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో పనిచేస్తుంటాడు. సొంత బైక్‌పై వెళ్లాలంటే రెండు గంటల సమయం పడుతుంది. ట్రాఫిక్‌లో అలసిపోయి విధులు
నిర్వహించాలంటే భారంగా మారుతోంది. దీంతో అతను ఇప్పుడు తన బైక్‌పై రావడం లేదు. మెట్రో రైలులోమియాపూర్‌ వరకు వెళ్లి, అక్కడి  స్టేషన్‌లోని బైక్‌ తీసుకొని విధులు నిర్వహిస్తున్నాడు. సాయంత్రం బైక్‌ స్టేషన్‌లోఅప్పగించేసి, తిరిగి మెట్రోలోనే ఇంటికి వెళ్తున్నాడు.   

ఇక కూకట్‌పల్లి, మాదాపూర్‌లలో షాపింగ్‌ చేయాలనుకుంటే ఎంచక్కా మెట్రోలో వచ్చి, మియాపూర్‌ స్టేషన్‌లో జూమ్‌ కారు అద్దెకు తీసుకుంటున్నారు. చక్కగా కారులో వెళ్లి, షాపింగ్‌ చేసేసి తిరిగి మెట్రోలో ఇంటికి వెళ్తున్నారు.   
 
మెట్రో స్టేషన్లకు అనుసంధానంగా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో బైక్‌లు, జూమ్‌ కార్లను అందుబాటులోకి తీసుకురావడంతో జర్నీ ఈజీగా మారింది. వీటికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే మియాపూర్‌తో పాటు మరికొన్ని స్టేషన్లలో బైక్‌లు అందుబాటులో ఉండగా...కార్లు మాత్రం ఇక్కడే ఉన్నాయి. వీటి సంఖ్యను మరింత పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.  

బైక్‌లకు భలే డిమాండ్‌...   
మియాపూర్‌ మెట్రో స్టేషన్‌లో వివిధ కంపెనీలకు చెందిన 24 స్కూటీలు, హర్నెట్‌ బైక్‌ అందుబాటులో ఉన్నాయి. ఉదయం 7:30 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. ఏదైనా కారణంగా బైక్‌ తిరిగి ఇవ్వకపోతే సమాచారం అందించాలి. లేని పక్షంలో యాప్‌లో సమయం పొడిగించుకోవాలి. ప్రతి గంటకు రూ.15 చెల్లించడంతో కిలోమీటర్‌కు రూ.4 చార్జీ ఉంటుంది. పెట్రోల్‌ చార్జీలు ఉండవు. ఇక హెల్మెట్‌ ఉచింతంగా ఇస్తారు. దీంతో బైక్‌లకు మంచి డిమాండ్‌ ఉంటోంది. ఉదయం 11 గంటల వరకే బైక్‌లన్నీ బుక్‌ అయిపోతున్నాయి. వీకెండ్‌లో బైక్‌ల కోసం ఎక్కువగా స్టూడెంట్స్‌ వస్తుంటారు. గంటల ప్రాతిపదికన కాకుండా రోజంతా బైక్‌ తీసుకోవాలని అనుకుంటే...  రోజుకు రూ.470 చెల్లించి, పెట్రోల్‌ పోయించుకోవాలి. మియాపూర్‌తో పాటు నాగోల్, పరేడ్‌గ్రౌండ్, బేగంపేట్‌ మెట్రో స్టేషన్లలో ఈ బైక్స్‌ అందుబాటులో ఉన్నాయి.  

బుకింగ్‌ ఇలా...  
గూగుల్‌ ప్లేస్టోర్‌లో మెట్రో బైక్స్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. యాప్‌ ఓపెన్‌ చేసి గుర్తింపు కార్డును అప్‌లోడ్‌ చేయాలి. ఎన్ని బైక్‌లు అందుబాటులో ఉన్నాయి? వాటి అద్దె ఎలా? తదితర వివరాలు ఉంటాయి. బైక్‌ ఏ సమయానికి కావాలి? ఎక్కడి నుంచి వస్తున్నారో? లోకేషన్‌ షేర్‌ చేయాలి. పేటీఎం ద్వారా చార్జీలు చెల్లించాలి. మెట్రో స్టేషన్‌కు వెళ్లాక బుకింగ్‌ను, ఒరిజినల్‌ ఐడీ కార్డు చూపిస్తే బైక్‌ ఇస్తారు.  

ఎలక్ట్రికల్‌ కార్లు...  
ఒక్క మియాపూర్‌ మెట్రో స్టేషన్‌లోనే ఎలక్ట్రికల్‌ కార్లు అందుబాటులో ఉన్నాయి. జూమ్‌ సంస్థ గత నెల 24న ఈ సేవలు ప్రారంభించింది. 10 మహీంద్రా ఈటుఓ కార్లు ఇక్కడున్నాయి. ఇవి బ్యాటరీతో పనిచేస్తాయి. గంటన్నర చార్జింగ్‌ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. వీటికి గంటకు రూ.40 చెల్లించాలి. ఒకవేళ మీ ప్రయాణం మొత్తం 4కిలోమీటర్లు మాత్రమే అయితే పూర్తిగా ఉచితం. అంతకంటే ఎక్కవ దూరమైతే గంటల చార్జీలతో పాటు కిలోమీటర్‌కు రూ.9 చెల్లించాలి. డీజిల్‌ కార్లు 14 అందుబాటులో ఉన్నాయి. వీటికి గంటకు రూ.120 చెల్లించాలి. ఒకవేళ మీ ప్రయాణం మొత్తం 10 కిలోమీటర్లు మాత్రమే అయితే పూర్తిగా ఉచితం. అంతకంటే ఎక్కవ దూరమైతే గంటల చార్జీలతో పాటు కిలోమీటర్‌కు రూ.12 చెల్లించాలి. 

ఇలా బుకింగ్‌...  
ప్లేస్టోర్‌లో జూమ్‌ కారు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 20 ఏళ్లకు పైబడిన తమ ఫోర్‌ వీలర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ అప్‌లోడ్‌ చేయాలి. యాప్‌లో ఎన్ని కార్లు అందుబాటులో ఉన్నాయో చూపిస్తుంది. అవసరమైన కారును బుక్‌ చేసుకొని ఆన్‌లైన్‌లో లేదా పేటీఎం ద్వారా చార్జీలు చెల్లించాలి. స్టేషన్‌కు వెళ్లి బుకింగ్‌ను చూపిస్తే కారు ఇస్తారు.

మరిన్ని అవసరం..   
నేను బీహెచ్‌ఈఎల్‌లో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నాను. మెట్రోలో వచ్చి మియాపూర్‌ స్టేషన్‌లో దిగాను. బైక్‌పై వెళ్దామనుకుంటే, బైక్‌లు లేవని చెప్పారు. బైక్‌ల సంఖ్య పెంచితే బాగుంటుంది.– సరిత, బీటెక్‌ విద్యార్థిని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement